2012 నవంబరు 18, 19, 20 తేదీలలో జిల్లెళ్ళమూడిలో శ్రీ విశ్వజననీపరిషత్ నిర్వహించిన ‘అమ్మ తత్త్వచింతన మహాసదస్సు’ ప్రసంగ వ్యాసాల సంకలనం ‘మహస్సు’ ప్రత్యేక సంచిక మరియు డి.వి.డి. ఆవిష్కరణ సభ హైదరాబాద్లో 28.3.2012 తేదీన (ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం అమ్మ పుట్టినరోజు) శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శ్రీ ఎన్.టి.ఆర్. కళామందిరంలో వైభవంగా జరిగింది.
ఈ మహత్కారాన్ని ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక, జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి, హైదరాబాద్ వారు సంయుక్తంగా నిర్వహించారు.
‘మహస్సు’ : శ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి, శ్రీ స్వామితత్త్వవిదానంద, శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు వంటి మహితాత్ముల సందేశములతో; శ్రీ ఎమ్. దినకర్, శ్రీ వి.యస్.ఆర్.మూర్తి, శ్రీ బి. రామబ్రహ్మం, డాక్టర్ బి.యల్. సుగుణ, శ్రీమతి బి. వసుంధర మున్నగు సోదరీ సోదరుల 40 ఆంధ్ర, ఆంగ్ల వ్యాస సుమసౌరభాలతో, శ్రీ పి.యస్.ఆర్ అన్నయ్య కవితానీరాజనంతో, రమణీయ అమ్మ వర్ణచిత్రాలతో, అమ్మ సుందర రేఖాచిత్ర సముదాయంతో; అమ్మ వాక్యాలు అక్షర దీపాలతో విశేష సంచిక కార్తీక దీపంలా ప్రకాశిస్తోంది.
డి.వి.డి. : శ్రీ రావూరి ప్రసాద్ సమర్పించిన వీడియో కాసెట్లు నుండి వ్రాసిన వివిధ సన్నివేశాలను ఆర్ష విజ్ఞాన నిధి అయిన శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి సముచిత సుమధుర వ్యాఖ్యానంతో, మాతృశ్రీ అడియో సో॥ ఈమని కృష్ణశర్మ సాంకేతిక నైపుణ్య సహకారంతో సదస్సు కమనీయ దృశ్యా శ్రవణ కావ్యంగా డివిడి అలరిస్తోంది.
సభాప్రారంభంలో శ్రీమతి ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ వీణావాద్యకచేరి చేసి సంగీతసరస్వతిగా అమ్మను అర్చించారు. అతిధులు జ్యోతి ప్రజ్వలనం చేసి అమ్మకు నమస్సుమాంజులలు అర్పించారు.
విశేష సంచిక ‘మహస్సు’ను శ్రీ పరిపూర్ణానంద సరస్వతీస్వామివారు ఆవిష్కరించగా, డివిడిని శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, I.A.S. (Retd) గారు ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన సో॥ శ్రీ కె.నరసింహమూర్తిగారు ‘నేను నేనైన నేను, ధ్యాసే ధ్యానం’ వంటి అమ్మ వాక్యాల్ని వివరించారు. ‘రాయిలో చైతన్యం ఉందా, అమ్మా?’ అని అడిగితే “లేకపోతే గోడగా, ఇటుకగా అనేక వస్తువులుగా ఎన్నో విధాలుగా ఎలా ఉపయోగపడు తోంది ?” అనే సందర్భాన్ని సూచించి అమ్మదృష్టిలో జడం అనేది లేదు, అంతా చైతన్యమే, సజీవమే అని విశ్లేషించారు. అమ్మ తత్వరూప పంచదార పలుకుల్ని తొలిపలుకుల్లో అందరికీ పంచారు.
మాన్య సోదరులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు “అన్నయ్య, అక్కయ్య అనే పిలుపుల మాటున ఏకోదర సంబంధ బాంధవ్యాన్ని ఉగ్గుపాలతో రంగరించి అమ్మ బిడ్డలందరికి పట్టింది. అందరి అనుభవాన్ని అర్ధం చేసికోవటం ద్వారా అమ్మతత్త్వాన్ని దర్శించటమే సదస్సు లక్ష్యం. శ్రీ కె. నరసింహమూర్తి బాలునిగా ఉన్నప్పుడే అమ్మ ‘వీడు చదువు పూర్తి అయ్యాక ఎంతో వృద్ధిలోకి వస్తాడు చూడు’ అని ఆశీర్వదించింది.
అమ్మ అంటే అంతులేనిది. అడ్డు లేనిది; కేవలం శ్రీ మన్నవ సీతాపతిగారి కుమార్తె, శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారి భార్య కాదు. సో॥ శ్రీ వీరమాచనేని ప్రసాదరావు ఎమ్.పి. గారి పరిశోధనా వ్యాసం ‘Marxist Prin ciples and AMMA’ ని చదవితే ఆస్తికులు – నాస్తికులూ అమ్మ కడుపున పుట్టిన కవలపిల్లలు అనే సత్యం తెలుస్తుంది” అంటూ అమ్మ హృదయం హృదయానికి సత్తుకునేలా ప్రసంగించారు.
శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ ఆంగ్ల భాషలో ప్రసంగిస్తూ “అమ్మ నిన్న, నేడు, రేపు ఎప్పుడూ ఉండే సద్వస్తువు, స్వయం ప్రకాశమానమూర్తి. అమ్మ చేతలు విశ్వకళ్యాణకారకాలు, అమ్మ మాటలు అనుభవసారాలు సత్యసంశోభితాలు” అంటూ అమ్మ తత్త్వాన్ని సరళంగా షూటిగా వివరించారు.
