‘నానాశ విశీర్ణ జీర్ణ హృదయైః రక్షార్ధిభిః సోదరైః
సమ్యక్సేవిత పాదపద్మయుగళీం శ్రీ చక్రసంచారిణీం
మాతృప్రాపిత మాధవత్వవిభవాం అద్వైతసిద్ధి ప్రదాం
అంబాం హైమావతీశ్వరీం హృదిభజే కారుణ్య రూపాం శివాం॥’
మాన్యసోదరులు శ్రీచింతలపాటి నరసింహదీక్షిత శర్మగారు సంస్కృత భాషలో రచించిన ‘శ్రీ విశ్వజననీ చరితమ్’ కావ్యములో 70వ పేజీ 15 వ అధ్యాయము ‘శ్రీహైమవతీ చరితమ్’ నందు హైమ అక్కయ్య చరిత్రను సవిస్తరంగా తెల్పిరి. ఈ అధ్యాయాన్నే ప్రతిఏటా శ్రీహైమవతీ జయంత్యుత్సవంనాడు సామూహికంగా పారాయణ చేస్తున్నాం. నా దృష్టిలో 57 శ్లోకాలతో విలసిల్లే ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తే సుందరకాండ పారాయణఫలం లభిస్తుంది. ఈ అధ్యాయసారాన్ని కొంతవరకు మీ ముందు ఉంచుతాను.
అమ్మ ఆ బ్రహ్మకీటజనని, విశ్వకల్యాణ సంధాత్రి, ఆ క్షమయాధరిత్రీ. కానీ అమ్మ భర్త – ముగ్గురు బిడ్డలతో ఒక
సామాన్య గృహిణిలా కన్పిస్తుంది. అమ్మకి ఇద్దరు కుమారులు – ఒక కుమార్తె. ఆ కుమార్తె పేరు హైమవతి. తత్త్వతః అమ్మకి దేవుళ్ళూ బిడ్డలే, బిడ్డలూ దేవుళ్ళే. అమ్మ ఒక ప్రణాళికతో హైమను కన్నది అనిపిస్తుంది. ఆశ్రిత కల్పవల్లి, పరితప్త మానసాల జాబిల్లి, కరుణామృత రంగవల్లి అయిన హైమ అమ్మ ప్రసాదంగా స్వభాను నామ సంవత్సర దక్షిణాయన కార్తీక బహుళషష్ఠీ సోమవారం పునర్వసూ నక్షత్రాన (18-11-1943తేదీన జన్మించింది. కేవలం అమ్మ రక్తమాంసాదులనే కాక అమ్మలో రాశీభూతమైన కరుణ, దివ్యమాతృప్రేమ, త్యాగము, అనురాగములను పంచుకుని అమ్మకి ప్రతిబింబంగా భాసించింది. సకల మానవాళికి సహోదరియై అందరినీప్రేమించి అందరిచే ప్రేమించబడింది.
మనిషి ఎంత నిర్మలంగా ఉండవచ్చునో, ఉండగల్గునో హైమ ద్వారా అమ్మ నిరూపించింది. హైమ పుట్టినప్పటి నుండి ఆరోగ్యంగా ఉన్నకాలం చాల తక్కువ. అందరి క్లేశాల్ని పంచుకుని విలవిల లాడేది. కనుకనే నిరంతరం తలనొప్పితో బాధపడేది. స్వసుఖనిరభిలాష హైమ. ఇక్కడే అమ్మకీ హైమకీ నడుమ ఒక విభజన రేఖ గోచరిస్తుంది. “కష్టాలు పడటానికి కూడా సిద్ధంగా ఉండాలి; బాధలు జీవితాన్ని చైతన్యతరంగితం చేస్తాయి” అని అమ్మ ఆచరణాత్మకంగా ప్రబోధిస్తుంది. కానీ ఆ కష్టాలు నశించి పోవాలని, తద్వారా శాంతినీ, హాయినీ మానవాళి పొందాలని తపిస్తుంది హైమ. విశ్వశ్రేయః కామనకి ఆర్ష సంస్కృతికి హైమ దర్పణం పడుతుంది. “ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా అందరూ చల్లగా హాయిగా ఉండాలని నేను నీకు నమస్కారం చేసుకుంటానమ్మా- అంటూ అమ్మనిప్రార్ధించేది, పోట్లాడేది.
