“జననములేక కర్మముల జాదలఁబోక సమస్తచిత్త వ
ర్తను డగు చక్రికిన్ కవు లుదార పదంబుల జన్మ కర్మముల్
వినుతులు సేయ చుందుదురు; వేదరహస్యములందు నెందు జూ
చిన మణిలేవు జీవునికి చెప్పిన కైనది జన్న కర్మముల్” (భాగ-1-68)
పుట్టుకలేనివాడు, కర్మలతో పనిలేనివాడు పరమాత్మ అనీ, అయినా కవులు చమత్కారంగా ఆ పరమాత్మ పుట్టినట్లు, ఎన్నో కర్మలు చేసినట్లు చెప్తూ ఉంటారు. జీవుని కున్నట్లుగా జన్మ, కర్మలు పరమాత్మకు లేనే లేవని వేదం చెప్పనే చెప్పింది.
అందుకే, “జన్మ కర్మ చ మే దివ్యం” అని గీతలో పరమాత్మ వివరించాడు. తన పుట్టుక, కర్మ కలాపాలు మానవాతీతమైన దివ్య లీలలని స్పష్టం చేశాడు పరమాత్మ.
మహాత్ముల పుట్టుక ఇలాంటిదే. 1923 మార్చి 28 వ తేదీన చైత్రశుద్ద ఏకాదశినాడు ‘అమ్మ’ పుట్టిందని మనం వేడుకలు చేసుకుంటున్నాం. కాని, యథార్థం పరిశీలిస్తే, ఆనాడు అమ్మ పుట్టినట్లు కనిపించింది. మనందరికీ అనిపించింది. అంతే.
“దేశ కాలా పరిచ్ఛిన్నా” అని లలితా సహస్రనామస్తోతంలో లలితాదేవిని కీర్తించారు. హయగ్రీవుల వారు, అమ్మ దేశకాల అపరిచ్చిన్న, ఒక ప్రదేశానికీ ఒక కాలానికీ కట్టుబడి ఉండవలసిన అవసరం లేని అప్రమేయ దివ్యశక్తి అమ్మ. మానవాతీతమైన దివ్యశక్తి మానవరూపంలో వ్యక్తం కావటం ఒక దివ్య లీల.
అమ్మ పుట్టుక కూడ అలాంటిదే అని పుట్టినప్పుడు జరిగిన సంఘటనలన్నీ స్పష్టంగా చెప్తున్నాయి.
రామ, కృష్ణాది అవతారాలలో కూడ ఇలాంటి విశేషం కనిపిస్తుంది.
“తతస్తు ద్వాదశే మాసే – చైత్రే నావమికే తిధౌ” అని శ్రీరాముని పుట్టుకను వర్ణించారు మహర్షి వాల్మీకి.
కౌసల్యాదేవి గర్భంలో పన్నెండు మాసాలున్నాడు పరమాత్మ. మాతృ గర్భంలో పన్నెండు మాసాలుండటం మానవాతీమైన దివ్య లీల కాదా? “ఆవిరాసీత్ యధా ప్రాచ్యాం దిశ ఇందురివ పుష్కల” అని శ్రీకృష్ణుని పుట్టుకను వర్ణించారు వ్యాసులవారు. తూర్పున చంద్రుడు ఉదయించినట్లుగా శ్రీకృష్ణుడు దేవకీదేవి గర్భంలో ఆవిర్భవించాడు – అన్నారు.
ఆవిర్భవించటం అంటే పుట్టటం కాదు. అందరికీ కనిపించటం, చంద్రుడు తూర్పున మనకు కనిపించటమే కాని, అప్పుడు పుట్టటం కాదు కదా!
అమ్మ పుట్టిందని చెప్తున్న ‘ఆ నాటి’ సం’ఘటన’లన్నీ అమ్మది అవతరణమే గాని, పుట్టుక కాదని చెప్పకనే చెప్తున్నాయి.
ఆ సమయానికే గడియారం ఆగిపోవటం, బొడ్డు తోద్దామని వచ్చిన మంత్రసానికి చాకు త్రిశూలంలా కనిపించటం మొదలైన సంఘటనలన్నీ దైవ ఘటనలే. పుట్టుకే లేని శక్తి పుట్టినట్లు కనిపించటం ఒక దివ్యలీల అని ఆ సన్నివేశాలన్నీ నిరూపిస్తున్నాయి.
