1. Home
  2. Articles
  3. Mother of All
  4. మాతృశ్రీ శ్రీరాముడే

మాతృశ్రీ శ్రీరాముడే

A Anasuya
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 18
Month : January
Issue Number : 1
Year : 2019

పూజ్యశ్రీ లక్ష్మణయతీంద్రులవారు అన్నారు, “ఆ వేదవేద్యుడే రాముడు. రాముడే లలిత. ఆ లలితయే మన అమ్మ” – అని. ఆ పలుకులు అక్షర సత్యం. శ్రీరామమూర్తి పేరు స్మరించగానే ‘ఒకే బాణము, ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ’ – వంటి లోకోత్తర కళ్యాణగుణాలు రాశీభూతమై మన కళ్ళముందు సాక్షాత్కరిస్తాయి.

“ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రం నుండి ‘రా’ అనే శబ్దాన్నీ, ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం నుండి ‘మ’ అనే శబ్దాన్నీ సంపుటికరణం చేస్తే ‘రామ’ శబ్దం ఉత్పన్నమైంది. అంటే రాముడు శివకేశవ మహనీయ తత్త్వ సమాహారం. రంజింపజేసేవాడు రాముడు.

‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనేది తారకమంత్రం.

‘అమ్మ’ పేరు అనసూయ. ‘అనసూయ’ అంటే రాగద్వేషాసూయలను పారద్రోలేది. మంచిలో చెడును చూడటం అసూయత్వం, చెడులో సైతం మంచిని చూడటం అనసూయత్వం. తరింపజేసే తల్లి అమ్మ. సంస్కరణ-సముద్ధరణమే అమ్మ మాతృధర్మం, అమ్మ దర్శనమే నిశ్రేయస సముత్పాదకం, పరతత్వానుభవ సంధాయకం.

దశరధమహారాజు రాముని ‘రామచంద్రా!’ అని అర్ధవంతంగా సంబోధించే వారు. దాని అర్ధాన్ని వాల్మీకి మహర్షి ‘తేజసా ఆదిత్యా సంకాశం, ప్రతిపత్ చంద్ర దర్శనమ్’ అని వివరించారు. అంటే – రాముడు సూర్యప్రభలతో దేదీప్యమానంగా విరాజిల్లుతాడు. అమ్మో! సూర్యుని చూడలేము భగభగలు, తాపము- దరి చేరలేముకదా! – అని అనుకోవద్దు. ‘ప్రతిపత్ చంద్రదర్శనమ్ ‘ పూర్ణచంద్ర ప్రశాంత శీతల జ్యోత్స్నలను కురిపిస్తూంటాడు. అని. ఈ అలంకారాన్ని విరోధాభాస (paradox) అని అంటారు. అది ఒక అవతారమూర్తి సాన్నిధ్యవైభవం.

“కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |

 ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥ 

చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః ।

విద్వాన్ కః కః సమర్ధశ్చ కశ్చైక ప్రియదర్శనః ॥

 ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః |

 కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే॥’ అని వాల్మీకి మహర్షి సంధించిన ప్రశ్నలకి సమాధానంగా నారదముని 

‘ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైశ్చృతః | 

నియతాత్మా మహవీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్వశీ॥’ అన్నారు.

శ్రీమద్రామాయణ ఆదికావ్యంలో వాల్మీకి మహర్షి ‘రామో విగ్రహవాన్ ధర్మ’ అని సూత్రీకరించారు. రాముడు తలచింది, చెప్పింది, చేసింది ధర్మం. ధర్మమూర్తి రామమూర్తి. ఆ మాట మారీచుడనే రాక్షసుడు రావణునితో అన్నాడు. విశ్వామిత్రమహర్షి సంకల్పిత యజ్ఞాన్ని ధ్వంసం చేయ యత్నించిన మారీచుడు శ్రీరామ బాణ ఘాత ప్రభావానికి కొన్ని యోజనాల ఆవలికి కొట్టుకు పోతాడు. వానిలోని ఆసురీ గుణాలు నశించి ఒక ఋషిలా జీవిస్తూంటాడు. అంటే శ్రీరాముడు మారీచ రాక్షసుని మరీచి మహర్షిగా సంస్కరించాడు అని అర్థం. అదీ అవతారమూర్తుల దర్శన స్పర్శన సంభాషణాదుల మహిమ.

