‘ఎందరో మహానుభావులు’ అని త్యాగరాజస్వామి అన్నారు. అందరూ మహానుభావులే” అని అమ్మ ఒక వాస్తవాన్ని, వైలక్షణ్యాన్ని చాటింది. పరిపూర్ణత్వాన్ని దర్శింప అన్నది. చేసింది. అంతేకాదు. మరొక కోణంలో “మనుషులందరూ మంచివాళ్ళే” అని ప్రస్ఫుటంగా నిర్ద్వంద్వంగా ప్రప్రధమంగా ఎలుగెత్తి చాటింది.
వ్యక్తి కర్తృత్వానికి బాధ్యత దైవానిదేనని తేల్చి చెప్పింది. కనుకనే వ్యక్తుల గుణాన్ని తన శిరస్సున ధరించి, దోషాల్ని ఎంచని అకారణ కారుణ్యమూర్తి అమ్మ. ఈ సందర్భంలోనే శ్రీరాజుబావ “ఎంత మంచిదానవోయమ్మా! నీదెంత మంచి విధానమో యమ్మా!!’ అని అపూర్వమైన అమ్మ తీరును కీర్తించారు. “మంచిని మించిన మహిమలు లేవు” అని విశ్వసిస్తే అమ్మను మించిన మహిమాన్విత చరిత లేనే లేదు.
అమ్మతత్త్వం విధి – విధానం; అమ్మరూపం సకలసృష్టి, కనుకనే అందరినీ అన్నింటినీ తన సంతానంగానే కాక తన అవయవాలుగా ప్రేమించింది. అద్వైత తత్త్వరసాధి దేవత అమ్మకి దేవుళ్ళూ బిడ్డలే; బిడ్డలూ దేవుళ్ళే. ఒక ఉదాహరణ:
ఒకసారి అమ్మ మంచం మీద ఒక కాగితంపై వేరుసెనగ కాయలు పోసి ఉన్నాయి. కాయలు ఒక్కొక్కటీ ఒలిచి చుట్టూ చేరిన బిడ్డలకు ఆప్యాయంగా పప్పు నోటికి అందిస్తోంది. తన చేత్తో అలా తినిపించటం అమ్మకి తృప్తి కొంతసేపటికి కాయలు తరిగి ఆ కాగితంపై ఉన్న భగవాన్ రమణమహర్షులవారి ఛాయాచిత్రం కానవచ్చింది. వెంటనే, “ఓసి బుజ్జిముండా ! నువ్వు ఇక్కడ ఉన్నావా!!” అంటూ మహర్షి నోటికి అమ్మ పప్పు అందించింది. అమ్మ కంటికి అది నిర్జీవ ఛాయాచిత్రపటంగా కాక రక్తమాంసాదులతో ఉన్న తాను కన్నబిడ్డ శ్రీ రమణులే ఎదురుగా ఉన్నట్టు, తన ఒడిలో ఉన్నట్లు అనిపించింది. ఇది అమ్మకు సహజం, మనకి విశేషం. ఆలయంలో పూజాదికములను అందుకునే విగ్రహాన్ని గురించి సందర్భావశాన, “దేవుడంటే రాయి కాదు కదా, నాన్నా! తనకీ మనస్సు ఉన్నది కదా!!”
సామాన్యంగా దేవుడంటే భక్తి కంటే భయమే అనేక పాళ్ళు ఎక్కువ. సృష్టికర్తకి సృష్టికి, దేవునికీ భక్తునికీ మధ్యగల సంబంధం తల్లీబిడ్డల సంబంధం అని ఎరుక పరిచింది సార్ధహృదయ అమ్మ. అంటే పునర్దర్శన ప్రాప్తి కోసం తహతహలాడేది, తపించేది భగవంతుడే – భాగవతుడు. కానే కాదు. కనుకనే దైవాన్ని దయాస్వరూపంగా, మమకార రూపంగా నిర్వచిస్తాం. అందుకు సాకారరూపమే హైమక్కయ్య.
‘హైమాలయం మహిమాలయం’ అంశాన్ని ప్రస్తావించే ముందు మూడు ముఖ్యాంశాల్ని సూక్ష్మంగానైనే స్పృశించాలి.
