1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

D V N Kamaraju
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 18
Month : January
Issue Number : 1
Year : 2019

(గత సంచిక తరువాయి)

  1. అమ్మ: “నాయనా! తెల్లవారవచ్చింది. ఇంటికెళ్లాం. నేను రేపు మన్నవ వెళతాను. ఎప్పుడు వస్తానో నేను ఎక్కడ ఉన్నా మీ అమ్మ మీకే ఉన్నది తాతను చేయి పట్టుకొనండి”.

“ఇంక కనపడవా అమ్మా”! అంకదాసు బావురుమన్నాడు.

“ఏడుపెందుకు? ఎక్కడున్నా అమ్మ ఉన్నదిగా!” మస్తాన్ ధైర్యం

“అంతటా ఉన్న అమ్మ – వెళ్ళి వస్తానంటున్నది” చెప్పాడు.

“రూపం పరిమితం. శక్తి అనంతం”. మస్తాన్ ఆ మాట అంటుండగానే ఒక్కసారిగా అన్ని దిక్కులూ అరుణోదయ కాంతితో వెలిగిపోయాయి. ఈ దృశ్యం ముగ్గురికీ ఒకేసారి కనపడుతుంది.

తాత: ఇంతకూ నా గతేమిటి?

అమ్మ: “వాళ్ళ గతే నీ గతి. అందరికీ సుగతే!”

అమ్మ ఆ మాట అంటుండగా అంకదాసుకు ఒక దృశ్యం కనుపించింది. అందులో అమ్మ అందరినీ ఒడిలో వేసుకుంటున్నట్లుగా ఉన్నది. ఆ దృశ్యం అంకదాసు మస్తానుకు వివరించాడు. మస్తాన్ అందుకేమీ విస్తుపోక అన్నాడు.

“ఆశ్చర్యమేమున్నది? వడేసిలాగి ఒడిలో వేసుకుంటుంది. ప్రపంచమంతా ఆ ఒడిలో వాలాలి తప్పదు. అమ్మా! తెల్లవారకుండా ఉంటే బాగుండును! అయినా, ఇందాక తెల్లవార వచ్చిందనుకుంటే ఇంత ప్రొద్దున్నదేమిటి?” మనకు ఎంతవరకు చెప్పదలచుకుంటే అంతవరకూ ప్రొద్దు ఉంటూనే ఉంటుంది.

  1. అమ్మ ఐలూరు కాంతమ్మగారి ఇంటి మీదుగా వెళ్ళుతుండగా ఆస్పత్రివద్ద కాంపౌండరు కృష్ణమాచారి కనపడి “మా డాక్టరుగారింట్లో నిన్ను గురించి ఏమిటో వింతగా చెప్పుకుంటున్నారమ్మా! ఇప్పుడెందుకో ఆ మాటలు గుర్తు వచ్చి నిన్ను చూడాలనుకున్నాను. అనుకోగానే నీవు కనపడ్డావు. “

“ప్రొద్దున్నే ఆస్పత్రికి వెళ్ళుతున్నారేమిటి?”

“మీ అమ్మగారి కేసులాంటి కేసు వచ్చింది. రాత్రి ఆ కేసు చేస్తున్నంతసేపూ నీవే గుర్తుకు వచ్చావు. అదీగాక డాక్టరు గారింట్లో నిన్ను గురించి విన్నప్పటినుండీ నాలో కలిగిన భావాలన్నీ కలిసి రాత్రి నిన్ను ధ్యానింపచేశాయి. ధ్యానమే కాకుండా దర్శనము కూడా అయింది.” “అవును నాయనా! ధ్యాసే ధ్యానం”

  1. ఒక బాదం ఆకు తీసుకువచ్చి గిన్నెలో అన్నం పెట్టుకుని అమ్మ దొడ్లోకి వెళ్ళింది. రోజూ ఒక వరాహానికి అన్నం పెట్టటం అమ్మ అలవాటు. ఆ రోజు ఆ వరాహం అక్కడ లేదు. ఎక్కడకు వెళ్ళిందా అని ఆలోచిస్తూ ఉండగా అది వచ్చింది. అమ్మకు క్రిందటి రెండు రోజులూ అంకదాసూ, మస్తానులతో గడిచిపోయాయి. అందువల్ల వరాహానికి అన్నం పెట్టలేదు. కనీసం కనుపించలేదు. ఆ దిగులూ, దైన్యమూ, ఆర్తీ ఆ కళ్ళల్లో స్పష్టంగా చూచిన అమ్మ వరాహాన్ని దగ్గరకు పిలిచింది. గబగబా అమ్మ పాదాల వద్దకు వచ్చి ముట్టె పాదాలమీద ఆనించి ఆఘ్రాణించి కన్నులు పైకెత్తి అమ్మ ముఖం వంక చూచింది. కన్నులు జలజలా స్రవించాయి. జాలిగా,ప్రేమగా, లాలనగా అమ్మ వరాహం వీపు నిమిరి విస్తరి ముందుకు లాగి దగ్గర కూర్చుని అన్నం కలిపి పెట్టింది. ఆకలితో దహించుకుపోతున్న దానిలా వరాహం గబగబా అన్నం తినడం ప్రారంభించింది.
  2. అహం అంటే నేను-బ్రహ్మ. నేను అంటే బ్రహ్మ అయిన నేను. నేను నేనుగా వున్న నేను “అహం బ్రహ్మాస్మి”. నేను నీవుగా వున్న నేను “అహంకార బ్రహ్మ”. అంటే రెండుగా వున్న స్థితి “అహంకార బ్రహ్మ” = ఇక్కడా బ్రహ్మత్వము లేకపోలేదు. నేను నేనుగానే వున్న నేను అనే స్థితి “అహం బ్రహ్మాస్మి. ”

