- మలసిదాసులమైన మాకు విధేయా !
భగవంతుడు భక్తసులభుడు. కాగా, భక్తపరాధీనుడు భక్తవిధేయుడు కూడా అని అన్నమాచార్యుల వారు చక్కగా విశదీకరించారు.
ఈ మొత్తం సారాంశాన్ని అమ్మ “నాన్నా! మీరే నా ఆరాధ్యమూర్తులు” అని ఒక్క మాటలో సృష్టం చేసింది. “దేవుడంటే రాయి (విగ్రహం) కాదు; తనకీ మనస్సు ఉన్నది” అని విలక్షణంగా అపూర్వంగా ప్రకటించింది. అమ్మయే మనకోసం బెంగపెట్టుకుంటుంది, మన శ్రేయోభివృద్ధుల కోసం ఆరాట పడుతుంది, శాంతి సౌఖ్యాలతో సుఖ జీవనం చేయాలని తపిస్తుంది. తన సంతాన అభ్యుదయం కోసం తన అలౌకిక శక్తిని వెచ్చిస్తుంది.
ఒకనాడు “అమ్మా! మా భారం అంతా నీ మీద వేసి మేము హాయిగా ఉంటాం” అంటే “వెయ్యండిరా!” అన్నది. మరుక్షణం “భారం అని నువ్వు అన్నావు గానీ నేను అనలేదు” అన్నది. అదీ తల్లిప్రేమ రక్షణ, బాధ్యత, ధర్మం. ఇందుకు ఒక ఉదాహరణ ;
శ్రీమతి యమ్.అంజనీదేవి గుంటూరు వాస్తవ్యురాలు. ఆమె తన బాల్యంలో తొలిసారి అమ్మను దర్శించుకున్నారు. ఆ సందర్భం ఆశ్చర్యకరం, అమ్మ అనుగ్రహానికి ప్రత్యక్షసాక్ష్యం.
ఆమె తండ్రి గారికి పక్షపాతం వచ్చింది. ఆస్తి పాస్తులన్నీ కరిగిపోయి నిస్సహాయస్థితిలో ఉన్నారు. అపుడు ఆమె బామ్మ తిరుమలమ్మ గారు అమ్మ దర్శనం చేసికొమ్మని వారికి మార్గదర్శనం చేసింది.
ఆమె తల్లిదండ్రులు పిల్లలను తీసికొని బస్సులో జిల్లెళ్ళమూడి బయలుదేరారు. పొరపాటున 7వ మైలు దాటి ఎక్కడోదిగారు. చీకటి, దారి తెన్ను తెలియదు. నడిచిపోతున్నారు. ఒక రైతు. “అయ్యో! దారి’ తప్పారు” అని ఒక పాక దగ్గర గడ్డి పరచి “ఈ రాత్రికి ఇక్కడ ఉండి, ఉదయం బయలు దేరి వెళ్ళండి” అన్నాడు. పిల్లలు ఆకలిదప్పులతో సొమ్మసిల్లి పడిపోయారు.
అల్లంత దూరంలో కాంతిరేకలు కనిపించాయి. క్రమంగా ఇద్దరు వ్యక్తులు లాంతర్లు తీసికొని వచ్చి “గుంటూరు నుంచి వస్తున్నది మీరేనా?” అని అడిగారు. వారు ఫలానా చోట ఉన్నారని చెప్పి అమ్మ పులిహోర, పెరుగన్నం, విస్తళ్ళు ఇచ్చి పంపిందని చెప్పారు. అమ్మ ప్రసాదం స్వీకరించి తెప్పరిల్లారు. తెల్లవారుతుండగా ఎడ్లబండి మాట్లాడి ఆ కుటుంబాన్ని క్షేమంగా అమ్మ నివాసానికి చేర్చారు.
వాళ్ళని చూస్తూనే అమ్మ రెండు చేతులూ చాచి రివ్వున ఎదురు వచ్చి వాళ్ళని గుండెలకు హత్తుకున్నది. అలా భక్తులకోసం ఆరాటపడే దైవం జిల్లెళ్ళమూడిలో కనిపిస్తాడు.
