అమ్మ, వేదాలు, శంకరులు, పోతనగారు త్రిసూత్ర ప్రతిపాదనం చేశారు. దానిని హైమక్యయ్య ఆచరణాత్మకంగా ప్రబోధించింది.
- అమ్మ – “నీకిచ్చింది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరణగా పెట్టుకో; అంతా వాడే (దైవం) చేస్తున్నాడని నమ్ము” – అనే మహత్తర సందేశాన్ని సూటిగా సరళంగా ప్రసాదించింది. తృప్తిగా జీవించటం, ప్రేమతో పంచటం, సర్వోత్కృష్టమైన శక్తిని విశ్వసించటం – అనే మూడు అంశాలున్నాయి ఇందులో.
- వేదాలు :- శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అనే మూడు తైత్తిరీయోపనిషత్తులు వేదసారాలు. శిక్షావల్లి – శ్రద్ధయాదేయమ్, అశ్రద్ధయా అదేయమ్, మాతృదేవోభవ అంటూ కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. ఆనందవల్లి ‘బ్రహ్మవిదాప్నోతి పరమ్’ అనే మంత్రంతో ఆరంభమౌతుంది. సత్యం, జ్ఞానం, అనంతం అయిన బ్రహ్మను తెల్సుకొనుటే బ్రహ్మను పొందటం (సోశ్నుతే) అని స్పష్టం చేస్తుంది. దాని సారం ‘బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి’ అని. భృగువల్లి ‘తపసాబ్రహ్మ విజిజ్ఞాసస్య’ (తపస్సు చేసి దైవాన్ని తెలుసుకో అని అన్న బ్రహ్మోపాసవ్రతాన్ని ఒక మార్గంగా తెలిపింది.
సూక్ష్మంగా చెప్పాలంటే శిక్షావల్లి అర్థవంతమైన ఆనందాదాయకమైన జీవనమార్గాన్ని, ఆనందవల్లి మహత్తత్త్వ సాన్నిధ్య ప్రాప్తిని, భృగువల్లి తపస్సు, త్యాగం వలన అమృతత్వ సిద్ధిని వివరిస్తాయి.
- శంకరులు :
దుర్లభం త్రయమే వైతత్ మోక్షానుగ్రహకారకం |
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః ॥
మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం – మోక్షానుగ్రహ కారక సోపాన త్రయమనీ, అవి దుర్లభములు అనీ వివరించారు. ‘మనుష్యత్వం’ అంటే మానవత్వం; కేవలం మానవజన్మ అని కాదు అర్థం.
- పోతనగారు :
నీ పాదకమల సేవయు
నీపాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
తాపస మందార ! నాకు దయసేయగదే ! – అన్నారు. శ్రీ శంకరుల సోపానత్రయం ఆరోహణక్రమంలోను, పోతన గారి సూత్రత్రయం అవరోహణ క్రమంలోను దర్శనం ఇస్తాయి. అపార భూతదయనే మనుష్యత్వంగా అన్వయం అవుతోంది. సర్వేశ్వరపాదకమల సేవకి పెద్దపీట వేశారు; మోక్షసాధన సామ్యం భక్తి రేవగరీయసే అనేది త్రికాలసత్యం. కావున అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాగా ‘తాపసమందార’ అని సంబోధించటంలో ‘తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్య’ అనే శృతి ప్రబోధాన్ని గుర్తు చేశారు.
- హైమ :
హైమను ఒక తపస్వినిగా యోగినిగా మలిచి, జిజ్ఞాసువులకు సాధకులకు ఒక ఆదర్శంగా, మార్గదర్శకంగా రూపుదిద్ది, పరితప్తమానసాల జాబిల్లిగా కరుణామృతరంగవల్లిగా కామితార్ధ ప్రదాయనిగా అద్వైతసిద్ధిదాయినిగా ప్రతిష్ఠించాలని అమ్మ ఒక ప్రణాళికతో కన్నది.
అవతారమూర్తి అమ్మ దివి నుండి భువికి దిగి వస్తే, హైమ మానవిగా పుట్టి మాధవిగా అమ్మ అనుగ్రహంతో సమున్నత శిఖరాల్ని అధిరోహించింది. ముందుగా స్థూలంగా హైమ స్వరూప స్వభావాల్ని తెల్సుకుందాం.
