1. Home
  2. Articles
  3. Viswajanani
  4. జిల్లెళ్ళమూడిలో దర్శనీయ స్థలాలు (2) శ్రీ హైమాలయం

జిల్లెళ్ళమూడిలో దర్శనీయ స్థలాలు (2) శ్రీ హైమాలయం

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : September
Issue Number : 2
Year : 2022

(గత సంచిక తరువాయి)

హైమాలయం – అద్వైతసిద్ధికి ఆలవాలం:

బాధాపరితప్తుల, ఆశ – అసంతృప్తుల నడుమ సతమమతమయ్యే వారల కన్నీళ్ళను తుడిచి హైమ శాంతి సౌఖ్యాల్ని అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తోంది. కనుక కొందరి అభిప్రాయం లౌకికమైన కోరికలు తీరాలంటే హైమవతీశ్వరిని, ఆముష్మికమైన కోరికలకు అనసూయమ్మను ఆరాధించాలి, ఆశ్రయించాలి – అని. కాని ఆ మాట వాస్తవం కాదు.

ధనధాన్యాలు, కీర్తి ప్రతిష్ఠలు, భోగభాగ్యాలు, సంతానపురోభివృద్ధి వగైరా అన్నీ అభిలషణీయం, అవశ్యం ఆవశ్యకం – ధర్మబద్ధంగా పొందినపుడు.

కాగా, అమ్మ సంకల్పించి ఒక ప్రణాళికా బద్ధంగా హైమను కని, అద్వితీయమైన శక్తిగా, దేవతగా ప్రతిష్ఠించిన లక్ష్యం వేరుగా ఉంది. “మీరంతా నాలా హాయిగా ఉండాలి అనేది నా కోరిక” అని అమ్మ అపూర్వంగా ఉద్ఘాటించింది. అంటే మనందరం తన స్థాయికి చేరుకోవాలని, అఖండానందాన్ని పొందాలనేది అమ్మ ఆకాంక్ష. అందుకు సజీవ ప్రత్యక్ష ప్రమాణం హైమ మానవిగా పుట్టి మాధవిగా ఎదగటం.

జీవునికీ దేవునికీ నడుమ హైమ వారధి, మానవ జీవిత రథానికి సారథి. ఆ మనో నైర్మల్యం మంచి ముత్యాలకి కూడా లేదు. ఆ మహోన్నత సంస్కారం మానవరూపంలో కానరాదు. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే – హైమాలయం వంటి దేవాలయం ఇలలో లేదనిపిస్తుంది; న భూతో న భవిష్యతి అనీ అనవచ్చు కారణం

అమ్మ స్వహస్తాలతో ప్రతిష్ఠించిన Plaster of Paris విగ్రహాన్ని కాని, తర్వాత కాలంలో ప్రతిష్ఠింపబడిన చలువరాతి విగ్రహాన్ని కాని జిజ్ఞాసతో పరికిస్తే వాస్తవం సులభంగా సుబోధకమవుతుంది. హైమవతీదేవి హస్తద్వయం వరద హస్తాలేనని తేలికగా తెలుస్తుంది. అందులో విశేషం ఏమంటే ఆ రెండు హస్తాలు చిన్ముద్ర (అద్వైత ముద్ర)ను ధరించి ఉంటాయి. అంటే అవి కేవలం ఇహపర సౌఖ్యాలను ప్రసాదించేవే అనుకోవచ్చు. అదికాదు, అంతేకాదు. చిన్ముద్రలో బ్రొటనవేలు క్రిందికి వంగి, చూపుడు వేలు పైకి లేచి ఉంటాయి. అంటే జీవులు పరతత్త్వాను సంధాన ప్రాప్తి కోసం ఎదురు తెన్నులు చూస్తూ అర్రులు చూస్తూ ఉంటాయి. కాగా, జగదీశ్వరి మన స్థాయికి దిగి ‘జీవోబ్రహ్మైవ నా పరః’ అనే పరమ సత్యాన్ని చాటుతూ తరింప చేయటమే, సముద్ధరించటమే జగన్మాతృ ధర్మం అని స్పష్టం చేస్తుంది. దీని సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే హైమవతీదేవి అద్వైతసిద్ధి ప్రదాయిని అనవచ్చు.

హైమవతీశ్వరీ సాక్షాత్కారం :

సుగంధ పరిమళం, వర్షం సహజంగా సర్వత్రా పరివ్యాప్తమవుతుంది. ‘యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాడ్గంధోవా త్యేవం పుణ్యస్య కర్మణో దూరాడ్గంధో వాతి’ అని వివరిస్తుంది వేదం. కాగా, కొందరు అదృష్టవంతులకే భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. శ్రీ హైమవతీదేవి సాక్షాత్కారాన్ని పొందినవారు శ్రీ రామకృష్ణ అన్నయ్య, శ్రీ గోపాలన్నయ్య, శ్రీ రామరాజు కృష్ణమూర్తి, శ్రీ భద్రాద్రి తాతగారు, శ్రీ బుద్ధిమంతుడు అన్నయ్య, హైమ విగ్రహ శిల్పి జయరాం, అన్నపూర్ణ అక్కయ్య, శ్రీ దినకర్ అన్నయ్య ఎందరో ఉన్నారు. అదే హైమవతీదేవి అనుగ్రహ విశేషం.

