1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మాతృశ్రీ చరణ చారణ చక్రవర్తులు – 1

మాతృశ్రీ చరణ చారణ చక్రవర్తులు – 1

Prasad Varma Kamarushi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

శ్రీ తంగిరాల కేశవశర్మ

‘అమ్మ ఒడిలోని పాప నేనై సుఖింతు, అమ్మ కనులందు జ్యోతి నేనై జ్వలింతు, జ్యోతిలో నున్న అగ్ని నేనై తపింతు అని’ అమ్మతో మమేకమైన తంగిరాల కేశవశర్మ గారు అమ్మ సేవకై, సంస్థల పురోభివృద్ధికై అహరహం తపించి అమ్మచే ఋషి అనిపించుకున్న మహనీయుడు.

వీరు R.S.S. కార్యక్రమాల్లో చాలా కాలం పనిచేశారు. కొంత కాలం తర్వాత R.S.S. ప్రచారక్ జీవితం విరమించి, గృహస్థ జీవితంలో ప్రవేశించాలనుకున్నారు. ఎలాగూ చీరాల విడిచిపెడుతున్నాం కదా! ఓ సారి జిల్లెళ్ళమూడి వెళదాం అనిపించి, 1958 సెప్టెంబరు 1వ తారీకున రెండో మూడో బత్తాయిపళ్ళు కొని మొదటిసారి అమ్మ దర్శనానికి వెళ్ళేరు. అప్పుడు వీరు బ్రహ్మచర్యం అంటే యేమిటండి. అని అడిగారు. అమ్మ ఓ చిరునవ్వు నవ్వి “నాకేం తెలుస్తుంది నాన్నా, నేను గృహిణిని కదా!’ అందట. నాటి నుండి ఏదో తెలియని ఆకర్షణకు లోనై జీవితమంతా అమ్మమయం అయిపోయింది అని చెప్పుకున్నారు..

వీరు తంగిరాల నరసింహారావు భవానమ్మలకు కలిగిన ద్వితీయ పుత్రుడు. వీరికి ఆరుగురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉన్నట్టు తెలుస్తున్నది. నరసింహారావు గారు వెల్లటూరు వాసి, గుంటూరులో పొగాకు కంపెనీలో ఉద్యోగం వచ్చినందువల్ల గుంటూరుకు మారేరు. వీరు శ్రీవిద్యోపాసకులై, నిత్య శ్రీచక్రార్చన చేసేవారు. శర్మ గారి వివాహం అమ్మ సంకల్ప ప్రేరణలతో 1960 మే 13 న దెందుకూరు వారి ఆడపడుచు శారదతో జరిగింది. వివాహానంతరం హైదరాబాద్ నల్లకుంటలో కాపురం పెట్టేరు. ఒక మగ పిల్లవాడు, ముగ్గురు ఆడపిల్లలు కలిగారు. తరువాత వాత్సల్యమూర్తి అని మగపిల్లవాడు పుట్టాడు. కాని బ్లడ్ కాన్సర్తో అకాల మరణం పాలయ్యాడు. మొదట్లో ఏవో చిన్నా చితకా ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా, ఎల్. ఐ.సి.లో గుమాస్తాగా చేరి, డివిజనల్ ఆఫీస్ లో ఎడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గా రిటైర్ అయినారు. నలుగురి పని ఒక్కడే చేసి పని రాక్షసుడని అనిపించుకున్నారు.

1958 ప్రాంతాల్లో ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు మంత్రోపదేశం చేశారు. ఆ జపం చేస్తున్న తొలినాళ్ళలో, చేతి నిండా గాజులతో ఒక చెయ్యి కొబ్బరి చిప్ప అందిస్తున్నట్టు శర్మగారి కొక దర్శనం అయింది. అమ్మను దర్శించుకుని పూజలో పాల్గొన్న తర్వాత ప్రసాదంగా కొబ్బరి చిప్పలు ఇవ్వటం చూసిన తర్వాత జప సమయం లో అయిన దర్శనం గుర్తుకొచ్చి సుమారు 5 యేళ్ళ ముందే అమ్మ దృష్టిలో పడ్డాను అనుకున్నారు. అమ్మను దర్శించుకున్న తొలి రోజుల్లో కాలి నడకన 6 నెలలు కన్యాకుమారి యాత్ర చేస్తానంటే అమ్మ అంగీకరించలేదు.. ఒక నెలలో తిరిగి రమ్మన్నది. కాలి నడక సాగ లేదు. చేతిలో చిల్లి గవ్వ లేకుండానే కన్యాకుమారి యాత్ర సాగింది. ఆలయంలో అమ్మవారి చెంత హైమ పాదాల మువ్వల సవ్వడి విన్నారు. అమ్మ అన్నట్టు ఒక నెలలోనే యాత్ర ముగిసింది.

