1. Home
  2. Articles
  3. Viswajanani
  4. హైమవతీశ్వరి – అద్వైతసిద్ధిప్రదాయిని

హైమవతీశ్వరి – అద్వైతసిద్ధిప్రదాయిని

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : December
Issue Number : 5
Year : 2012

(గత సంచిక తరువాయి)

మందారపుష్ప సౌకుమార్యం, పారిజాత సుమ సౌరభం, తులసీదళ పావనత్వం హైమలో ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. వేదవేదాంగపారంగతులైన శ్రీ రాయప్రోలు భద్రాద్రిరామశాస్త్రి గార్ని హైమ ‘తాతగారూ’ అని సంబోధించేది. వారి వద్ద సంస్కృత భాషని అభ్యసించింది. ‘కుశాగ్రబుద్ధి’ అని హైమను వారు ప్రశంసించేవారు. ఒకనాడు అమ్మ, హైమ ఒకే మంచం మీద పడుకుని యున్నారు. శ్రీ భద్రాద్రిశాస్త్రిగారు నిత్యం సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠాన అనంతరం తులసీదళాల్ని కోసుకువచ్చి అమ్మ పాదాలను అర్చించి నమస్కరించుకునేవారు. నాడు వారు అమ్మ పాదాలు అనుకొని హైమ పాదాలకు నమస్కరించారు. వెంటనే హైమ తన పాదాలను వెనుకకు తీసికొని “తాతగారూ ! అవి నా పాదాలండీ” అని అన్నది. వెంటనే అమ్మ. “తప్పేమీ లేదమ్మా! నా పాదాలనుకుంటూ నీ పాదాలకు నమస్కరించారు. ముందు ముందు ఎటూ జరిగేది అదే” అని తన భావి ప్రణాళికనుసూచన ప్రాయంగా తెలిపింది.

హైమ తన అవసానకాలంలో, “నాకు ఎవరూ ఏమీ కనపడటం లేదమ్మా” అన్నది. అమ్మ తన ఋలాకీ తీసి, “ఇప్పుడు కనపడ్తున్నానా, అమ్మా?” అని అడిగింది. తేజోమూర్తి అయిన అమ్మ వంక నిర్నిమేషంగా చూస్తూ, “కనపడ్తున్నావమ్మా” అన్నది. బులాకీ పేరుతో అమ్మ ఏ మాయ తెరలను తొలగించిందో ! అటు తర్వాత కూడా హైమ కేవలం అమ్మను మాత్రమే చూడగలిగింది. ‘బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి’ అన్నట్లు అమ్మ అనుగ్రహంతో అమ్మను మాత్రమే తన దివ్యదృష్టిలో బ్రహ్మగా నిలుపుకున్నది.

5.4.68 తేదీన “అమ్మా! నీ దగ్గరికే వస్తున్నాను” అంటూ హైమ పార్థివశరీరాన్ని పరిత్యజించి అమ్మ అంతరాలయంలోకి చేరింది. శంకరాచార్యులు, వివేకా నందులు, హైమ వంటి కారణజన్ములకి శరీర ధారణ, శరీర త్యాగం నిమిత్తమాత్రము.

“హైమ ఎక్కడకూ పోలేదు. దానిని ఇక్కడనే ప్రతిష్ఠ చేస్తాను” అన్నది అమ్మ. విశ్వకళ్యాణ కారక మహాయజ్ఞానికి

తన కన్నబిడ్డనే కర్పూరహరతి పట్టింది; తర్వాత కాలంలోతన మంగళసూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగాఆవిష్కరించింది.

6-4-68వ తేదీ కీలక చైత్రశుద్ధనవమి నాడు మృత్యుంజయ హైమ పార్థివ దేహానికి నూనెపెట్టి, సున్నిపిండితో నలుగుపెట్టి సీకాయతో తలంటి నీళ్ళు పోసింది అమ్మ నాన్నగారు, అందరూ హైమను పంచామృతాలతో అభిషేకించారు. సర్వాలంకార సంశోభితయై, సర్వలక్షణ సంపన్నయై సిద్ధాసనంలో ఉన్న హైమను భూగృహంలో ఉంచారు. దానిని బ్రహ్మగ్రంధి అని అన్నది అమ్మ. హైమ శరీరంలో వేడీ చైతన్యమూ వచ్చాయి. అంటే విఘ్నేశ్వరుని పార్వతీదేవి అనుగ్రహించి నట్లు అమ్మ హైమకి ప్రాణప్రతిష్ఠచేసింది. టెంకాయలు కొట్టి, కర్పూరం వెలిగించి హారతి ఇచ్చి, యజ్ఞోపవీతం వేసి ఉపనయనాన్ని ప్రసాదించింది. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఆభరణాలు, విభూతి, లవణము వేయగా విశిష్టా లావణ్యరాశి హైమ శిరస్సు మునిగిపోయింది. హైమకి శిరోభేదనం అయి రక్తం చిమ్మింది. ఈ క్రతువంతా శ్రీరామనవమి నాడు పునర్వసు నక్షత్రాన అంటే హైమ జన్మ నక్షత్రాన జరిగింది.

