మొదటిసారి జిల్లెళ్లమూడి అమ్మ ఆశ్రమంలో 2024 జులై, 18, 19, 20 తేదీలలో మూడు రోజులు గడిపే అవకాశం నాకు కలిగింది. ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది. దాదాపు 5 /6 ఎకరాల స్థలంలో 40 / 50 కార్లు పార్క్ చేసుకునే సౌకర్యం ఉంది. ఆశ్రమంలో ఉచిత వసతి సౌకర్యం, రెండు పూటలా వచ్చిన వారందరికీ భోజన ప్రసాద సౌకర్యం ఉంది. రోజూ కనీసం 1000 మంది దాక భోజనం చేస్తారు. ఆశ్రమంలో అందరూ (ఆఫీసులో, మందిరాలలో, భోజనశాలలో, బుక్ స్టాళ్లలో) స్నేహపూర్వకంగా, ఆదరంగా ఉన్నారు.. ఆశ్రమంలో AC/గీజర్ సౌకర్యం ఉన్న గదులు కూడా ఉన్నాయి. ఆశ్రమంలో టి.టి.డి వారి కల్యాణ మండపం కూడా ఉంది. ఇది కాక 300 మందికి సరిపడ ఒక పెద్ద హాలు కూడా ఉంది.
నేను వెళ్లిన సమయానికి ఆశ్రమంలో చాలా భాగంలో ఎయిర్టెల్ సిగ్నల్ లేదు. ఫోన్ లేదు, టీ / కాఫీలు లేవు, టీవీ.లేదు, ఇంటర్నెట్ లేదు, న్యూస్ పేపర్ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. రాత్రి కలత లేని నిద్ర పట్టింది. ఆశ్రమ ప్రాంగణం చాలా విశాలంగా చెట్లు, మొక్కలతో ప్రశాంతంగా ఉంటుంది.
జిల్లెళ్ళమూడి చిన్న పల్లె, రెండువందల గడపలకు తక్కువగా ఉంటాయేమో, వెయ్యి మంది జనాభా ఉంటుంది ఏమో! పెద్దగా దుకాణాలు ఉండవు. ఆశ్రమంలో, అమ్మ మందిరం, హైమ మందిరం, నవనాగ నాగేశ్వరాలయం, గణపతి ఆలయం, పాదుకాలయం ఉన్నాయి. ప్రతిరోజూ ఆలయాలలో ఉదయం అభిషేకము చేస్తారు. మనము కూడ స్వయంగా చేసుకోవచ్చు: ప్రతి ఉదయం అమ్మ, హైమ ఆలయాల్లో ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. మంత్రం అర్చకులు చెపితే మన చేతిమీదుగా అర్చన చేసుకోవచ్చు.
ఉదయం, సాయంకాలం సహస్రనామం, ఖడ్గమాలా, త్రిశతి చెప్పుకుని అర్చన చేసుకోవచ్చు. మిగిలిన సమయంలో అమ్మగారి చరిత్ర పారాయణ చేసుకోవచ్చు, మనకు అమ్మగారు జన్మతః ప్రజ్ఞావంతురాలిగా వచ్చింది. జన్మించిన తర్వాత మనకు పైకి కనిపించే సాధన ఏమీ లేదు.
ఎల్లలు లేని ప్రేమతత్వమే అమ్మ అనీ, విశ్వమానవ సౌభ్రాత్రమే అమ్మ సంస్థ అని నాకు అనుభూతి కలిగింది. జిల్లెళ్ళమూడి యాత్ర నాకు ఒక ఆధ్యాత్మిక మధుర స్మృతి.