1. Home
  2. Articles
  3. Viswajanani
  4. (సంపాదకీయం) శ్రీ సీతారాములు

(సంపాదకీయం) శ్రీ సీతారాములు

A V R Subramanyam
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : March
Issue Number : 8
Year : 2024

శ్రీరామచంద్రునిగా అవతరించాడు శ్రీ మహావిష్ణువు, లోకకంటకుడైన రావణుని వధించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై- 

‘సీతా లక్ష్మీః భవాన్ విష్ణుః దేవః కృష్ణః ప్రజాపతిః |

వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుమ్ ॥ (శ్రీమద్రామాయణం, యుద్ధకాండ, 117వ సర్గ) 

సీతాసాధ్వియే లక్ష్మీదేవి, నీవు శ్రీ మహావిష్ణుడవు, రాబోవు ద్వాపరయుగములో దుష్టశిక్షణకై శిష్టరక్షణకై అవతరించు శ్రీ కృష్ణభగవానుడవు నీవే. దుష్టుడైన రావణుని వధించుటకు మానవ రూపములో అవతరించినావు’ అని ప్రస్తుతించారు. అంతేకాదు. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు, సర్వభూతహితుడు, అనసూయా రహితుడు, ఆత్మనిష్ఠుడు…. అని రాముని కళ్యాణగుణాల్ని ఉటంకిస్తూ ధర్మస్వరూపుడని శ్లాఘిస్తాం.

అమ్మ శ్రీమద్రామాయణాన్ని తన సన్నిధిలో పండితులచే చదివించి సకల శ్లోక తాత్పర్యాన్ని విన్నది, వినిపించింది. అవసరమగుచోట పండితుల వివరణను సరిదిద్దింది.

ఇటు ఏకపత్నీ వ్రతదీక్షకు శ్రీరాముని, అటు పాతివ్రత్య గరిమకు సీతామాతను పూజిస్తాం. ఆ నడవడి మానవ జాతి మనుగడకి జీవం, ఆదర్శం అని సంభావన చేస్తాం.

అట్టి సీతారామ తత్త్వాన్ని సుబోధకం చేస్తూ అమ్మ – “ఆ సమయంలో ఆ అవతారం అవసరమయింది. ఆ రాముడు పరిమితి గల రాముడుగా, విరామంలేని దానిలోనుంచి అవతరించాడు. తనలో ఉండే శక్తి సీతై, ఆ సీతే లోకమాతై, ప్రకృతై, వికృతై, సర్వసాక్షియై, సర్వం ఆరామమై, విరామంలేనివారుగా ప్రపంచానికి వారి ధర్మాన్ని పంచిపెట్టారు వారే సీతారాములు.” – అని స్పష్టంచేసింది.

రామునివంటి తనయుడు, రామునివంటి భర్త, రామునివంటి సోదరుడు, రామునివంటి తండ్రి, రామునివంటి ప్రభువు, రామునివంటి స్నేహితుడు, రామునివంటి శత్రువు, రాముని వంటి శిష్యుడు చరిత్ర పుటల్లో మచ్చుకైనా కానరాడు.

“విరామం లేనిది రామం” అని అమ్మ అపూర్వంగా నిర్వచించింది. దేనికి విరామం లేదు? మానవ శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలకు విరామం లేదు; హృదయ స్పందనకి రక్తప్రసరణకి విరామం లేదు; ఈశ్వరానుగ్రహానికి విరామం లేదు, పరాత్పరి దీనజనావన తత్త్వానికి, తరతమ భేదంలేని సముద్ధరణ తత్త్వానికి విరామం లేదు; పిపీలికాది బ్రహ్మ పర్యంతం స్థావర జంగమాత్మక సృష్టిలోని గ్రహాలు- గ్రహరాజులు, నదీనదాలు, సకలప్రాణుల తమ తమ విధ్యుక్త ధర్మాచరణకి విరామం లేదు; మూలకారణశక్తి యొక్క సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహదివ్య విభూతులకు విరామం లేదు. అట్టి సమతౌల్యాన్ని పరిరక్షించే సమన్వయశక్తి సంచాలక శక్తే ‘రామం’. అంటే పరతత్త్వం.