బ్రహ్మగ్రంధి అనేది మూలాధార స్వాధిష్టాన చక్రద్వయాన్ని విడదీయరాని ముడి. మూలాధార చక్రం భూ తత్వ

తత్వాన్ని, స్వాధిష్టానచక్రం జల తత్వాన్ని ప్రతి బింబిస్తాయి. బ్రహ్మగ్రంధి అనేది సృష్టికారకమైనది, బ్రహ్మరాతని తుడిచి తిరగరాయ గల శక్తిగలది, (మేను నేనైన నేను) దేహాత్మభావనని నశింప చేసి ‘జీవో బ్రహ్మైవ నా పరః’ అనే అద్వైత తత్వాన్ని బోధిస్తుంది. అలా శ్రీ హైమాలయం ఆవిర్భవించింది. ఈసత్యాన్ని శ్రీ శర్మగారు

‘వాణీ రమా పాదకంజ మంజీర ధ్వని రంజితం

తత్నమభవత్ పారలౌకిక జ్ఞానవేదికా’ అంటూ హైమవతీశ్వరి భోగమోక్షాలను రెంటినీ ప్రసాదించే అనుగ్రహస్వరూపం అని వివరించారు.

“హైమ మనకు దారి అనుకొని ఎడతెరిపి లేకుండా నామం చెయ్యండి. ఇది తపస్సాధకులకు నిలయం అవుతుంది” అని మార్గదర్శనం చేస్తూ అమ్మ అఖండ నామ యజ్ఞాన్ని ప్రారంభించింది. హైమాలయంలో భద్రాద్రి తాతగారేప్రధమ అర్చకులు. అమ్మ అనుమతితో అనుదినం ఏకాదశ రుద్రాభిషేకాన్ని, శ్రీలలితాసహస్రనామ అర్చనని స్వయంగా నిర్వర్తించారు. శ్రీ హైమవతీ శతకాన్ని రచించారు. మానవిగా పుట్టి మాధవిగా ఎదిగిన హైమ అలౌకిక ఆధ్యాత్మిక సాధనాగరిమకు అబ్బురపడిన తాతగారు.

తనలో జేరెడు మంత్రమేదయిన యుద్ఘాటించెనే మాత ? నా

కును బోధింపుము భక్తవత్సల! పరాకునెంద నీకేల? పా

 వనమౌ నీదయ యొక్కటే యనుచు సంభావించితిన్ నిశ్చయం

 బనియైనన్ వచియింపుమమ్మ జననీ ! అని వేడుకున్నారు.

హైమక్కయ్య అమ్మ అవతార లక్ష్యరూపం. ‘అమ్మా! నీ కోరిక ఏమిటి?’ అని అడిగితే “మీరంతా నాలా హాయిగా ఉండాలి” అన్నది అమ్మ. ‘హాయి’ అనేది ఆనందమయ కోశాంతర్గత పరతత్వ స్వరూపం, స్వభావం. అది జనన మరణ రూప పునరావృత్తిరహిత అవిచ్ఛిన్న ప్రశాంతత. “అంతా నాలా హాయిగా ఉండాలి” అని కోరుకోవటం అందరినీ తనస్థాయికి. తీసుకువెళ్ళాలనే మహదాకాంక్షని స్పష్టం చేస్తోంది. ఇది అపూర్వకమైనది. ఏ అవతారమూర్తి అలా ఆకాంక్షించలేదు. అచ్చమైన అమ్మ కనుకనే అమ్మ అలా కోరుకుంటోంది. మానవ ప్రతినిధిగా హైమకు అమ్మ దైవత్వాన్ని ప్రసాదించింది. శ్రీ శర్మగారు హైమాలయ ప్రాదుర్భావ తాత్పర్యాన్ని,

“జగద్రక్షణార్థం ధరామండలేస్మిన్ శుభం జన్మసంపాద్య దేవీకలాభిః

మహాదర్శపాత్రం బభూవాత్ర ‘హైమా’ యయౌగీ రమాసుందరీదివ్యధామా! 

