1. Home
  2. Articles
  3. Mother of All
  4. 2015లో మదర్ ఆఫ్ ఆల్ – ఒక సింహావలోకనం

2015లో మదర్ ఆఫ్ ఆల్ – ఒక సింహావలోకనం

Prasad Varma Kamarushi
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 15
Month : January
Issue Number : 1
Year : 2016

నిత్య నూతనంగా నిరాఘాటంగా నడుస్తున్న ఆధ్యాత్మిక పత్రికలలో Mother of Alll ఒకటని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే ఇది జిల్లెళ్ళమూడి అమ్మ తత్త్వచింతనా ప్రబోధ స్ఫూర్తితో వెలువడుతున్న త్రైమాసిక. ప్రారంభ నేపథ్యం :- 1962లో మాతృశ్రీ పేరుతో ఒక సంచిక వేసి అమ్మ జన్మదిన కానుకగా సమర్పించేరు ఆనాటి అనుంగు బిడ్డలు. అలా వరుసగా 4 జన్మదిన సంచికలు వెలుగు చూసేయి. ఆ తర్వాత అది అధరాపురపు శేషగిరిరావు గారి నేతృత్వంలో మాతృశ్రీ అన్న పేరున మాస పత్రికగా రూపుదిద్దుకుంది. ఆ సందర్భంలో ‘ప్రతినెలా యేముంటాయి రాయటానికి’ అన్న నాన్నగారి సందేహమూ, దానికి కొండముది రామకృష్ణన్నయ్య సమాధానం అమ్మ గురించి ఏ ఒక్క అక్షరం వెలుగు చూసినా జ్ఞాపకం చేసుకో దగిన మార్గదర్శక సూత్రం వంటిది. ఆ సమాధానం – “చూసే కన్ను, వ్రాసే పెన్నూ ఉండాలి కాని ఎన్నయినా వ్రాయవచ్చు. అయినా వ్రాసేది మనం కాదుకదా. “వ్రాయించే శక్తి ఆ శక్తి యిచ్చి వ్రాయిస్తుంది”. కారణాంతరాల చేత మాతృశ్రీ 1992లో ఆగిపోయింది. ఆ లోటు పూరించటానికా అన్నట్లు 2000 సం॥లో మొదలయ్యింది Mother of Aill నేటికి పదిహేనేళ్ల టీనేజ్లోకి వచ్చింది. అమ్మ బోధలు, అమ్మ సాహిత్యం, అమ్మ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచానికి అందించే వాహిక Mother of All . ‘నీవు ఎవరి వ్యాసం చూసి నా వద్దకు వచ్చావు?’ అని కోటంరాజు రామారావు గారిని అమ్మ ప్రశ్నించినా, ఇప్పటి కాలమాన పరిస్థితులలో ఇట్టి వాహిక అవసరం ఎంతయినా వుంది. సర్వాంతర్యామి అయిన అమ్మ ఆశీస్సులతో సంస్థలు దినదిన ప్రవర్ధమాన మవుతూ విస్తరిస్తున్నందువల్ల అమ్మ సందేశ వ్యాప్తికి, సంస్థల వార్తలు, విశేషాల ప్రచారానికి ఒక సాధనం అవసరమయిన సందర్భం కనుక ఇట్టి పత్రికలు, ప్రచురణలూ అవసరమే. అమ్మది “సరే” మంత్రం కదా!

చిన్నదో, పెద్దదో ఒక పత్రికను అందునా ఆధ్యాత్మిక పత్రికను క్రమం తప్పకుండా, స్థాపనోద్దేశ్యానికి దూరమవకుండా వెలువరించటమన్నది సామాన్య విషయం కాదు. అది అసిధారా వ్రతం లాంటిది. సాంకేతికంగా చాలా పురోభివృద్ధి జరిగి, ముద్రణ సులభతరమూ, వేగవంతము వంటి సదుపాయాలేర్పడి నప్పటికీ – సకాలంలో పత్రిక వెలువడి పాఠకుల చేతికందే వరకు జరిగే ప్రక్రియలో పెద్దగా వెసులుబాటు లేదు. ఆ కష్టనష్టాలు సహనంతో, సమర్థతతో ఎదుర్కొంటున్న నిర్వాహకులు అభినందనీయులు. ఇక 2015లో వెలువడిన 4 సంచికల గురించి స్థాలీపులాక న్యాయం అంటారే అలాంటి సమాలోచన ఈ వ్యాస ఉద్దేశ్యం.