‘శ్రీరామ’ పదాన్ని నిర్వచిస్తూ అమ్మ, “విరామం లేనిది రామం” అన్నది. విరామం లేనిదేది? అని ప్రశ్నించుకుంటే – గ్రహాలు, గ్రహరాజుల గమనానికి విరామం లేదు. పంచభూతాల కార్యకలాపాలకి విరామం లేదు. జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు, రక్తప్రసరణ, హృదయ స్పందనకి విరామం లేదు. ‘విరామం’ అంటే సృష్టి స్తంభించి పోవడం. కావున ‘రామం’ అంటే సృష్టి నడక.

ఆచరణాత్మకంగా ‘అమ్మ’ స్పష్టంచేసినదేమంటే ధర్మాచరణకి విరామం ఉండరాదు. ఒక వ్యక్తి కుమార్తె, కుమారునిగా, భార్య, భర్తగా, తల్లి, తండ్రిగా, విద్యార్ధి, గురువుగా, స్నేహితునిగా పౌరునిగా, ఉదర పోషణార్ధం చేపట్టిన వృత్తిలో సేవకునిగా / అధికారిగా ఎన్నో పాత్రలు నిర్వహించాలి; వాటికి త్రికరణ శుద్ధిగా న్యాయం చేయాలి అని. ‘స్వాధ్యాయప్రవచనాభ్యాం న ప్రముదితవ్యం। దేవ పితృ కార్యాభ్యాం న ప్రముదితవ్యం / మాతృదేవో భవ / పితృదేవోభవ / ఆచార్య దేవోభవ….” అనీ, ‘ధర్మో రక్షతి రక్షితః’ అని శాసిస్తోంది వేదం. వేదవిహిత కర్మానుష్ఠాన తత్పరులు బ్రహ్మయజ్ఞంలో భాగంగా దేవతర్పణం, ఋషితర్పణం, పితృతర్పణం, మనుష్య తర్పణం చేపట్టి 4 విధాల ఋణాలను తీర్చుకుంటారు.

శ్రీరాముడు పురుషునిగా దిగివచ్చి ఏకపత్నీవ్రత దీక్షను ఆచరించి చూపిస్తే, ‘అమ్మ’ స్త్రీమూర్తిగా సామాన్య గృహిణిగా పాతివ్రత్య దీక్షను దక్షతతో వహించింది; అనసూయాదేవిని సీతాదేవిని మరపించింది. పతివ్రత అంటే పతిని ఆధారంగా చేసికొని పంచభూతాలను జయించినది అని, సర్వాన్నీ స్వాధీనం చేసుకున్నది. సాధ్వి అని ఆచరణాత్మకంగా నిరూపించింది. అంతేకాదు. ‘భర్తకు భార్య దేవత’ అని సంపూర్ణత్వాన్ని యధార్ధాన్ని ప్రబోధించింది.

శ్రీరామావతారంలో మరొక విశేషం – రాముడు కైకేయీ మాతతో అంటాడు. “రామోద్విర్నాభి భాషతే” అని. అంటే రామునికి రెండు నాల్కలు లేవు, రెండు మాటలు లేవు అని. దీనికి వివరణ అమ్మ ఇచ్చింది; ఒక సందర్భంలో “మాట అంటే ఏమిటో ఎప్పుడన్నా విన్నావా? అర్ధం తెలుసునా? మాట అంటే మారు మాటలేని మాట. ఆ మాటనే మంత్రమంటారు. ఉత్తములకు మంత్రం మామూలు. వారి మారుమాట లేని మాటకు సంఘంలో ఏ తంటాలేదు. చాలా తంటాలు పడుతున్నామంటారే, వారు మారు మాట గలవారే” అని.