చిన్న జిల్లెళ్ళమూడి : శర్మ గారు రిటైర్ అయిన తర్వాత విశాఖ, గుంటూరులలో సొంత ఇళ్ళు ఉన్నా, అమ్మకు దగ్గరగా ఉండి సేవ చెయ్యాలని బాపట్లలో ఒక అద్దె యింట్లో ఉండి, బాపట్ల జిల్లెళ్ళమూడి మధ్య తిరుగుతూ ఉండేవారు. జిల్లెళ్ళమూడి అందరింటి సోదరులు తరచుగా వచ్చి రోజుల తరబడి, నెలల తరబడి ఉంటూ ఉండేవారు. అలా వచ్చిన వాళ్ళలో లెక్కలు చెప్పించు కోవటానికి వచ్చిన రవి అన్నయ్య కూడా ఉన్నాడు. హద్దులేని ఆదరణతో, అంతులేని అభిమానంతో అతిథి అభ్యాగతులను ఈ దంపతులు ఆదరించే వారు. అందుకేనేమో ఆ యిల్లొక చిన్న జిల్లెళ్ళమూడి అని పేరు పడింది.

ఒకసారి రవి అన్నయ్య హైదరాబాద్ లో వీరింటి కెళ్లినపుడు, నగరంలో చూడదగిన ప్రదేశాలన్నీ చూపించి, సుల్తాన్ బజార్లో కావలసిన వన్నీ కొన్నాక, ఇంతకు అమ్మకు ఏం కొంటున్నావు రవీ అని అడిగి, కుంకుమ భరిణ కొంటే బాగుంటుందని ప్రోత్సహించారు. నాలుగు రూపాయల Pocket money తో భరిణ కొని అమ్మకు సమర్పించారు రవి, ఇతర బహుమతులెన్ని వచ్చినా అమ్మ ఆ భరిణను చిరకాలం వాడుకుంది. అది కేశవన్నయ్య నాలో కలిగించిన సమర్పణ భావానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వంటిది అంటారు రవి,

కవిగా :- ఆంధ్ర ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం కల వారు. Richard schiffman వ్రాసిన MOTHER OF ALL లో కొంత భాగాన్ని విశ్వజనని పేరుతో తెలుగు అనువాదం చేశారు. దక్షత గల కార్యకర్తయే కాదు, గొప్ప రచనా పాటవం కల కవి కూడా, వీరి పద్య, గేయాదులు చూసి కవితా దృష్టితో ఇది ఉదాత్తతను, భక్తి పారమ్యాన్ని, శరణాగతిని లలిత లలితంగా రస స్ఫురితంగా అందిస్తున్న రచన అని శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ప్రశంసించారంటే శర్మ గారి రచనల స్థాయి అవగతం కాగలదు. శర్మగారి రచనలలో నిబద్ధత అమ్మపట్ల అచంచల విశ్వాసం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కుమారుడు వాత్సల్యమూర్తి అకాల మరణం చెందినపుడు “అమ్మా! ఇక నిన్నేమీ కోరను” అనే వచన కవిత పెల్లుబికింది. అది పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకొన్నది. ఇందులో – జీవిలోనూ నేనే చావులోనూ నేనే, అని చెప్పావు, ప్రాణాలు తీసి కూడా పాఠాలు చెప్పగలవు. అమ్మా కోరిక నాదైతే – కోత మరొకరికా? గర్భ తీపి తెలిసిన దానివి, కన్నతల్లికా కష్టం? నన్ను కట్టు కున్నందుకా? నిన్ను పట్టు కున్నందుకా? అని నిందా స్తుతి చేశారు.

వీరి జీవన రేఖలు, స్వీయ రచనలు, శ్రీమతి శారదగారి రచనలు, అలయ విశేషాలు, ఆప్తుల అభిప్రాయాలు సంకలనం చేసి శర్మగారి ఆప్త మిత్రుడు, ఆత్మ బంధువు శ్రీ పి.ఎస్.ఆర్. అంజనేయ ప్రసాద్ గారు “అమృతసేచనము” అన్న పేరుతో 2018 లో వెలువరించారు. ఈ గ్రంథానికి ఈ పేరు సూచించినది కేశవ శర్మగారే.

  • (సశేషం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!