1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ధారావాహిక అమ్మ ప్రసాదించిన అనుభవం

ధారావాహిక అమ్మ ప్రసాదించిన అనుభవం

Ravuri Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

(గత సంచిక తరువాయి)

సర్వాత్మనా అమ్మ

‘శృంగారలహరి’ స్తోత్రరాజంలో డా॥ పన్నాల రాధాకృష్ణ శర్మ గారు తన సర్వస్వం అమ్మయేనని విన్నవించుకుంటూ

“పితా త్వం మాతా త్వం త్వ మసి సకలో బాంధవ జనో

గురుస్త్వం దేవస్త్వం త్వ మసి హి విభు ర్మిత్ర మపి చ

మదీయం సర్వస్వం త్వ మసి పరమేశాని! జనని!

వినా త్వాం త్రైలోక్యే సహి సహి శరణ్యం మమ శివే! – (శ్లో. 60)

అమ్మా! పరాత్పరీ! నాకు నువ్వు తండ్రి, తల్లి, బంధువర్గం, గురువు, దైవం, ప్రభువు, స్నేహితుడు. నా సర్వస్వం నీవే. ఈ మూడు లోకాల్లో నీవు తప్ప నాకు దిక్కు లేదు, లేదు’ అని అనన్య శరణాగతిని ఆశ్రయించారు. ఈ ఉదాత్తభావన సర్వాత్మనా భక్తికి పరాకాష్ఠ.

మన సోదరీ సోదరులలో దీనికి ఉదాహరణగా నిలిచిన భాగవతశ్రేష్ఠులు కోకొల్లలు. అందు డా॥ K.S.N. మూర్తి ఒకరు. ఆయన ‘సత్యం అన్నయ్య’గా సుపరిచితులే; శ్రీ కోన వెంకట సుబ్బారావు గారి జ్యేష్ఠకుమారుడు, వసుంధరక్కయ్యకి పెద్ద తమ్ముడు. శ్రీ సుబ్బారావు గారి కుటుంబ సభ్యులందరూ అమ్మ ఆదరణ, అప్యాయత, ఆశీస్సులను పొంది త్రికరణశుద్ధిగా అమ్మ సేవకు అంకితమైన వారే.

శ్రీ సత్యం అన్నయ్య అమ్మతో తనకు గల ఆత్మీయతను వివరిస్తూ ‘అమ్మతో నాకు అష్ట బంధాలు ఉన్నాయి – తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితుడు, బావ, అన్న, మార్గదర్శి అన్నారు. కాగా, ఆయా పాత్రల్ని విభిన్నం (water-light-compartments)గా చూడలేము అన్నిటిలో అంతర్లీనంగా అమ్మ అలౌకిక శక్తి, అపారమైన అనుగ్రహ ప్రభావం అణువణువునా ప్రస్పుట మవుతుంది.

తండ్రిగా అమ్మ : తన బిడ్డ ప్రయోజకుడు కావాలి, సమర్థవంతంగా తన సంసారాన్ని చక్కదిద్దుకుంటూ పేరు ప్రఖ్యాతులు ఆర్జించాలని కన్నతండ్రి అశిస్తాడు. సత్యం అన్నయ్య P.U.C (MPC) చదువుకున్నాడు. Maths. Lecturer/ English Lecturer / Engineer కావాలని కోరుకున్నాడు. కానీ, అమ్మ ‘నాన్నా! నువ్వు నా దగ్గర ఉండాల్సిన వాడివి. నాకు వైద్యం చెయ్యాలి. హెూమియో కోర్సు చదువు’ అని నిర్దేశించింది. అమ్మ మాట శిరోధార్యం, గుడివాడలో హోమియో విద్య నభ్యసించాడు. తరువాత అమ్మకి ఎంతవరకు వైద్యం చేశాడో తెలియదుకాని, అమ్మ దగ్గరవైద్య విధానం నేర్చుకున్నాడు. అన్నయ్య చేత చికిత్స పొందని అందరింటి సభ్యులు లేరని అంటే అది అతిశయోక్తి కాదు. అంచెలంచెలుగా ఎదిగి అన్నయ్య Homeo College, Principal, Homeo PG Dept Professor గా పనిచేశారు.

తల్లిగా అమ్మ సత్యం అన్నయ్య హోమియో చదువు పూర్తి అయింది. శ్రీ అధరాపురపు శేషగిరిరావు అన్నయ్యగారితో అమ్మ, “జిల్లెళ్ళమూడిలో వాడికోసం Govt. Homeo Hospital పెట్టించండి” అని ఆదేశించింది. సత్యం అన్నయ్యను పిలిచి ‘రోజూ సంధ్యావందనం చెయ్యి’ అని మార్గదర్శనం చేసింది. అది కంటికి కనిపించే సాధన, దానికి తోడు పరమేశ్వరి అనుగ్రహం పుష్కలంగా ఉంది. అంతే, కథ అనేక మలుపులు తిరిగి అమ్మ సంకల్పానుసారం జిల్లెళ్ళమూడిలో హోమియో ఆస్పత్రి మంజూరై సత్యం అన్నయ్య వైద్యునిగా నియమించబడ్డారు.

దైవంగా అమ్మ: తన వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు ‘పెళ్ళికూతురు’ ఎంపిక బాధ్యతను సత్యం అన్నయ్య అమ్మపై మోపాడు. సరేనని అమ్మ మధు అన్నయ్యని పిలిచి అడవులదీవిలో ఫలానా అమ్మాయి ఉందని చెప్పి పసుపు కుంకుమలు పంపి, లగ్నం కూడా నిశ్చయించింది.

“అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే !

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥” అని దైవం వాగ్దానం చేశాడు కదా!

సత్యం అన్నయ్యకి పద్దెనిమిదవ ఏట మాతృవియోగం కలిగింది. సరే, కళ్యాణఘడియలు సమీపించాయి. అది స్నాతకవ్రత సమయం, కళ్యాణ వేదికపై అన్నయ్య పెళ్ళి పీటల మీద కూర్చొని అచమనం చేసి, సంకల్పం చేశాడు. వెంటనే సర్వమంగళ అమ్మ లేచి వచ్చి అన్నయ్యకి కుడివైపున, దేవదేవుడు నాన్నగారు వచ్చి అన్నయ్యకి ఎడమవైపున పీటల మీద కూర్చున్నారు. ఆదిదంపతులే జననీజనకులై స్వయంగా పీటల మీద కూర్చుంటే అన్నయ్యకి స్వర్గంలో ఉన్నట్లు అఖండ ఆనందాన్ని పొందారు.

గురువుగా అమ్మ: మాఘ పూర్ణిమనాడు మంత్రోపదేశం చేసింది అమ్మ. నిజజీవితంలో ఏ పనులు ఎప్పుడు ఎట్లా చెయ్యాలో బోధించింది.

బావగా అమ్మ: జగత్కర్త, జగద్భర్త అయిన అమ్మ వసుంధర అక్కయ్యకి తాళి కట్టి వివాహం చేసుకున్నది. ఆ సంఘటన అమ్మని ఆదిపురుషుడు అనీ, ఆదిమూలము అనీ విస్పష్టం చేస్తోంది. ఆ వివాహంతో అమ్మ ఆ కుటుంబ సకల బాధ్యతల్నీ నిర్వర్తించింది. నారాయణుడు నరునికి వలె తన చేయూత నిచ్చి నడిపించింది.

అన్నగా అమ్మ: శ్రీమతి కోన వెంకాయమ్మ సత్యం అన్నయ్య తల్లి. ఆమె జ్ఞానంలో; మోక్ష సాధనామార్గంలో పరిపక్వత సాధించింది. తన అవసానదశను గుర్తించి “నన్ను నీలోకి తీసుకో నీ పాదాల్లో కలుపుకో” అని అమ్మను అభ్యర్థించింది. కడసారి అవునేతితో అమ్మకి దీపారాధన చేసింది. అమ్మ నిర్ణయానుసారంగా అమ్మ చేతుల మీదుగా తుదిశ్వాస విడిచింది.

ఆశ్చర్యం. “ఆమె అన్నీ నా చేతుల మీదుగా జరగాలనుకున్నది” అంటూ అమ్మ ఆమె మృతదేహంతో స్మశానానికి వెళ్ళింది. సత్యం అన్నయ్యను నిమిత్తమాత్రంగా పెట్టి తానే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించింది. దీని పరమార్ధం ఏమంటే అమ్మ మోక్షప్రదాయిని, కైవల్యదాయిని, కాగా, స్వయంగా శ్రీమతి వెంకాయమ్మగారి చితికి నిప్పు పెట్టింది – అంటే పరమేశ్వరి తన లీలానాటకంలో కర్త, కర్మ, క్రియ సర్వం తానే అని ఋజువు చేయటమే కదా!

స్నేహితునిగా అమ్మ:

‘అఘము వలన మరల్చు, హితార్థ కలితు

జేయు, గోప్యంబు దాచు, బోషించు గుణము,

విడువ దాపన్ను, లేవడి వేళ నిచ్చు

మిత్రుడి లక్షణంబుల మెలగుచుండు’- అని

భర్తృహరి ప్రబోధించినట్లుగా సత్యం అన్నయ్య జీవన నావకి అమ్మ చుక్కాని, తెరచాప, దిక్సూచి, చిక్కు అయి నడిపించింది.

సత్యం అన్నయ్య Promotion మీద జిల్లెళ్ళమూడి నుండి గూడూరు బదిలీ అయ్యారు. అన్నయ్యను మళ్ళీ జిల్లెళ్ళమూడి తీసుకురావాలంటే Jillellamudi Homeo Hospital upgrade చెయ్యాలి. కనుక, రామకృష్ణ అన్నయ్యకి ప్రేరణనిచ్చి, డా॥ పొత్తూరి వెంకటేశ్వరరావు గారిని కదిలించి, upgrade చేయించి, మళ్ళీ సత్యం అన్నయ్యను తన వద్దకు రప్పించుకున్నది. ఈ నేపథ్యంలో సత్యం అన్నయ్యని హైమాలయంలో అభిషేకాలు చేయమన్నది.

అన్నయ్య అమ్మతో Carrom Board ఆడేవాడు. ఎవరు నెగ్గేదీ అమ్మ సంకల్పానుసారమే. అమ్మతో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కలిసిమెలిసి నడుస్తూ ‘ఆనందోబ్రహ్మ కాదు: అమ్మ అని పరవశించాడు.

ఆ విధంగా వ్యక్తుల జీవితాల్లో ప్రత్యక్షంగా అమ్మ జోక్యం చేసుకున్న సందర్భాలు బహు అరుదు. ఆ విధంగా సత్యం అన్నయ్య భాగ్యశాలి, అదృష్టవంతుడు: అమ్మ కృపకు, మహత్వానికి ప్రత్యక్ష సాక్షి అమ్మ సూత్రధారి, తాను పాత్రధారి.

(శ్రీ రావూరి ప్రసాద్ సంకలన గ్రంథం-

అమ్మతో అనుభవాలు 3వ భాగంనుండి).

సమర్పణ: సంపాదకమండలి, విశ్వజనని ‘మాసపత్రిక’

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!