సోదరి అంజనీదేవికి 1971లో వివాహం అయింది. అందుకు కర్త కర్మ క్రియ తానేనని తెలియచేస్తూ అమ్మ పసుపుకుంకుమ, చీరె, నల్లపూసలు, గొలుసు బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్య చేత పంపింది. అటు పిమ్మట అందరూ అమ్మ దర్శనానికి వెళ్ళారు. వధూవరులను కలిపి ఒక దండవేసి అమ్మ ఆశీర్వదించింది. అందరూ సెలవు తీసుకున్నారు. కళ్ళనిండా నీళ్ళు నింపుకుని అంజనీదేవి అక్కడే తలవంచుకుని నిలుచున్నది. “ఏమమ్మా? ఏమన్నా మాట్లాడాలా?” అని అమ్మ అడిగింది.
“అమ్మా! ఊహ తెలిసిన తర్వాత అన్నీ కష్టాలే. వివాహం అయింది. ఆయనకి ఉద్యోగం లేదు. ఎలా బ్రతకాలో తెలియదు. భయంగా ఉంది” అన్నది. ” దిగులు పడకు, తప్పకుండా ఉద్యోగం వస్తుంది” – అని అమ్మ హామీ నిచ్చింది. 16 రోజుల పండుగ నాడు Registered Post లో ఒక Cover వచ్చింది. అది ఆమె భర్త Govt. Teacher గా Appointment order. అమోఘమైనవి అమ్మ వాక్కు, అమ్మ ఆశీస్సులూ.
శ్రీమతి అంజనీదేవి రెండవ కుమారుడు పుట్టినప్పటి నుండి చాలా బలహీనంగా ఉండేవాడు. ఏమీ తినేవాడు కాదు. బలవంతంగా పెడితే రక్తం వాంతి చేసుకునే వాడు. డాక్టర్లకి అర్ధం కాలేదు. ఆమె పిల్లవానిని తీసుకుని వెళ్ళి, అమ్మ పాదాల ముందు కూర్చోబెట్టి తన వ్యధను విన్నవించుకుంది. అప్పుడు అమ్మ ఆ పసివాని వంక తదేకంగా చూస్తూ “నువ్వు పెడితే తినడు. నేను పెడితే తినను అంటాడా?” అని, అన్నం, కూర తెప్పించి స్వయంగా తన అమృతహస్తాలతో ముద్దలు చేసి తినిపించింది. వాడు నెమ్మదిగా తిన్నాడు. వాంతి కాలేదు. తర్వాత క్రమేణ పరిపూర్ణ ఆరోగ్య వంతుడైనాడు.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అడుగడుగునా ఆమె జీవనయానంలో ప్రత్యక్షంగా నిలబడి అమ్మ తన చేయూత నిచ్చి ఆదుకున్నది. అదంతా భక్తుని దృష్టిలో విశ్వాసం అనవచ్చు. కాగా అవతారమూర్తి అమ్మ భక్తులకు (బిడ్డలకు) విధేయురాలు,
తల్లి ధర్మాలుగా ఈ వ్యాసంలో అమ్మ శరణాగత పారిజాతము, అసురుల పాలిట భూతము, విధికి విధి, దాసులకు విధేయురాలు- అనేది కొన్ని కల్యాణ గుణములను వివరించాను.
అమ్మ తల్లిధర్మం కోసం అవతరించింది. బిడ్డలుగా మన ధర్మం ఏమిటో స్పష్టం చేసింది- “నీకున్నది. తృప్తిగా తిని, నలుగురికి ఆదరంగా పెట్టుకో” అని. ఆ విధంగా అమ్మ నిర్దేశించిన బాటలో పయనించి కృతార్థులు, చరితార్థులు అవుదాం !!!
ఉపయుక్త గ్రంథావళి :
- ‘విశ్వజనని’ మాసపత్రికలు- సెప్టెంబరు 2020, జనవరి 2021
- శ్రీ రావూరి ప్రసాద్ సంకలన గ్రంథం ‘అమ్మతో అనుభవాలు’ అరవ భాగం.