‘జీవితమొక తపస్సుగా జీవించిన చెల్లీ !
పువ్వుకన్న మెత్తనైన హృదయమున్న తల్లీ
బుద్ధునిలో కారుణ్యం నీలో పొంగెను మళ్ళీ
జీసస్ లో సౌజన్యం నీలోవెలసెను చెల్లీ !
గాంధీ సత్యాహింసలు కదిలివచ్చులే తల్లీ !
ప్రేమమూర్తి ప్రేమస్ఫూర్తి నీవే నీవే చెల్లీ !
పిచ్చుకపిల్లలు గాలికి గూటి నుండి జారి పడిన
చెట్టునున్న కాయ కోయ తొడిమ నుండి నీరుగార
చేతము ద్రవియించు నీకు జలజలకన్నీరు కారు
ఎందులకీ దయార్ద్రత? ఎందులకీ సుమసౌమ్యత? ….’ అంటూ వివరించారు సో॥ శ్రీ ఆంజనేయప్రసాద్ గారు.
హైమలో మనకి స్పష్టంగా గోచరించే విశిష్టకళ్యాణ గుణాలు రెండుః అందరి మీద ప్రసరించే అవ్యాజమైన ప్రేమ, అమ్మను ఏకైక లక్ష్యంగా పెట్టుకోవటం. ఒక సందర్భంలో అమ్మ, “హైమను నేనే కన్నాను. నేనే పెంచాను. నేనే చంపుకున్నాను. నేనే దైవత్వమిచ్చాను” అని అన్నది. ‘చంపుకున్నాను’ అన్నమాట యాదృచ్ఛికంగా, అనాలోచితంగా అన్నది కాదు.
అమ్మ అనంత శక్తి సంపన్న. చనిపోయిన వాళ్ళనూ, చనిపోతున్న వాళ్ళనూ పునరుజ్జీవితుల్ని చేసింది. ప్రేమ, వాత్సల్యం, కరుణ రసప్రవాహ త్రివేణీ సంగమమైన హైమ విషయంలో ఎందుకింత నిర్దయగా ప్రవర్తించింది? నిండు జాబిల్లి వంటి రాజహంస గుండెల్లో క్రూర నారాచాన్ని ఎలా నాటింది? అమ్మ అకారణకారుణ్య, ఆశ్చర్యకర వాత్సల్య అని తలపోయటం అర్థరహితమా? – అంటే ఎన్నటికీ కాదు. అలా భావించటం పొరపాటు; మహాపాపం. అందుకు నిష్కృతి లేదు. విశ్వకళ్యాణ కారకయజ్ఞంలో హైమను ఒక సమిధలా అర్పించింది. తన కంటి వెలుగునే కర్పూర హారతి పట్టింది. తర్వాత తన మంగళసూత్రాలనే జగత్కల్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది. అది, ఇది చరిత్ర ఎరుగని త్యాగం.
అమ్మ అచ్ఛమైన ప్రేమకి నిలువెత్తు రూపం. అమ్మ శరీరంలో రక్తం, మాంసం, నాడులు ఏమున్నాయో తెలియదు; కానీ పంచదార చిలుక వలె అణువణువునా మమకారం, ప్రతిఫలాపేక్షలేని అనురాగం, సహస్రకోణాలలో ప్రస్ఫుట మౌతుంది, ప్రస్నత మౌతుంది. హైమాలయ ప్రాదుర్భావంలోని అంతరార్ధాన్ని అధ్యయనం చేయటంలో యోగవాసిష్ఠంలోని ఒక సన్నివేశం సమాంతరంగా గోచరిస్తుంది.