హైమ మంచికి మంచి
సత్యానికి సత్యం
వెలుగులకు వెలుగు
జాబిల్లికి జాబిల్లి. ఒకసారి హైమక్కయ్య అమ్మ దగ్గరికి వెళ్ళి అంజలిఘటించి “అమ్మా! వాళ్ళ (ఫలానా సోదరీ సోదరుల) బాధను తీసెయ్యరాదూ!” అని అర్థించింది. అందుకు అమ్మ, “నీవే తీసెయ్య వచ్చుగా! నాదాకా ఎందుకు?” అన్నది. వెంటనే హైమ, “నాకే ఆశక్తి ఉంటే నీ దాకా రానిచ్చే దాననా?” అన్నది. అప్పుడు అమ్మ తడుముకోకుండా, “ఏమో! త్వరలో ఆ రోజు కూడా వస్తుందేమోలే” అంటూ అమోఘమైన తన ఆశీర్వచన వృష్టిని కురిపించింది. అమ్మకి త్రికాలములు వర్తమానమే. జరుబోయే తన విధి- విధాన రచన తనకి కట్టెదుట కన్పిస్తోంది. ఆరోజు రానే వచ్చింది శీఘ్రంగా. “నా దాకా ఎందుకు?” అన్న ప్రశ్నలో ఒక రహస్యం దాగి ఉంది. అమ్మ సచామర రమా వాణీ సవ్య దక్షిణ సేవిత, శ్రీలలితా పరా భట్టారిక, కాగా హైమ రమావాణీ స్వరూపం. హైమక్కయ్య స్వరూప స్వభావాల్ని
శ్రీ నరసింహదీక్షితశర్మగారు:
తన్మానసం మృదుస్నిగ్ధం దర్శనీయా తనూద్యుతిః ।
పదద్వయం దూర్దవాడ్యం నేత్రయుగ్మం సుశోభనమ్ ||
ప్రసన్నతా ముఖాంభోజో మాధుర్యం భాషణాదికే
ఆప్యాయ భావ సంపన్నా సంగీతాలాప భాసురా ॥
ప్రేమార హృదయానిత్యం సర్వస్యప్రియదర్శినీ ।
సద్భావ సంపత్తియుతా సర్వభూత హితేరతా ॥
మానసేరాగ జలధిః హృదయే రాగమాలికా
అనురాగ సుధాదేహే నేత్రయో రాగ వీచికా ॥
తస్యాః సంస్కృతి వేళాయాం గౌతమాది దయామయాః
తిష్ఠంతి భావపద్యాయాం తేషు ‘హైమా’ ప్రదృశ్యతే |
అనే ఐదు శ్లోకాల్లో వర్ణించారు.
హైమ స్మిత పూర్వాభిభాషిణి, మందస్మిత వదన, మృదు మధుర భాషిణి, ప్రియదర్శిని. తనువునిండ అనురాగసుధలు, కళ్ళ నుండి మమకార రోచిస్సులు వెల్లి విరిసేవి. బుద్ధుని జీవకారుణ్య సాకారరూపమే హైమ. ఒకసారి తెల్లని పరికిణీ, వోణీ వేసుకొని మృదువుగా చిరుగజ్జెల మ్రోతతో నడచి వస్తున్న హైమను చూసి సో॥ శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు “దేవతలు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఇప్పుడు హైమను చూస్తుంటే ఇలా ఉంటారేమో అనిపిస్తోంది.” అని అన్నారు. ఆ సమయంలో అమ్మ హైమను పిలిచి, “అన్నయ్య నిన్ను దేవత అంటున్నాడు” అన్నది; పరోక్షంగా సత్యమే నని ధృవీకరించింది. దయగల హృదయం దైవ నిలయమేకదా!
“ఇతరులను విమర్శించుకోవటం వివేకం” అనే అమ్మ వాక్యాన్ని శిరసావహించింది హైమ. 25సంవత్సరాలు ఈ అవనిపై నడయాడిన ఆ పావనమూర్తి ఏనాడూ ఇతరుల దోషాల్ని ఎంచలేదు. “మనకు హైమ మీద కంటే, హైమకు మనమీద ప్రేమ ఎక్కువ ” అనే అమ్మ వాక్యాల ద్వారా అతులితమైన నిర్మలమైన అవ్యాజమైన హైమప్రేమ అర్థమౌతుంది. అమ్మ విశ్వజనని. అందరూ అమ్మ ఒడిలో పసిపాపలే. కావున అమ్మ అందరినీ తన సంతానంగా పాలించటం పోషించటం సహజం; అందులో విశేషమేమీ లేదు. కానీ హైమ మనలాంటిది. అవతారమూర్తిని కాదు మానవిగా పుట్టి కన్యకుమారిగా ఎదిగింది. శ్రీరాముడుసీతామాత
శిశు శిష్యవా భవతు యదపి మమహృదయం తత్తిష్ఠతుతధా
విశుద్ధేరుత్కర్షస్త్వయితు మమ భక్తిం ద్రఢయతి
శిశుత్వం స్త్రైణం వా భవతు నను వంద్యాసి జగతాం