హైమవతీదేవి మమకార తరంగాలు :

హైమ అనురాగ బంధం పలువురతో పలురీతుల్లో ప్రస్ఫుటమైంది. శ్రీ మధు అన్నయ్య, శ్రీ శేషు అన్నయ్య, శ్రీ కేశవ అన్నయ్య, కుమారి, వసుంధర అక్కయ్యలతో అందరితోనూ సహోదరిగా వారి వారి అంతరంగాల్లో చిరస్మరణీయంగా నిలిచింది. కాగా శ్రీ తంగిరాల సత్యనారాయణగారి ధర్మపత్ని శ్రీమతి దమయంతిగారిని ‘అమ్మా! అని సంబోధిస్తూ వారి కన్నబిడ్డలా ఆ కుటుంబసభ్యులతో మమేకమైంది.

కాగా, ఆచార్య భరద్వాజను కన్నబిడ్డలా లాలించింది, ఆదరించింది. శ్రీ ఎక్కిరాల భరద్వాజ నాల్గవ ఏటనే తన కన్నతల్లి శాశ్వతంగా కనుమరుగైంది. పసిప్రాయంలోనే కన్నతల్లి ప్రేమకి దూరమైన తన హృదయంలో ఒక వెలితి, అఖాతము, మూగవేదన, లోటు అవ్యక్తంగా గూడుకట్టుకున్నాయి. ఆ వాస్తవం భరద్వాజను చూడగానే హైమక్కయ్య స్పష్టంగా గుర్తించింది. భరద్వాజని “బాబూ!” అని పిలిచేది; అభిమానించేది. ఆ విధంగా భరద్వాజ హైమక్కయ్యలో మాతృప్రేమను దర్శించి, ఆ వాత్సల్యామృతధారలలో పరవశించారు. కనుకనే హైమక్కయ్య శరీరత్యాగం చేసినపుడు “నేను రెండవసారి తల్లిని కోల్పోయాను” అని దుఃఖించారు.

హైమాలయ ఉత్సవ విశేషాలు:

శ్రీ హైమవతీశ్వరీ ప్రాభవాన్ని దర్శింప చేస్తూ శ్రీ కొండముది రామకృష్ణ “హైమాలయం” గ్రంథాన్ని, శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ ‘శ్రీ హైమవతీ వ్రతకల్పా’న్ని, శ్రీ భద్రాద్రి తాతగారు ‘శ్రీ హైమవతీ నమశ్శతి’ అని 100 పద్యాల సమాహారంగా ఒక గ్రంథాన్నీ రచించారు. హైమవతీవ్రతం శ్రీ సత్య నారాయణస్వామి వ్రతం రీతిగా ఉంటుంది. ప్రతిమాసం బహుళ షష్ఠినాడు ‘శ్రీహైమవతీవ్రతా’న్ని ఆచరిస్తారు. ప్రతిమాసం పూర్ణిమనాడు ‘ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ’ అనే హైమవతీదేవి నామ ఏకాహం చేస్తారు.

ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి నుండి కార్తీక బహుళ షష్ఠి వరకు (7 రోజులు) ‘శ్రీ హైమవతీ జనయిత్రీ వ్రతా’ల్ని నిర్వహిస్తారు. “అమ్మ” స్వయంగా వ్రతవిధానాన్ని, వ్రతలక్ష్యాన్ని వివరించి, ఆచరింప జేసింది. ఈ వ్రతాన్ని అందరూ కలిసి చేసుకుంటారు, అందరి యోగక్షేమాలు కోరి ఆచరిస్తారు – అదే హైమ అక్కయ్య నిరంతరం కోరుకునేది.

కార్తీక బహుళ షష్ఠి అంటే హైమవతీ జన్మదినం. ఏటా ఆనాడు సామూహికంగా “శ్రీ లలితా కోటి నామ పారాయణ” చేస్తారు. ఇదీ “అమ్మ” స్వయంగా ప్రప్రథమంగా ఆచరింపజేసినదే.

అనుదినం హైమాలయంలో ఉదయం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరం లలితా సహస్రనామ పూర్వక అర్చన; సాయంకాలం లలితా సహస్రనామ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ పూర్వక అర్చన చేస్తారు.

– హైమాలయ ప్రాంగణంలో అనుదినం అహరహం అమ్మ నామం (జయహెూమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి) సంకీర్తన అఖండంగా చేస్తారు.

– ప్రతి సోమ, శుక్రవారాల్లో ‘హైమాలయం’లో శ్రీ లలితా లక్షనామ పారాయణ చేస్తారు.

ఏటా శరన్నవరాత్రులలో రోజూ త్రికాల పూజలు నిష్ఠగా భక్తిశ్రద్ధలతో కావించి విజయదశమి నాడు ఆ నిర్మాల్యాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళి ఓంకారనదిలో నిమజ్జనం చేస్తారు.

ఈ సకల సేవల్లో, అర్చనల్లో, ఉత్సవాల్లో అందరూ పాల్గొనవచ్చు. అవి అందరికోసం. హైమాలయం కల్పవృక్షం, హైమ కామితార్థప్రదాయిని. మీరు జిల్లెళ్ళమూడి క్షేత్రంలో అడుగిడిన తర్వాత ప్రథమంగా హైమాలయానికి విచ్చేయండి; క్షిప్రప్రసాదిని హైమవతీదేవి దర్శనం చేసుకోండి. పూజలు, ప్రదక్షిణలు ఆచరించి హైమానుగ్రహాన్ని సునాయాసంగా పొందండి. ఇహపర సౌఖ్యాలు అను భవించండి. శాంతి సౌఖ్యాలను సొంతం చేసుకోండి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!