తానే ఉపనిషత్తు అయి అమ్మ వివరిస్తూ ఉంటే తన్మయుడై వింటూ ఉన్నాడు తాత.

  1. అమ్మ వయస్సు 5 సంవత్సరముల ఆరు మాసములు. అమ్మమ్మగారి సంవత్సరీకాలకు అమ్మ మన్నవ వస్తుంది. వూళ్ళోకి రాగానే ప్రతివారూ “మా యింటికి రామ్మా! మాయింటికి రామ్మా”! అని అమ్మని పిలుస్తారు. అమ్మ ఎవరి యింటికీ వెళ్ళక అరుగుమీద కూర్చుని వుంటుంది. ఇంతలో గొల్లనాగమ్మ వచ్చి “మన ఇంటికి పోదాం రామ్మా” అంటుంది. అమ్మ లేచి చివాలున నుంచుని “అందరూ మాయింటికి అన్నారు. నాగమ్మ మన ఇంటికి అన్నది” అని మనసులో అనుకుంటూ చేతులు చాచి నాగమ్మ వంక చూచింది. నాగమ్మ చూపు నిలిచిపోయింది. శరీరం కొయ్య బారింది.

కొద్ది క్షణాల పిదప నాగమ్మ “అమ్మా! మిట్టమధ్యాహ్నం సూర్యునిలాగా ఉన్నావమ్మా! ఆ సూర్యుని చూస్తూ కళ్ళు తెరవలేము. నిన్ను చూస్తుంటే మూయలేము” అన్నది.

పొలంనుంచి నాగమ్మ కూతురు సుబ్బలక్ష్మి వస్తుంది. అమ్మను చూడగానే ఆనందంతో ఎదురుగుండా వున్న మండిగం కూడా కనపడక “మా అమ్మ వచ్చిందే” అని అరుస్తూ మండిగం తగిలి ముందుకు పడుతుంది. చేతులు అమ్మ పాదాలకు తగుల్తాయి. లేవబోయేటప్పుడు పాదాలకు చేతులు వత్తిడి తగిలి కందుతాయి.

నాగమ్మ : “పిల్ల కాళ్ళు చూడు. కనపడటంలా?”

సుబ్బలక్ష్మి : “ఏమీ కనపడలేదమ్మా- అమ్మను చూడగానే ఏదో మాయ కప్పినట్లు అయిపోయింది. పాదాలు చేతికి తగలగానే నా సర్వమూ మరిచిపోయాను. ఏమిటో శరీరం నుండి లాగినట్ల యింది.”

  1. అమ్మను తీసుకెళ్ళటానికి నల్ల ఖాసిం (పాలేరు) వస్తాడు. “అమ్మా! నిన్ను నాన్నగారు (సీతాపతి తాతగారు) తీసుకు రమ్మంటున్నారు.”

అమ్మ: “నిజం చెప్పు. నాన్నగారా, తాతమ్మ (మరిడమ్మ)”

ఖాసిం: (నవ్వుతూ) మీ నాన్నగారే.

అమ్మ: అబద్దమాడకుండా అంటున్నాను అను. ఖాసిం: అబద్దమాడకుండా తాతమ్మ రమ్మన్నది.

అమ్మ: నాన్న అక్కడే నుంచున్నారా? తాతగారు చూస్తూ తొందరగా, తొందరగా అనలా?

ఖాసిం: నేను వచ్చేలోగా అక్కడనుంచి ఎవరయినా వచ్చిపోయారా?

29.నాకెవరూ ఎదురు కాలేదే? అని అంటూంటే. సుబ్బలక్ష్మి “అక్కడ అట్లాగే జరిగి వుంటుంది. అమ్మాయిగారి లక్షణాలన్నీ విశేషంగానే వుంటాయి. కనుక్కునే వుండొచ్చు” అన్నది ఏమీ ఆశ్చర్యం లేకుండానే. ఖాసిం అమ్మ ముఖంవంక కన్ను ఆర్పకుండా చూస్తూ అమ్మలో అక్కడ జరిగినవన్నీ చూస్తూంటాడు. పిలిచినా పలకడు.

