(గత సంచిక తరువాయి)
- ఆద్యంతంబుగ అమ్మ గాథ కనగా నాలోకనం బంతయున్
విద్యావంతుల జేసి బిడ్డలకునై విజ్ఞాన దీపంబుగా
సద్యోగంబును కల్గజేయుదు నికన్ సామీప్య మందింపగా
అద్యాదేవత అమ్మ సన్నిహితమై ఆకాంక్షలన్ దీర్పదే.
- శారద యంచు కొందరును, శాంకరి, లక్ష్మి యటంచు కొందరున్
వారికి నచ్చినట్టి పలు భంగుల సన్నుతి సేసి అమ్మనే
పేరుల మార్పుతోడ మరి బిడ్డలు పిల్చుచునుండ అమ్మయున్
వారల నందరిన్ తగిన వత్సల భావము తోడ ప్రోచెదున్.
- జననం బాదిగ అమ్మచేసిన మహా జాగ్రద్వికాసంబుతో
గణనీయంబుగ బిడ్డలెల్ల రిదియున్ కాంచంగ సన్మార్గమున్
జననంబుల్ సఫలంబుగా మది మహోూత్సాహంబు సంధిల్లగా
అనయంబున్ మన అమ్మసేవకొరకై ఆకాంక్షతో చేరరే..
- కారుణ్యంబును వత్సలత్వమును సాకారంబుగా అమ్మయై
సారూప్యంబున కెంత మాత్ర మెవరున్ చాలంగ లేనట్లుగా
భారం బంతయు మోయుచున్ మనల తా పాలించుచున్ నిత్యమున్
పారంబే కనరాని దేవి మనకై ప్రాదుర్భవించెం గదా!
- తలపులయందు చేతలను తక్కిన మాటల అమ్మ భావనల్
కలిగిన జీవితంబు నవకాంచన శోభల వెల్గుచుండెడున్
కలలవి నిశ్చయంబుగను కన్నుల ముందర తోచుచుండు, సత్
ఫలమును పొంది జీవితము భాసురమై అలరారుచుండెడున్.
- (సశేషం)