1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ ఎప్పుడూ వున్నది

అమ్మ ఎప్పుడూ వున్నది

D V N Kamaraju
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

“తల్లి అంటే తొలి” అని ఒక అపూర్వ నిర్వచనం ద్వారా తనను గురించి తానే తెలియచేసింది అమ్మ. జిల్లెళ్ళమూడి అమ్మగా ప్రసిద్ధి చెందిన బ్రహ్మాండం అనసూయాదేవి జననం అందరికీ తెలిసిన విషయమే మార్చి 28, 1923, రుధిరోద్గారీ నామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి, బుధవారం.

అమ్మ జననం 1923 లో జరిగింది అంటే అంతకుముందు అమ్మ లేదా? అన్న ప్రశ్న రావటం సహజం. కానీ మన అమ్మ విషయంలో అది అసహజం. అందుకు అనేక ఉదాహరణలు.

శ్రీ గోవిందరాజుల దత్తాత్రేయులు గారు అమ్మను దర్శించుకున్నప్పుడు వారితో అమ్మ “నేను నిన్ను మంగళగిరి బాలాంబగారి సత్రంలో వడ్డన చేస్తుండగా చూశాను నాన్నా!” అన్నది. వారు చాలా అనందించారు. తరువాత వారు ఇంటికి వెళ్ళి తీరిగ్గా అలోచించుకుంటే, ఆ సంఘటన జరిగింది 1918లో, అప్పటికి అమ్మ పుట్టనే లేదు. ఎలా సాధ్యం?

అభినవ వ్యాసుడు, కవిబ్రహ్మ తిక్కన సోమయాజి 13వ శతాబ్దిలో క్రీ.శ. 1208 1288 మధ్య జీవించారు. ఆంధ్రమహాభారతంలోని 15 పర్వాలు రచించారు. తిక్కన గారు నెల్లూరువాసి అయినా వారు గుంటూరు సమీపం లోని జిల్లెళ్ళమూడిలో అనేక యజ్ఞాలు చేశారని తెలుస్తున్నది. ఇటీవల అమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రసంగించిన శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఈ విషయం స్పష్టం చేశారు.

అయితే అమ్మ ఈ విషయం అంతకుముందే ఎప్పుడో ప్రస్తావించటం జరిగింది. ఆ సమయంలో అమ్మ సన్నిధిలో విశాఖపట్నం నివాసి అయిన సోదరులు శ్రీ కవిరాయని కామేశ్వరరావు గారు ఉన్నారు. అమ్మ ఈ విషయం ప్రస్తావించినప్పుడు ఆయన అమ్మను “అప్పుడు నువ్వు ఎక్కడ వున్నావమ్మా?” అని అడిగితే దానికి “నేను చూశాను నాన్నా!” అని సమాధానం ఇచ్చింది అమ్మ.

పై రెండు సందర్భాల్లో జరిగిన సంఘటనలు అమ్మ జననానికి పూర్వం జరిగినవి.

అది వివరిస్తున్నప్పుడు అమ్మ మాటలను జాగ్రత్తగా గమనించాలి. అమ్మ మాటలను ఎంతో అర్థవంతంగా ఉపయోగిస్తుంది. అమ్మ వాక్యాలలో వ్యర్థ పదాలు వుండవు. “తోలు నోరు కాదు కదా” మరి!! పై సంఘటనలు వివరిస్తున్నప్పుడు అమ్మ “నాకు తెలుసు” అనో, లేదా “నేను ఉన్నాను” అనో లేక తత్సమానమైన పరోక్షజ్ఞాన వాక్యాలు ఏవీ వాడలేదు. అమ్మ అన్నది ఒకటే మాట. “నేను చూశాను నాన్నా” అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడు కంటి కెదురుగా కనిపించే దానిని ఎలా చూస్తున్నానో అలా చూశానని చెప్తున్నది.

