1. Home
  2. Articles
  3. Viswajanani
  4. జిల్లెళ్ళమూడిలో స్త్రీ రూపధారిణియై

జిల్లెళ్ళమూడిలో స్త్రీ రూపధారిణియై

Sankara Sree Rama Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

(పాట)

పల్లవి:

జిల్లెళ్ళమూడిలో

స్త్రీ రూప ధారిణియై

దిగివచ్చి నిల్చినది

దివ్య మాతృప్రేమ

॥జిల్లెళ్ళమూడిలో॥

చరణం 1:

ఆ ప్రేమధారలో

అత్మార్పణము చేసి

తరియింతురట దేహ

ధారులీ వసుధలో

॥జిల్లెళ్ళమూడిలో॥

చరణం 2: 

కనుదోయి వర్షించు

కరుణారసము గ్రోలి

తమ్ము దా మరతురట

తత్సన్నిధానమున

॥జిల్లెళ్ళమూడిలో॥

చరణం 3:

చదవ లేదట సుంత

సర్వదివ్య జ్ఞాన

స్వారస్యములు దెలిపి

స్వాంత మలరించునట

॥జిల్లెళ్ళమూడిలో॥

చరణం 4:

తన సతీ ధర్మ మను

తత్పరత పాలించి

ఏమి యెరుగని యట్టు

లిద్దర నటించునట

చరణం 5:

తన బిడ్డలట లోక

మున గల్గు జనులెల్ల

తన ప్రేమ దుగ్ధముల

దనియించి బ్రోమనట

చరణం 6:

సందేహములు తీర్చి

శాంతి సుధ లొలికించి

ఘోర కానన మందు.

దారి చూపించునట.

॥జిల్లెళ్ళమూడిలో॥

చరణం 7:

దివ్యతేజము తోడ

దిశలు వెలిగించునట

వెతచెందు మనసులకు

వెలుగొనగి ప్రోచునట

॥జిల్లెళ్ళమూడిలో॥

చరణం 8:

ఎవ్వరో ఈ యమ్మ!

ఎందుకో ఈ రాక

 ఏ తీరముల నుండి

ఏమి కొని తెచ్చినో?

॥జిల్లెళ్ళమూడిలో॥

చరణం 9:

ఈ ఎడారుల లోన

ఏ బీజముల నాటి

ఏ కల్పవృక్షాల

నిందు వెలయించునో?

॥జిల్లెళ్ళమూడిలో॥

చరణం 10:

ఏ మహోన్నత శక్తి

ఈ మాతృమూర్తి యై

హృదయార్తి నొలికింప

ఈ లోకమున దిగెనో?

॥జిల్లెళ్ళమూడిలో॥

చరణం 11:

అమ్మ అమ్మల కమ్మ

మేలి బంగరు బొమ్మ

అమ్మ వదముల కివే

ప్రేమ ప్రసూనాలు ॥2॥

మనవి : ఈ పాట రచయిత డా॥ శంకర శ్రీ రామారావు గారు ఏలూరు వాస్తవ్యులు, నేత్రవైద్యులు, ఏలూరు సోదరుల ద్వారా తెలుసుకొని అమ్మ మహత్వపూర్ణ నిజతత్వానికి నిలువుటద్దంగా వాస్తవ చిత్రణ చేస్తూ ఈ పాటను రచించి అమ్మ శ్రీ చరణాల మ్రోల ఉంచారు. తరువాత కాలంలో అనేక సార్లు జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మ దివ్య మాతృప్రేమకి ముగ్ధులైనారు.

ఈ పాటలో కొంత భాగం ‘అమ్మ చలన చిత్రం’ లో స్థానం పొందింది: సుప్రసిద్ధ సినీ నేపధ్యగాయని. శ్రీమతి S.జానకి గానం చేశారు.

ఇది పూర్తి పాఠం; కావున సోదరీ సోదరులు గమనించగలరు.

(19-4-2024 అమ్మ 102 వ జన్మదినోత్సవ సందర్భంగా ప్రచురితము)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!