“అమ్మ”తో పరిచయమైన తరువాత సోదరీ సోదరులందరి జీవితగమనంలో “అమ్మ” బాసట అడుగడుగునా ప్రస్పుటంగా ఉంటూనే ఉంటుంది. ఎటొచ్చీ వాటి గమనం కొంత దూరం పోయిన తరువాత వెనుదిరిగి చూసుకొని విశ్లేషణ చేసుకోవాలి.
మనకు చాలామంది సోదరీసోదరుల అనుభవాల సంపద, సోదరి కుసుమగారి కలం నుండి, సోదరుడు. రావూరి ప్రసాద్ గారి సేకరణ నుండి పుస్తకరూపంలో మన మధ్య ఉన్నవి. కాని “అమ్మ”ను నమ్ముకుని బ్రతికే సోదరీ సోదరుల జీవినగమనంలో ప్రతిదినమూ ఒక అనుభవమే.
ఈ నేపథ్యంలో, “అమ్మ”తో నా 50 సంవత్సరాల పరిచయథాభాగ్యంలో బహుక్లుప్తంగా జరిగిన జరుగుతున్న సంఘటనల కూర్పే ఈ నా వ్యాసం.
1) నేను ఉమ్మడి హైకోర్టులో పనిచేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్ క్యాడర్లో రిటైర్ అయినాను. నేను ఒకప్పుడు Accounts Section లో పనిచేస్తూ 1983-84 ప్రాంతంలో దాదాపు ఒక లక్ష రూపాయల లావాదేవీలతో ఉన్న సమయంలో ఒకరోజు Lunch Break లో నా Desk కు తాళంవేయడం మరచిపోయి, సగం తెరచి ఉన్న స్థితిలో, బయటకు వెళ్ళి 40 నిమిషముల తరువాత సెక్షన్‌కు వచ్చినాను. నేను వచ్చే సమయానికి నా Desk వద్ద ఒక కుక్క తచ్చాడుతూ ఉండడం, నా Desk సగం తెరచి ఉండి Cash bag భద్రంగా ఉండడం, వెనుక “అమ్మ” రక్షణ ప్రచ్ఛన్నంగా ఉందనే భావించినాను. అది సొమ్ముపోవడమే కాక, నా నిజాయితీకి ఉద్యోగ భద్రతకు సంబంధించిన విషయము.
2) “అమ్మ” వద్దకు ఏవేవో నిరాధారమైన భయాలతో వెళ్ళి “అమ్మ”కు చెప్పుకుంటే “నెలకు (అప్పటిలో) రూ.25/- పంపరా, నీకేమీ ఉండదు” అని హామీ పొంది. నా 38 సంవత్సరాల సర్వీసులో ఎన్నెన్నో ఉపద్రవపరిస్థితులు ఎదురయ్యి, దూదిపింజలువలె ఎగిరిపోయినవి. సత్యనిష్ట గురించి, “అమ్మ” చెప్తూ, “సత్యం ముందు ఆ దైవంకూడ తక్కువేరా అని, “అమ్మ” మీద భక్తి మీకు ఉన్నది. “అమ్మ” మీ వెనుకనే ఉన్నది. అన్న హామీకూడ పొందినాను. దాదాపు 20, 25 సంవత్సరాలుగా హాస్యానికి కూడ అనృతం చెప్పక, మనసా, వానా, అంతఃకరణకి విరుద్ధంగా లేని జీవనం అలవాటయ్యి, ప్రతి సంఘటన వెనుక “అమ్మ” ఉన్నదనే భావనాబలం ఉన్నది. దాదాపు 10, 15 మంది న్యాయమూర్తులు నేనంటే అభిమానం చూపడం, ఎన్నో క్లిష్టమైన సెక్షన్లలో పనిచేసి, ఎంతో ఖ్యాతి గడించిన దాని వెనుక “అమ్మ” అనుగ్రహం, ఆశీర్వచనం స్పష్టం.
3) మా శ్రీమతికి 1993 సంవత్సరంలో రెండవ కాన్పు, 8 వ నెలలో కాన్పు భంగం అయినది. అ సందర్భంలో డాక్టర్లు అయితే పెద్ద ప్రాణానికి కూడ హామీ యివ్వలేకపోయినారు. ఆ రోజు అపరేషన్ థియేటర్‌కు Strech పైన వెళ్తున్న మా శ్రీమతి చూపుకు ప్రత్యక్షంగా “అమ్మ” పై నుంచి, కూడావస్తూ, “ఒక్క గంట అరగంట ఓర్చుకో అమ్మా!” అంటూ కూడా వచ్చి మా శ్రీమతికి ప్రాణగండం. నుండి కాపాడిన విషయం “అమ్మ” మనవెంటనే ఉన్నదన్న విషయానికి ప్రత్యక్ష నిదర్శనము.
