శ్రీ ఈమని కుమారశాస్త్రి
అమ్మ పుష్పాలంకరణ దీక్షా కంకణ బద్ధుడు సోదరుడు శ్రీ ఈమని కుమారశాస్త్రి, నెల్లూరు వాస్తవ్యులు. అతి సామాన్య కుటుంబీకులు. అమ్మ శతజయంతి ఉత్సవాల వరకూ జిల్లెళ్ళమూడిలో జరిగే ఏ ఉత్సవాలకైనా పుష్పాలంకరణ బాధ్యత తీసుకుంటానని అమ్మకు ప్రమాణం చేశారు.
అమ్మకు, హైమకు పుష్పాలతో అలంకారం చేయటమంటే ఒళ్ళు మరచిపోయి, ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. నిరంతరం అదే ఆలోచన, అదే చింతన. ఆయన ఆశయం ముందు దెబ్బయి మూడేళ్ళ ముదిమి వయసు తలవంచి, ఓడిపోయింది.
అన్నమాట ప్రకారం ఇప్పటివరకూ క్రమం తప్ప కుండా ప్రతి పండుగకూ రెండు రోజులు ముందుగానే వచ్చి ఆ ఏర్పాట్లు చేస్తారు. జిల్లెళ్లమూడిలో జరిగే ప్రతి ఉత్సవానికీ, “పుష్పాలంకరణ” అంటే కుమారశాస్త్రి గారు చేస్తేనే గాని ఆ ఉత్సవానికి నిండుదనం రాదంటే అతిశయోక్తి కాదు. అందుకు కావలసిన పూల ఖర్చు ఏ వందో రెండొందలో కాదు వేలరూపాయలలో వుంటుంది. మరి సామాన్య కుటుంబీకుడైన కుమారశాస్త్రి ఎలా సమకూర్చగలుగుతున్నాడు అనే అంశం ఆసక్తికరం.
దీనికి ఆయన నిర్మొహమాటంగా, తనకు తెలిసిన వారందరి దగ్గరా, ఏ విధమైన బలవంతం లేకుండా వారు ఎంత ఇస్తే అంత తీసుకుని, మిగిలింది తను వేసుకుని కావలసిన మొత్తం సమకూర్చుకుని పూలు, పూలదండలు ఎక్కడ చవకగా దొరుకుతాయో అక్కడికి స్వయంగా వెళ్ళి జిల్లెళ్ళమూడికి తీసుకు వచ్చి మళ్ళీ తనే స్వయంగా కొంతమంది విద్యార్థినీ విద్యార్థుల సహాయంతో అలంకరించి తృప్తి చెందుతారు. ఇది ఆయన నిరంతర ఆలోచన ఆరాధన.
ఆయన ఒక విశ్రాంత ఉద్యోగి. ఈ కార్యక్రమానికి మూలధనం సంపాదించటానికి రకరకాల మార్గాలు ఎంచుకున్నాడు. ఊరగాయ పచ్చళ్ళు కొని తెలిసిన వాళ్ళందరికీ కొంత లాభానికి అమ్ముతాడు. ఆ లాభం ఈ పూల అలంకరణ మూలధనంలో దాచివుంచుతాడు. జిల్లెళ్ళమూడి “అన్నపూర్ణాలయం” లో మనం తినే చింతకాయ పచ్చడి ఆయన తెచ్చిందే. జిల్లెళ్ళమూడికి మాత్రం ఏమీ లాభాపేక్ష లేకుండానే సప్లయి చేస్తాడు.
ఈ విధంగా సమకూర్చుకున్న ధనంతో అమ్మ పుట్టినరోజు, కళ్యాణం, దసరా ఉత్సవాలు, హైమ పుట్టినరోజు మొదలైన పండుగలకన్నిటికీ ఆయన చేసే పుష్పాలంకరణే ప్రత్యేక ఆకర్షణ.