ఈ రెండు సందర్భాలు అమ్మ జననానికి పూర్వం జరిగిన సంఘటనలయితే, అమ్మ శరీరం త్యజించిన’ తరువాత కూడా తన ఉనికిని సుస్పష్టంగా ప్రకటించింది.

ఈ సందర్భాలనూ, అమ్మ మాటలనూ జాగ్రత్తగా ధ్యానించి ఆలోచిస్తే, అంతటా వున్న అమ్మ, సర్వం. తానయిన అమ్మకు జనన మరణాలు అన్నవి కేవలం ఒక వ్యాజం, అమ్మ నిత్యా, లలితా సహస్రంలో ‘నిత్యా నామానికి అర్ధం – “భూత, భవిష్యద్వర్తమాన కాలాల్లోను, జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలలోనూ అఖండ రూపిణిగా ప్రకాశించే దేవి ‘సత్య’ (భారతీ వ్యాఖ్య), ‘ఎప్పుడూ ఉండేది కనుక నిత్యా’ అని భాష్యకారులు చెప్పారు. అంతేకాదు, ఆ నామాల వరుసలోనే మరొక నామం కూడా వుంది ‘నిరంతరా’, ‘అంతర’ అంటే హద్దు – హద్దులు లేక అంతటా వ్యాపించి ఉన్న దేవి “నిరంతరా’ (భారతీ వ్యాఖ్య), “నాకు నిన్నా, ఇవాళా, రేవూ అంటే నవ్వొస్తుంది” అంటుంది అమ్మ (అమ్మా- అమ్మ వాక్యాలు 1514- చతుర్ధ ముద్రణ). ‘నిత్యా’ అయిన అమ్మ మాత్రమే ఆ మాట అనగలదు.

లలితా సహస్రం లోని ఈ రెండు నామాలకూ ఇచ్చిన వ్యాఖ్యానం, పైన వివరించిన రెండు సంఘటనల నేపధ్యంలో ఆలోచించినప్పుడు అమ్మ “నేను చూశాను” అని మాత్రమే ఎందుకన్నదో అర్థమవుతుంది.

అమ్మ ఒకప్పుడు వుండి, ఒకప్పుడు లేకపోవటం లేదు. “రూపం పరిమితం శక్తి అనంతం” అన్నదీ అమ్మ మాటే. “అమ్మ అంటే జిల్లెళ్ళమూడిలో మంచంమీద కూర్చున్న ఈ నాలుగు అడుగుల పది అంగుళాల రూపము మాత్రమే కాదు” అని ఒక సందర్భంలో అమ్మ వివరించింది.

ఎప్పుడూ వున్న అమ్మను ప్రత్యేకించి ఒక రాతి విగ్రహంలో ఆవాహన చేసి ప్రాణ ప్రతిష్ట చేయవలసిన అవసరం వుందా? మహాబలిపురంలో చెక్కబడిన అమ్మకృష్ణశిలా విగ్రహాన్ని జిల్లెళ్ళమూడికి తరలిస్తున్న సమయంలో ఆ విగ్రహ స్పర్శ రక్త మాంసాది ధాతుయుక్తమైన శరీర స్పర్శగా, స్పష్టంగా ఈ వ్యాసకర్తకి అనుభూతిని ప్రసాదించింది ‘నిత్య’ అయిన అమ్మ ఆ సమయంలోనే అమ్మ విగ్రహం చేతిని స్పర్శించినప్పుడు నాడి కొట్టుకోవడం అనుభూతమయింది సోదరుడు వై.వి. శ్రీరామమూర్తికి,

ఎప్పుడూ వున్నది అమ్మే అంతటా వున్నది అమ్మే! అందుకే అమ్మ “నేను చూశాను నాన్నా” అన్నది కాని, “నాకు తెలుసు” అనలేదు.

అఖండ సచ్చిదానంద స్వరూపిణి అయిన అమ్మకు శతకోటి ప్రణామాలు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!