- హైమ – మూర్తీభవించిన మానవత్వం
- హైమ – అతులిత సాధనామార్గం
- హైమ – అమ్మ అవతార లక్ష్యరూపం
- హైమ – మూర్తీభవించిన మానవత్వం
అమ్మలో రాశీభూతమైన కరుణ, ప్రేమ, త్యాగములను పంచుకొని హైమ అమ్మకి ప్రతిబింబంగా భాసిల్లింది. హైమ అంటే మానవత్వానికి మరో పేరు, మమకారానికి మారుపేరు. రూపుదాల్చిన కారుణ్యం, పోతపోసిన ఆత్మీయత, దయకు ఆకృతి, ఆదరణ ఆప్యాయతలకు నవీనకృతి; దయగల హృదయం, దైవనిలయం. పరికెణీ ఓణీ వేసుకొని, కాలి అందెల చిరుమువ్వల సవ్వడి చేస్తూ మందగమనయై, స్మితపూర్వాభి భాషిణియైన కన్యకుమారి; కరుణారసభరిత హృదయ స్పందనం. ఒక ఉదాహరణ:
ఆచార్య ఎక్కిరాల భరద్వాజను చూడగానే – బాల్యం లోనే తల్లికి తల్లిప్రేమకు దూరమైన కారణంగా వారి హృదయంలో ఏర్పడిన వేదనాభరితమైన అఖాతాన్ని, వెలితిని హైమ స్పష్టంగా చూడగల్గింది. అంతేకాదు. వారితో, “నేను నీకు అమ్మనై, తల్లి తన మూడేళ్ళబిడ్డకి ఎలాంటి సేవ చేస్తుందో అదంతా నేనే చెయ్యాలని ఉంది” అని తన సహజ మాతృప్రేమను వర్షించింది, కొంత ఉపశమనాన్ని కల్గించాలని తపించింది. కనుకనే హైమక్కయ్య ఆలయ ప్రవేశం చేసినపుడు సో॥భరద్వాజ “రెండవసారి తల్లిని కోల్పోయాను” అని విలపించారు.
కనుకనే అమ్మ, “మనకు హైమ మీద కంటె, హైమకు మనమీద ప్రేమ ఎక్కువ. మన ప్రేమకూ హైమ ప్రేమకూ తేడా ఉంది. దానికీ మనకీ పోలిక ఏమిటీ” అని హైమమ్మ యొక్క ప్రతిఫలాపేక్ష లేని పవిత్రప్రేమను విశదీకరించింది. హైమ మనోనైర్మల్యం మంచి ముత్యాలకి కూడా లేదు, ఆ మహోన్నత సంస్కారం మానవరూపంలో ఇక రాదు.
- హైమ – అతులిత సాధన మార్గం :
హైమ యొక్క ఆధ్యాత్మిక సాధన ఆదర్శవంతమైంది. దైవం ‘అమ్మ’గా మానవరూపం ధరించి అవనిపై అవతరిస్తే, హైమ మానవిగా జన్మించి దైవానుగ్రహాన్ని పొంది దైవత్వాన్ని, అధిరోహించింది. ‘ఎప్పటికైనా ఒక్క నీవే తప్ప ఇంకేమీ లేకుండా ఉండగలనా, అమ్మా’ అనేదే హైమ ఏకైక వాంఛ, ఏకాగ్రత, దీక్ష. హైమక్కయ్య హృదయ కుహరంలో ప్రకాశించే బ్రహ్మ ‘అమ్మ’. నిరంతర లలితా సహస్ర నామపారాయణ ద్వారా జగన్మాత అమ్మను చేరుకోవాలని.. ఉపాసించి దైవత్వ పీఠాన్ని అనాయాసంగా అధిష్ఠించిన అనితరసాధ్యమైన సాధనామార్గం, గమ్యం, రూపమే హైమక్కయ్య.