కనుకనే అమ్మ అంటుంది “అన్ని వేళలందూ నీ వెన్నంటి ఉండేది భగవంతుడు మాత్రమే. ఆ శక్తి కనపడదు, కనిపెడుతుంది” – అని.

“రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః” అంటూ శ్రీరాముని బాహ్యసౌందర్యానికి ముగ్ధులవుతాం, ‘రక్షితా జీవలోకస్య ధర్మస్యచ పరంతపః’ అంటూ అంతస్సౌందర్యానికి, రామతత్వానికి దాసోహం అంటాం.

‘సీతారాములు’ ఇరువురు వ్యక్తులు కారు, ఒక్కరే. ఆ వాస్తవాన్ని స్పష్టంచేస్తూ అమ్మ ‘రామునిలో ఉండే శక్తే సీత’ అన్నది. ఈ వివరణ అర్ధం కావాలంటే “వస్తురూపం పురుషుడు, దానిలో ఉన్న శక్తి స్త్రీ” అనే అమ్మవాక్యం ముందుగా బోధపడాలి.

సీతాసాధ్వి పరాక్రమం : కోదండరాముని సత్యపరాక్రమం లోకానికి విదితమే. సీతాసాధ్వి పరాక్రమం, సంహారక శక్తి గురించి కూడా తెలుసుకోవాలి. లంకలో రావణుని చెరలో అశోకవృక్షం క్రింద ఉన్న సీతామాతను వర్ణిస్తూ వాల్మీకి మహర్షి

‘ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ |

పరిక్షీణాం కృశాం దీనామ్ అల్పాహారాం తపోధనామ్ ॥ (సుందరకాండ, 19వ సర్గ)

సీతాదేవి ఉపవాసములతో, శోకముతో, నిరంతర ధ్యానంతో, భయముతో, నామమాత్రాహారంతో తపోవ్రత నియమపాలనతో మిక్కిలి క్షీణించి, కృశించి, దీనయై ఉండెను’ – అని.

లోతుగా అధ్యయనం చేస్తే- ఆ తల్లి ఒకనాటికి శ్రీరాముని పొందు కలుగుననే ఆశతో జీవిస్తోంది. రామ దర్శనార్థియై ధ్యానం చేస్తోంది, తపిస్తోంది. భయం ఎందుకు? రావణుని శక్తిని చూసికాదు. రామదర్శన భాగ్యం పొందకనే శరీరం చాలించవలసి వస్తుందేమో! – అని.

రావణుని కపటోపాయాలు, బ్రహ్మదత్తమైన వరప్రసాదలబ్ధ శక్తులు అంటే సీతామాతకు భయంలేదు. రావణుడు రూపయౌవన సంపదతో, సిరిసంపదలతో, బలదర్పంతో సీతాదేవిని ప్రలోభపెట్ట చూస్తే ఆమె అతనికి ఒక హెచ్చరిక చేస్తుంది.

‘అసందేశాత్తు రామస్య తపసశ్చాను పాలనాత్ |

న త్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజసా ॥ (సుందరకాండ, 22వ సర్గ)

ఓ దశకంఠా! నీవు భస్మము చేయదగిన వాడవు. నా తపః ప్రభావమునను, పాతివ్రత్య మహిమచేతను నేను నిన్ను అట్లు చేయగలను. కాని, అందులకు నాకు రామాజ్ఞ లేదు. కనుక బ్రతికి పోయావు’ సీతాదేవి ఒక వ్యక్తి కాదు, మహాశక్తి, శ్రీరామతేజస్సు. అని.

ఈ సత్యం పతివ్రతాశిరోమణి అమ్మపట్ల అంతే సత్యం. అమ్మ ప్రేమరూపిణి, వాత్సల్యామృత వర్షిణి, అతి వర్ణాశ్రమి. నిజం. అంతేకాదు. సమయం వస్తే మహాకాళి, మహిషాసుర మర్దని. తపస్వుల సంహారకారక శక్తిని విశదంచేస్తూ కణ్వమహర్షి అంటారు. “శమప్రధానేషు తపోధనేషు గూఢం హి దాహాత్మక మస్తి తేజః” అని. శమదమాది షడ్గుణైశ్వర్య సంపన్నులైన తపోధనులలో దహించివేసే శక్తి ఉంటుంది. అది పైకి కనబడదు, వారిలో గూఢంగా ఉంటుంది – అని,

