1. Home
  2. Articles
  3. Mother of All
  4. మానవుని సాధన – మాధవుని సంకల్ప సిద్ధి

మానవుని సాధన – మాధవుని సంకల్ప సిద్ధి

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 5
Month : April
Issue Number : 2
Year : 2006

హైమాలయంలో భద్రాద్రి తాతగారు నమకచమకాలతో అభిషేకం చేసే రోజులవి. తిరుమలక్కయ్య రోజూ 10 సార్లు ఉదయం, 10 సార్లు సాయంకాలం లలితా సహస్రనామ పారాయణ చేసేది. ఒకసారి తనకి కించిత్ అనారోగ్యం చేసింది. తనకి బదులు లక్ష్మీనారాయణ అన్నయ్య చేత పారాయణ చేయించమని అమ్మతో చెప్పింది. అందుకు అమ్మ “నీ కోసం చేస్తున్నావా? నా కోసం చేస్తున్నావా? హైమకోసం చేస్తున్నావా?” అని వాస్తవాన్ని గుర్తించమంది. శ్వాస ఉన్నంతసేపూ ఈ శరీర సౌఖ్యం కోసం తాపత్రయ పడతాం. ఈ శ్వాసని, శరీరాన్ని అనుక్షణం పరిరక్షించే అమ్మ నామస్మరణ, కీర్తన, అర్చన, శ్వాస అంత అత్యవసరం అనిపించవు. ఎందుకో?

అమ్మ అన్నయ్యను పిలిచి, “నాన్నా! అక్కయ్యకి సున్తీ కదా! నువ్వు చెయ్యరాదూ!” అన్నది. అనేక జన్మల తపః ఫలం అమ్మ సాన్నిధ్యం, సాన్నిహిత్యం, దానిని వదులుకునే అవివేకి కాదు అన్నయ్య. అదే మాట అమ్మతో అన్నాడు. కాని, అమ్మ బుజ్జగిస్తూ, “నువ్వు ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లే చేయి, నాన్నా!”. అని ఒప్పించింది. మిగిలిన అవతారాలకి అమ్మకీ తేడా అదే. ఎంతో గారం చేసి పెంచింది మనల్ని. భగవత్సంకల్పము అనూహ్యము, దురవగ్రాహ్యము. అయిష్టం. గానే ప్రారంభించి రోజూ ఉదయం 12 సార్లు, సాయంకాలం 12సార్లు. లలితాపారాయణం నెలరోజులు చేశాడు.

అప్పట్లో తన ఉద్యోగ రాయచూర్, మర్నాడు ప్రయాణం. పది రోజులు. ఉండమని అమ్మ బ్రతిమాలింది. మనకి అమ్మ మీదకంటే అమ్మకి మన మీద ప్రేమ ఎక్కువ. కనుకనే అమ్మను ప్రేమ రూపిణి, ప్రేమ వర్షిణి, ప్రేమ భాషిణి అని అంతటితో ఆగక ప్రేమోన్మాదిని అని కీర్తిస్తాం. వినమ్రంగా చేతులు జోడించి ఆ దివ్య మాతృప్రేమకు అంజలి ఘటిస్తాం..

అన్నయ్య ప్రయాణ సన్నాహం చేస్తున్నాడు. కమలక్కయ్య కడగా ఉన్నది. అమ్మ అన్నయ్యను పిలిపించి, “రా నాన్నా! బొట్టు పెడతా. ఊరు వెడుతున్నావుగా!” అన్నది మందహాసంతో, ‘కమలకి స్నానం అయిన తర్వాత తీసుకుని వెడతాను’ అన్నయ్య తన అభిప్రాయం వెలిబుచ్చాడు. అమ్మ మరో మార్గంలో “నువ్వు వెళ్ళు నాన్నా! ఉద్యోగానికి, కమలను మనిషిని పెట్టి పంపిస్తాను” అని ఎదుర్కొంది. ప్రయాణం రద్దు చేసుకుని ఉండడానికే అన్నయ్య నిర్ణయించుకున్నాడు. మనల్ని ఉద్దరించటం కోసం జగద్గురువు అమ్మకి ఎన్నో పద్ధతులు, ప్రణాళికలు ఉన్నాయి. కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం న్యాయం. – చివరకు భ్రమర కీటక తిరుమలక్కయ్యకి ఆరోగ్యం చేకూరినా అన్నయ్యే లలితా పారాయణం చేశాడు. అది జగన్నాధరథం. కదిలితే ఆగదు.