చివరకు 6-11-2019 తేదీన, మేమిరువురమూ ప్రయాణిస్తున్న Taxi ఘోర ప్రమాదంలో చిక్కుకుని, Driver spot లోనే ప్రాణం విదువగా, మా శ్రీమతి నా ఒడిలో తలయుంచి, పుణ్య కార్తీకమాన, శుద్ధదశమినాడు, అనాయాసంగా అసువులను “అమ్మ”యందు విలీనపరచినది. నేను మాత్రం పూర్తి స్పృహకోల్పోయి, 10 రోజుల పిదపనే మా శ్రీమతి నిర్మాణ విషయం తెలుసుకోగలిగినాను.
దాదాపు నాకు 4 ఆపరేషన్స్ జరిగి, డాక్టర్లు చెప్పినా, “అమ్మ” కృపవలన, 4 వ నెలనుండియే కొద్దికొద్దిగా లేచి, తిరుగుతూ దాదాపు ఒక సంవత్సరం తరువాతనుండీ ఇంటివద్ద నా పూజాభిషేకార్చనలన్నీ యథావిధిగా నిర్వహించుకుంటున్నాను. ఈ కష్టంలో రవి అన్నయ్య, భార్య మా ఇంటికి వచ్చి స్వయాన పలుకరించడమే గాక, ఐ.రామకృష్ణ గారిని హాస్పిటల్‌కు పంపినారు.
తాలుమాటలేని, “అమ్మ” నాకు 1978 సం॥రంలోనే ఈ విషయాలన్నీ, ఏలూరు రామకృష్ణ మాష్టారి వంకనా, సోదరుడు నదీరా వంకన, నాకు ముందుగనే సంకేతం ఇచ్చినది. అపుడే చెప్పినది “జిల్లెళ్ళమూడి అనుకున్నపుడల్లా రాలేరు ఈ వాతావరణం మీ వద్దనే కలుగజేసుకోవాలనే సత్యం. అపుడు హైమాలయంలో జరిగే అర్చన, నిత్యం ఏకవారరుద్రాభిషేకం, శ్రీలలితా ఖడ్గమాలా, “అమ్మ” ఖడ్గమాల, త్రిశతీ, సహస్రనామార్చన, “అమ్మ” హైమల అష్టోత్తరశతనామార్చనలతో మా ఇల్లే అర్కపురి పుణ్యస్థలి.
ఇంక కుల, మత ప్రసక్తి అనేది మన సోదరులెవరి ఇంట ఉండవనే సంగతి ప్రస్తావించే పనిలేదు.
ఆ Accident నన్ను తీసుకుని పోయి, మా శ్రీమతిని ఉంచియుంటే, ఈ బంధువులందరూ, రాబందులే, లేనిపోని తతంగంతో ఆడపండితుల దాష్టీకానికి ఆమె బలియై ఉండేది. ఆ ఆవశ్యకత లేక, ఆమెను తనయందే చేర్చుకుని ఆ గందంనుంచి గట్టెక్కించినది.
4) ఒకపుడు రవి అన్నయ్య పద్మారావునగర్‌లో 2వ శనివారముల పూజాసమయంలో నేను వెళ్ళే దారిలో కోతుల సమూహం అడ్డగించబోగా. 60 సం||ల ముదుసలి ఒకామె, కర్రతో వాటిని అదిలించినది, మరల తిరిగి వచ్చే సమయంలో చేతినిండా ప్రసాదాలతో తిరిగివస్తున్నా వాటి జాదయే లేదు. ఈ విధంగా రాజుబావ చెప్పినట్లు “అడుగడుగు గండాలు గడియలో తొలగించే సురపారిజాతాలు” “అమ్మ” పాదకమలాలు,
ఈ విధంగా ‘ఒక సూర్యుందు సమస్తజీవులకు తానొక్కక్కడై తోచు’ అన్న పోతనగారి మాటతీరులో, “అమ్మ”ను నమ్మిన వారేగాక, “అమ్మ” కృపాదృష్టిపడినవారందరూ. “అమ్మ” రక్షణకవచంలోనే ఉంటారసడానికి సందేహం ఏమీ లేదు.
“అమ్మ” చెప్పినట్లు ఆ సముద్రంలోని కెరటాలవలె, మన జీవితాలు మనమూ “అమ్మ” సంకల్పంతోనే “అమ్మ”లోనికేనని ఈ భావం కలిగినవానికి, ఈ దేహం చావుపుట్టుకలకు ఆటంకం కాదనే సత్యం బోధపడి, జనన – మరణాల గురించి కృంగు పొంగులు లేని, సర్వద్వంద్వ క్షయంకరి అయిన “అమ్మ” ఆశీస్సులే మనందరకూ ద్వంద్వార్థ డిండిమమైన ఈ సంసారసాగరం నుండి తరించే నావ అని బోధపడుతుంది.