1. Home
  2. Articles
  3. Viswajanani
  4. (సంపాదకీయం) అమ్మ రాక అవనికి ఏరువాక

(సంపాదకీయం) అమ్మ రాక అవనికి ఏరువాక

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

ఆవిర్భావం అంటే పుట్టుక, అవతరణ అంటే దిగిరావడం.

తొమ్మిది లేదా పదినెలలు తల్లి గర్భంలో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ ఈ భూమి మీదకు రావడం జననం లేదా పుట్టుక, అంటే అప్పటివరకు మన కంటికి కనిపించకుండా తల్లి గర్భంలో ఉన్న బిడ్డ, మనందరికీ, కనిపించే విధంగా బయటకు రావడమే అవిర్భావం.

అవతరణ అంటే దిగి రావడం. ఎక్కడ నుంచి? ఒక విశ్వవ్యాప్తమై ఉన్న శక్తి ఒక పరమ ప్రయోజనాన్ని సాధించడం కొరకు ఒక పరిమిత ఆకారంతో భూలోకానికి దిగి రావడమే అవతారం. విష్ణుమూర్తి ధరించిన అవతారాలలో శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలు పరిపూర్ణ అవతారాలుగా చెప్తారు. అందులోనూ శ్రీరాముని ధర్మావతారంగా, శ్రీకృష్ణుని లీలావతారంగా పేర్కొన్నారు. వారి అవతార ప్రయోజనం పూర్తికాగానే వారి అవతార పరిసమాప్తి జరిగింది.

ఆంగ్ల కాలమానం ప్రకారం 1923 మార్చి 28వ తేదీ, తెలుగు పంచాంగం ప్రకారం రుధిరోద్గారి, చైత్ర శుద్ధ ఏకాదశి, బుధవారం ప్రాతఃకాలంలో లోకంలోని చీకటిని తొలగించే సూర్యభగవానుడి రాకకు ముందు, లోకంలో ప్రేమ దీపాన్ని ప్రకాశింపచేసే ‘అవ్యాజకరుణామూర్తి’గా, ప్రేమరూప’గా అమ్మ ఆవిర్భవించింది. ఆదిశక్తి అమ్మగా అవతరించింది.

మన్నవ గ్రామంలో ఆ గ్రామకరణమైన సీతాపతిశర్మ, రంగమ్మ దంపతులకు పుట్టిన అమ్మను అనాడు ఎవ్వరూ అసామాన్యమైన ఆడపిల్లగా గుర్తించలేదు. అయితే అమ్మ పుట్టుకకు పూర్వం నుంచీ ఆ దంపతులకు ఏవేవో దృశ్యాలు కనిపించి కనుమరుగవుతుండేవి. వాటికి తమ శారీరక, మానసిక బలహీనతలే కారణ మనుకున్నారు కానీ, కారణజన్మురాలి జన్మకు తాము కారకుల మవుతున్నామని ఊహించలేకపోయారు. అలాగే, అమ్మ పుట్టినప్పుడు మంత్రసాని ‘గొల్లనాగమ్మకు గాని, కాలక్రమంలో ఇతరులకు గాని కనిపించిన, అనిపించిన వన్నీ తమ తమ శారీరక, మానసిక బలహీనతలుగానో, అధ్యాత్మికతలకు నిదర్శనాలుగానో భావించారే తప్ప అమ్మ అసాధారణతకు దర్పణాలని తెలుసుకోలేకపోయారు.

మొగ్గ పుష్పమై వికసించినట్లుగా క్రమంగా అమ్మలోని దివ్యమాతృత్వం తన పరిమళ లహరులను విశ్వవ్యాప్తం చేయసాగింది. అది లోకానికి అవ్యాజ్యా ప్రేమకు దారిచూపటానికే అదే అమ్మ అవతరణకు లక్ష్యం కదా! మాటలు వచ్చీరాని వయస్సులోనే తన తల్లితో “నీవు లేనప్పుడు నేనే తల్లినై ఉంటాగా!” అని సెలవిచ్చింది. బుల్లితల్లి, అందుకే “తల్లి అంటే తొలి” అని నిర్వచించింది అమ్మ.

“భూమికి జానెడెత్తున లేవు” అని చిదంబరరావు, తాతగారంటే, “లోపలగానా, జయటగానా” అని ప్రశ్నించి భూభారం వహించే శక్తి గల తల్లిగా తన్ను తానే ప్రకటించుకున్నది.

చిన్నపిల్లగా ఉన్న అమ్మ మాటలలోని సర్వజ్ఞత్వానికి అశ్చర్యపడిన చిదంబరరావు తాతగారు… ” నీవు ఆదిశక్తిని, లోకజననివి’ అని అప్పుడే ప్రస్తుతించారు. అంతేకాదు… రంగమ్మ తల్లి గర్భాన ‘రత్నగర్భ’ ఆవిర్భవించింది. అని హర్ష పులకితగాత్రులైనారు.

తాతగారు అనడం కాదు. అంత చిన్న వయస్సులోనే అమ్మే స్వయంగా ప్రకటించింది. తన తల్లి తండ్రిగారైన వెంకటసుబ్బారావు తాతగారితో “నేను సర్వ సృష్టికారిణిని” అని చెప్పిన అమ్మ సాక్షాత్తూ అదిపరాశక్తియే. అయితే, అమ్మ అవతార ప్రయోజనం ఏమిటి? అంటే అమ్మే చెప్పిందిగా…. “తల్లి ధర్మం చూపించటానికి తన ఈ రాక” – అని. అయితే- ఏమిటి తల్లి ధర్మం? అంటే తన బిడ్డ అందరిపట్ల తారతమ్యం లేని ప్రేమను పంచడం. అమ్మ ఈ ధర్మాన్ని తు.చ. తప్పకుండా ఆచరించి చూపించింది. “నేను నీకు, మీకు, అందరికి ఈ పశుపక్ష్యాదులకు, క్రిమి కీటకాదులకు తల్లిని” అని ప్రకటించడమే కాక మానవులమైన మనలో కూడా గుణభేదం, కులభేదం పాటించకుండా తన ప్రేమ నందించింది. అంతేకాదు. పశువులను, పక్షులను, క్రిమికీటకాలను సైతం నిండు మనస్సుతో ప్రేమించింది.

ఈ ఏప్రిల్ నెలలో 19 వ తేదీన మన అమ్మ పుట్టినరోజు. అందరింటిలో అమ్మ పుట్టినరోజు వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి. మన మందరము వేడుకల్లో పాలుపంచుకుని మన ‘అందరి అమ్మ’ ప్రేమామృతవర్షధారలలో తడసి ముద్దవుదాము.

“నేను నేనైన నేను”ను

అన్నీ తానైన అమ్మను

ఏ పూల పూజింతునూ

ఏ రీతి నర్చింతునూ”

  • మల్లాప్రగడ శ్రీవల్లి

 

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!