‘శ్రీ వాణీ గిరిజా స్వరూపమయి రాశీభూత మాతృత్వమై
ఆ వేదంబుల వెల్గునై వెలసి, విశ్వారాధ్యయై, దివ్య సు
శ్రీ వాత్సల్య మారీచి మాలిక శుభశ్రీ నించు ఇల్లాలు నా
యావచ్ఛక్తియు భావదీప్తి అనసూయా దేవి రక్షించుతన్.’
“అంఆ” అంటే అంతులేనిది, అడ్డులేనిది. అన్నిటికీ ఆధారమయినది. అమ్మను మించిన దైవం లేదు. దివ్య మాతృత్వ మమకారంతో సకలజీవాళిని పునీతులను చేసే కారుణ్యావతారమూర్తి “అమ్మ”. సహజ సహనమూర్తి అమ్మ. బిడ్డల తప్పొప్పులు చూడక పావనులు, పతితులు అందరినీ ప్రేమించే ప్రేమమూర్తి అమ్మ, ‘అ’ కారంతో తెరుచుకున్న పెదవులు “మ’ కారంతో మూసుకొంటాయి. అంటే మధ్య వచ్చే అన్ని అక్షరాలు ఈరెంటిలోనే. పూర్ణానుస్వార వివర్తనంతో ‘అంఆ’ అయింది. ఆ బీజాక్షర సంపుటి పారాయణతో జీవలక్షణం నశించి శాశ్వతత్వం పొందటానికి అవకాశం ఉన్నది.
అమ్మ కుటుంబాన్ని విశ్వకుటుంబంగా పరిగణించవచ్చు. అమ్మ నాన్నగారిని, శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరావుగారిని, వివాహం చేసుకొని జిల్లెళ్ళమూడి వచ్చినప్పటి నుండి అన్నార్తుల ఆక్రందనలు. నశింపచేయటానికి ‘ఇంటింటా పిడికెడు బియ్యం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదట్లో అమ్మ దగ్గరకు వచ్చే వాళ్లను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. కాలక్రమేణ అమ్మ మహిమలు విశ్వవ్యాప్తం అయ్యేసరికి తండోపతండాలుగా వచ్చేవారు. ఇక్కడ నాకు నదీరా అన్నయ్య పాట జ్ఞప్తికి వస్తుంది.
“ఎందరు రానీ ఎప్పుడు కాని ముందుగ విందులు చేయును జననీ” అలా అమ్మ ప్రతిష్ఠించిన అన్నపూర్ణాలయం లక్షల మందికి అమ్మ అన్నప్రసాదాన్ని అనుగ్రహించింది. అమ్మ సేవాసంస్థ అమ్మ అనుగ్రహంతో శాఖోపశాఖలుగా విస్తరించింది. వాటిలో ప్రధానంగా మనకు కనిపించేవి అన్నపూర్ణాలయం, విద్యాలయం, దేవాలయాలు, వైద్యాలయం, ఆదరణాలయం సుగతి పథం, మాతృశ్రీ పబ్లికేషన్స్, అవి అమ్మ మహత్తత్త్వాన్ని, అమ్మ అలౌకిక ప్రేమను, అకారుణకారుణ్యాన్ని, ఆచరణాత్మకప్రబోధాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు విస్తరింపచేయటానికి శ్రీవిశ్వజననీ పరిషత్ ట్రస్ట్ వారు ఎన్నో సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేస్తున్నారు.
‘నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
తాపసమందార! నాకు దయసేయగదే!” అని పోతనామాత్యులు అన్నారు. నిజమే. అంతకంటే కావలసిందేముంది? కోరుకోదగినది ఏమున్నది? దానికి నిదర్శనంగా ఎందరో అమ్మను సేవించి, తరించారు. వారిని మనం మహనీయులుగా ఆదర్శప్రాయులుగా గౌరవిస్తున్నాం. ఉదాహరణకు పూజ్యశ్రీ పూర్ణానంద స్వామి, శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి, ఆచార్యఎక్కిరాల భరద్వాజ మొదలగువారు. అలా అమ్మను దర్శించి తరించిన మహనీయులు ఎందరో!
అటువంటి అమ్మ సన్నిధిలో అమ్మ చేతుల మీదగా స్థాపించబడిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో చదివి ఈనాడు ఆదర్శప్రాయంగా నిలిచిన పార్వతీపురం సోదరులు మన కళాశాల పూర్వవిద్యార్థులు కావడం గర్వకారణం. వారి అడుగు జాడలలో ప్రతి ఒక్కరూ పయనించి తమ వంతుగా అమ్మ ఆచరించి ప్రబోధించిన సేవా కార్య క్రమాలలో పాల్గొనటం మన కర్తవ్యం. అమ్మసన్నిధిలో ఎన్నో దివ్యానుభూతులను పొందిన ఎందరో భాగ్యశాలురు ఎన్నో విధాలుగా అమ్మను స్తుతించారు, స్తుతిస్తున్నారు.
ఒకసారి నేను కళాశాల లైబ్రరీలో అమ్మను గురించి తెలుసుకుందామని ఒక పుస్తకం తీయగానే నాకు శ్రీమల్లెమాల వేణుగోపాలరెడ్డి వ్రాసిన పద్యం కనిపించినది. అద్భుతమైన ఈ పద్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను.
‘పూర్ణచంద్రుని మోము పుణికి పుచ్చెడి తల్లి.
బంగారు మేనితోఁ బరుగు తల్లి
కుంకుమ తిలకమ్ము కూర్మి దిద్దిన తల్లి
పట్టు పుట్టంబుల వెలయు తల్లి
చిరునవ్వు చూపుల చెన్నొందు మా తల్లి
ఆనందమూర్తియై యలరు తల్లి
కోటి సూర్యులకాంతి మేటి బాసిలు తల్లి
కమల నేత్రంబులు గలుగు తల్లి
తులసి మాలికా తతులచే వెలయు తల్లి
నిత్య సౌందర్యమూర్తియై నెగడు తల్లి
కరుణ రూపముగా గొన్న కన్నతల్లి
కనగ భక్తుల పాలిట కల్పవల్లి!
వేదవీధుల గాని వెదకిన దొరకని
నియమంబులను నిత్యనియతి గూర్చి
జ్ఞానులందునగాని కానిపింపని యట్టి
సాత్విక భావంబు స్వాత్మ నంది
విద్వాంసులకుగాని వెదకిన గనరాని
విద్యావివేకంబు వినుతి నంది
అందని మునివర్యులకు గాని పుడమిలో
శాంత స్వభావంబు స్వాంతమందు అని,”
మాతుః పవిత్ర చరణే శరణం ప్రపద్యే!!