పత్రికకు ఎడిటోరియల్ నోట్ అందిస్తున్నవారు ప్రొ. శివరామకృష్ణగారు. వారు అమ్మ సాహిత్యాన్ని, తత్వచింతనా వైభవాన్ని ఆంగ్లంలో అందిస్తున్న కొద్ది మంది వైతాళికులలో ఒకరు. వారి ఆంగ్ల, ఆంధ్ర సాహిత్య పరిజ్ఞానానికి, అమ్మత్వ పరిశీలనకు, గీటురాళ్ళయి నిలుస్తాయి వారి ఎడిటోరియల్ నోట్స్, 2015లోని 4 సంచికలలో అమ్మతో సంభాషణలు ఆధారంగా, తమ వ్యాఖ్యా విమర్శలు జోడించి రాసినవి. జనవరి – మార్చ్ సంచికలో కింగ్ లియర్ 3వ కుమార్తె జవాబుకు సమానమైనదంటూ ‘గుండెగొంతుకలోన కొట్లాడుతాది’ అన్న గీత పాదం ఉటంకించారు. అది కృష్ణశాస్త్రి దని పొరబడ్డారు. అది నండూరి వారి ఎంకిపాటల్లోది. ఏకోహి దోషాః

నిలయ విద్యాంసులు శ్రీ దినకర్, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యంగార్ల రచనలు 4 సంచికలలోను ఉన్నాయి. వీరిరువురు అమ్మ పై ఆంగ్ల, ఆంధ్ర భాషలలో రాస్తున్న అలుపెరుగని కలం యోధులు. దినకరన్నయ్య ఆంగ్ల వచనరచనా విన్యాసం మచ్చలేని చంద్రుని వంటిది. వారి ఆంగ్ల పాత్రికేయ అనుభవ నేపథ్యం అడుగడుగునా అక్కరకు వస్తుంది. కేనోపనిషత్ వ్యాసంలో – చేతలు. చేతుల్లో లేవు. భ్రాంతి లేనిదే బ్రహ్మం వంటి అమ్మ వాక్యాలను కేనోపనిషత్ నేపధ్యంలో వివరించే ప్రయత్నం చేశారు. నారికేళ పాకం. కాస్త శ్రమ పడాలి అర్థం చేసుకోడానికి. రాజుబావ అనుభవసారం గురించి రాస్తూ – Raju had the unique fortune of having 1) direct divine interface, 2) deep inner experienc, 3) first person exposure అని చెప్పటం వారి పాటల అంతరార్థాన్ని అర్థం చేసుకోవటానికి ఉపకరించే మాట. ఆ 3 ఉన్నందువల్లనే కదా ‘అనుభవ సారాన్ని’ రసభూయిష్టంగా పిండ గలిగేది. నీ నామమే పావనం అన్న రాజుబావ పాటకు దై హోలీ నేమ్ వ్యాసంలో క్లుప్త సుందర వివరణ ఇచ్చారు. అలాగే అమ్మాస్ మిస్టిక్లో అమ్మ 1946లో జిల్లెళ్ళమూడి రావటం, 1956లో అమ్మత్వం ప్రకటితమై సందర్శకుల సంఖ్య పెరగటం, ఎందరో భక్తులకు తర్కానికందని. అనుభవాలు కలగటం, చివరగా 1971 నుంచి అమ్మతో వారి స్వీయ అనుబంధం, continue being in AMMA’s glorious, singular, unique, nonpareil mystique during this lifetime, అన్న ఆకాంక్షతో ముగించారు. దినకరప్రభ మరీ కాంతిమంతంగా ఉంటే చూడటం కష్టం. మీ వ్యాసాల నిడివి తగ్గించి, బ్రెవిటి పాటించండని ఈ రచయిత చిరకాల విన్నపం మరొకసారి…