సామాన్యంగా ఏ వ్యక్తి అయినా బంధుమిత్రుల సుఖసంతోషాల కోసం జీవిస్తారు. పరితపిస్తారు. కానీ మహాత్ములకు స్వపర భేదం ఉండదు. ‘ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, అందరూ చల్లగా హాయిగా ఉండాలని నేను నీకు నమస్కారం చేసుకుంటానమ్మా – అని హైమ ‘అమ్మ’ను ప్రార్థించేది. విశ్వశ్రేయః కామనకి, ఆర్ష సంస్కృతికి ప్రతీక హైమ. అట్టి సర్వత్రా అనురాగబంధమే హైమను దేవతగా చేసింది. చరమదశలో “అమ్మా! నువ్వే కనిపిస్తున్నావు. నీ దగ్గరకే వస్తున్నాను” అంటూ ఒక పరిణత ఆరూఢతతో పార్థివ శరీరాన్ని పరిత్యజించి పరమపావని ‘శ్రీ హైమవతీశ్వరి’గా సుప్రతిష్ఠిత అయింది. హైమ అలౌకిక ఆధ్యాత్మిక సాధనా గరిమకు అబ్బురపడిన శ్రీ భద్రాద్రి
‘తనలో జేరెడు మంత్రమేదయిన యుద్ఘాటించె మాత? నా
కును బోధింపుము భక్తవత్సలి ! పరాకున్ జెందనీకేల ? పా
వనమౌ నీ దయ యొక్కటే భావించితిన్, నిశ్చయం
బనియైనన్ వచియింపుమమ్మ జననీ ! హైమావతీ! సద్గతి’
అని వేడుకొన్నారు.
- హైమ – అమ్మ అవతారలక్ష్య రూపం
‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ’ అని కృష్ణపరమాత్మ షరతులతో కూడిన వాగ్దానం చేశారు. కానీ అమ్మ “తల్లి అంటే తరింప చేసేది” అనీ, “అందరికీ సుగతే”ననీ తన మాతృధర్మాన్ని నిర్వచించింది అపూర్వ అమోఘ కృపాపూర వరాల జల్లులను బేషరతుగా వర్షించింది. అమ్మ వంటి అనుగ్రహావతారమూర్తి చరిత్ర కనీ, వినీ, ఎరుగనిదీ.
“నీ కోరిక ఏమిటమ్మా?” అని అడిగితే, “మీరంతా నాలా హాయిగా ఉండాలి” అని తన అవతారపరమలక్ష్యాన్ని విస్పష్టంగా చాటింది – అంటే అందరినీ తన స్థాయికి
‘ఆనందోబ్రహ్మేతి వ్యజానాత్’ అంటూ నిరవధిక నిరతిశయ ఆనందస్వరూపమే దైవం అని నిర్వచించింది వేదం. ‘హాయి’ అనేది ఆనందమయకోశపరంగా పరతత్త్వ స్వరూపం, స్వభావం. అది జనన మరణ రూప పునరావృత్తి రహిత ప్రశాంతత. కనుకనే మానవ ప్రతినిధిగా హైమకు అమ్మ దైవత్వాన్ని ప్రసాదించింది.
హైమాలయం – మహిమాలయం
‘Miracles are incidents that promote faith’ (విశ్వాసాన్ని ధృఢతరం చేసే సంఘటనలే మహిమలు) అని అన్నారు Bernard Shaw. దైవం తాను ఉన్నాననే గుర్తును కలిగించటం కోసమే కష్టాలను కలిగిస్తాడు. అనిపిస్తుంది. సమస్యలు ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేసినపుడు మ్రొక్కటం గట్టెక్కటం.. అంతా ఈశ్వర ప్రేరణ, సంకల్పంలోని భాగాలే.
