“కరుణ లేకపోతే మనమే లేము. మనము చేసే పనులన్నీ కరుణ వల్లనే. నా దృష్టిలో కష్టసుఖాలు రెండూ కూడా కరుణ వల్లనే. ప్రతి చిన్నపనీ మన చేతులతో చేస్తున్నామనుకున్నా, మనం ఎట్లా చేసినా వాడి కరుణ వల్లనే. మనకు కనపడకుండా ఆయా తరుణాల్లో ఆయా పనులు చేయించటమే కరుణ. కరుణ సముద్రం అల వంటిది.” – అమ్మ. (మాతృశ్రీ జీవిత మహెూదధిలో తరంగాలు).
“మైత్ర్యాది వాసనాలభ్య” అని లలితా సహస్రనామాలలో ఒక నామం. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే గుణములు వాసనా చతుష్టయము. ఈ గుణములు కలవారికి “అమ్మ” సులభంగా ప్రసన్నురాలు అవుతుందని ఈ నామం యొక్క భావం. ఈ గుణాలలో “కరుణ” అనేది దయాగుణానికి పరాకాష్ఠ
మన మధ్య మనతోపాటు మసలిన హైమక్కయ్యలో ప్రధానమైన గుణం కరుణ. హైమక్కయ్యలోని కరుణ – హద్దులు లేని, విచక్షణ లేని అపారమైన కరుణ. హైమక్కయ్యని ఎవరు ఎన్ని విధాల కీర్తించినా, ప్రధానంగా కీర్తించేది ఆమెలోని కరుణనే, “అంబాం హైమవతీశ్వరీం హృది భజే కారుణ్యరూపాం శివాం” అని శ్రీ ఎ.వి.ఆర్. గారు కారుణ్యరూపిణిగా ధ్యానిస్తే, “దేవీం హైమవతీశ్వరీం హృది భజే కారుణ్యవారాన్నిధిమ్” అని స్వర్గీయ పి.ఎస్.ఆర్. గారు హైమక్కయ్యను కరుణాసముద్రంగా దర్శించారు.
హైమక్కయ్య కుసుమసదృశమైన సుకుమారి. నిరంతరం తలనొప్పితో బాధపడేది. తాను శారీరకంగా ఎంత బాధనైనా భరించేది గాని, సోదరీ సోదరులకు ఏ చిన్న కష్టం వాటిల్లినా తల్లడిల్లిపోయేది. వెంటనే అమ్మను వారి బాధను తీర్చమని కన్నీళ్ళతో అర్థించేది. అందుకే “నానాక్షేశ విశీర్ణజీర్ణ హృదయైః రక్షార్థిభిః సోదరైః” అనీ, “కల్లోలాన్విత సర్వసోదర మనః సౌజన్య శాంతిప్రదాం” అనీ కవులు కీర్తించారు. ఆంజనేయుడికి ఎవరైనా గుర్తు చేసేదాకా తన బలం తనకు తెలిసేది కాదట. అలాగే “నాదాకా ఎందుకు హైమా! నువ్వే తీర్చగలవు” అని అమ్మ హైమక్కయ్యలోని శక్తిని గుర్తు చేసింది. హైమక్కయ్యని ఆర్తుల కన్నీళ్ళను తుడిచే క్షిప్రప్రసాదినిగా మనకోసం త్యాగం చేసి, ఆలయంలో సుప్రతిష్ఠితను చేసింది.
కరుణ అనేది దైవీ గుణం. లలితా ధ్యానశ్లోకం మొట్టమొదటే “అరుణాం కరుణా తరంగితాక్షీం…..” అని ప్రారంభమవుతుంది. “అవ్యాజ కరుణామూర్తి:” అని చివరి నామాలలో చేర్చారు. అంటే ఆద్యంతమూ అమ్మవారు కరుణాస్వరూపం.
ఆదిశంకరుల ధ్యానశ్లోకం “శ్రుతి స్మృతి పురాణానామ్ ఆలయం కరుణాలయమ్…” తో ప్రారంభమవుతుంది. భగవంతుడు వివిధ సందర్భాలలో వివిధ రూపాలలో అవతరించటానికి ప్రధాన కారణం మనమీద కరుణ.
“కారణపర చిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా
కాచన విహరతి కరుణా కాశ్మీరస్తఒక కోమలాంగలతా”
మూకపంచశతి “ఆర్యాశతకం”లోని ప్రథమ శ్లోకమే ఇది. “కాచన విహరతి కరుణా” అంటారు మూకశంకరులు, కాంచీపుర సీమలలో “ఒకానొక కరుణ” విహరిస్తున్నదిట. ఎవరు? సాక్షాత్తూ చిద్రూపిణి. అయిన కామాక్షీ పరదేవతయే. మరి కామాక్షీ దేవి విహరిస్తున్నది అనకుండా “ఒకానొక కరుణ” అనటంలో అర్థమేమిటి? అంటే రూపం దాల్చి వచ్చిన ఆ కరుణయే కామాక్షి దేవి. ఆ కరుణను ఎలా వివరించాలో, ఎలా వర్ణించాలో తెలియని సందిగ్ధంలో “ఒకానొక కరుణ” అనవలసి వచ్చింది.
భగవంతుని కరుణ అవ్యాజమే కాదు, అనిర్వచనీయం కూడా అని అర్థమవుతున్నది కదా!
అసలు ఈ కరుణా స్వభావానికి కారణమేమిటి? అంటే ఔన్నత్యం. భగవంతుడు జ్ఞానస్వరూపం. జ్ఞానులకు అజ్ఞానులను చూస్తే కలిగే మొట్టమొదటి ప్రతిస్పందన “కరుణ”.
ఏసుక్రీస్తును ప్రధానంగా కరుణామయుడుగా కీర్తిస్తారు ఆ మతంలోని ఆరాధకులు. ఆయనను శిలువవేసినప్పుడు కూడా “ప్రభూ వీరిని క్షమించు- వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు” అని ఆయన అన్న మాటలు ఆయన కరుణకు ప్రతీకలు.
“అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు” అని ఆనాటి ఋషులు మనమీద జాలిపడి కలియుగ మానవులకు భాగవత కథా సుధాలహరిని ప్రసాదించారు.
అందుకే అమృతతుల్యమైన అమ్మ వాక్యం “కరుణ లేకపోతే మనమే లేము”,