1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మ మతం

అమ్మ మతం

Vitala Ramachandra Murthy
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

సకల చరాచరాలను తన బిడ్డలుగా, తన అవయవాలుగా భావిస్తూ అంతటా తననే దర్శించే అమ్మ మతం సర్వసమ్మతం. మత మంటే మనశ్శాంతిని, తృప్తిని కలిగించే జీవన విధానం. ఆచరణకు అన్ని మతాలూ ఒకటే అంటుంది అమ్మ. తనకిచ్చింది తృప్తిగా అనుభవించడం, ఉన్నంతలో నలుగురికి ఆదరణగా పెట్టుకోవడం, అన్నీ భగవంతుడే చేస్తున్నాడనుకోవడం స్థూలంగా అమ్మ సిద్ధాంతం ఇది. తన కిచ్చింది మంచైనా, చెడైనా, కష్టమయినా, సుఖమయినా అనుభవించడానికి సంసిద్ధుడు కావాలి. పారిపోవడానికి, దాచుకోవడానికి ప్రయత్నించకూడదు. పారిపోయినా ‘అనుకున్నది జరగదు తనకున్నది తప్పదు’, దాచుకుంటే పనికిరాకుండా పోతుంది. అది డబ్బయినా, తిండయినా సరే. అందువల్ల తృప్తిగా అనుభవించాలి. ఉన్నంతలో నలుగురికి ఆదరంగా పెట్టాలి. “పంచిపెట్టని కాడికి ఉండడం దేనికి?” అందువల్ల ఉన్నదానికి సార్థక్యం కలగాలంటే పెట్టి తీరాలి. యదార్ధానికి భోగంలో కంటే త్యాగంలోనే ఆనందమున్నది.

“ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్

తేన త్యక్తేన భుంజీధాః మాగృధః కస్యస్విద్ధనమ్||

(ఈ ప్రపంచం అంతా భగవన్మయం- అందుచేత త్యాగ భావంతో జీవిద్దాం. ఎవరి సంపదకూ అసూయ పడవద్దు) “ఆపదలో ఉన్న వాళ్ళ బాధకు స్పందించి సాయపడటమే నిజమైన మానవత్వం” అంటుంది అమ్మ.. ఇతరుల అవసరాలకు తనది ఉపయోగించడానికి ఆదర బుద్ధి కావాలి. ఇతరులంటే తన మారు రూపాలే కదా! అన్నీ భగవంతుడే చేస్తున్నాడనుకుంటే ఇతరులమీద ద్వేషం కలుగదు. బాధ, భయం పోతుంది. తన వంతు తాను అనుభవిస్తున్నాననుకుంటాడు. అన్యులను నిందించడు. సాధించడానికి పూనుకోడు. రాగం, ద్వేషం హద్దుల్లో ఉంటాయి. అంటే అవి బాధాకరాలు కావు. తనకు కర్తృత్వం లేదు కనుక కష్టసుఖాలకు కుంగు పొంగు లుండవు. దురాశ దూర మవుతుంది. ఇది జీవితంలో సుఖపడే మార్గమంటుంది అమ్మ. ఆచరించ గలిగితే ఇంతకంటె మరోమతం ఎందుకు? మనశ్శాంతికి మంచి మార్గ మిది. ఇది మతం మాత్రమే కాదు. అన్ని మతాల సారం. లక్ష్యం. ఈ నాటి సంక్షుభిత సమాజానికి ఆమె అచరణ రూపమైన సందేశ మిదే. జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో విభిన్న మనస్తత్వాలు కల అనేకులు సహజీవనం చేసే అందరిల్లు, ఎల్ల వేళలా ఎంతమంది వచ్చినా అన్నం పెట్టే అన్నపూర్ణాలయం; సుమారు 200 మంది విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యాలతో విద్యాబోధన చేసే సంస్కృత డిగ్రీకళాశాల, పాఠశాల; స్త్రీలకు, పిల్లలకు ఉచిత వైద్య సదుపాయం ఉన్న వైద్యాలయమూ ఉన్నాయి. ఇవన్నీ, ఊరూరా ఏర్పడాలనీ, విశ్యవ్యాప్తం కావాలనీ అమ్మ సంకల్పం. ఆమె సిద్ధ సంకల్ప, మనందరి ఆర్తిని తొలగించడమే అమ్మ లక్ష్యం. ఉదారచరిత అమ్మ. “మీకు పెట్టుకోక పోతే నేను చిక్కి పోతాను, మీ చేత పెట్టించడంకోసమే నేను మీకు పెట్టడం” అంటుంది. మనలో మాతృత్వం పెల్లుబికేటట్లు చేయాలని, మనం తోటివారి ఆపదలకు స్పందించి ఆదుకోవాలని ఆమె ఆకాంక్ష, ఆమె చేసే ఈ మహాయజ్ఞంలో మనమూ సమిధలను ఆహుతి చేద్దాం. అమ్మ బాటలో పయనించ గలగడం అదృష్టంకదా!

  • (1982 మార్చి, ఏప్రిల్ ‘మాతృశ్రీ’ సంచిక నుండి)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!