ఆత్మ ఎక్కడుంటుంది? ఆత్మ ఎలా ఉంటుంది? అని మామూలుగా ఈ ఆత్మాన్వేషణ చేసేవారికి ఎదురొచ్చే ప్రశ్నలు.
ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంటుందని, జీవుల హృదయగుహలో నివసిస్తుందని మనము ఇదివరకే తెలుసుకొన్న విషయాలే. హృదయం వుంటుంది. ప్రతివారికి రక్తమాంసాలతో నిర్మాణమైయున్న గుండె లేక హృదయంగా ఉండి శరీరమంతా రక్త ప్రసారము జరిగే చోటు ఇక్కడ నుండే అది కాకుండా ఆత్మ నిలయమైన ఒక హృదయము ఎడమవైపు కాకుండా కుడివైపు బొడ్డుకు జానెడు దూరంలో మధ్య భాగంలో ఆధ్యాత్మిక హృదయం ఒకటే వుంటుందని దానిలోనే ఆత్మ విరాజిల్లుతుందని మనము తెలుసుకోవలసిన విషయము. ఆత్మ ఎక్కడా కనపడేది కాదు. కారణం అది ఒక పదార్థం లాంటిది కాదు. అది ఎప్పుడూ మనతోనే వుంటుంది, ఈ దేహంలోనే వుండి దేహంతో నిర్వహించే అన్ని పనులు, చూడటం, వినటం, చేయటం అన్ని పనులు నిర్వర్తించటం అన్నీ దీని వల్లనే. అది ఎక్కడో లేదు. ఎవరో కాదు ప్రతివాడు “నేను” అని భావించే ఆ “నేనే” ఈ ఆత్మ. మనలో జాగ్రత్తగా పరికిస్తే ఈ శరీరంలోని అంగాలన్నీ దేనికది “నేను” కాదు నేను కాదు అని తెలుస్తుంది. “నేను” కాదు అనే తేలుతుంది. మరి ఈ దేహము “నేను” వ్యాపించి ఈ దేహము ‘నేను’ నేనే అనేటట్లుగా పరిభ్రమించి ఈ దేహము నేను కాకుండా ‘నేను’ లేక ఆత్మ హృదయ గుహలో వుండి దేహమంతా వ్యాపించి యుండుటమే కాకుండా దేహము బయటంతా సర్వ వ్యాప్తమై యున్నది. ఈ ‘నేనే’ అనగా ఆత్మే – ఈ హృద్గుహలో ఆత్మను చూడాలనే భావించి ఒక ప్రయత్నం చేసాను. ఆ గుహలో నేను చూచింది చీకటి. ఆ చీకటిలోనే వెలుగు వుంది. చీకటిలో వెలుగు ఉండుట యేమిటి? “వెలుగుకు ఆధారం చీకటే” అన్నది అమ్మ. కనుక ఆ వెలుగును చూచాను. “జ్ఞానానికి ఆధారం అజ్ఞానం” అన్నట్లుగా చీకటిలో వెలుగు ఎట్లా వుంటుంది? ఇది నాకు రెండుసార్లు జిల్లెళ్ళమూడి అమ్మను చూడటానికి వెళ్ళినప్పుడు అనుభవం వున్నది.