‘అమ్మ’ తన జీవితకాలంలో పఠించింది. ‘సరే’ మంత్రం. సుఖంగానీ, కష్టంగానీ ఏది అనుభవించాల్సివస్తే అన్నిటికీ ‘సరే’ అంటూ సంతోషంగా కొంగుచాచి పట్టడం; అది అసిధారావ్రతం. నిప్పుల బాటలో, ముళ్ళ బాటలో పయనం. అమ్మ మాటలలో చెప్పాలంటే “నిప్పులంటే నిప్పులు అనికాదు. ఒకమాట ఉన్నది. ఆ మాటను తు.చ. తప్పకుండా నడవాలంటే నిప్పుల బాటలో నడిచినట్టే. ఆ మాట ఒకనాటి మాటకాదు కదా! జీవితానికి సంబంధించి కలకాలమూ మిగిలే మాట. ఆ మాట ఒక మహామంత్రం. ఆ మంత్రం పఠించిన తర్వాత కదా గమ్యస్థానానికి చేరేది! తియ్యగా అనుభవిస్తూ మాటను నెర వేర్చుకోవాలి. అదే మహామంత్రం. మంత్రం అంటే ‘సరే. ఆ ‘సరే’ అనే మాట మంత్రం. ఆ మంత్రమే మాట తప్పక పోవటం” అని.

ధర్మాచరణ అనేది మాటలు కాదు; బహుకష్టతరము. శ్రీరాముడు పితృవాక్పరిపాలనకోసం సింహాసనాన్ని పరిత్యజించి వనవాసం చేశాడు, ‘నాతి చరామి’ మాటకోసం రావణ సంహారం చేశాడు, ‘జనవాక్యంతు కర్తవ్యం’ అని ప్రాణాధికమైన ధర్మపత్ని అగ్నిపునీత అయోనిజ సీతను పరిత్యజించాడు. అవన్నీ నిప్పుల బాటలే, ముళ్ళ బాటలే. కనుకనే అమ్మ అన్నది “సత్యం వధ, ధర్మంచెఱ” అని. సత్యవాక్పరిపాలన అనేది ఒక విధంగా ఆత్మహత్యా సదృశం. ధర్మాచరణానురక్తి అనేది తనకై తాను విధించుకున్న కఠోర నియమ శృంఖలాల నడుమ చెఱసాలలో బందీకావడం.

సీతాపహరణం, సీతా పరిత్యాగ సమయాల్లో ఆ ఇల్లాలి గుండెల్లో ఎన్నో అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందాయి. అంతేనా! సీతాపహరణం సీతావియోగం శ్రీరాముని ఎంతగా వేధించాయో, ఎంతగా క్రుంగదీశాయో! వారిరువురి వేదనాగ్నులను పోల్చటం, అంచనా వేయటం అసాధ్యము.

అట్టి వేదన, కన్నీళ్ళ వాస్తవికతను ‘అమ్మ’ ఆవిష్కరించింది. హైమక్కయ్య శరీరత్యాగం చేసిన పిమ్మట తన స్నేహితురాలు వచ్చింది. హైమను తలచుకుని విలపిస్తుంటే అమ్మ అన్నది ‘ఎవరు దగ్గర లేరనుకుంటున్నావో, ఎవరు కావాలను కుంటున్నావో వారిని ఆవేదనతో ఆరాధిస్తున్నావు. ఆరాధన అంటే ఆవేదనే నమ్మా! ఏడుపంటే కన్నీళ్ళు కాదుగా? హృదయాన్ని దగ్ధం చేసే అగ్ని ప్రవేశించి దహనం చేస్తుంది. అది సర్వ మమకారాల్నీ రాగద్వేషాదుల్నీ దగ్ధం చేసే మహాయోగం. అదే అందరూ సర్వసామాన్యంగా చెప్పుకునే హఠయోగం. అదే భక్తి, యోగం. సర్వకాల సర్వావస్థలయందూ ఉన్నప్పుడు అదే జ్ఞానం, అదే నిష్కామకర్మ, అదే సర్వమూ” అని.