ఆవిర్భావాన్నే ‘అవతరణం’ అని కూడా అంటారు. ‘అవతరించటం’ అంటే ‘దిగిరావటం’. ఏ దివ్య లోకాలలోనో ఉన్న ఆదిశక్తి మానవరూపాన్ని ధరించి భూమిపైకి ‘దిగిరావటం’ అవతరణం.
అయితే, అమ్మ అలా ఎందుకు అవతరించింది అని ఆలోచిస్తే, మానవుల మధ్య మానవిగా పుట్టి, మన వలె కష్ట సుఖాలు అనుభవిస్తూ, మనం మెలగవలసిన తీరు తెన్నులను ఆచరించి చూపించటానికే అని మనకు తెలుస్తుంది.
స్వ, పర భేదం లేకుండా చిన్ననాటినుంచీ అందరినీ అవ్యాజంగా ప్రేమించటం, తనకు అపకారం తలపెట్టిన వారిపట్ల కూడా అపార కరుణనే కురిపించటం, అంతరంగంలోని దివ్యప్రేమను సేవగా మలచుకొని దీనులను, హీనులను, బాధాసర్పదష్టులను లాలించి పాలించటం చూడగా పెట్టటం, పంచటం మనకు నేర్పటమే అమ్మ అవతారానికి లక్ష్యం అనిపిస్తుంది.
స్వార్థంతో, సంకుచిత స్వభావంతో, రాగద్వేషాలతో సతమతమవుతూ, బాధపడుతూ, బాధపెడుతూ బ్రతుకుతున్న మనకు జీవితం ప్రేమమయమనీ, సుఖదుఃఖాలకు అతీతమైన ఆనందమే మన అసలు స్వరూపమనీ తన జీవనవైఖరి ఆధారంగా నిరూపించటానికే అమ్మ దిగివచ్చిందని అనిపిస్తుంది.
మంచిని మించిన మహిమలు లేవనీ, తనకున్నది తృప్తిగా తింటూ, ఇతరులకు ఆదరంగా పెట్టుకోవాలనీ, తన బిడ్డయందు చూస్తున్నదే అందరియందు చూసే బ్రహ్మస్థితిని ఆచరణద్వారా అందుకోవచ్చుననీ, సత్యాన్ని గమనిస్తే ‘తనకంటే’ భిన్నంగా ఈ లోకంలో మరేమీ లేదని గుర్తించి, అందరిపట్ల మమతా సమతలతో మెలగవచ్చుననీ, ఆచరించి చూపించటానికే అమ్మ అవతరించింది అని మనకు తెలుస్తుంది.
ఈ విధమైన పరమ సత్యాలపట్ల మనకు అవగాహన కలిగించటానికి, సహనమనే దేవతను బాధలనే పూజాద్రవ్యాలతో ఆరాధించటం మనకు నేర్పటానికీ, దేవులాడినా దొరకని ఆ దేవుడు, ఎంత వెతికినా හධි తప్ప మరేమీ లేని సర్వవ్యాపకుడై ఉన్నాడని మనకు ప్రబోధించటానికి అమ్మ ‘దిగివచ్చింది’.
జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ, తరణోపాయం కోసం అన్వేషిస్తూ, ఏవేవో సాధన మార్గాలకోసం ఆరాటపడుతూ, వాటిని నిర్వహించే సామర్థ్యం చాలక వేదనపడుతూ, నిరాశానిస్పృహలతో కొట్టు మిట్టాడుతున్న మనకు సులభము, ఆచరణ సాధ్యము, యథార్థము అయిన ప్రేమతత్త్వాన్ని, సేవాతత్పరతను ఆచరించి ప్రబోధించటానికే అమ్మ అవతరించిందని మనం గుర్తించవచ్చు.
జీవితంలో కొంతభాగం ‘సాధన’ అని కాక, జీవితమే సాధన అని, పరిసరాలే గురువు అని, జీవిత సన్నివేశాలను సాధనకు సోపానాలుగా గుర్తించి తరించవచ్చునని ఆచరించి చూపించింది అమ్మ.
నామరూపాలకు అతీతమైన దివ్యశక్తి నామరూపాలు ధరించి దిగిరావటం మనకోసమే.
మన ‘భవ’తరణం కోసమే అమ్మ అవతరణం.