అంటూ వివరించారు. హైమాలయం అది చల్లని దేవాలయం. సకల ఆధివ్యాధి తాపోపశమన అమరసరిత క్షీరధార. ఆలయంలో అడుగిడిన వెంటనే మేనుకు చల్లన, మనస్సుకు హాయి క్షిప్రప్రసాదాలు. హైమాలయం వంటి మహిమాలయం నా దృష్టిలో మరెక్కడా లేదు. ఆలయంలో తనకర కమలాల్లో చిన్ముద్రని వహించి దక్షిణామూర్తి దివ్య ప్రభలతో అద్వైత రసామృత ధారలను వర్షిస్తోంది హైమవతీశ్వరి. హైమాలయం దక్షిణామూర్తి తత్వానికి నిలయం. అద్వైత సిద్ధికి ఆలవాలం.

“నానాచ్ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం

జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే

జానామీతి తమేవ భాన్త మనుభాత్యేతత్ సమస్తం జగత్

తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే’ అని శ్రీ దక్షిణామూర్తితత్వాన్ని కీర్తించారు శంకరాచార్యులు.

బొటనవ్రేలు పరమాత్మకీ చూపుడు వేలు జీవాత్మకి సంకేతాలు. వాటి కలయిక, సంయోగమునే చిన్ముద్ర (అద్వైత ముద్ర) అంటారు. దైవం అకారణ కారుణ్యంతో క్రిందకి దిగివస్తాడు; ‘నన్ను చేదుకో’ అని జీవాత్మ ఉద్ధరణ కోసం పైకి వస్తుంది కొంతదూరం. హైమాలయం ఆగతికులకు ధృవతార; సమస్యల సాగరంలో పడి కొట్టుకు పోయేవారికి తీరైన తీరం, ఇహపర సౌఖ్యాలను అనుగ్రహించే పవిత్ర తీర్థం.

హైమ దయాసింధువు. జిల్లెళ్ళమూడిలో అమ్మ ఇంట్లో ఒకసారి ఒక పిల్లి పిల్లల్ని ప్రసవించి ఎక్కడికో అదృశ్యమైంది; అంతరించిందో తెలియదు. కన్నులు తెరవని ఆ కూనల్ని ఆప్యాయంగా హైమ చేరదీసింది. పాలలో గుడ్డ తడిపి ఆ పసికూనలకు రోజుకు నాలుగైదు సార్లు పాలు త్రాగించేది.

హైమ మహోన్నత సంస్కార సాకార రూపం. ఆదరణ, ఆప్యాయతలకు ఆకృతి, నవీన కృతి. జిల్లెళ్ళమూడి వచ్చీ పోయే. సోదరీసోదరుల పునర్దర్శన ప్రాప్తి కోసం ఎదురు చూసేది. “మనశ్శుద్ధే మనస్సిద్ధి” అని అమ్మ నిర్వచించింది. అదృశ్యమూ, అగమ్యమూ, వరదాయినీ అయిన దేవత హైమ.

‘సత్యేన ధార్యతే పృధ్వీ సత్యేన తపతే రవి:

సత్యేన వాయవో శాంతి సర్వం సత్యే ప్రతిష్ఠితం॥’

అనే ఆర్ష వాక్య ప్రతిపాదిత సత్యస్వరూపం హైమ.

‘సత్యం జ్ఞానం అనంతం’ హైమ. జీవునికీ దేవునికీ నడుమ హైమ వారధి. మానవ జీవిత రధానికి సారధి. ఆ మనోనైర్మల్యం మంచిముత్యాలకి కూడా లేదేమో! ఆ మహోన్నత సంస్కారం మానవరూపంలో ఇక రాదేమో!

ప్రతినెల బహుళ షష్ఠినాడు హైమాలయంలో ‘శ్రీ హైమవతీ వ్రతాన్ని’ కల్పోక్తంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాచరణ వలన ఎందరో చతుర్విధ పురుషార్థాల్ని సునాయాసంగా పొందారు. కంటికి కనిపించే ఈశ్వరాను గ్రహ రూపమే హైమ, కాలువనిండా నీరు ప్రవహిస్తున్నా త్రాగాలంటే రేవు కావాలి. అట్టి రేవు హైమాలయం; మనస్సు లయం చేసే దేవాలయం. అట్టి 5.12.2012 తేదీన శ్రీ హైమవతీ జయంత్యుత్సవ సందర్భంగా మనందరం జిల్లెళ్ళమూడిలో సామూహికంగా ‘శ్రీ హైమవతీ చరితాన్ని’ పారాయణం చేద్దాం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!