దుష్ట శిక్షణ, శిష్టరక్షణలు అవతారమూర్తి లక్ష్యం. “దుష్టసంహారం అంటే దుష్టత్వ సంహారం” అని అమ్మ స్పష్టం చేసింది. అంటే సముద్ధరణమే అవతార మూర్తి లక్ష్యం. వీరశృంగార రామచంద్రమూర్తి సరయూ నదిలో ప్రవేశించి అవతార పరిసమాప్తి చేసి నిజధామమైన వైకుంఠానికి ఏతెంచినపుడు తన పరివారమైన అయోధ్యవాసులను వెంట బెట్టుకుని తీసుకువెళ్ళి వారికి సామీప్య సాయుజ్యాలను ప్రసాదించాడు.

ఆద్యంత రహిత అనుగ్రహ స్వరూపిణి ‘అమ్మ’ దివి నుండి భువికి ఏతెంచిన మరుక్షణం చరిత్ర ఎరుగని ఒక మహోన్నత వరాన్ని ప్రసాదించింది. “అందరికీ సుగతే” అని. ఆ సూత్రంలో అంతర్లీనమైన సత్యాన్ని “సముద్రంలో అలలేచి మళ్ళీ కలసిపోయినట్టే మీ జన్మలూనూ, నా సంకల్పంతో మీరు జన్మ ఎత్తి నాలోనే లయమవుతారు” అని విపులీకరించింది.

చివరగా ఒక ఆసక్తికరమైన సంగతి.

‘సీతాలక్ష్మీ భవాన్ విష్ణుః శేషోలక్ష్మణ ఉచ్యతే’ అని రావణ సంహారానంతరం బ్రహ్మదేవుడు రామునితో అన్నారు. అంటే “రామా! నీవు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. నీ ధర్మపత్ని శ్రీమహాలక్ష్మి. నీ సోదరుడు లక్ష్మణుడు ఆదిశేషుడు” అని.

ఇక్కడ ఒక ప్రశ్న తల ఎత్తుతుంది. ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువు రామునిగా, త్రిశక్తి రూపిణి ‘అమ్మ’గా అవతరిస్తేనే గానీ దుష్ట సంహారము/ దుష్టత్వ సంహారము చేయలేరా? అని. చేయగలరు. వారు సిద్ధ సంకల్పులు, ఘటనా ఘటన సమర్ధులు. సంఘంలో కొన్ని ఆదర్శాల్ని ప్రమాణాల్ని విలువల్ని ఆచరణాత్మకంగా నిలబెట్టడానికి వారి ఆగమనం అత్యంత ఆవశ్యకమైనది. కనుకనే అవతరించారు.

లోకంలో జయాలు, లాభాలకోసం. ‘జయ పంచకమ్’ (5) శ్లోకాల్ని జపిస్తారు;

‘జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః |

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ॥

దాసో హం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః |

హనుమాన్ శతృసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ |

శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ॥

అర్ధయిత్వా పురీంలంకాం అభివాద్యచ మైథిలీమ్ ।

సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం ॥

తస్య సన్నాద శబ్దేన తే భవన్ భయశంకితాః |

దదృశుశ్చ హనూమంతం సంధ్యామేఘమివోన్నతమ్||

 అందరింటి సోదరీ సోదరులు సర్వకామ్య సిద్ధికి ‘జయహో మాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి’ అమ్మ నామ మంత్రాన్ని జపిస్తారు.

ముగింపు మాటలు:

‘గుణాః పూజాస్థానం గుణిషు నచలిఙ్గం నచ వయః: సద్గుణాలే పూజనీయములు; స్త్రీ పురుష భేదాన్ని, చిన్న పెద్దా భేదాన్ని పాటించం. కనుకనే శ్రీరాముడు, మాతృశ్రీ మనకి ఆరాధ్యమూర్తులు; ఆదర్శ ప్రాయులు అయినారు. ‘ఆ వేదవేద్యుడే రాముడు, రాముడే లలిత, ఆ లలితయే మన ‘అమ్మ’ అన్న శ్రీలక్ష్మణ యతీంద్రుల వారి సందేశ సారం అదే. దీనిని అమ్మ పరోక్షంగా సమర్ధించింది; ఒకసాడు సో॥ శ్రీహనుమబాబుగారితో అన్నది “రామాయణకాలంలో ఉన్నవారు ఇక్కడికి వస్తారు” అని. అంటే లోతుగా పరికిస్తే ‘మాతృశ్రీ శ్రీరాముడే’ మనం!.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!