గుర్తు తెలిపే వాడే గురువు అని అమ్మ అన్నట్టు చదివాను. అంటే ఒక విషయం గురించి మనకు అర్ధమయ్యే విధంగా తెలియ జేసేవారే గురువులు. అమ్మ తాను గురువునని చెప్పేది కాదు. అది వేరే మాట. ఒకానొక సందర్భంలో నేను గురువును కాదు, మీరు శిష్యులు కాదు. నేను అమ్మను, మీరు బిడ్డలు అంది. కానీ నా జీవితంలో అమ్మ నా వెనుక ఉండి నడిపించింది, నడిపిస్తున్నది. నడుపుతుంది.
మా నాన్నగారు కొండముది రామమూర్తి గారు ఉద్యోగరీత్యా మద్రాసు, విజయవాడ, హైదరాబాద్ నగరాలకు బదిలీ అయ్యారు. అమ్మ నా చిన్నతనం నుండి పై అన్ని ప్రదేశాలకు ఊహ తెలిసినప్పటి నుండి వచ్చింది. కొన్ని గుర్తున్నాయి, మరి కొన్ని జ్ఞప్తి లేవు. నేను పలుమార్లు జిల్లెళ్ళమూడి వెళ్ళాను, అమ్మ శరీరధారిగా ఉన్నప్పుడూ, ఆ తరువాత కూడా. నేను ఆర్టీసీ ఉద్యోగం లో 1985 సంవత్సరంలో చేరాను. 2018లొ రిటైర్మెంట్. ఈ మొత్తం ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నో అనుభవాలు. 1985లో మేము శంకరమఠంలో ఉండే వాళ్ళం హైదరాబాద్ లో. నేను ఆర్టీసిలో చేరినప్పుడు వేదవ్యాస్ అనే ఒక అమ్మ భక్తుడు హైదరాబాద్లో ఇంజనీరుగా పని చేసే ఆయన ఒక డైరీ ఇచ్చారు. తెరిచి చూతును కదా ‘అఆ’ అని వ్రాసి ఉంది. చాలా ఆనందం వేసింది. తరువాత ఎన్నో ట్రాన్సఫర్లు. తెలియని తనం. కానీ అమ్మే రిటైర్ అయ్యే వరకు నాకు మార్గనిర్దేశం చేసింది. ఎలా ప్రవర్తించాలో నేర్పింది. నాకు మంచి పేరు వచ్చేలా చేసింది. ఇప్పుడు చెప్పండి. అమ్మ నాకు గురువా?తల్లా? గురువైన అమ్మనా?