నానాదుఃఖ పరితప్త జనావళి నిస్సహాయతని చూసి మనస్సు ద్రవించిన బ్రహ్మ వశిష్ఠుని సృష్టిస్తాడు. పుత్రప్రేమతో దగ్గరకు పిలిచి ప్రక్కన కూర్చుండబెట్టుకొని. ‘నాయనా! నీ మనస్సు ముహూర్తకాలము అజ్ఞానము పొందుగాక’ అని శపిస్తాడు. అజ్ఞాన వశుడైన వశిష్ఠుడు దైన్యమును పొంది దుఃఖితుడౌతాడు. అపుడు బ్రహ్మ; నాయనా! ఎందుకు దుఃఖిస్తావు? దుఃఖ రాహిత్యం గురించి అడుగు” అని సలహా ఇస్తాడు. అపుడు వశిష్ఠుడు, “మహా దుఃఖరూపమగు ఈ సంసారము ఎలా వచ్చింది? ఈ దుఃఖము ఎలా నశిస్తుంది?” అని ప్రశ్నిస్తాడు. అటుపైన బ్రహ్మదేవుడు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. అపుడు వశిష్ఠుడు దుఃఖాన్ని విడిచి సుఖాన్ని పొందుతాడు.
హైమ పరంగా అమ్మ కూడా ఈ పద్ధతినే ఎంచుకున్నది. ప్రపంచానికి అవసరమైన ‘సాధన’ ‘తపస్సు’లను హైమ చేత చేయించింది. ‘హైమవతి’ అనే పదానికి ‘పార్వతి’ అని అర్థం. కనుకనే ‘తపసాబ్రహ్మ విజిజ్ఞాసస్య’ అనే శృతి వాక్యానికి ఆచరణరూపంగా పార్వతీదేవివలె
‘పరితాపోగ్రనిదాఘవేళ శిలపై పంచాగ్ని మధ్యంబునన్
పరమధ్యానసమేతయై నిలిచి విభ్రాజిల్లె నుద్యత్త ప
శ్చరణాలంకృత శైలనందన కనత్సంధ్యారుణాంబో
ధర మధ్యస్థిత కాంతి కాంతయుత శీత ద్యోతి లేఖాకృతిన్ -’
మాదిరిగ హైమ ఏకాగ్రత కుదరటం లేదనీ, శ్రీలలితా సహస్రనామాలు కంఠస్థం చేయలేక పోతున్నాని వ్యధ చెందేది. ‘అన్నీ అంతా అమ్మే’ అని త్రికరణ శుద్ధిగా నమ్మి తన అంతరంగంలో తిన్నగా వెదకి తెల్సుకున్నది హైమ. అంతేకానీ మనవలె గంటల కొద్దీ అమ్మతో గడపనూ లేదు, సంభాషించనూ లేదు.
ఒకసారి అమ్మ గదిలో మంచం మీద పడుకొని యున్నది. సో॥ కేశవశర్మగారు అమ్మ తల వద్ద కూర్చుని మాట్లాడుతున్నారు. నేను అమ్మ పాదాల వద్ద కూర్చున్నాను. అమ్మ కాళ్ళు రాస్తున్నాను. ఆ సంభాషణ పూర్వాపరాలు నాకు తెలియదు. ఒక సందర్భంలో ‘నీకెంత స్వార్థం, అమ్మా!’ అన్నారాయన నవ్వుతూ. అందుకు నేను, “అమ్మకి పరమార్థమే స్వార్థం, మనకి స్వార్థమే పరమార్థం” అన్నాను. అందుకు అమ్మ, అన్నయ్య ఇద్దరూ ఎంతగానో ఆనందించారు. అమ్మ పాదస్పర్శ ప్రభావం అది. మహాపురుష సంశ్రయం లభిస్తే అక్కడ మాటలతో పని లేదు. కనుకనే పోతనగారు ప్రప్రథమంగా ‘నీ పాదకమల సేవయు నాకు దయ సేయగదే’ అన్నారు.
ప్రతి వ్యక్తికి ప్రధానంగా ఆరోగ్యము, ఆనందము కావాలి. తర్వాత ఎందరున్నా ఎన్ని ఉన్నా నిరర్ధకమే. అమ్మ హైమకి ఆ రెంటినీ ఇవ్వలేదు. హైమ శరీరంతో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న కాలం చాల తక్కువ. తనకంటూ ఏ బాధ లేక పోయినా, అందరి క్లేశాలూ తనవేనని విలవిలలాడేది. అవి నశించిపోవాలి. తద్వారా మానవాళి శాంతిని పొందాలని తపించేది. “ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అందరూ చల్లగా హాయిగా ఉండాలని నేను నీకు నమస్కారం చేసుకుంటాను” అని అమ్మను ప్రార్థించేది, అమ్మతో పోట్లాడేది. ఆర్షసంస్కృతికి, విశ్వశ్రేయః కామనకి హైమమ్మ సాకారరూపం.