ఒకసారి జిల్లెళ్ళమూడి 7వ మైలు దగ్గర వంతెన మీద రాత్రి 9.00 గంటలకు బస్సు దిగాను. అది కటిక రాత్రి ‘కన్ను పొడుచుకున్నా కనపడలేదు’ అని అంటారే అట్లా వున్నది. బ్రిడ్జి మీద నుండి మెల్లగా క్రిందకు వచ్చేసాను, ఇంకా ఎటుపోవాలో పాలుపోవటం లేదు. నేను నిల్చున్న చోట నుండి ఎదురుగా ఒక డొంక వున్నది. దానికి ఒక ప్రక్క కాలువ, మరొక ప్రక్క పొలాలు. ఒక 10 నిమిషాలు నిల్చున్నాను. ఆ డొంకలో తెల్లగా ఒక చిన్న కాలి దారి కనబడుతున్నది. ఆ దారినే పడి జిల్లెళ్ళమూడి వెళుతున్నాను. మొదట ‘వరవ’ను దాటాను. రెండవ ‘వరవ’ ను సమీపించాను ఆ కాలిబాటనే. ఆ కాలిబాటనే ఎదురుగా ఒక పాము నాకు ఎదురు వచ్చింది. నిశ్చేష్టుడనై నిల్చున్నాను. తర్వాత ఆ పాము నా ప్రక్కగా సరసరా వెళ్ళిపోయింది. అప్పుడు భయం పుట్టింది. 10 అంగలలో జిల్లెళ్లమూడి చేరాను. అమ్మ ఇంటి దగ్గర బావి నీళ్ళతో కాళ్ళు కడుక్కొని అమ్మ దగ్గరకు వెళ్ళాను. అమ్మ “నాన్నా! భయపడ్డావా?” అని అడిగింది. జరిగింది చెప్పాను.
మరొకసారి గుంటూరు వెళ్ళి అప్పికట్ల ఆలయాల వద్ద బస్సు దిగి పూండ్ల మీదగా రాత్రి దాదాపు 8,9 గంటలకు చీకటిలో ఎండాకాలం పొలాలకు అడ్డంపడి నడిచి వస్తున్నాను. జిల్లెళ్ళమూడి వూరి బయట పెద్ద మురుగుకాలువ దాని వడ్డు చాలా ఎత్తుగా వున్నది. అట్లాగే ఆ వద్దు ఎక్కాను. దానిమీద ఎత్తైన ప్రదేశం కనబడింది. వెళ్ళి గుట్ట ఎక్కాను. నిల్చున్నాను. నా కాళ్ళు కంతలలో పడుతున్నది ఏమిటా అని చూస్తే అది పాము పుట్ట. దానిమీద నుండి చూస్తే జిల్లెళ్ళమూడి లైట్లు దూరంగా మిణుకు మిణుకుగా కనబడుతున్నాయి. నేను నిల్చున్నది పాము పుట్ట అని తెలుసుకున్న తరువాత భయం పుట్టింది. ఒక్కసారి ‘అమ్మా!’ అని కేక వేశాను. ఒక్క దూకు దూకాను. క్రిందకు వచ్చేసాను. మరలా కాసేపు నిల్చున్నాను. ఆ చీకటిలో ఒక కాలిదారి కనబడింది. ఆ కాలి బాటనేబడి ఒక ఎక్విటెంటు దగ్గరకు వెళ్ళాను. దాని మీదుగా జిల్లెళ్ళమూడి వైపునున్న గట్టు మీదుగా జిల్లెళ్ళమూడికి చేరాను. మేడ మీదనున్న అమ్మ బస వాత్సల్యాలయంకు చేరాను. అమ్మ ఆరు బయట ఇంకా కొంతమంది సోదరులతో పచార్లు చేస్తున్నది. అమ్మ అంది “నాన్నా! నీ కేక వినబడింది. నీకు భయం పుట్టిందా” అన్నది.
ఇట్లా చీకటిలో వెలుగును చూచిన ఉదంతాలు అనేకంగా వున్నవి. కాని అక్కడ ఆ చిమ్మ చీకటిలో వెలుగుకు కారణభూతమైన ఆకాశంలో నక్షత్రాలు అని భావించవచ్చును. కాని ఈ హృదయ గుహలోని చీకటిలో వెలుగుకు కారణమేమిటి? అని విచారిస్తే ఆత్మే స్వయం ప్రకాశమైన వెలుగు. అట్లానే అన్ని నేనులు నేనైన “నేను” కూడా స్వయం ప్రకాశమే. అది వెలుగుతూ అన్ని జీవులకు వెలుగునిస్తుంది. ఈ వెలుగు మన కంటితో చూచేది కాదు అట్లా ఎట్లా కనబడినా అది వ్యక్తమైనట్లే ఇది అవ్యక్తమైంది. మనం అనుభూతి పొందవలసిందే ఎవరికి వారు అనుభూతి పొందతగినది కూడా.