1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ

Bhattiprolu Lakshmi Suguna
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

నిండు మనస్సు, ప్రసన్న వదనం, స్ఫురద్రూపం, నిరాడంబరత, నిస్వార్థసేవాతత్పరత, నిరుపమాన ఔదార్యం, నిర్వ్యాజప్రేమ, నిజాయితీ, నిబద్ధత, వాక్సంయమనం, ఆత్మనిగ్రహం మొదలైన గుణాలన్నీ రూపుదాల్చిన విశిష్ట వ్యక్తి మా గురువర్యులు శ్రీ విఠాల రామచంద్రమూర్తిగారు, వారి గురించి వ్రాయాలంటే ‘క్వ సూర్య ప్రభవో  వంశః క్వచాల్ప విషయామతిః’ అని చెప్పినట్లుగా నా శక్తి సరిపోదేమో అన్పిస్తుంది. ఎందుకంటే ఏ అంశం తీసుకున్నా వారి ఔన్నత్యం ముందు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

‘నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు అంటూ మాస్టారు వెలిగించిన జ్ఞానజ్యోతి వెలుగులో నాలుగు మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.

‘తన సర్వస్వం, తన సర్వశక్తులను వినియోగించడమే ఆరాధన’ అని అమ్మ చెప్పినట్లుగా అమ్మ సంస్థల నిర్వహణలో పాలుపంచుకోవడమే అమ్మను ఆరాధించడంగా భావించి అమ్మ ఏర్పరచిన కళాశాల, అందరింటి అభివృద్ధికి నిరంతరం తమ సేవలందించిన మహోన్నతవ్యక్తి మాస్టారు. ‘కంటేనే కాదు కనుగొంటేనూ బిడ్డలే! అన్న అమ్మ ప్రేమతత్త్వాన్ని పుణికి పుచ్చుకుని శిష్యులందరినీ కన్నబిడ్డలుగా ప్రేమించి ఆదరించిన వాత్సల్య స్వరూపులు. ‘విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. వారిని ప్రేమతో ఆదరించండి’ అని సూచించిన అమ్మ మాటను అక్షరాలా పాటించిన ఆచరణశీలి శ్రీ రామచంద్రమూర్తిగారు.

విద్యార్థినిగా, అధ్యాపకులురాలిగా నేను ఎపుడు వారింటికి వెళ్లినా “అమ్మాయి వచ్చింది. ఏదయినా ప్రసాదం పెట్టు” అని శేషక్కయ్యగారికి చెప్పేవారు. ‘పంచని కాడికి ఉండడం దేనికి’ అన్న అమ్మ మాటను ఆకళింపు చేసుకున్న మాస్టారికి ఎప్పుడూ పెట్టుకోవాలనే ఆలోచనే, అది అన్నం కావచ్చు. వస్త్రాలు కావచ్చు. ధనం కావచ్చు. ఎందరో విద్యార్థులు చదువు పూర్తయి జిల్లెళ్ళమూడి నుండి వెళ్ళిన తరువాత కూడ వారు జీవితంలో స్థిరపడటానికి ఎన్నో విధాలుగా సహకారాన్ని అందించిన ఆదర్శ ప్రాచార్యులు వారు.

‘అమ్మ ఏ సంకల్పంతో కళాశాలను స్థాపించిందో దానికి అనుగుణంగా కళాశాల తీరు తెన్నులు ఉండాలి. జిల్లెళ్ళమూడి కళాశాల అంటే అన్ని విషయాలలో ప్రత్యేకత కలిగి ఆదర్శంగా ఉండాలి,’ అంటూ ఒక ఒరవడిలో కళాశాలను నడిపించి తరువాత వారికి మార్గనిర్దేశనం చేసిన ఆచార్యవర్యులు, నిరంతరం అధ్యయన అధ్యాపన తత్పరతతో విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తిని పెంచుతూ ‘సందేహ నివృత్తి చేసేదే సందేశం’ అని అమ్మ చెప్పినట్లుగా నాటి నుండి నేటివరకు తమ సందేశాన్ని అందించిన ఉత్తమ అధ్యాపకులు. విద్యార్థులకు బ్రతుకు తెరువు విద్యనే కాక బ్రతుకు పరమార్థాన్ని తెలియజేసిన ఆధ్యాత్మిక గురువులు, పరుసవేది ఇనుమును బంగారంగా మార్చగలదు కాని మరో పరుసవేదిగా మార్చలేము. కానీ శిష్యులను తమంతటి వారుగా మలచగలిగిన శక్తి గురువుకు మాత్రమే ఉంది. అలా ఉత్తమోత్తమ గురువులయి శిలలను శిల్పాలుగా మలచి చక్కదిద్దిన గురుబ్రహ్మ శ్రీ విఠాల రామచంద్రమూర్తిగారు.