అన్నయ్య పట్టు వదలని సంకల్పాన్ని గుర్తించి అమ్మ అన్నయ్యను దగ్గరకు తీసుకుని, ముఖంలో ముఖం పెట్టి “నాన్నా! హైమాలయంలో ఏదైనా దీక్షగా 40 రోజులు చేస్తే సంకల్ప సిద్ధి కలుగుతుంది” అని తన నిజసంకల్పాన్ని వివరించింది.

మిగిలిన 10 రోజులూ పారాయణ దీక్షగా పూర్తిచేసి అన్నయ్య రాయచూర్ వెళ్ళాడు. పూజలూ, ప్రదక్షిణలూ, అభిషేకాలూ, అర్చనలూ దైవంకోసం కాదు – మన కోసమే. వెంటనే అన్నయ్య మనోభిష్టం ఫలించింది. రాయచూర్ నుంచి గుంటూరు బదిలీ అయింది. తర్వాత కాలంలో ఆ పారాయణ బలంతో లలితా.. కోటి నామార్చాన, సహస్రమటాభిషేకాలూ నిర్వహించాడు. ప్రతిఫలంగా శుభపరంపరలను పొందాడు.

‘కర్మణ్యేవాధికారస్తే’ అంటారు గీతాచార్యులు. వాస్తవానికి కర్మల మీద అధికారం మనిషికి లేదు; దైవానికే. కనుకనే అమ్మ, “నేను చేస్తున్నాననుకునేది. మానవత్వం, వాడు చేయస్తున్నాడనేది జ్ఞానం, అన్నీతానైనది దైవం” అని వాస్తవాన్ని గుర్తింప చేస్తుంది.

ఈ సందర్భంలో ఒక చక్కని కథని గుర్తు చేసుకోవాలి. ఒకనికి అంత్యకాలం సమీపించింది. తన జీవితమంతా కలగా కన్పిస్తోంది. జీవనయానం సాగరతీర గమనంలో ఉన్నది. తాను సంతోషంగా ఉన్న కాలంలో ఇద్దరు వ్యక్తుల అడుగు జాడలు కనుపిస్తున్నాయి. తన కష్టకాలంలో మాత్రం కేవలం ఒక వ్యక్తి అడుగుజాడలు. కనుపిస్తున్నాయి. ఆ సమయంలో దైవం దర్శనం ఇస్తున్నాడు. కనుకనే అడిగాడు, “ఆ రెండు అడుగు జాడలు ఎవరివి?” అని. ఒకటి నీవి, రెండవది నావి’ అని బదులిచ్చాడు దేవుడు. ‘అయితే కష్టకాలంలో నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావు?” అని నిష్ఠూరంగా దేవుని ప్రశ్నించాడు. దేవుడు చిరునవ్వుతో ‘ఆ అడుగు జాడలు నీవి కాదు, నావి. కష్టకాలంలో నువ్వు నడవలేవని నేను నిన్ను ఎత్తుకుని నడిచాను. నేను నిన్ను ఎప్పుడూ వదిలి ఉండలేదు. నువ్వే సంతోషకాలంలో నన్ను విడిచి దూరంగా పరుగెత్తుకు పోయావు’ అన్నాడు.

ముళ్ళ బాటవైపు పోయే వాళ్ళని రహదారిలోకి చేతులు పట్టుకుని నడిపించటం, బురద పూసుకున్న వాళ్ళని స్వయంగా కడిగి శుభ్రం చేయడం విశ్వజనని తన కర్తవ్యం అనుకోవచ్చు. కాని అధికరుణ అని మనం గుర్తించాలి. అవ్యాజకరుణామూర్తి అజ్ఞాన ధ్వాంత దీపికా అని అహరహం మననం చేసుకోవాలి.

 

ఒక రోజు అమ్మ గది ముందు వరండాలో సంధ్యావందనం జరుగుతోంది. అమ్మకు అత్యంత సన్నిహితమైన ఒక సోదరునితో అమ్మ “నాన్నా! ఇక్కడ కూర్చుంటే ఏవస్తుంది. అక్కడ కూర్చో” అని ఆదేశించింది. లాలనా, పాలనా, పోషణా అన్నీ అమ్మ బాధ్యతలే. చిత్రం ఏమంటే సాధన మానవునికి; సంకల్పసిద్ధి దైవానికి. అందుకే ‘త్రిపదార్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్త మం’ అని సృష్టికర్త విరాట్ స్వరూపాన్ని అభివర్ణిస్తుంది వేదం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!