సర్వమంగళ సర్వార్థదాయని అయిన అమ్మ తను కన్నబిడ్డ హైమ విషయంలో ఎందుకు కినుక వహించింది? తన్ను మాలిన ధర్మం లేదంటారే! వీడు తనవాడని, వీడు పరుడని ఎన్నిక లఘు బుద్ధులకు, మహాత్ములకు లోకమే కుటుంబము. ఇక్కడే స్వార్థం- పరమార్థం అనే పదాల అర్థాలు నిజస్వరూపంతో సాక్షాత్కారిస్తాయి.
ఎవరికోసం, దేని కోసం అమ్మ అసిధారావ్రతాన్ని ఆచరించింది?
ఎందుకు విష్ణువుని నగరాజధరుడని, ఈశ్వరుని నీలకంఠుండని స్తుతిస్తున్నాము ?
ఎందుకు శ్రీరామచంద్రుడు వనవాస క్లేశాన్ని, సీతా వియోగ దుఃఖాన్ని అనుభవించాడు? ఎందుకు సీతాసాధ్వి అనుమానాన్ని, అవమానాల్ని సహించింది?
ఏ సంపదకోసం, విలువలకోసం క్రీస్తు కావాలని శిలువపై నరకయాతన అనుభవించాడు ?
ఎందుకు సూర్యుడు ఉదయిస్తున్నాడు; మేఘం వర్షిస్తోంది; చెట్లు పుష్పించి ఫలిస్తున్నాయి ? ఏ స్వార్ధ ప్రయోజనాన్ని ఆశించి గౌతమ బుద్ధుడు భార్యాబిడ్డల్ని పరిత్యజించాడు?
ప్రశ్నలన్నింటికి సమాధానం ‘స్వసుఅ నిరభిలాషః ఖిద్యతే లోకహేతోః అని వివరించారు మహాకవి కాళిదాసు. అదే నిజమైన తపస్సు, ఉపాసన, భగవదారాధన. హైమ జీవితమంతా అమ్మను చేరుకోవటానికై చేసిన తపస్సుగానే రూపొందింది. అందరినీ ప్రేమించి, అందరిచే ప్రేమించబడింది. మంచికేమంచి హైమ. వెలుగులకు వెలుగు హైమ.
జీవునికి దేవునికీ నడుమ హైమ వారధి.
మానవ జీవిత రధానికి సారధి:
మనోనైర్మల్యం మంచి ముత్యాలకి కూడా లేదు;
ఆ మహోన్నత సంస్కారం మానవ రూపంలో ఇకరాదు. ఏకాగ్రతతో, దీక్షతో అమ్మను ఆరాధించిన రాధాతత్వం హైమ. కనుకనే “అమ్మా! నీ దగ్గరకే వస్తున్నాను” అంటూ శరీరత్యాగం చేసింది. కనుకనే హైమాలయ ప్రాదుర్భావానంతరం ఆ ప్రాంగణంలో అఖండజ్యోతిని అఖండ నామ సంకీర్తనను ప్రారంభించి అమ్మ “హైమ మనకు దారి అనుకొని నామం చెయ్యండి. ఇది తపస్సాధకులకు నిలయం అవుతుంది” అని పరోక్షంగా సకల శ్రేయోదాయక తన సంకల్పాన్ని తన లక్ష్యాన్ని తేటతెల్లం చేసింది.
మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయాల్ని హైమ పుట్టుకతోనే పొందింది. నిర్మలమైన ప్రేమకి, త్యాగానికి, తపస్సుకి, ఆరాధనకి అర్ధంగా జీవించింది. కనుకనే అమ్మ, వేదాలు, శంకరులు, పోతనగారు ప్రతిపాదించిన త్రిసూత్రప్రతిపాదనని ఆచరణాత్మకంగా ప్రబోధించింది.
ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