గృహస్థ జీవితం సాగిస్తూనే సమస్త ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించింది అమ్మ. పాత్రత ప్రసక్తి పక్కనపెట్టి ఆమె చూపే ఆదరింపుకి జలదరించని జన్మ ఉంటుందా, జలధరం కాని మనస్సు ఉంటుందా? పిలిచే ఆర్తిని బట్టి కొలిచే దేవత పలుకుతుందని నానుడి. కాని అమ్మ అన్న ఈ దేవత ఎవరెలా పిలిచినా పలుకుతుంది పిలవకపోయినా పలకరిస్తుంది. అడగకపోయినా అనుగ్రహసుధ చిలకరిస్తుంది. అమ్మతనాన్ని ఆడతనమే అనుకుంటే – ఆకాశమంత ఆకలిని సూది బెజ్జమంత నోటితో తీర్చుకోవాలనుకోవటమే. హస్త సంస్పర్శ మాత్రాన సదా బాధించే వ్యాధులు, సంక్లిష్ట వ్యధలు తన వాత్సల్య ఔషధంతో మౌన మంత్రంతో, నివారించిన అశ్వనీ దేవత, ఆధునిక అది యోగిని అమ్మ. ఆవరణాతీతమైన ఆదరణకి ప్రతీక అందరింటి తోరణం. అన్నపూర్ణాలయపు తలపులు వేయబోవని తలుపు తీయమనే పిలుపు వినబడని వింత. అందరికీ అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణ మాత్రమేనా ? సర్వతంత్ర స్వతంత్ర పరిపూర్ణ !
అమ్మను గూర్చి ఎన్నో పుస్తకాలు చదువుతాం. సినిమాలు, సి.డిలు చూస్తాం. ప్రవచనాలు ఆసక్తితో వింటాం. అన్న ప్రసాదాలు తనివితీరా తింటాం. అమ్మతో గడిపిన అదృష్టవంతుల అనుభవాలు వింటాం. అశీస్సులు పొందినవారిది పూర్వజన్మ సుకృతం అనుకుంటాం. ఇంతాచేసి అమ్మ గురించి మనకేం తెలుసు ? ఆధ్యాత్మిక కష్టమర్ కేర్ూ, కాల్సెంటర్లూ అమ్మ గురించి ఏం చెప్పగలవు ? వారి దగ్గరున్న విషయ వివరణ డేటాకి అందుతుందా అమ్మ ? అసలు అమ్మే ఒక విశ్వప్రసార కేంద్రం. ఈ కేంద్రానికి సమయ నియమాలు లేవు. కాలపరిధులు లేవు.
అసలీ పుస్తకాలు, పత్రికలూ అమ్మ సాహిత్యం అంతా పరమతు’ల, పరిమితులమయం. అడుగడుక్కీ అడ్డు పడుతుంది తర్కం. సాహిత్యంతో రాహిత్యము కాదు కదా. ఈ తర్క కర్కశ కంటకావృత వలయం దాటగలగాలి. మళ్ళీ మాతృగర్భంలోకి పునఃప్రవేశం చెయ్యగలగాలి. శైశవం లోని స్వచ్ఛతను పునరాహ్వానించగలగాలి. పసితనం లోని ‘పచ్చి’తనాన్ని ఆఘ్రాణించగలగాలి. చిన్నతనమే చిన్మయమని నమ్మగలగాలి. తెగిన పేగు బంధానికి ప్లాస్టిక్ సర్జరీ చెయ్యాలి. అంతటా ఉన్న అదృశ్య రూపిణి అమ్మ కేలు బట్టి అడుగులు వేయ్యాలి. నీ ఐదు వేళ్ళ మధ్య ఇమిడిన అమ్మ చిటికెన వేలు – చిన్ని కృష్ణుని నోట బ్రహ్మాండమున్నట్లు. పునర్భ ప్రవేశం చెయ్యగలిగితే పునర్జన్మ లేదు. అమ్మతనమొక విశ్వపర్యంత నిత్య నిరంతర ప్రవాహఝరి. అం – ఆకి సంపూర్ణ అర్థం నిగమాగమా లోను, నిఘంటువుల్లోను దొరుకుతుందా ? నీ జీవితంలో తపనే తపస్సు అయితే, ఆవేదనే ఆరాధనైతే వర్గంలేని స్వర్గంలోకి చేరగలవు. మరణాన్ని సైతం పరిణామంగా చూడగలవు. మిస్. మార్వా ‘పంపని’ కారులో ప్రయాణిస్తే సులువుగా అమ్మని చేరగలవు.
రస-రక్త మజ్జ మాంసాది సప్తధాతువులూ అందిచ్చేది. అమ్మ చేతిముద్ద. అందుకే ఆలయం లాంటి అంగరింటికి ‘పాకు’. ‘నడిస్తే’ ఈ దేహానికి అదొస్తుంది సందేహమనే స్పీడ్ బ్రేకర్. నాన్నగారి ఏడు రూపాయల జీతంలో ఆ తల్లి ఎందరి క్షుధార్తి తీర్చిందో, లెక్కల జాడలు యే డే బుక్ ను చూడలేవు. “బాంధవాః శ్శివ భక్త్యాశ్చ స్వదేశో భువనత్రయం…” అన్నట్లు జిల్లెళ్ళమూడిలో అడుగుపెట్టిన వారందరూ బంధువులే. అందరికీ ‘స్వ’ గ్రామం అర్కపురే! దయకోసం కొందరు. దర్శనం కోసం కొందరు, మార్గదర్శనం కోసం కొందరు, మమతా మాథుర్య రుచికి దాసులై కొందరు వస్తూనే ఉన్నారు… ఉంటారు. ఇది నిరంతర నిత్యకృత్యం.
సప్త మోక్షపురుల సంగమ స్థానం అర్కపురి. సప్తమాతృకలు వ్యక్తమైన పుణ్యస్థలి అర్కపురి ! సప్తస్వరాల్లో విను మాతృధ్వని. సప్త సముద్రాల తరంగ చైతన్యంలో అమ్మ కదలిక కను. సప్తకోటి మహా మంత్రాల సంపుటీకరణ అమ్మ ! అనుభూతిలోంచి మాత్రమే స్పర్శించగల, అనుభవం లోంచి మాత్రమే దర్శించగల అవాజ్మానస గోచర అద్వైత స్థితి ! అద్వైత స్థితిని అందుకునే మొదటిమెట్టుగ అందరింట అడుగుపెట్టు. అడుగుపెట్టాలంటే బ్రహ్మతత్త్వమే అమ్మతత్త్వ మన్న ఎరుక కలగాలంటే దాటాలి 7వ మైలురాయి!
(‘దర్శనమ్’ మాసపత్రిక వారి సౌజన్యంతో)