“సత్యము, జ్ఞానము, ఆనందము రూపంగా గల శ్రీమాత ‘సత్యజ్ఞానానందరూప’ అని శ్రుతులు ప్రకటిస్తున్నాయి…” – భారతీవ్యాఖ్య.
సత్యము అంటే అబద్ధము కానిది అని సర్వసాధారణంగా మన మనుకునే మాట. సత్య మంటే నిత్యమైనది. అంటే ఎప్పుడూ ఉండేది. జ్ఞాన మంటే తెలివి, ఎఱుక. పరతత్త్వాన్ని గురించి తెలుసుకోగలగటం. ఆనందం. అంటే పారమార్ధిక విషయాసక్తిలో మనసు పొందిన దివ్యానుభూతి. సత్యమూ, జ్ఞానమూ, ఆనందమూ తన రూపంగా కలిగిన శ్రీమాత ‘సత్యజ్ఞానానందరూప’. “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” అనే ఉపనిషద్వాక్యం బ్రహ్మ పదార్థాన్ని నిర్వచించింది. లలితా సహసం ‘బ్రహ్మా’ అని శ్రీమాతను స్తోత్రం చేసింది. ఆ పరబ్రహ్మమే లలితాదేవి. కనుక ఆ తల్లి “సత్యజ్ఞానానందరూప”.
“అమ్మ” – ‘సత్యజ్ఞానానందరూప’, సత్య మంటే నిర్వచించి, ఆ సత్య స్వరూపాన్ని వివరించి, సత్యమైన వ్రతమంతా తనకే అని ప్రకటించిన తల్లి.
‘సత్యానంద స్వరూపిణి’ అనే వ్యాసంలో (సెప్టెంబర్ నెలలో)… సత్యస్వరూపిణిగా, ఆనందరూపిణిగా “అమ్మ”ను దర్శించాము.
‘జ్ఞానద’, ‘జ్ఞానవిగ్రహ’, ‘జ్ఞానజ్ఞేయస్వరూపిణి’ గా “అమ్మ” ను దర్శించాము. (ఫిబ్రవరి, మార్చి 2017, జనవరి 2020), జ్ఞానరూపిణి “అమ్మ” ను దర్శించే ప్రయత్నమే ఈ వ్యాసం.
“అంతా జీవమయం. నా దృష్టిలో జడమే లేదు” అని ప్రకటించింది “అమ్మ”. అవును. నిజం. “అమ్మ” దృష్టిలో జడ మనేది లేదు.. చిన్నతనంలోనే మినప్పప్పు కడుగుతూ… పొట్టులో, పప్పులో, గిన్నెలో చైతన్యాన్ని చూసిన “అమ్మ” దృష్టిలో జడపదార్థ మేదీ లేదు. తనకు వచ్చిన గడ్డలో బిడ్డను చూసిన తల్లి.
మట్టిగడ్డను ప్రసాదంగా పంచి పెట్టిన తల్లి జ్ఞానస్వరూపిణీయే కదా! మనకు తినదగినవి, తినకూడనివి, తినలేనివి ఉంటాయి. “అమ్మ” కు ఆ భేదం లేదు. గోడకు ఉన్న మట్టి పెళ్ళలను గిల్లుకుని తిన్న తల్లి.
“కనిపించేదంతా దైవం అనుకోవటమే జ్ఞానం” అని చెప్పిన “అమ్మ”… గుడిలో విగ్రహ రూపంలో ఉన్న అమ్మ వారిని… గుడి బయట ఆవరణలో, తాను నడుస్తూ ఉన్న నేలమీద, ఆకాశంలో, చుట్టుప్రక్కలా దర్శించిన జ్ఞానరూపిణి.
“ఇది అని ఎప్పుడు అనిపిస్తుందంటే అది అనుభవించి ఉంటే ఇదే అవుతుంది. మాటలలో కాక క్రియలలో అనుభవించి తెలుసుకోవాలి”.. అని చెప్పిన “అమ్మ” ముందుగా తాను అనుభవించి, మనకు తెలియ చేసింది. అందుకే “అమ్మ” మాట ‘అనుభవాల మూట’,
“అన్ని వేళల్లో మనస్సు ఒక్కటిగా ఉంటే జ్ఞానం వచ్చినట్లే” అనే “అమ్మ” వాక్యానికి “అమ్మే” నిలువెత్తు నిదర్శనం. “అమ్మ” జీవిత మహోదధిలోని ఎన్నో సంఘటనలు, సన్నివేశాలూ “అమ్మ” మనస్సుపై ఎటువంటి ప్రభావాన్నీ చూపలేకపోయాయి.. అనటంలో అసత్యం ఆవగింజంతైనా లేదు. అందుకే “అమ్మ” జ్ఞానస్వరూపిణి.
అనసూయేశ్వరాలయంలో కన్నుల పండుగగా కొలువుతీరిన అర్కపురీశ్వరి అనసూయమ్మను ‘సత్యజ్ఞానానందరూప’ గా దర్శించి, స్మరించి, భజించి, తరించుదాం….