అందుకు అమ్మ జీవితంలో ఒక సందర్భాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఒకనాడు జిల్లెళ్ళమూడిలో రెండు వర్గాలమధ్య ఘర్షణ మొదలయింది. కత్తులు, బరిసెలు, గొడ్డళ్ళు ఉవ్వెత్తున లేచాయి. అమ్మ భర్త (నాన్నగారు) కరణంగారు; కావున ఇరువర్గాలను శాంతపరచే నిమిత్తం నిలబడితే, ఒకరు వారిని పడద్రోశారు. ఆ వార్త విన్న వెంటనే అమ్మ శరవేగంతో రణస్థలికి వెళ్ళి కళ్ళు ఎఱ్ఱచేసి, “కొట్లాటకు దిగుతారా ? మీరంత మొనగాళ్ళా? ఏదీ, ఒక్క అడుగు ముందుకు వెయ్యండి చూద్దాం” అని ఉరిమింది. అంతే. ఇరుపక్షాలవారు నోరు మెదపలేదు, కాలు కదపలేదు. స్థాణువులల్లే నిశ్చేష్ఠులైనారు. వారు కాలు కదిపితే, అమ్మ అగ్నినేత్రాన్ని తెరుస్తుంది. వారు భస్మీపటలం అవుతారు.

సీతారాములు, అమ్మ – నాన్నగారలు, పార్వతీపరమేశ్వరులది అర్థనారీశ్వర తత్త్వం, అవినాభావసంబంధం, శివశక్యైక్య రూపం. అమ్మ, నాన్నగారలు ఒకటేనని అమ్మ తన బాల్యంలో సందర్భవశాన నృసింహోపాసకులు లక్ష్మణాచార్యుల వారికి స్పష్టంచేసింది. లక్ష్మణాచార్యుల వారి ఇంటినుండి వస్తూండగా దారిలో ఆచార్యులు గారు అమ్మ మధ్య పెద్దత్రాచు నిలుచుని ఉన్నట్లు కనపడింది. వారు భయవిహ్వలురైనారు. అప్పుడు అమ్మ, “ఇది మామూలు సర్పం కాదు, నాయనా! నాగేంద్రుడు. ఆ నాగేంద్రుడే నన్ను చుట్టుకుని ఉన్నాడు. నేను నాగేంద్రుడిని చుట్టించుకున్నాను. ఆ నాగేంద్రుడే నాగేశ్వరుడై (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు) వస్తాడు. వాడే నా కాధారం. వాడి ఆకారమే నేను”- అని,

శ్రీరాముడు పితృవాక్య పరిపాలన కోసం కిరీటాన్ని త్యజించి వనవాసంచేశాడు. జనవాక్యంతు కర్తవ్యం అని ప్రాణాధికంగా ప్రేమించిన ధర్మపత్నిని పరిత్యజించాడు. ధర్మాన్ని స్థాపించాడు.

లోకకళ్యాణార్థం అమ్మ కన్నబిడ్డను కర్పూరహారతి పట్టింది. కామితార్థప్రదాయినిగ ఆలయంలో ప్రతిష్ఠించింది. అంతేకాదు. తన ఆరాధ్యదైవం సర్వస్వం అయిన పతిదేవుని ఆలయప్రవేశం చేయించింది; తన మంగళసూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది; మాతృధర్మం కోసం నిలిచింది.

పరాత్పరి అమ్మ, శ్రీరామచంద్ర పరబ్రహ్మము ఇరువురూ “న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్త్వ మానశుః” అనే శ్రుతివాక్య సారంగా నిలిచారు.

భారతప్రధాని గౌ॥శ్రీ నరేంద్రమోదీ చేతులమీదుగా శ్రీరామచంద్రుడు అవతరించిన అయోధ్యానగరంలో రామభక్తులు నిర్మించుకున్న రామమందిరంలో 22-01-2024 న శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగటం భారతదేశచరిత్రలో ఒక సువర్ణాధ్యాయం; ఆర్ష సంస్కతికి హైందవజాతి విశ్వాసానికి ప్రాణప్రతిష్ఠ.

– ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!