1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ జీవితచరిత్ర – శ్రీమద్రామాయణం

అమ్మ జీవితచరిత్ర – శ్రీమద్రామాయణం

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

శ్రీమద్రామాయణ కావ్య ఆవిర్భావం : అదికావ్యమైన శ్రీమద్రామాయణ ఇతిహాస రచనా క్రమాన్ని అధ్యయనం చేస్తే –

మా నిషాద ప్రతిష్టాం త్వ మగమః శాశ్వతీః సమాః అంటూ అప్రయత్నంగా వెలువడిన ఒక మంగళాచరణ శ్లోకంతో వాల్మీకిమహర్షి వ్యాకుల చిత్తుడైనాడు. అశ్లోక సారం ఏమంటే దుర్మార్గుడైన రావణుడు మాయోపాయంతో సీతామాతను అపహరించటం.

ఆ సందర్భంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై- “రామస్య చరితం కృత్స్నం కురు త్వమ్ ఋషిసత్తమ!” (ఓ ఋషీశ్వరా! శ్రీరామ చరితమును నీవు సంపూర్ణముగా రచింపుము) అని ఉపదేశించారు. అతః పూర్వం నారద మహర్షి ద్వారా శ్రీరామ చరిత్రను సంక్షిప్తంగా మహర్షి విని ఉన్నారు. అంతమాత్రం చేత 24,000 శ్లోకాలలో సవిస్తరంగా (రాజ్యాభిషేకం రాజ్య పరిత్యాగం, ప్రాణదానం- ప్రాణహరణం, స్నేహం- శతృత్వం, ధర్మాచరణ – ధర్మ పరిరక్షణ) మున్నగు ఘట్టాలను నవరసభరితంగా ఛందోబద్ధంగా అభివ్యక్తం చేయటం నిస్సందేహంగా అసాధ్యం. కనుకనే బ్రహ్మదేవుడు –

“తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి” (నీకు ఇతః పూర్వం అది తెలియక పోయినా, సర్వం ఇప్పుడు నీకు తెలియును) – అంటూ మహత్వపూర్ణ స్ఫూర్తిని, స్థైర్యాన్ని అనుగ్రహించారు. అటు పిమ్మట మహర్షి శ్రీరామచరిత్రను రచించారు.

అమ్మ జీవితచరిత్ర ఆవిర్భావం: శ్రీమద్రామాయణాన్ని శ్రీరాముడు, శ్రీమద్భాగవతాన్ని శ్రీకృష్ణుడు రచించలేదు. ఏ అవతారమూర్తి స్వీయచరిత్రను వ్రాసుకున్న దాఖలాలు లేవు. కాగా, ‘అమ్మ జీవిత మహోదధి’ గ్రంథం అమ్మ స్వీయచరిత్ర (Autobiography) అని అనవచ్చు. అది అత్యంత విశిష్టమైనది, విలక్షణమైనది, అపూర్వమైనది.

‘వేదములే శిలలై వెలసినదీ కొండ’ అని తిరుమల గిరిని ప్రస్తుతించారు అన్నమయ్య. అదే విధంగా అమ్మ యొక్క చూపు, వాక్కు స్పర్శ, కదలిక, సంకల్పంతో దీపించే అమ్మ పవిత్ర చరిత్ర నిగమాగమసారం, నిత్య సత్య పరతత్త్వ స్వరూప స్వభావ సమన్వితం, పరమార్థ ప్రబోధకం, అనితర సాధ్యమైన జ్ఞాన జలధి, ప్రజ్ఞాననిధి.

‘యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్’ (ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు) అని వ్యాసభగవానులు మహాభారత ప్రశస్తిని చాటారు. అదే విధంగా అమ్మ చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తే- బ్రహ్మచర్యం గార్హస్యం, మంత్రం- గురువు, రాగం- త్యాగం, సాధన- సుగతి, స్వధర్మనిరతి – పరోపకార పారీణత, జ్ఞానం అజ్ఞానం, ప్రవచనం- పరివర్తనం, రక్షణ- శిక్షణ, మానవీయ విలువలు – పారమార్థిక జీవనం, మృణ్మయం- చిన్మయం. అద్వైతం- పరతత్త్వాను సంధానం, సృష్టి సృష్టి కర్త, కర్మ – అకర్మ, పురుషకారం దైవానుగ్రహం, సర్వసమాన దృష్టి సంపూర్ణత్వం, కృపాదృష్టి… మున్నగు సమస్త విషయ జ్ఞాన సర్వస్వం అని తెలుస్తుంది.

అమ్మ తన జీవితంలోని ప్రధాన ఘట్టాలను కొందరికి స్వయంగా చెప్పింది. కాగా, చరిత్ర మొత్తాన్ని అక్షరబద్ధం చేసే అదృష్టం సో॥ యార్లగడ్డ భాస్కరరావుకు లభించింది. “అక్షరబద్ధం” అనే పదానికి వివరణ అవసరం. అమ్మ చరిత్రను ఒక దృశ్యకావ్యంగా అర్థాన్ని పరమార్థాన్ని వివరిస్తూ హృదయంగమంగా సందర్భాలను వర్ణిస్తూ సర్వోన్నతంగా సముచితంగా వ్యాఖ్యానిస్తూ మూలాన్ని కొంతవరకు ‘మాతృశ్రీ జీవితమహాదధిలో తరంగాలు పేరిట జనరంజకంగా అక్షరబద్ధం చేశారు శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య.

