అమ్మను నా ఊహ తెలిసినప్పటినుండి చూస్తున్నాను. 1957కి ముందు నాకు మశూచి సోకినప్పుడు నేను బ్రతికి బట్టకడతానా అని భయపడి మా నాన్నగారు కనపడని దేవుళ్ళందరికీ ప్రార్థన చేస్తూ నిద్రలోకి జారినప్పుడు ఒక తెల్లవారుజామున అమ్మ కలలో కనపడి ‘మీ పిల్లవాడికి ఏమీ కాదు, ఈ వ్యాధి నయమవుతుంది’ అని అభయమిచ్చింది.
ఆ కనపడిన మూర్తిని ఎప్పుడూ మా నాన్నగారు అంతకుముందు చూడలేదు.
డాక్టర్ పొట్లూరి సుబ్బారావు గారి దగ్గరకు మందుకు పోతే అక్కడ తాను కలలో చూచిన అమ్మమూర్తిని చూచి “వారు ఎవరు?” అని డాక్టర్ గారిని అడిగితే ‘జిల్లెళ్ళమూడి గ్రామకరణం గారి భార్య, ‘రాజరాజేశ్వరి. అవతారం గా పూజలు అందుకుంటోంది. మేము ప్రతివారం వెళ్లి ఆమెను దర్శించుకుంటాము. మీరు కూడా ఈ వారం రండి. దర్శించండి” అన్నారు. మా నాన్నగారు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకుని శరణాగతి ని పొంది జీవితాంతం అమ్మనే సేవించుకున్నారు.
ఆ తర్వాత ఆయన వ్రేలు పట్టుకొని నేనూ జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించుకున్నాను. అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ఎక్కువగా అమ్మతో గడిపినా తనివి తీరేది కాదు.
అమ్మ చెప్పేమాటలు వేదాల సారం సులభంగా అందించినట్లు అనిపించేవి.
అమ్మ దగ్గర అమితమైన ఆనందం, శాంతి కలిగేవి. అమ్మను విడిచి పోవాలంటే బాధాకరంగా ఉండేది, అమ్మ కూడా వదలలేక వదలలేక వెళ్ళేంతవరకు మమ్మల్నే చూస్తూ ఉండేది. హైమక్కయ్యను ప్రత్యక్షంగా చూచి ఆమె ప్రేమామృత వాక్కులను చవి చూచాను. అప్పట్లో అమ్మ కూతురుగానే చూచాను గాని దైవమై గుడిలో కొలువవుతుందని ఊహించలేదు. అమ్మతో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక అనుభవాలు జరిగాయి. నేను చేరుకోవలసిన అంతిమ లక్ష్యం అమ్మే అని ఆ అనుభవాలు తెలియజేశాయి. ప్రత్యక్షంగా అమ్మ కరుణను పొందిన మొదటి అనుభవం మీతో పంచుకుంటాను. మా అమ్మకు (కన్నతల్లికి) 1972వ సంవత్సరంలో అంతుతెలియని జ్వరంతో బాధపడుతున్నది. మా ఇల్లు మొత్తం మా అమ్మ చేతులమీదే నడిచేది. మానాన్నగారు ILTD Company లో ఉద్యోగం చేసే వారు. సెలవురోజులలో జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనానికి వెళ్ళేవారు. మా అమ్మే ఇంటి బాధ్యత అంతా చూసుకునేది. మానాయనమ్మ, నాన్న, నేను, మా పిచ్చి అత్త, మా రెండో అత్తకొడుకు రాంబాబు అందరినీ మా అమ్మే చూసుకునేది. ఆమెలేని ఇల్లు ఊహకి అందేది కాదు. అలాంటిది అమ్మకు జ్వరం వచ్చి రెండునెలలపాటు చీరాల సదానందరావు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాకు దిక్కు తోచలేదు. డాక్టర్ గారు అనేక మందులు వాడినా గుణం కనిపించలేదు. ఒకరోజు ఆయన తలపట్టుకుని కూర్చొని ‘ఈ జ్వరం అంతు చిక్కడంలేదు’ అని కొంచెం హైరానా పడ్డాడు. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. దిక్కుతోచక జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మ పాదాలమీద పడి కన్నీటితో మా అమ్మ స్థితి చెప్పి కరుణించమని అడిగాను. “శారద (మా అమ్మ ) కి ఎప్పుడూ ఇలా జరగలేదు. అది దూరంగా ఉన్నా నన్ను తలుచుకుంటూ ఉంటుంది. తగ్గిపోతుందిలే నాన్నా!” అని ప్రసాదం ఇచ్చి పంపింది అమ్మ.
- (సశేషం)