అమ్మను ఆరాధ్యమూర్తిగా సేవించి, తమ జీవితాలను సార్థకత (పొంచిన) చేసుకున్న ధన్యులు ఎందరో ఉన్నారు. తన సంకల్పంతోనే వారిని తన వద్దకు రప్పించుకుంటుంది అమ్మ. ఎవర్ని ఎందుకు ఏ కారణంతో తనవద్దకు రప్పించుకుంటుందో అమ్మకు మాత్రమే తెలుసు.
అమ్మతో అనుబంధం పెంచుకుని ఆరాధ్య మూర్తిగా భావించి, జిల్లెళ్ళమూడిలో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించి అమ్మ సేవలో తరించిన ధన్యజీవి కొండేపూడి సూర్యనారాయణ అన్నయ్యగారు, అమ్మతో అనుభవాలు, అమ్మతో అనుబంధం అమ్మచే ప్రభావితులు, ధన్యజీవులు, ఇలా అనేకగ్రంధాలు ఆవిష్కరించబడి అనేకమందిని, గొప్పగొప్ప సోదరులను గురించి, తెలుసుకొని ధన్యులమయ్యాము. ఆ కోవకు చెందినవారే సూర్యనారాయణ అన్నయ్యగారు కూడా.
జిల్లెళ్ళమూడిలో జరిగే అనేక కార్యక్రమాలు అన్నయ్యను ప్రభావితుడ్ని చేసాయి. అమ్మ ప్రేమ, కరుణ, అమ్మ సాన్నిధ్యంలో ఉన్న ప్రశాంతత ఆయన్ని జిల్లెళ్ళమూడిలో కట్టి పడేసాయి.
1962 వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అమ్మను దర్శించుకునే భాగ్యం కలిగింది. సూర్యనారాయణ అన్నయ్య తల్లి రమణమ్మగారు కోడలిని పిల్లలను తీసుకుని, అమ్మ దగ్గరకు వచ్చింది. అన్నయ్య నాస్తికుడు.. భక్తిలేదు. నమ్మకాలు అసలేలేవు. రానన్నాడు. అన్నయ్యకు ముగ్గురు పిల్లలు. ఒక మగపిల్లవాడు ఇద్దరు ఆడపిల్లలు. రెండో ఆడపిల్ల పసి బిడ్డ. అమ్మ ఒళ్ళోకి తీసుకుంది బిడ్డను. అమ్మను చూసి తన్మయులయ్యారు అందరూ. ప్రథమ దర్శనంలోనే అమ్మ భక్తులయ్యారు.
ఒకసారి కార్తీకమాసంలో అమ్మ దర్శనం చేసుకుందామని, తనకుమారుడు సుందర రమేష్ ను వెంటబెట్టుకుని జిల్లెళ్ళమూడి ప్రయాణమయ్యాడు.
అమ్మా! పిల్లకు పేరుపెట్టమ్మా! అని అడిగింది రమణమ్మగారు నేను పెట్టడం ఎందుకు. నీ కొడుకు అరుణ అన్న పేరు పెడదామని మనసులో అనుకుంటున్నాడుగదా! అన్నది అమ్మ. ఏమో అమ్మా నాకు తెలియదు. పేరు నువ్వే పెట్టాలి అని కోరింది రమణమ్మగారు. అమ్మ ఆ పాపకు పరాత్పరి అని పేరు పెట్టింది.
సరే ! ఇంటికి వచ్చాక కొడుకుతో ఈ మాట చెపితే ఆయన విపరీతమైన ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎందుకంటే అరుణ అన్న పేరు తన మనసులో అనుకున్నది ఎవ్వరికీ చెప్పలేదుట. ఒకసారి వెళ్ళి అమ్మని చూసి రావాలి అనుకున్నారుట. అలా పునాది వేసింది అమ్మ.
గాత్రం కోటేశ్వరరావు అనే మిత్రునితో కలసి మొట్ట మొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చాడు అన్నయ్య. ప్రథమ దర్శనంలోనే అమ్మను చూడగానే పాదాలకు నమస్కారం చేసుకుని ప్రశాంతచిత్తుడైనాడు. అమ్మ ఆప్యాయంగా తలనిమిరి మొఖాన బొట్టుపెట్టి ఆశీర్వదించింది. దేముడంటే నమ్మకంలేని అన్నయ్య కడిగిన ముత్యంలా అమ్మసాన్నిధ్యంలో అపూర్వమైన అనుభవం పొందాడు.
