1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ‘అమ్మ జీవిత మహోదధి’ అవసరము

‘అమ్మ జీవిత మహోదధి’ అవసరము

Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : November
Issue Number : 4
Year : 2022

జిల్లెళ్ళమూడి అమ్మ, విశ్వజనని అని గుర్తింపు, మాతృశ్రీ అనే గౌరవం పొందిన బ్రహ్మాండం అనసూయాదేవి స్వయంగా తాను చెప్పిన తన జీవితచరిత్ర అమ్మజీవితమహోదధి. మరుగును తన గురువుగా స్వీకరించి, తాను అమ్మగా ఉండడానికి నిర్ణయించబడ్డాను అని తన ఆరవయేటనే ఖచ్చితంగా చెప్పిన ఈ అమ్మ జీవిత చరిత్ర ఎంతవరకూ అవసరము అనే ప్రశ్న సమంజసమే. వాల్మీకి రామాయణం ఆది కావ్యమని, మహాభారతాన్ని పంచమవేదమనీ గుర్తింపు ఇచ్చిన భారతదేశంలో కేవలం ఇరవయ్యవ శతాబ్దంలో అరవైరెండు సంవత్సరాల కాలం జీవించిన ఈ అమ్మ చరిత్ర కూడా ఏదో ఒక గుర్తింపు పొందాలి.

ఈ జీవితచరిత్రను పారాయణగ్రంథంగా చదువుతూ, అమ్మ దర్శన, స్పర్శన, భాషణలతో పునీతులైన భక్తులు అనుకొనే అమ్మబిడ్డలకు కూడా ఈ సందేహం వచ్చి ఉండకపోవచ్చు.

అమ్మ గురువుకాదు.

అమ్మ అవతారమూర్తి కాదు.

“ఉన్నదేదో ఉన్నది. అదే ఇది” అని తన స్వరూపం వెల్లడించారు.

ఉన్నదేదో అంటే ఏది వేదములు, ఉపనిషత్తులు, దర్శనములలో ఉన్నది -సత్ -అంటున్నాయో, దేన్ని అనాది, అనంత, అవినాశ, ఆనంద పరిపూర్ణతత్త్వంగా గుర్తించారో, కానీ వివరించలేకపోయారో, అది ఉంది. ఈ కనపడే అమ్మ అనే రూపం (ఇది) కనపడనిది. అందరూ సో2 హం అంటే అమ్మ సో యమ్ అన్నారు. సః + అయమ్.

సః అంటే అతడు, ఓం తత్ సత్ అని చెప్పబడిన బ్రహ్మమే అనగా అపరిమితమే, అయమ్ అనగా ఇది.. అనగా పరిమితమైన రూపము.

దీనిలో ఉన్న అయమ్ “అయమాత్మా బ్రహ్మా” అనే మాండూక్య ఉపనిషత్తులోని అయమ్. సః అనేది సామవేదములోని మహావాక్యమైన తత్త్వమసి అనే దానిలోని తత్. తత్పదార్థమే అనగా బ్రహ్మపదార్థమే అయమ్ ఈ పరిమితమైన రూపమైనది అనడం. ఇది పరాప్రకృతిని అపరాప్రకృతిని సమన్వయం చేసే మహావాక్యం. ఈ మహావాక్యభావాన్ని తన స్వస్వరూపంగా అర్థంచేసికొన్న జిల్లెళ్ళమూడి అమ్మ చరిత్రకు ఏ గుర్తింపు ఇవ్వాలి?

లోకంబులు లోకేశులు

లోకస్థులు తెగిన తుది నలోకంబగుపెం

జీకటి కవ్వల నెవ్వం డే

కాకృతివెలుగు…

అనే భాగవతప్రతిపాదితమైన సత్యమే నేను అన్నారు అమ్మ. చీకటినే వెలుగుకు ఆధారంగా, ఈ విశ్వాలను వేర్వేరు తెరలుగా, తన ఆహార్యాన్ని మనగుర్తుకోసం ధరించిన శైలిగా అమ్మ చెప్పారు. నేను కనపడితే, మీరు కనిపెడతారు అన్నారు.

మీ అందరినీ నేను కని మీ మీ తల్లులకు పెంపుడిచ్చాను అని సాధికారికంగా ప్రకటించిన కన్నాంబ ఈ అనసూయాదేవి.

ఈమె చరిత్ర సంగీతంవలె ఆపాతమధురము, సాహిత్యం వలె ఆలోచనామృతము.

సత్యసాయి బాబా వారు అమ్మను సృష్టి స్థితి లయకారిణి యైన ఆదిపరాశక్తి అన్నారు. మరికొందరు అమ్మ కృప ప్రత్యక్షంగా పొందినవారు అమ్మ జీవితాన్ని దేవీభాగవతం అన్నారు. అమ్మ తాతగారు చిదంబరరావు గారు అనసూయోపనిషత్తు అనివర్ణించారు.

అమ్మ స్వయంగా అన్నట్లు నన్ను లలితగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా చూసిన వారున్నారే కానీ, నన్ను నన్నుగా, కేవలం అమ్మగా ఎవరు చూశారు?

అదే రకంగా అమ్మజీవితమహోదధి వేదము అనీ, ఉపనిషత్తు అనీ, దేవీభాగవతము అనీ వర్ణించడం అధ్యాస అవుతుందే కానీ, ఆ ధ్యాస, అమ్మ ధ్యాస కాదు. మరి ఏమిటీ చరిత్రకు ఇవ్వవలసిన గుర్తింపు.

అధ్యాసను ధ్యాసగా,

మాటను మంత్రంగా,

కష్టసుఖాలను కరుణగా గుర్తెరిగి

సో యం సోహం ల

మధ్య భేదం లేదని తేల్చి చెప్పిన మహాసూత్రం. జీవితలక్ష్యం సుగతి అని చరాచరసృష్టికీ సుగతిని ఖరారు చేసిన మహామంత్రం. జీవించడమే మోక్షానుసంధానమనీ, భావించడమే స్వస్వరూపానుసంధానమనీ, అనంతత్వమే స్వేచ్ఛా మార్గమనీ చెప్పే మహాతంత్రం…..

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!