అమ్మ తాత్విక చింతనను ఆంగ్లంలో అందిస్తున్న మరొక అనుంగుబిడ్డ, విశ్వజననీపరిషత్ లో క్రియాశీలక కార్యకర్త శ్రీ మోహన కృష్ణ అన్నయ్య. వారు “అన్ సీన్ గైడెన్స్”లో సాధన గురించి అమ్మ వాక్యాల ఆధారంగా కొంత వివేచన చేశారు. అమ్మ దృక్కోణంలో బోధన, ఉపదేశాల వంటివి లేవు. అయితే దానర్థం అమ్మ మౌన మార్గదర్శనం పొందిన వారున్నారు అని వారి వివరణ. జిల్లెళ్ళమూడి ఆధ్యాత్మిక కేంద్రంగా విస్తరిస్తున్న వైనం వివరించారు. వీరి రచనలలో ప్రప్రథమంగా పాఠకులనాకర్షించేది వారి రచనలోని ఎనలిటికల్ ఔట్ లుక్, ఇంటర్ప్రైటేషన్స్..

ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధులైన శ్రీ వి. ఎస్. ఆర్. మూర్తిగారి ఈగో హిండర్స్ స్పిరిట్యువల్ ప్రోగ్రెస్ లో అహం ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం అంటారు. ఆలోచనలు సమసిపోయి సాధకుడు ప్రేక్షకుడిగా మారితే శాంతి నెలకొంటుంది. ప్రశాంతత సంతరించుకున్న మనసు ఆధ్మాత్మికత వైపు మొగ్గుతుంది అని ముగిస్తారు. అయితే అహం మీద ఒక కన్నేసి అదుపు చెయ్యగలగటం మన వల్ల కానిది. అది కూడా అమ్మ అదుపాజ్ఞలలోనే ఉంటూ అమ్మ వల్లే సాధ్యం అవాలి అంటారు ప్రొ. శివరామకృష్ణ ఒక సంపాదకీయంలో. మరొక వ్యాసంలో భగవన్నామ స్మరణ ప్రాధాన్యం గురించి చెప్పారు. కేవలం యాంత్రికంగా ఉచ్ఛరించటం నిష్పలం. పరివేదనతో, శరణాగతి భావనతో చెయ్యాలి. అప్పుడది మనశ్శుద్ధికి దారి తీస్తుంది అని వివరిస్తారు ఎఫికసి ఆఫ్ లార్డ్స్ నేమ్ వ్యాసంలో.

అమ్మ నాన్నగార్ల సాహచర్యం, వాత్సల్యం రుచి చూసిన అదృష్టవంతుడు శ్రీ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం గారు. మన అమ్మ విశ్వజనని వ్యాసంలో సర్వంబునను ఉండి, సర్వంబుపై ఉండి, సర్వసాక్షిగ వెలుగు సర్వేశ్వరి గురించి కీర్తించారు. అమ్మ సమాధి స్థితిలో ఎల్లవేళలా ఉండేది. అది నేర్చుకున్నది కాదు, సహజాతం అని వివరిస్తారు. అమ్మను గురించి మాట్లాడటం, వ్రాయటం దుస్సాహసం అంటూనే అమ్మతత్వాన్ని విశదీకరించారు ‘అమ్మ తత్వాధ్యయనం’లో ద్విపాత్రాభినయం వ్యాసంలో – అమ్మ శివానందమూర్తి గారల సంభాషణ, శివానందుల వారు “నీకు సవ్యం లేదు. అపసవ్యంలేదు, ఎవరి ముందు వెనుకలు ఎక్కడ జరిగినా నీదగ్గరికి వస్తారు కాబట్టి (ఇంకొంతకాలం) ఉండండి. అని సలహా ఇచ్చే – ఆసక్తికర సంఘటన గురించి చెప్పారు.

