ఆశ్రిత కల్పవల్లి భక్తుల కొంగు బంగారమైన హైమతీదేవి పాలరాతి విగ్రహము సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న విషయం మీకందరకూ తెలుసు.
స్వస్తిశ్రీ వృషనామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి సోమవారం 30.4.2001 గం. 11.11. ని.లకు హైమవతీదేవి క్షీరశిలా విగ్రహము ప్రతిష్ఠించుటకు నిర్ణయమైనది. ఎంతో మంది సోదరీ సోదరులు దీక్షగా ప్రతిష్ఠాంగంగా జపతపాదులు స్తోత్ర పారాయణాదులు ఇప్పటికే చేసి ఉన్నారు. సర్వాంగ సుందర విగ్రహ నిర్మాణమునకు విగ్రహ నిర్విఘ్న ప్రతిష్ఠా సిద్ధికి వారు. వారు చేసిన మంత్ర జపములు పారాయణాదులు వివరములు విధిగా కన్వీనర్, ఆలయ సముద్ధరణ సమితి, జిల్లెళ్ళమూడికి తెలియ చేయవలసిందిగా కోరుతున్నాము.
ఇతఃపూర్వము హైమాలయ ముఖమండపంలో “సౌభాగ్య లక్ష్మీ హోమం” జరిగింది. ఆ మంత్ర జపం కూడా పూర్వం హోమంలో పాల్గొన్న వారందరు చేయవచ్చును. వ్యక్తి గత కారణాల వల్లగాని, ప్రతిష్ఠాకాలము, నిర్ణయం కాకపోవటంవల్లకానీ, ఇంతవరకు ఎవరెవరు దీక్షలు స్వీకరింపకపోయినా వారికి అమ్మ అవకాశం ఇస్తున్నట్లున్నది. వంద రోజులకు పైగా పారాయణ చేయుటకు సమయమున్నది.
పూర్వము దీక్ష స్వీకరించి పారాయణలు, మంత్రజపము చేసిన వారు కూడా ఆ దీక్షలనే కొనసాగించుట గానీ, ఇతరములైన స్తోత్ర జపాదులు స్వీకరించిగాని చేయవచ్చును. శ్రీసూక్తము-కనకధారాస్తవము నిత్యపారాణ విధిలో కనీసం మండలం రోజులలో వేయిసార్లయినా చేయుట ప్రతిష్ఠకు మంచిది.
శ్రీసూక్తము, లలితా సహస్రనామము, సౌందర్యలహరి, కనకధారా స్తోత్రము, సుందరకాండ, సప్తశతిలలో ఎవరికి తోచినది వారు దీక్షగా పారాయణ చేయవచ్చును. బాల, పంచదశి, మహాగణపతి, మహాలక్ష్మి మంత్రములు చేయగలవారు తప్పక దీక్షా స్వీకరాం చేసి మంత్రానుష్ఠానం చేయవలసిందిగా కోరుతున్నాము.
ఈ మంత్రానుష్ఠాన కర్తలు, పారాయణకర్తలు, వివరములను ఆలయ సముద్ధరణ సమితికి వెలియపరచుట ప్రతిష్ఠాంగ హోమములకు, అనుకూలించును. పూర్వ కరపత్రములలో వివరించిన రీతిగా సంకల్పము చెప్పుకోవలెను.
ఈ మా విజ్ఞప్తిని పురస్కరించుకొని ప్రతిష్ఠా కార్యక్రమములో తమవంతు బాధ్యతను నిర్వర్తించుటకు సన్నద్ధులు కావలసిందిగా కోరుచున్నాము.
– ఆలయ సముద్ధరణ సమితి జిల్లెళ్ళమూడి