1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ధ్యానమూర్తి దివ్యస్మృతి

ధ్యానమూర్తి దివ్యస్మృతి

Sivalenka Prasad Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

పదవ తరగతి పాసయ్యి జిల్లెళ్ళమూడిలో చదువుకోవడానికి వచ్చినపుడు నాలో ఎంతో భయం. మా నాన్నగారి అనారోగ్యం… ఇంటిలో దుర్భర దారిద్య్రం.. కన్నీళ్లు అదిమిపెట్టి జిల్లెళ్లమూడికి మామయ్యతో వచ్చాను.

అదే రోజు తెల్లటి వస్త్ర ధారణతో అంతకంటే స్వచ్ఛమైన నవ్వులతో నిండిన వదనంతో చూడగానే వింత ఆకర్షణకు గురి చేసే ఒక వ్యక్తిని చూసాను. ఆ క్షణమే మనసులో ఏదో కదలిక, ఆయనే ఆ కళాశాల ప్రిన్సిపల్  శ్రీ విఠాల రామచంద్రమూర్తిగారు అని తెలిసింది. ఇన్నేళ్ళయినా ఇప్పటికీ మొదటిసారి తనను చూసిన ఆ క్షణం మనసులో సజీవ చైతన్యం, దాదాపు నలభై ఏళ్ళైనా ఇప్పటికీ ఆయనే నా అంతరంగ ధ్యానమూర్తి. ఆయన ద్వారానే ఆ మట్టిలో ఏముందో తెలిసింది. అమ్మ మానవత్వ పరిమళాల ఆస్వాదన తెలిసింది.

అక్కడ అయిదు సంవత్సరాల విద్యాభ్యాస కాలం ఒక అద్భుతమైన అనుభూతిగా, అదొక దివ్య లోకంగా ఇప్పటికీ మనసులో సెలయేటి ప్రవాహపు గలగల ధ్వనిగా మనసులో సందడి చేస్తోంది. జీవితంలో నా పాత్ర నేను పోషించడానికి ఆ కళాశాల, ఆ అందరిల్లు నాకు దారిచూపాయి. అమ్మ అవ్యాజ కరుణ, విఠాలవారి శిక్షణ, ఆనాటి అధ్యాపక బృందం, కళాశాల యాజమాన్యం నన్ను తీర్చి దిద్దాయి.

శ్రీ విఠాల రామచంద్ర మూర్తి గారు వందలాది విద్యార్థుల మనసుకు ఎలా నేరువ అయ్యారని నాలో నేనే ప్రశ్నించుకుంటే, విద్యాభ్యాసం తరువాత కూడా మాతో ఉండి. అమ్మచూపిన మానవత్వపు వెలుగుల వైపు మమ్మల్ని మా ద్వారా మా చుట్టూ ఉన్న సమాజాన్ని నడిపిస్తుండడమే కారణం అనిపిస్తుంది. ఆయనను తలుచుకుంటే ఒక భావోద్వేగం, కృతజ్ఞత కన్నీరుగా మారి ఆనంద బాష్పమై అలరిస్తుంది. మాష్టారుతో నాకున్నవన్నీ దివ్య స్మృతులు,

“అనుభూత విషయా సంప్రమోషః స్మృతిః” అని పతంజలి యోగ సూత్రం. అంతరంగమందు అనుభవించిన లక్ష్యమును ఆధారం చేసుకొని ఏర్పడిన చిత్త వృత్తి స్మృతి అని వివరణ, విద్యాభ్యాస కాలంలో ఆయన బోధ, దినచర్య, ఆచరించిన అమ్మమాట, నడిచిన అమ్మబాట ఇప్పటికీ నాకు మార్గదర్శకం.

ధ్యానంలో మాష్టారి రూపమే కనిపిస్తుంది. పొగమంచు అలముకున్న బాటలో మాష్టారుతో చేసిన వాకింగ్ మెదులుతుంది. మెట్లు ఎక్కి అమ్మ గదిలోకి ప్రవేశిస్తే అక్కడ అమ్మ నిలువెత్తు చిత్ర పటం ముందు ధ్యానం చేస్తున్న మాష్టారును నా ధ్యానంలో చూస్తాను. ఇప్పటికీ ఆ గది నుండి ఏవో సందేశాలు వినిపిస్తాయి.

నన్ను చేయి పట్టుకొని అమ్మ గదిలోకి తీసుకు వెళ్తున్న అనుభూతి నాకు ధ్యానంలో నిత్య నూతనం. నేను ఎదుర్కొన్న అనేక సంఘటనలను, నేను చేసిన పనులను జిల్లెళ్ళమూడి అమ్మ మా గురువు గారు అనే పేరుతో ప్రచురణ చేసి పుస్తకావిష్కరణ సభలో వీడియో కాల్లో తనను చూస్తూ మాట్లాడిన మాటలు ఆయన గురించి అమ్మ పలికించిన మాటలుగా భావిస్తాను.

నాపై అత్యంత ప్రభావం చూపిన మాష్టారుకు నా ఆత్మ కథను చెప్పుకోవడం, నా విద్యార్థుల ముందు మాష్టారు గురించి చెబుతూ ఆనందం అనుభవించడం నా భాగ్యం. అయిదు వందలమంది నా పూర్వ విద్యార్థులతో రామా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, కార్య క్రమాలు నిర్వహించడం వెనుక గురువు గారిచ్చిన స్ఫూర్తి ఉంది.