ఒక విధంగా చెప్పాలంటే- భాస్కరరావు అన్నయ్య అమ్మ జీవితాన్ని చరిత్ర బద్ధం చేశారు. అక్షరబద్ధం కాదు. అంటే అమ్మ ముఖతః చరిత్ర విని దానిని యథాతథంగా అక్షరం పొల్లు పోకుండా వ్రాశారు.. అది ఉక్తలేఖనం – dictation. అన్నయ్య సొంతంగా ఒక్క అక్షరాన్ని చేర్చలేదు. తొలగించలేదు. ఎప్పటికప్పుడు అమ్మ వ్రాయబడిన దానిని చూసి సవరణలుంటే దిద్దించింది. అలా చెప్పటం వ్రాయటం అనేది కొన్ని ఏళ్ళు పట్టింది, 15 పుస్తకాలు నిండాయి.

తాను పుట్టక పూర్వం, పుట్టిన తర్వాత సంగతులు వెండితెరమీద చలన చిత్రాన్ని చూస్తూ చెప్పినట్లు, అ సమయంలో ఆ సంఘటనలను సాక్షి మాత్రంగా దర్శిస్తూ సవివరంగా సవిస్తరంగా తన అద్భుత చరిత్రను మానవాళికి మహాప్రసాదంగా అనుగ్రహించింది అమ్మ. అయితే అది సంభవమా? అంటే సామాన్యులకు అసంభవం; అవతారమూర్తులకు అప్రతిహతమైన అప్రాకృతపరాక్రమ సంపన్నులకు ఏదైనా సాధ్యమే..

అమ్మకు సన్నిహితంగా మెలిగిన అదృష్టవంతులకు అమ్మ సర్వజ్ఞత్వము, అసామాన్య జ్ఞాపకశక్తి-ధీశక్తి సుపరిచితములే, కాగా, అమ్మ వాక్రుచ్చిన సంఘటనలన్నీ యథార్థములు అని సామాన్యునికి ఎలా తెలుస్తుంది? అందుకు ఒక ఆధారం ఉంది. చరిత్రను అమ్మ చెప్పటం, అన్నయ్య వ్రాయటం సమయంలో “ఏనాడో (నలభై ఏళ్ళ క్రితం) మసిలిన వ్యక్తుల (చిదంబరరావు గారు, మరిడమ్మగారు, సీతాపతిగారు, రంగమ్మ గారు మున్నగువారి) కంఠధ్వనులతో ఆ మాటలు యథాతథంగా నాకు వినిపించేవి” అని పేర్కొన్నారు భాస్కరరావు అన్నయ్య. సర్వం తానైన తల్లి కనుక అమ్మ విన్నది అంటే సహజమే: కానీ ఎదుటి వ్యక్తికి వినిపించటం అనేది ఊహాతీతం, మానవాతీతం. ఈ వాస్తవాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం.

శ్రీమద్రామాయణ కావ్యరచనా కౌశల్యాన్ని విపులీకరిస్తూ – 

తత్సర్వం తత్త్వతో దృష్ట్యా ధర్మేణ నే మహాద్యుతిః |

అభిరామస్య రామస్య చరిత్రం కర్తు ముద్యతః ॥’ ( వాల్మీకి మహర్షి యోగ దృష్టితో సర్వాన్ని దర్శించి శ్రీరామచరిత్రను రచించుటకు శ్రీకారంచుట్టారు. అని చెప్పబడింది. అదే విధంగా భాస్కరరావు అన్నయ్య నిరంతరం అమ్మను ఆరాధించిన ఉపాసనా ఫలంగా అమ్మ అనుగ్రహంతో అనూహ్యమైన రీతిలో ఒక వైపు అమ్మ మాటల్ని మరొక వైపు ఆయా వ్యక్తుల మాటలు వింటూ వ్రాయగలిగారు పురాకృత ఫలంగా, అనంతర కాలంలో శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య ఆ రచనను సాహిత్య సౌందర్యంతో తీర్చిదిద్దారు.

అమ్మ చరిత్రను పారాయణ చేయుటవలన

– అమ్మ శరీరం పాంచభౌతికమైనది కాదు, వంచ భూతాలను జయించినది.

– అమ్మ శక్తి, దృష్టి, సంకల్పం వరిమితమైనవి కావు, అనంతములు.

– అమ్మ వాక్కు ఆప్తవాక్కు,

– అమ్మ సంచారం – వేద వీధులలో,

– అమ్మ చరిత్ర విధి, విధాన స్వరూప స్వభావ వ్యాఖ్యానం,

– అమ్మ మనలాంటిది కాదు – పరదేవతా స్వరూపిణి…. అని స్పష్టమవుతుంది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!