శ్రీహైమాలయం – అది చల్లని దేవాలయం. అడుగిడిన వెంటనే మేనుకు చల్లన, మనస్సుకు హాయి క్షిప్రప్రసాదాలు. హైమవతీ దేవిని నమకచమకాలతో ఏకాదశ రుద్రాభిషేకాలతో తొలుత అర్చించినది శ్రీ భద్రాద్రి తాతగారు. రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్య శ్రీ లలితాకోటి నామపారాయణలూ, మండలదీక్షలూ చేపట్టి హైమవతీదేవి ప్రాభవాన్ని వేనోళ్ళ చాటారు. హైమవతీశ్వరి ఎందరికో దర్శనభాగ్యాన్ని, అందరికీ అనుగ్రహవీక్షణాన్ని ప్రసాదించింది. శ్రీ వై.వి. సుబ్రహ్మణ్యంగారు, శ్రీమతి నక్కా శకుంతలమ్మ, షేక్ మస్తాన్, చి॥ వల్లూరి వెంకటరమణ … ఇంకా ఎందరికో అనారోగ్యాన్ని రూపుమాపి ఆరోగ్యాన్ని ప్రసాదించింది. శ్రీమతి రాచర్ల లలిత, శ్రీమతి రావూరి శేషు ప్రభావతి .. వంటి సోదరీమణులు సత్సంతాన ప్రాప్తిని పొందారు. శ్రీ మధుఅన్నయ్య సమస్యల వలయం నుంచి బయటపడ్డారు. ప్రతినెల బహుళషష్ఠినాడు హైమాలయంలో శ్రీ హైమవతీ వ్రతాన్ని నిర్వహిస్తారు. ఈ వ్రతాచరణ వలన ఎందరో -ఉన్నత ఉద్యోగప్రాప్తి, స్వగృహప్రాప్తి, కళ్యాణము వంటి సకల శుభపరంపరలను పొందుతున్నారు.
అసలు విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తాను.హైమాలయం ఐహిక సుఖాల్ని అనసూయేశ్వరాలయం అముష్మిక సుఖాల్ని అనుగ్రహిస్తుంది అని కొందరు అంటారు. హైమాలయం విశిష్టమైనది, విలక్షణమైనది, సకల ‘హైమాలయం, దక్షిణామూర్తితత్వానికి నిలయం, సంపత్కర మైనది. హైమాలయం వంటి దేవాలయం నా దృష్టిలో ఎక్కడా లేదంటాను. ఆలయంలో హైమక్కయ్య తన కరకమాలల్లో చిన్ముద్రను వహించి దక్షిణామూర్తి దివ్యప్రభలతో అద్వైతరసామృతధారలను వర్షిస్తోంది. బొటనవ్రేలు పరమాత్మకీ, చూపుడు వేలు జీవాత్మకీ సంకేతాలు. వాటి కలయికనే చిన్ముద్ర (అద్వైత ముద్ర) అని అంటారు. అంటే హైమవతీదేవి అద్వైత సిద్ధిదాయిని అన్నమాట. ఉన్నమాటే. కనుకనే అమ్మ “హైమ మనకు దారి అనుకొని నామం చెయ్యండి. ఇది తప సాధకులకు నిలయం అవుతుంది” అని మార్గదర్శనం చేసింది. కావున హైమాలయ, అగతికులకు ధృవతార. సమస్యల సాగరంలో కొట్టుకుపోయేవారికి తీరైన తీరం. ఇహపర సౌఖ్యాల ననుగ్రహించే పవిత్ర తీర్థం.
శ్రీ హైమవతీవ్రత కల్పరచనలో భాగంగా నేను వ్రాసిన ప్రార్థన శ్లోకంలో ఈ వ్యాససారం అంతా ఇమిడి
నానాక్లేశ విశీర్ణ జీర్ణ హృదయైః రక్షార్ధిభిస్సోదరైః
సమ్యక్సేవిత పాదపద్మయుగళీం శ్రీచక్ర సంచారిణీం
మాతృప్రాపిత మాధవత్వవిభవం అద్వైతసిద్ధిప్రదాం
అంబాం హైమవతీశ్వరీం హృదిభజే కారుణ్యరూపాం శివాం’
“ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ”
ఉపయుక్త గ్రంథావళి రచయిత స్వీయ రచనలు
- శ్రీ హైమవతీ వ్రతకల్పము
- మహాప్రవక్త అమ్మ
- ‘అమ్మ అవతార లక్ష్యరూపం – హైమ’ వ్యాసం,
విశ్వజనని, నవంబర్ 2008.
- హైమాలయం, దక్షిణామూర్తి తత్వానికి నిలయం
అద్వైతసిద్ధికి ఆలవాలం’ కవిత
- ‘అద్భుతచారిత్ర – హైమవతీశ్వరి హృత్కమలం’,
గ్రంథ సమీక్ష, విశ్వజనని, జూన్ 2011.