శ్రీ పరిపూర్ణానంద సరస్వతీస్వామివారు తమ అనుగ్రహభాషణంలో” ప్రతిమనిషి పంచయజ్ఞములకు లోబడి తన జీవితాన్ని కొనసాగిస్తాడు. మౌనం, జ్ఞానంతోనే తపస్సు పరిపూర్ణమౌతుంది. ఈ కంటికి బ్రహ్మ కనిపించే అవకాశమే
లేదు. కానీ బ్రహ్మ అనే అక్షరస్వరూపాన్ని “అమ్మ”లో చూడవచ్చు. ఒక డాక్టర్ M.B.B.S., M.D., పట్టాలు పుచ్చుకోగానే సరికాదు. రోగుల వ్యాధుల్ని నిర్మూలించినపుడే వారి చదువు సార్థకం. లేకపోతే అది అలంకార ప్రాయం. అలాగే సద్గురువు తన వద్దకు చేరిన వారికి పునర్జన్మ లేని స్థితిని కల్గిస్తాడు. శ్రీ రమణమహర్షి ‘నేనెవరు’ అనే విచికిత్సను ప్రబోధించారు. అల్పాక్షరం, అసందిగ్ధం … అన్నట్లు అలతి అలతి పదాలతో అమ్మ ‘నేను నేనైన నేను’ అనే వాక్యాల్లో అనల్పార్ధాన్ని ప్రబోధించారు” అని విశదీకరించారు.
శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు “అమ్మ 90వ జన్మదినోత్సవ శుభసందర్భాన ఈ సభలో పాల్గొనడం సంతోషదాయకం. సాధారణంగా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు తగాదాలు పడుతుంటారు. కానీ అమ్మ ఆత్మస్వరూపాను భవాన్ని పొందింది కాబట్టి ఆత్మతః అన్నయ్యలు, అక్కయ్య పారమార్థిక బంధాన్ని తెలిపింది. శాస్త్రం చాల సంక్లిష్టమైనది. అది చెప్పినట్లు ఆచరించడం చాల కష్టం. కానీ అమ్మ శాస్త్రసారాన్ని చిన్న చిన్న మాటలలో ఆదరణ, ఆప్యాయతలను రంగరించి ప్రవచిస్తోంది” అని ప్రసంగించారు.
శ్రీ పి.కృష్ణయ్యగారు ‘అమ్మవాక్యాలు పదార్థానికి కాకుండా యధార్ధానికి దర్పణం పడతాయి. అవి ఎంతో పారదర్శకతని కలిగి తేటతెల్లంగా ఉంటాయి. వాటిని మనం ఆచరణలో పెట్టాలి’ అని సందేశాన్ని ఇచ్చారు.
శ్రీ కె.పి. నందన్ గారు ‘బ్రహ్మపదార్థం సగుణం, నిర్గుణం, రెండూ .. ఏకకాలంలో, అమ్మ అట్టి బ్రహ్మతత్త్వాన్ని ‘నేను నేనైన నేను’ అంటూ విశదీకరించింది. మా గురువుగారు శ్రీ శివానందమూర్తిగారు ‘అమ్మ కాళీ రూపం’ అని చెప్పారు. శైవసంప్రదాయంలో ‘అనుపాయం’ అనే పద్ధతి ఉంది. అంటే మనం ఏమీ చెయ్యనక్కరలేదు; అమ్మను ఆశ్రయిస్తే చాలు. మన గమ్యాన్ని చేరుకుంటాం’ అంటూ మహాపురుష సంశ్రయ ప్రభావాన్ని విశదీకరించారు.
శ్రీ ఎమ్.వి.ఆర్. శాస్త్రిగారు ‘ఆధ్యాత్మికత ఒక వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో అమ్మ సన్నిధే ఎంతో విలక్షణమైనదీ, విశిష్టమైనదీ, జిల్లెళ్ళమూడి వెళ్ళగానే కడుపునిండా అన్నం పెడుతుంది. తర్వాత ఏం చేస్తుంది; అది కంటికి కనపడదు. మనకు కావలసింది అడగకుండానే అందిస్తుంది’ అంటూ అమ్మ విలక్షణ మాతృతత్వాన్ని విశదీకరించారు.
శ్రీ ఎస్. మోహనకృష్ణ ‘మహస్సు’ సంచిక మరియు డి.వి.డి. లను సమీక్షించారు. శ్రీ వై.వి. శ్రీరామమూర్తి జిల్లెళ్ళమూడిలో నిర్వహించిన 3 రోజుల సదస్సును సమీక్షించారు. శ్రీ బి.జి.కె. శాస్త్రిగార వందన సమర్పణ చేశారు. శ్రీ ఎమ్. దత్తాత్రేయశర్మ, ‘దర్శనం’ సంపాదకులు ఆద్యంతమూ ఆపాతమధురంగా సభను సమర్థవంతంగా నిర్వహించారు. శ్రీ ఎమ్. వెంకటరమణశర్మ, వ్యవస్థాపకులు, దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక, వారు అతిథులను జ్ఞాపికలతో, దుశ్శాలువలతో సత్కరించారు. ‘మహస్సు’ గ్రంథాలను ఉచితంగా అందించారు. జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి, హైదరాబాద్ వారు అందరికీ ఫలహారం, డి.వి.డి. కాపీ, అమ్మ వర్ణచిత్రంతో పాటు అమ్మ ప్రసాదాన్ని పంచారు.