పాఠ్యాంశాలలో ఏ అంశం తీసుకున్నా సమగ్ర అవగాహన కలిగించే విధంగా ఏ కవిని గురించి మాస్టారు. బోధిస్తున్నా ఆ కవిని మాస్టారిలో దర్శించేవాళ్లం. విద్యార్థిని గానే కాదు అధ్యాపకురాలిగా ఉన్నపుడు కూడ మాస్టారి దగ్గర సందేహాలు నివృత్తి చేసుకుని క్లాసుకు వెళ్ళిన సందర్భాలెన్నెన్నో…..

విద్యార్థి దశనుండి ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ వరకు అన్ని భూమికలలో సూచనలిస్తూ నన్ను తీర్చిదిద్దిన ఉదార స్వభావులు మాస్టారు. నేను కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు నిర్వహించేటపుడు మాస్టారు అమ్మ దర్శనార్ధం జిల్లెళ్ళమూడి వచ్చినపుడు ఎంతో ఓపిక చేసుకుని కళాశాలకు వచ్చి నన్ను ఆశీర్వదించిన సన్నివేశం. మరపురానిది, మరువలేనిది. కళాశాలలో ప్రార్థనా కార్యక్రమం అసిధారావ్రతంగా పాటించడం మాస్టారి నుండి నేర్చుకున్నదే. సమయపాలనకు నిలువెత్తు నిదర్శనం మాస్టారు. ఒక సెకను కూడ ఇటు ఇటు కాకుండా సమయ నియమాన్ని పాటించే మాస్టారి రాకను చూసి గడియారంలో కాలాన్ని సరిచేసుకోవచ్చు అనడం అతిశయోక్తి మాత్రం కాదు. పూర్వవిద్యార్థులు వారు నిర్దేశించిన మార్గంలో అదే ఒరవడిలో ముందుకు సాగుతూ వృత్తిలో సమాజంలో ఉన్నత స్థితిని పొందగలగడం ఆ గురుదేవుల ఆశీర్వాదబలమే.

‘ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే సాధన ఏముంటుంది అని అమ్మ చెప్పిన సాధనా మార్గంలో ప్రయాణం చేస్తూ ఎందరో పూర్వవిద్యార్థులు అమ్మకిష్టమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎన్నో ప్రాంతాలలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ అమ్మను గురించి తెలియచేస్తూ అమ్మ తత్త్వప్రచార రథసారధులుగా అమ్మ తత్త్వ సౌరభాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. వీరందరికీ ప్రేరణ మాస్టారే. చివరివరకూ విద్యార్థులకు ఆర్థికంగానూ, అక్షరరూపంగానూ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించిన మార్గదర్శకులు, స్ఫూర్తిప్రదాత మాస్టారు.

అమ్మను ఆరాధించడంలో అక్షరార్చన ఒక మార్గం. అమ్మతత్త్వాన్ని అనేక కోణాల్లో పరిశీలించి పరిశోధించి అనేక వ్యాసాల ద్వారా అమ్మ బిడ్డలకు అందించిన మాస్టారి ఒక్కొక్క వ్యాసం ఒక్కో జ్ఞానదీపం. ఆధ్యాత్మిక సాధనలో పరిణత రూపం జ్ఞానం. ఆ జ్ఞాన తేజంతో విరాజిల్లుతూ అమ్మఒడి చేరి విశ్రాంతి పొందుతున్న ధన్యజీవులు మాస్టారు. వారు భౌతికంగా మనకు దూరమయినా వారి ఆచరణస్ఫూర్తి ద్వారా అమరులుగా అందరి స్మృతి పథంలో మెదులుతూనే ఉంటారు.

‘వండ నలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు ఉద్రియౌ అతని గృహిణి’ అన్నట్లుగా మాస్టారి మహోన్నత మార్గంలో సహధర్మచారిణిగా తమ భూమికను సర్వసమర్థంగా నిర్వహించిన ఆదర్శగృహిణి శేషక్కయ్యగారు మాస్టారి కంటె కాస్త ముందుగా అమ్మఒడి చేరారు. ఆ పుణ్యదంపతులకు నమస్సులు సమర్పించుకుంటూ చిరంజీవులు అనూరాధ, పావని, రామకృష్ణలకు ధైర్యాన్ని ప్రసాదించమని అమ్మను ప్రార్థిస్తూ…

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!