ఒకసారి రామకృష్ణ అన్నయ్య కరణీకం పనుల దృష్ట్యా అప్పికట్ల వెళ్ళాడు.
ఆ మర్నాటి ఉదయం అమ్మ నన్ను పిలిచి “నాన్నా! అప్పికట్ల వెళ్ళి రామకృష్ణ అన్నయ్యతో ‘అమ్మ నిన్ను రమ్మన్నది’ అని చెప్పు” అని చెప్పింది.
వెంటనే నేను బయలుదేరి అప్పికట్ల వెళ్ళాను. అన్నయ్య ఇంట్లో అడుగుపెట్టాను. ఎదురుగా బల్లమీద పది ధాన్యంబస్తాలు ఉన్నాయి. ఆ ప్రక్కనే ‘అమ్మ సినిమా వ్యాఖ్యానం గ్రంథం’ Cinema Shooting వివరాలతో సుమారు 200 పేజీల పెద్దగ్రంథం కనిపించింది.
సరే. ముందుగా అన్నయ్యకి అమ్మ మాటని వినిపించాను. సరే నన్నాడు. పద్మావతి అక్కయ్య వంట చేసింది. అన్నయ్య, నేనూ భోజనాలు చేసి కాలి నడకన పూండ్లమీదుగా జిల్లెళ్ళమూడి చేరుకున్నాం.
‘అమ్మ సినిమా వ్యాఖ్యానం’ రచన ఔన్నత్యాన్ని మాలతీచందూర్ వంటి లబ్ధప్రతిష్ఠులు కొనియాడారు, గొప్ప ప్రజాదరణ పొందింది. కావున సోదరీ సోదరులు కోరిన మీదట అన్నయ్య దానిని ధారావాహికంగా ‘మాతృశ్రీ’ మాసపత్రికలో ప్రచురించటం మొదలు పెట్టాడు.
కానీ, అది శ్రమతో కూడిన పని; అక్షరం అక్షరం కూడబలుక్కుని వ్రాయాలి. అన్నయ్యకి ఆ శ్రమ తగ్గించాలని ఆ బృహద్గ్రంధాన్ని అడిగి తీసుకున్నాను. ప్రతి నెల కొంతభాగం వ్రాసి పంపేవాడిని. అలా అది పత్రికలో పూర్తిగా ప్రచురితమైంది.
నరసాపురం డా. ఆచంట కేశవరావు గారు “ఇది అన్నయ్య అద్భుత రచన. ఇది మన సంస్థ Official Document. దీనిని మనం ఒక గ్రంథంగా ప్రచురిద్దాం” అన్నారు.
తక్షణం అమ్మ ఆశీస్సులు, అన్నయ్య అనుమతి తీసుకొని గ్రంథంగా ప్రచురించాం. అమ్మ వక్రోత్సవాల్లో (1983)లో అమ్మ అమృతహస్తాల మీదుగా ‘అమ్మ సినిమా వ్యాఖ్యానం’ గ్రంథం ఆవిష్కరింప బడింది.
ఈ వ్యాఖ్యాస రచన శ్రీ రామకృష్ణ అన్నయ్య బహుముఖ ప్రతిభకూ భాషా పటిమకూ అక్షర సాక్ష్యం.
అక్షర గవాక్షాలలోనుండి అమ్మను ఈ ప్రపంచానికి చూపించిన దార్శనికుడు అన్నయ్య అని ఈ వ్యాఖ్యానం నిరూపిస్తుంది.
ఈ గ్రంథం PDF copy “Matrusri Digital Center Website” లో సందర్శించవచ్చు.