గుణాః పూజాం గుణిషు నచ లింగం నచవయః
అని అన్నట్లు హైమ సద్గుణ సంపత్తియే, అవధులు లేని ప్రేమే హైమని దేవత చేశాయి. అమ్మ హైమమ్మకి దైవత్యాన్ని ప్రసాదించడం, శ్రీ హైమలయాన్ని స్థాపించడం మన కను విప్పు కోసమే. నా ఉద్దేశం హైమ శరీరంతో ఉండగానే దైవీ సంపత్తి కలిగి ఉన్నది. ఒక ఉదాహరణ:
ఆచార్య ఎక్కిరాల భరద్వాజను చూడగానే వారి హృదయంలోని అవ్యక్తవేదనాగ్ని కీలల్ని వారి కళ్ళల్లో గ్రహించింది హైమ. బాల్యంలోనే వారు తమ కన్నతల్లిని పొగొట్టుకొని, మాతృవాత్సల్యానికి దూరం కావటం చేత ఏర్పడిన మానసిక క్రుంగు (depression) అనీ తత్ఫలితంగా వారి హృదయాంతరాళాల్లో ఒక అఖాతం (Gap) ఏర్పడిందనీ హైమ గుర్తించింది. వయస్సులో భరద్వాజ హైమకంటే పెద్దవారు. ‘బాబూ! అనే పలక రింపుతో మాతృవాత్సల్య రసామృత దృష్టిని కురిపించింది. “తల్లి తన మూడేళ్ళబిడ్డకి ఎలాంటి సేవచేస్తుందో – అంటే నీళ్ళు పోయడం, తల దువ్వడం, అన్నం తినిపించడం, ఒడిలో వేసికొని లాలిపోయడం అవన్నీతానే చేయాల నిపిస్తోంది” – అని తన సహజ మనోజ్ఞ దివ్య మాతృత్వ పరిమాళాల్ని ప్రసరించింది- సకల జగత్తుకి నిజ అవ్యక్త సౌజన్యతత్త్వాన్ని ప్రస్ఫుటం చేసింది. కనుకనే హైమ తుదిశ్వాస విడిచినపుడు సో॥ భరద్వాజ రెండవసారి తన తల్లిని కోల్పోయానని విలపించారు. ప్రేమైక రసాధిదేవతహైమ మహత్తత్వానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణ, అచ్ఛమైన దర్పణం, అలౌకిక రాధాతత్వానికి మనోజ్ఞరూపం.
‘నీపాదకమల సేవయు, నీ పాదార్చకులతోడినెయ్యమును, నితాంతాపార భూతదయయును ” అనిపోతన గారు నుడివిన పరమపవిత్ర భాగవత లక్షణత్రయం హైమకు జన్మతః సంప్రాప్తించినవే. అరిషడ్వర్గాల్ని జయించి, స్వపర భేదం లేక, చిత్తస్థైర్యం సౌమనస్యం కలవారిని స్థితప్రజ్ఞులు అని అంటారు. హైమ అట్టి మహితాత్మ. పుట్టుక నుంచీ హైమ లక్షణం విలక్షణంగానే ఉంది.. కాషాయాంబరాల సంయోగము. హైమ సాధకులకు ఒక అనన్య సామాన్య ఆదర్శం. తాను ఒక నిర్దిష్ట గమ్యాన్ని స్థితిని పొందాలని, సాధించాలని తపించేది. ‘తపసాబ్రహ్మ విజిజ్ఞాసస్వ’ అని అంటుంది తైత్తిరీయోపనిషత్.
హైమ రూపం, అంతఃకరణ, ఆచరణ అన్నీ లలితమే. . “ఎప్పటికైనా ఒక్క నీవేతప్ప ఇంకేమీ లేకుండా ఉండగలనా, అమ్మా?” అనేది హైమ ఏకైకవాంఛ, ఏకాగ్రత, దీక్ష. నారాయణ ప్రశ్నం అనే ఉపనిషత్తులో:
దహ్రం విపాపం పరమేశ్మ భూతం
యత్పుండరీకం పురమధ్యసం
తత్రాపిదహ్రం గగనం విశోకః
తస్మిన్యదంస్తదుపాసితవ్యం !!
(మనహృదయం ఎల్లప్పుడూ పరమాత్మ నివసించే గృహం. అంటే మన హృదయమే బ్రహ్మపురం. అది చాల చిన్నది. అందులో ఘటాకాశంగా శుద్ధంగా సూక్ష్మరూపంగా పరమాత్మ విరాజిల్లుతున్నాడు. దానిని మనం ఉపాసించాలి) – అని ప్రబోధిస్తోంది. హైమక్కయ్య హృదయకుహర మధ్యలో ప్రకాశించే బ్రహ్మ అమ్మ. నిరంతరం శ్రీలలితా సహస్రనామ పారాయణ ద్వారా జగన్మాత అమ్మను ఉపాసించి దైవత్వ పీఠాన్ని అనాయాసంగా అధిష్ఠించిన అనితర సాధ్యమైన సాధనామార్గం, గమ్యం, రూపం హైమక్కయ్య.
– సశేషం