రామా ఫౌండేషన్ ‘అమ్మ బడి’ గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్న అన్ని సేవా కార్య క్రమాలు ఆయన సూచనతో జరిగినవే. నువ్వున్న చోట అమ్మను చూపించు అని పలికిన గురుబోధ నాకు శిరోధార్యం. పబ్లిసిటీ కన్న పని ముఖ్యం అని చెప్పే అయన మాట నాకు హెచ్చరిక.

నేను ఈ పని చేశాను అనవద్దు. ఈ పని నానే చేయ బడింది అని వినయం చూపించు అన్నారు. ఎన్నో జీవన పాఠాలు నేర్పారు. దివ్య స్మృతులుగా నాలో నిండారు. ఆయన నాలో కలిగించిన దివ్య స్మృతులకు సాష్టాంగ ప్రణామం.

ఈ దివ్య స్మృతులే నాకు బలం, దివ్యౌషధం, నిరుపేదగా జిల్లెళ్ళమూడిలో అడుగు పెట్టిన నేను ఎవరి దగ్గరా విరాళం తీసుకోకుండా కేవలం నా జీతంలో కొంత మొత్తం సేవా కార్యక్రమాలకోసం వెచ్చించడం వెనక జిల్లెళ్ళమూడి అమ్మ, గురువు గారు, సాహిత్యం పట్ల, మానవతా విలువలు పట్ల స్పృహ కలిగించిన అధ్యాపక బృందం ఉన్నది. ‘గుర్తు చూపేవాడే గురువు’ అనే మాటకు నిలువెత్తు నిదర్శనం మాష్టారు గారు.

గురువంటే సమాచారం మాత్రమే కాదు, సదాచారాన్ని ఇచ్చేవాడు అని మాష్టారు గారిని చూస్తే తెలుస్తుంది. 

విద్యాభ్యాసం తరువాత కూడా మా చిరునామాలకు ఉత్తరాలు రాసి యోగ క్షేమాలు అడిగే వారు, పై చదువులకు, కుటుంబ కష్టాల్లో కూడా ఆయన ఓదార్పు చెప్తూ మానసిక ధైర్యాన్ని పెంచే వారు. ఆయన చూపు, ఆయన మాట, నా భుజంపై ఆయన హస్త స్పర్శ నాకు దివ్యానందం కలిగించేది. నా అంతరంగ ధ్యానమూర్తి మాష్టారు.

తిక్కన భారతం నుండి “సారపు ధర్మమున్ విమల సత్యము…”, “తానొక గడ్డ కట్టుకొని తత్పరతన్ శిలలై నశించు….” అని సౌందర నందంలోని పద్యం-

ఈ రెండు పద్యాల భావాలని ఆయన వలన నేను నిరంతరం నెమరు వేస్తూ ఆచరణలో అలా ఉండటానికి సాధన చేస్తున్నాను. మాస్టారి సందేశమే రామా ఫౌండేషన్ అమ్మ బడికి పునాది అయింది.

“నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అనే అమ్మ మాటకు అయన చేసిన వ్యాఖ్యానం మరువ లేనిది. నీకున్నది అంటే నీకేం ఉంది. నువ్వు పుట్టినపుడు ఏమీ తేలేదు. అందుకే నీకున్నది అంటే నీకు ఇవ్వబడిందే తప్ప నీకంటూ ఇక్కడేమీ లేదు అనే వివరణ నా రామా ఫౌండేషన్ అమ్మ బడి సేవా కార్య క్రమాలకు ధర్మధ్వజం.

భక్తి సేవ అనేవి ఒకే నాణానికి బొమ్మ, బొరుసు లాంటివని మాస్టారివల్ల తెలుసుకున్నాను.

నా వ్యాసాలకు మొదటి శ్రోత, మొదటి విమర్శకులు. ఒకటా రెండా? ఎన్నో జీవన పాఠాలు నేర్చుకున్నాను. సత్కార్యాలు చేస్తున్నప్పుడు పసిపిల్లాడిలా సంబర పడేవారు. ప్రతి క్షణం ఆశీర్వదించే వారు.

కరోనా విపత్కర కాలంలో పది గ్రామాల్లో చేసిన సేవకు ఆయన ప్రోత్సాహం ఉంది. నాకు కరోనా సోకినప్పుడు రోజుకు నాలుగు సార్లు ఫోన్ చేస్తూ… మెసేజ్ ఇస్తూ నాకు మానసిక ధైర్యం కలిగించిన తండ్రి మనసు ఆయనది.

కళాశాల స్వర్ణోత్సవాలు, అమ్మ శత జయంతి ఉత్సవాలు నేనున్న ప్రాంతంలో జరుపుకోవడానికి సూత్రధారులు ఆయనే. రెండు గిరిజన గ్రామాలను దత్తత తీసుకొని రెండేళ్లుగా చేస్తున్న కార్య కలాపాలకు మాష్టారే ప్రేరణ.

ఆయన లేరు అనే భావన నాకు ఎపుడైనా దిగులుగా ఉన్నప్పుడు నాలో నుండి ఆయన కంఠ స్వరం “నీలో దీపం వెలిగించు నీవే వెలుగై వ్యాపించు జన కళ్యాణం సాధించు” అని వినిపించేది. ఇక ముందు కూడా ఆయన స్వరం నేను ఇలాగే వింటాను. నా జీవితపు చివరి రోజు వరకు మాస్టారు చూపిన మానవత్వపు బాటను వదలను, సేవా కార్య క్రమాలను ఇలాగే కొన సాగిస్తాను.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!