ఈ మాయా ప్రపంచం నుండి నన్ను వేరు చేస్తావా!
నిన్నే చూసే చూపునిస్తావా!
ఈ ప్రగల్భాల ప్రవృత్తి నుండి
నన్ను తప్పిస్తావా!
నిన్నే పిలిచే మాటనిస్తావా!
లోకవృత్తి నుండి నన్ను తప్పిస్తావా!
నీ పనులే చేసే చేతలిస్తావా!
పరుల ఉద్ధరణ తలపును తప్పిస్తావా!
స్వోద్ధరణ వరమిస్తావా!
నియంత్రణ లేని నా నాలుకను
నీ నామమనే దారంతో కట్టేస్తావా!
బావి అంచున మొలిచిన
పచ్చ గడ్డిని చూసి పరవశించి చేరబోయే
నా వెర్రి తలపులను
నీ పాదపద్మాలతో తొక్కిపెడతావా!
కుంటి గుడ్డి చెవిటి వైకల్యాన్ని
ప్రాపంచికాలపట్ల చూపే
కుశల బుద్ధినిస్తావా!
ఇన్ని అవకరాలున్న నన్ను
నీ అక్కున చేర్చుకుంటావా అమ్మా!