  1. అమ్మమ్మ సంవత్సరీకాల అనంతరం అమ్మను తెనాలిలో అమ్మ మాతామహులు వెంకటసుబ్బయ్యగారి వద్ద ఉంచి అలవాటు చేద్దామనుకుంటారు సీతాపతి తాతగారు.

తెనాలి తాతగారు: “అవన్నీ తరువాత చూద్దాం!. నీవుకుడా వచ్చి పిల్లని అలవాటుచేసి వద్దువుగాని, రారా!”

సీతాపతి తాతగారు: “నేను ఎక్కడికీ రానండీ. పిల్లను అంతా తీసుకెళతామంటారు. వాడి సంగతే అర్ధం కాకుండా వుంది. (అమ్మ సోదరుడు రాఘవరావు మావయ్య గురించి). అటువంటి దుడుకు పిల్లవాడిని ఎవరు భరిస్తారు? నాకే విసుగు – తల్లికి మినహా. తల్లికి తప్పదు.”

అమ్మ (తలవంచుకుని మెల్లగా): తల్లికి తప్పదు కాదు. తల్లికి తప్పే కనపడదు.

అమ్మ పలికిన ఆ వాక్యం విని చిదంబరరావు గారు విస్మితులై “మళ్ళీ అనమ్మా” అంటారు.

తెనాలి తాత వెంకటసుబ్బయ్యగారు: “సీతాపతీ! ఇచ్చిన దేవుడు మర్చిపోతే నీ కూతురు బ్రహ్మాండమే”.

అమ్మ : “నేను బ్రహ్మాండమూ, మీరు బ్రహ్మాండంలోని వాళ్ళూనా?”

“నీవు ఎట్లా బ్రహ్మాండానివి?” చిదంబరరావుగారు సమాధానం కోసం కుతూహలపడ్డారు.

“మీ అన్నగారేగా అన్నది” – చిదంబరరావుగారు మరో మార్గంలో ఎదుర్కొన్నారు.

32.”జరుగుతున్నదీ అదే. ముందు జరగబోయేది అదే. వచ్చింది అందుకే. ఎవరేది చేసినా, అన్నా ఒప్పుకునేందుకే అని అమ్మ ఒప్పుకున్నది అసందిగ్ధముగా.

33.గంగరాజు పున్నయ్యగారు అమ్మను ఒడిలోకి తీసుకుని – 

“అమ్మా, తల్లిలేని తల్లీ -” అంటూ అమ్మను చెక్కిళ్ళు పుడికి ముద్దుపెట్టుకున్నారు. 

తల్లిలేని తల్లీ అంటే తొలి నేనే ననా?” అమ్మ “తల్లి” శబ్దానికి అర్ధం. యిచ్చింది. ఔను తనను గురించి అయినా తాను చెప్పుకుంటే గాని మనకు తెలియదు!

  1. అమ్మ, చిదంబరరావు తాతగారూ, మరికొంతమంది ఎడ్లబండిలో మన్నవ నుంచి పొన్నూరు బయలుదేరతారు. దారిలో బండి కాడితాళ్ళు తెగి సుడిపడుతుంది. అమ్మ పైతొట్టిలో నుంచి కిందకి దూకుతుంది. ఆ దూకే సమయంలో పడిపోయినట్లుగా కనపడుతుంది అందరికీ. అమ్మో బిడ్డ పడ్డదని బండిలోని వారంతా అనుకుంటూ వుండగా వారుకూడా వెనుకకు పడిపోతారు.

అమ్మ నవ్వుతూ వెనుకకు వచ్చి, “నేను ముందు పడ్డాను. మీరు వెనుక పడ్డారు. ముందు నే పడ్డాను. నా వెనుక మీరు పడ్డారు. నేను చిన్నమ్మాయిని ముందు పడ్డాను. పెద్దవారంతా నావెంట పడ్డారు” అన్నది విలాసంగా.

‘ఎన్ని అర్ధాలుగా అన్నావమ్మా! చిదంబరరావుగారు విస్మితు లయినారు. అమ్మ : అర్ధాల కోసం అనలేదు. జరుగుతున్నది అంటున్నాను.

“అర్థాలకోసం అనలేదు సరే. ఇన్ని రకాలుగా ఎందుకు? ఇంతకూ చిదంబరం ఏమిటిరా అమ్మాయి అనేది?” వెంకటసుబ్బారావుగారు అడిగారు.

“చాలా వున్నది అర్ధం. ఇప్పుడిప్పుడే తేలేటట్లుగా లేదు. ఇంటికి వెళ్ళిన తరువాత తీరికగా కూర్చోబెట్టుకుని చాలా అడగాలి ఈ బుడ్డమ్మాయిని చిదంబరరావుగారు అలవాటయిన వాయిదా వేశారు.

(సశేషం…)

 

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!