నవరి సంచికలో ప్రముఖ లేఖనం ని.జి. వెస్టర్లాండ్ రాసిన కరుణామయి. క్రిష్టమస్, నూతన సం॥ర శుభాకాంక్షాలతో మొదలై, Listen to the Nada which is soundless, Pure silence is the voice of Mother Divine, Pain is the real eye opener & guide వంటి విషయాలు స్పృశిస్తూ సాగిన సుదీర్ఘ వ్యాసం. అమ్మ కోసం ఎక్కడెక్కడో వెతక్కండి. మీలోనే ఉంది, Experience Mother in your intuition అని వివరించి, అమ్మ ప్రేమ అనే కుంభవృష్టి బిడ్డలందరిపై కురియాలని కోరుతూ ముగించాడు.

రాజు బావ గారి “లోచూపు” గ్రంథానికి ఆంగ్ల అనువాదం ఇన్నర్ విజన్ సరళంగా సాగుతున్నది. ఆర్.ఎ. పద్మనాభ రావు గారి జిల్లెళ్ళమూడి జ్ఞాపకాలు, మల్లాది హనుమంతరావుగారి ‘అమ్మతో నా అనుభవాలు’ ఆసక్తికరంగా చదివించే రచనలు.

అమ్మ సాహిత్య వైతాళికులలో ప్రముఖ స్థానం పొందినవారు, ‘ఈ స్థాన కవివి’ అని అమ్మ ప్రశంసలందుకున్న సాహితీవేత్త, కవీశ్వరులు, శ్రీ పి.ఎస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు నిర్వహిస్తున్న శీర్షిక ‘ధన్యజీవులు’ Mother of All సంచికలకు కొసమెరుపై విరాజిల్లుతూ ఉంటుంది. వారు అమ్మ సేవలో తరించిన ధన్యజీవులను పరిచయం చేసే తీరు అల్పాక్షరముల అనల్పార్థ సూచకమై వారి లోకజ్ఞతకు, వ్యక్తిత్వాల నిశిత పరిశీలనకు, అద్దం పడుతూ సాగుతుంది. జనవరి సంచికలో జమ్మి వెంకటరత్నం గారి మాతృసేవా తత్పరత, ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకమ్ అన్న ఆర్యోక్తికి ఆలంబనగా నిలచిన వారనీ వివరించారు. తరువాత సంచికలో మిన్నెకంటి గరునాథశర్మగారు.

అమ్మది పూర్ణావతారం అని నిర్ణయానికి రావటం, ‘ఈశ్వరశక్తినే నీవు, మహేశ్వరునకు నీకు భేదమేమియు లేదొ విశ్వజనని’ అని వేడుకోలు, అమ్మతో వారి అతిలోక అనుభవాలు ఆసక్తికరంగా సాగుతాయి. కృష్ణభిక్షు గురించి రాస్తూ, అసలు పేరు ఓరుగంటి వెంకటకృష్ణయ్య అని, మొదటగా రమణమహర్షి జీవిత చరిత్ర రాసిన వారని, కులపతి గారితో వారి స్నేహం, కులపతిగారు అమ్మద్వారా ఒక దివ్య మంత్రోపదేశం పొందటానికి కారకులు వీరే అని, ఛిన్నమస్త సాధన చేసిన వారని కొన్ని అపురూపమైన సంగతులు పొందుపరచిన వాక్చిత్రం. అక్టోబర్ సంచికలో మొసలికంటి తిరుమలరావుగారు ధన్యజీవి ఎలా అయినదీ వివరించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వారి రాజకీయ ప్రస్థానం, ఎన్నో ప్రభుత్వాలు చెయ్యలేని సమసమాజ నిర్మాణం అలవోకగా అమ్మ చేసి చూపటం వారిని జిల్లెళ్ళమూడికి ఆకర్షించినదని, అవతార్ మెహెర్ బాబా బోధనలపట్ల ఆకర్షితులై వారి “ది గాడ్ స్పీక్స్” తెలుగులోకి అనువదించారని చాలా మందికి తెలియని, విస్మృతిలో పడ్డ విషయాలు చెప్పారు. ఈ సంగతులు నన్ను 60 యేళ్ళ వెనక్కు తీసుకెళ్ళాయి. మా నాన్నగారు కీ.శే. సత్యనారాయణ వర్మగారు పీఠికాపుర వాస్తవ్యులే. కాంగ్రెస్ కార్యకర్తలకు లాఠీ ప్రహరణాలో, జైలు జీవితమో తప్పవనుకున్న గడ్డు రోజులలో వారు పీఠాపురం తాలుకా స్థాయిలో ముఖ్య కాంగ్రెస్ కార్యకర్త. వీరిద్దరికి పరిచయముండేది. రెండవది కాకినాడ గాంధీనగరం ఒంటి మామిడి జంక్షనుకు పడమరగా వెళితే తిరుమలరావు వీధి అని ఉండేది. మొదటి యిల్లు వీరిదే. ఒకనాడు మెహర్ బాబా వీరింటికి వచ్చారు. అప్పుడు నాకు 7-8 యేళ్ళుంటాయి. మా అమ్మతో వెళ్ళి బాబావారి దర్శనం చేసుకున్న అనుభవం ఇప్పటికీ నూతనంగా ఉంది నా మనసులో.