అప్పటినుండి తరచుగా జిల్లెళ్ళమూడి రాకపోకలు సాగిస్తూ అమ్మను గురించి పెద్దలనోట అనేక విషయాలు తెలుసుకుంటూ ప్రభావితుడై అమ్మ భక్తగణంలో సభ్యుడైనాడు.
ఒకసారి కార్తీకమాసంలో అమ్మ దర్శనం చేసుకుందామని, తనకుమారుడు సుందర రమేష్‌ను వెంటబెట్టుకుని జిల్లెళ్ళమూడి ప్రయాణమయ్యాడు. 7వ మైలు వద్ద బస్సు దిగి నడవసాగారు. ఆరోజు కార్తీక పౌర్ణమి. అమ్మ ఓంకారనది నదిలో స్నానానికి వచ్చింది. చుట్టూ భక్త బృందం. కొందరికి మంత్రోపదేశం ఇస్తున్నారు అమ్మ. కార్యక్రమం అంతా పూర్తయింది. ఇంక బయలు దేరుదామా అమ్మా! అన్నారు అందరూ.
“కొంచెంసేపు ఆగుదాం నాన్నా! సూర్యనారాయణ వాడి కొడుకుని తీసుకుని వస్తున్నాడు”. అన్నది అమ్మ దయామయి. సర్వాంతర్యామి. పరుగు పరుగున అమ్మను చేరుకుని నమస్కారం చేసుకున్నాడు అన్నయ్య. స్నానాలు ముగించుకొని అమ్మ నామస్మరణతో నగర సంకీర్తన చేసుకుంటూ అమ్మతో కలిసి జిల్లెళ్ళమూడి చేరుకున్నాడు. ఈ సంఘటన మనసులో ముద్రించుకుని ఎంతో సంతోషపడేవాడు.
చీరాలలో I.L.T.D.లో ఉద్యోగం వచ్చింది అన్నయ్యకు. ఆయన ఆనందానికి అవధులు లేవు. అమ్మకు దగ్గరగా వచ్చాను, అమ్మ సేవ చేసుకునే భాగ్యం కలిగింది. ఇదంతా అమ్మదయే ! అని తరచుగా జిల్లెళ్ళమూడిలో సేవాకార్యక్రమాలు చేపట్టాడు. సూర్యనారాయణ అన్నయ్య సోదరి సత్యవతి భగవాన్ సత్యసాయిబాబాను దర్శించు కొందామని పుట్టపర్తి వెడుతూ అన్నయ్యను తోడు రమ్మని అడిగింది. ఆమెకు సాయంగా అన్నయ్య కూడా పుట్టపర్తి వెళ్ళాడు. (1963లో) ఒకవారం ఉన్నారు అక్కడ అందరూ. రోజూ భజన హాలులో కూచుని దూరం నుండే స్వామిని దర్శించుకునేవారుట.
ఒకరోజు స్వామి ఇంటర్యూ ప్రసాదించారు. అందరితో కలిసి ఇంటర్యూ రూంలో కూచున్నారు అన్నయ్య. చిన్నగా నడుస్తూ మందహాసవదనుడై స్వామి అన్నయ్య వద్దకు వచ్చినిలబడ్డారుట. నీకు నేనంటే భక్తి, నమ్మకం, ఏవీ లేవుగా, అందరి బలవంతం మీద వచ్చావుగదూ ! అన్నారట స్వామి.
అవును స్వామీ! నేను జిల్లెళ్ళమూడి అమ్మ భక్తుడను. అమ్మ తప్ప ఇతర దైవం లేదు నాకు అన్నాడు. అన్నయ్య. “సరే బంగారూ! మంచిది. అమ్మ సామాన్యురాలుగాదు. సాక్షాత్తు రాజరాజేశ్వరి అవతారం. అమ్మను నమ్ముకుని హాయిగా జీవించు” అన్నారట స్వామి. పాదనమస్కారం చేసుకుని విభూది ప్రసాదం తీసుకుని గది బయటకువచ్చారుట. ఈ విషయం తరచుగా చెపుతుండేవాడు అన్నయ్య.
- (సశేషం)