1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ జన్మదినోత్సవం

అమ్మ జన్మదినోత్సవం

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

అమ్మ పుట్టిందీ రోజున – జగదీశ్వరీ జగన్మాత, ఆది అనాది అయిన శక్తి- ఒక అనంత చైతన్యం నామరూపరహిత స్థితి నుండి ఆకారం దాల్చి వచ్చిందీ రోజున, అవతరించిన క్షణం నుండి ఇంకా చెప్పాలంటే అవతరణకు ముందు నుండి కూడా మహాద్భుతాలు వెదజల్లుతూ అడుగడుగునా మహిమాన్వితమయిన తన లీలా విశేషాలతో తనను చుట్టుకున్న సృష్టిని సమ్మోహనపరుస్తూనే ఉన్నది.

మధురలో కారాగారంలో పుట్టిన వైష్ణవశక్తి జగత్తును మాయలో ముంచి ప్రేపల్లెలోని నందయశోదల. మందిరంలో పారాడినట్లుగా అమ్మ మన్నవలో కరణంగారింట్లో కాంతికిరణమై వెలసినా గొల్ల నాగమ్మ పూరి గుడిసెలో కేరింతలు కొట్టుతూ సంక్రాంతులు వెదజల్లింది.

కన్నతల్లికి, తండ్రికి ఎన్నెన్ని అనుభవాలో ఆఖరికి పురుడు పోసిన మంత్రసానికి లక్ష్మీదేవిగా దర్శనం ప్రసాదించింది. పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఎవరి ఆరాధ్యదైవంగా వారికి ప్రత్యక్షమవుతూ వచ్చింది. గంగరాజు పున్నయ్య గారికి కృష్ణుడుగా, గుండేలురావు గారికి రామచంద్రునిగా, బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయపూజారికి రాజ్యలక్ష్మి అమ్మవారుగా, మన్నవలో వెంకటప్పయ్య గారికి సత్యనారాయణస్వామిగా, చిదంబరరావుగారింట్లో పనిచేసే నల్లికి ఏసుగా, ఏసును కన్న మరియమ్మగా, వాసుదాసస్వామికి తన ఆరాధ్య దైవమైన రామబ్రహ్మంగా అమ్మ దర్శనం ప్రసాదిస్తూ వచ్చింది.

కవులు వాణిగా, సంపన్నులు లక్ష్మిగా, శక్తి ఉపాసకులు కాళిగా, రాజరాజేశ్వరిగా, అతితగా ఆరాధిస్తూ, ఉపాసిస్తూ తమ కోర్కెలు సాధించు కుంటున్నాడు. అమ్మ సృష్టి తానుగా తాదాత్యం చెందుతూ సృష్టిని ప్రేమించింది. లాలించింది, ఉపాసించింది. ఆకలిగొన్న వారికి, అన్నపూర్ణయై కదుపునింపింది.

తల్లి లేని వారికి, తల్లి ఉన్న వారికి, తల్లులకు, తండ్రులకు, పిల్లలకు, పెద్దలకు, అందరికీ ఆఖరికి తాను కన్న వారికే కాక తనను కన్నవారికి, కట్టుకున్నవారికి కూడా తల్లియై ఆదరించింది, మాతృత్వ మమకారంతో వాత్సల్య జలధిలో ఓలలాడించింది.

సృష్టికి మంచి చెడులు సహజం. అందుకే అమ్మ మంచిని చెడును రెంటిని ప్రేమించింది. మరి సృష్టి తాను గదా! అందుకే ‘అందరికి సుగతేనని ఘంటాపథంగా చాటి చెప్పింది.

ఒక రోజు అందరం అమ్మ చుట్టూ కూర్చున్నాం, ఒక్కొక్కరే అమ్మను “సమర్థురాలై ఉండి కూడా అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు” అని దెప్పి పొడుస్తున్నారు. అప్పుడు అందరిని మాట్లాడనిచ్చి, “మీరు కోరింది. నేనేమి చెయ్యలేదో? ఏం జరుగలేదో చెప్పండి. గుండె మీద చెయ్యి వేసుకొని” అని అమ్మ ఒక సవాలు విసిరినట్లు మాట్లాడితే ఒక్కరు కూడా కిమ్మనలేదు. మన కోరికలోని నిష్టాలోపమే తప్ప అమ్మ తీర్చక పోవటమనేది లేదు. ప్రతి చిన్న విషయంలోను స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది.

అమ్మ ఆలయంలో ప్రవేశించిన తరువాత కూడా అమ్మకు జరిపే ఉత్సవాలు ఏవీ వాటి స్థాయి తగ్గకుండానే జరుగుతున్నవి. మనం తపన పడాలి. మనస్ఫూర్తిగా ఆ పని కోసం ఆవేదన చెందాలి. అమ్మను ప్రార్థించాలి, అంతే, కరుణామయి అమ్మ ఎనాడూ తిరస్కరించలేదు. తిరస్కరించదు. ఉదాహరణకు ఒక సంవత్సరం అమ్మ జన్మదినోత్సవానికి నూట ఎనిమిది అనసూయావ్రతాలు చేయాలని ప్రయత్నించాము. తపనపడ్డాం. ప్రార్ధించాము, అ కార్యక్రమం, నిర్విఘ్నంగా, జయప్రదంగా, మహోన్నతంగా జరగాలని చివరి నిమిషం దాకా ఆందోళన చెందాం, కాని అమ్మ దయతో 108 మంది దంపతులు కాదు 120 మంది దంపతులు అనసూయా ప్రతాలు చేసుకున్నారు. అనసూయేశ్వరాలయంలో, హైమాలయ ఆవరణంలో, అమ్మ సన్నిధిలో పవిత్ర వాతావరణంలో ప్రతాలు విజయవంతంగా జరిగాయి. వ్రతంలో పాల్గొన్న అక్కయ్యలు, అన్నయ్యలు ఇక్కడ జరిగినట్లుగా ఎన్నడూ ఎక్కడా, అఖరికి తమ యిండ్లలోను, గుళ్ళలోను ఇంత వ్యవస్థీకృతంగా మాకు అర్థమయేట్లుగా వ్రతపూజ జరుగలేదు. ఈ రోజు అదృష్టవంతులం, ధన్యులమైనాం. అమ్మ కారుణ్యం మామీద పొంగిపొర్లింది, అమ్మ ప్రత్యక్ష అనుభూతిని మేము అనుభవించాం అని ఎంతో సంతృప్తి చెందారు.

కనుక అమ్మను మనం కోరే కోర్కెలో సత్యనిష్ట, తపన ఉంటే అమ్మ కోర్కెలు తీర్చే కొంగు బంగారమే మరి, కార్యకర్తలకు కూడా క్షణక్షణము అమ్మ అనుభవాలు ప్రసాదిస్తున్నా ప్రతీసారీ అమ్మ చూపే అనిర్వచనీయమైన వాత్సల్యంతో అకారణ కరుణలో తడిసిపోతూ మళ్ళా మాయలో మునుగుతూ తేలుతూ కూడా అమ్మ చేసిన అద్భుతానికి చూపిన కారుణ్యానికి ఆనందంతో మురిసిపోయారు.

అమ్మ జన్మదినోత్సవం అందరింట్లో ఒక క్రొత్త కాంతి ప్రసరింప జేసింది అనేది నిస్సందేహం,

(శ్రీ విశ్వజననీ వీక్షణం – గ్రంథం నుండి)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!