అమ్మలో ఐక్యమయిన మల్లుగా పిలువబడే వర్ష మల్లికార్జున ప్రసాద్, రాము అని పిలుచుకునే మతుకుమిల్లి రాము గురించి దినకర్ గారు, శేషుగా అందరూ పిలిచే రాజుపాలెపు శేషగిరిరావు గురించి ఆకెళ్ళ సుబ్రహ్మణ్యంగారు శ్రద్ధాంజలి ఘటించేరు. వారితో వ్యక్తిగతంగా పరిచయముండటం, వారి సేవానిరతి, అమ్మతో, అర్కపురితో వారి అనుబంధం ప్రత్యక్షంగా చూపిన వారవటం చేత ఒకానొక ఆత్మీయ స్పర్శతో చెప్పి, వారిని కళ్ళముందు నిలిపేరు.

జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితివారు, హైదరాబాదు, జిల్లెళ్ళమూడి తదితర ప్రాంతాలలో నిర్వహించే అన్నప్రసాద వితరణ, ప్రేమార్చన కార్యక్రమ వివరాలు, డి.వి.డి.లు, టెలి ఫిల్మ్, వాటర్ ప్లాంట్ల ల ఆవిష్కరణ సమాచారం సచిత్రంగా అందించారు 4 సంచికలలో. జనవరి 2016 సంచిక నుంచి ప్రశ్న-జవాబు శీర్షిక ప్రారంభిస్తున్నామని ప్రకటించటం ముదావహం. మొత్తం మీద 4 సంచికల కవర్ పేజీల ఆకర్షణీయంగాను, సందర్భోచితంగాను ఉన్నాయి. ప్రూఫ్ రీడింగ్ విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. రచయితల పేరు దగ్గర ఫోన్ నెంబరు కూడా వేస్తే బాగుంటుంది. పాఠకులు డైరెక్ట్ రచయితతో అభిప్రాయాలు కలబోసుకోవటానికి, సందేహ నివృత్తికి ఉపయోగ పడుతుంది.

ఆధునికత, ప్రపంచీకరణ లాంటి పరిణామాల ప్రభావంతో వస్తున్న మార్పుల వల్ల అమ్మలలో ఆప్యాయతా, అమ్మతనం, బిడ్డలలో బాంధవ్యాలు, బాధ్యతలు, కుటుంబ సంబంధాలు మృగ్యమవుతున్న ఈ కాలంలో ఇలాంటి పత్రికలు కరదీపికలై, అమ్మ తత్వకిరణ జ్వాలా మాలికల వెలుగులో చెయ్య గలిగిన, చెయ్య వలసిన మార్గదర్శనం చాలా ఉంది.

పదహారేళ్ళ ప్రాయంలోకి అడుగిడుతున్న ‘షోడశి’ Mother of Alll ఈ పరమార్థ సాధనలో ప్రముఖంగా నిలవాలని ఆశిస్తూ.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!