గత నవంబరు హైమవతీ జనయిత్రీ వ్రతములలో పుష్పాలంకరణ కోసం ఆయన పడ్డ శ్రమ చూస్తే సంభ్రమాశ్చర్యాలకు లోనుకాక తప్పదు. అంతటి అంకితభావం, ఆరాధన, దీక్షా, దక్షత వున్న వ్యక్తులు చాలా అరుదు. ఈ ఉత్సవాలకై చాలాకాలం నుండి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. చీరాలలో భరద్వాజ మాస్టరుగారి శిష్యులు ప్రదీప్, రాము (బుల్లెబ్బాయి), రామకృష్ణలను వెంటపెట్టుకుని వచ్చి, రోజూ పూలు వెదుళ్ళపల్లి నుండి తీసుకువచ్చి ముందు రోజు సాయంత్రం నుండే పుష్పాలంకరణకి సంసిద్ధులవుతుంటారు.
నవంబరు 12న హైమవతీజనయిత్రీ వ్రతముల ప్రారంభ దినం నుండి, 18వ తేదీ హైమజయంతి వరకు ఒక్కొక్కరోజు ఒక్కొక్కరకమైన అలంకారములతో హైమవతీదేవినీ, అమ్మనీ, చివరికి లలితాపారాయణ వేదికలను కూడా పుష్పాలంకరణ చేసి చూపరులకు ఆనందోత్సాహాలను కలిగించారు.
చిత్రమేమిటంటే భరద్వాజగారి శిష్యులు భౌతికంగా భరద్వాజగారినీ చూడలేదు, అమ్మనీ చూడ లేదు. ఆయన చరిత్రలో అమ్మ గురించీ, హైమ గురించీ. చదివి, విని, ముఖ్యంగా హైమక్కయ్య భరద్వాజగారిని తల్లిగా ప్రేమించి, ఆదరించిన సంఘటన వారిని ప్రభావితులను చేసిందని వారే స్వయంగా వివరించారు.
గత సంవత్సరం జరిగిన అమ్మ కళ్యాణోత్సవంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఎప్పటిలాగే ఆ ఉత్సవం కోసం కావలసిన పుష్పాల కోసం కర్ణాటకలోని హోసూరులో మంచి పూలు చవకగా దొరుకుతాయని నెల్లూరు నుంచి హోసూరుకి ట్రైన్లో టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో బెర్త్ కన్ఫర్మ్ కాక RAC వచ్చింది. అంటే బెర్త్ కాకపోయినా సీటు వరకు గ్యారంటీ అన్నమాట. హోసూరులో కావలసిన పూలు, దండలు అన్నీ కొనుక్కుని, ఒక ఆటోరిక్షాలో పెట్టుకుని స్టేషనుకు బయలుదేరాడు. తెలుసుగా మన నగరాలలో, పట్టణాలలో పరిస్థితి! ట్రాఫిక్ లో ఇరుక్కుంటే ఇక దేవుడే దిక్కు! ఒక పక్క ట్రైన్ బయలుదేరే సమయం దగ్గరపడింది. మరోపక్క గంపెడు పూలు, దండలతో ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఆటోరిక్షా సమయానికి స్టేషన్ చేరే మార్గం కనిపించటం లేదు. అమ్మ మీద భారం వేసి సమయం దాటిపోయినా స్టేషన్ చేరుకున్నాడు.
ఆశ్చర్యం! ఆ ట్రైన్ ఈయనకోసమే వేచియున్నట్లు అక్కడే వుంది. ఆనందంతో గబగబా ఈ పూలబుట్టలు అన్నీ ట్రైన్లోకి ఎక్కించి శాస్త్రిగారు కూడా ఎక్కడో లేదో ఆ ట్రైన్ వెంటనే, తన లక్ష్యం నెరవేరినట్లుగా బయలుదేరింది. అయితే ఇక్కడ ఇంకో తమాషా! ఇన్ని చేసిన అమ్మ, ఆయన కోసం ట్రైన్నే ఆపివుంచినా, ఆయనకు బెర్త్ మాత్రం కన్ఫర్మ్ కాలేదు!! పాపం శాస్త్రి అన్నయ్య గారు !
హోసూరు నుంచి బాపట్ల వరకు కూర్చుని ప్రయాణం చేసి, జిల్లెళ్లమూడికి రాత్రి చేరుకుని, మరునాడు అమ్మ కళ్యాణానికి కావలసిన అలంకరణ చేసి ఊపిరి పీల్చుకున్నాడు! అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఏ విధంగా వుంటుందో ఎవరు ఊహించగలరు?