శ్రీ అంబికా సహస్ర నామావళిలో 994వ నామము:
‘ఓం శ్రీ పరిష్వక్త తనూజాతాయై నమః’
ప్రతిపదార్థము: పరిష్యక్త కౌగలించుకోబడిన, = తనూజాతా = కుమార్తె కలది
భావము: తన కన్నబిడ్డ ‘హైమ’ను ‘అమ్మ’ ఆలింగనము చేసుకున్నది.
వివరణము: హైమనేకాదు, మన ‘సహోదరీలనందరినీ ‘అమ్మ’ గుండెలకు హత్తుకున్నది. ఉదా: శ్రీమతి విఠాల శేషారత్నం గారిని దగ్గరకు తీసుకుని ‘అమ్మ’ అన్నది
“నేను నీకు అమ్మను;
నువ్వు నాకు హైమవు” అని.
‘హైమ’ అంటే మానవత్వం, ప్రేమ, కరుణ, దీక్ష, సాధన, మార్గం, గమ్యం, ఉపాసన,
శ్రీ శేషు, మధు అన్నయ్యలకు చిట్టి చెల్లెలుగా, శ్రీ ఎక్కిరాల భరద్వాజకు కన్నతల్లిగా, శ్రీ T.S. శాస్త్రిగారి తల్లి శ్రీమతి దమయంతి గారికి కుమార్తెగా ‘హైమ’ నిస్వార్థమైన ప్రేమను పంచింది.
‘హైమ’ –
జీవునికి దేవునికీ నడుమ వారధి;
మానవ జీవిత రథానికి సారధి;
ఆ మనోనైర్మల్యం మంచి ముత్యాలకి కూడా లేదేమో
ఆ మహోన్నత సంస్కారం మానవరూపంలో ఇక రాదేమో!
“అమ్మా! ఎవరు ఎక్కడ ఉన్నా హాయిగా ఉండాలని నేను నీకు నమస్కారం చేసుకుంటాను ” అనేదే ‘హైమ’ ఏకైక నివేదన, అభ్యర్థన, మహదాకాంక్ష.
‘స్వసుఖ నిరభిలాషః ఖిద్యతే లోకహేతోః’- అన్న రీతిగా “హైమ’ సదా సర్వదా దుఃఖితుల కన్నీటిని తుడవటమే ఒక తపస్సుగా జీవించింది. కావున తత్త్వతః ‘హైమ’యే పరాత్పరి ‘అమ్మ’ని ఆలింగనం చేసుకున్నది.
తన ఊపిరి అనంతవాయువుల్లో లీనమయ్యేవేళ – “అమ్మా! నీ దగ్గరకే వస్తున్నాను” అంటూ శరీరత్యాగం చేసింది ‘హైమ’.
‘అమ్మ’ తప్ప ఇంకేమీ లేకుండా ఉండే స్థితికోసం. పరితపించింది. పరమపద సోపానమధిరోహణం, పురుషోత్తమ ప్రాప్తి యోగం.
‘దయగల హృదయమే దైవనిలయం’ అదే ‘హైమ’ హృదయాంతరాంతరాలయం. ‘హైమ’లోని ఈ లోకోత్తర కృపావిశేషగుణ సంపదకి ‘అమ్మ’ మురిసి పోయింది.
తన అత్యుత్తమస్థాయికి ఉద్దరించింది. పూజా సమయంలో తన స్థానంలో ‘హైమ’ను కూర్చుండబెట్టి సర్వులచే అర్చింప చేసింది.
‘హైమ’ ఆలయప్రవేశం చేసిన తర్వాత ‘హైమ’ను ఎలా అర్చించుకోవాలో ఆచరణాత్మకంగా ప్రబోధించింది.
నేడు ‘కేవలకృపాధారాధార ‘ అయిన ‘హైమమ్మ’ మనల్ని విడిచి శోకాలు లేని లోకాలు చేరినరోజు.
‘నిను మరువదు మానవాళి. నీకిదియే మా నివాళి’ అంటూ మనం సాశ్రునయనాలతో అంజలి ఘటించి ‘హైమవతీశ్వరి’ని ఆరాధించే రోజు.
‘హైమ’ ప్రేమకు మన ప్రేమకు పోలిక లేదు లేదు, లేదు.
అద్వైతసిద్ధిప్రదాయిని అయిన ‘హైమ’ వంటి దేవత చరిత్రలో ఇక రాదు, రాదు, రాదు.