అమ్మ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని 5 రోజులకు సంబంధించి మాతృశ్రీ ఆరోగ్య కేంద్రం ముందుగా ఒక ఆరోగ్య కమిటిని ఏర్పాటు చేసుకుని, కమిటీ ద్వారా ఒక చక్కని ప్రణాళికను రూపొందించి, తదనుగుణంగా విచారణ చేసి, కావల్సిన మెడిసిన్స్, మ్యాన్ పవర్ సర్వీసెస్, స్పెషాలిటీస్ ని సంసిద్ధం చేయడం జరిగింది.
శ్రీ విశ్వజననీ పరిషత్ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం ఆధికారికంగా డా. పి. రాఘవరావు గారు (చెస్ట్ ఫిజీషియన్) సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజి, గుంటూరు వారిని సంప్రదించగా, డాక్టర్ గారు ఎంతో ఆనందంతో అంగీకరించి, ఆ ప్రకారం అమ్మ సేవకై ఒక వైద్య బృందాన్ని 28 మార్చి 2023 నుండి ఏప్రిల్ 1, 2023 వరకు రోజు వారీగా ఎవరు వచ్చేది, నిర్ణయం చేయడమయినది. మరియు ఆ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్త/అధికార బృందాన్ని ముందుగా అంచనా వేసి, వేసవి కాలాన్ని సైతం దృష్టిలో ఉంచుకుని, తగురీతిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది.
ఇందుకు గాను ప్రతి రోజు ఉదయం 8.30 మొదలు సాయంత్రం 6 గంటల వరకు వైద్య సిబ్బంది మాతృశ్రీ ఆరోగ్య కేంద్రం ద్వారా తగు సేవలను అవసరార్థులకు అందించడం జరిగింది. హెూమియో, ఆయుర్వేదము, అల్లోపతి శాఖలను బట్టి, ఆ వైద్యులు అవసరమైన మందులు కొన్ని సంస్థ తరఫున, కొన్ని ప్రభుత్వం తరఫున అవసరమయిన వారికి ఉచితముగా అందించడమైనది.
అమ్మ శత జయంతి వేడుకల సమయంలో ఆరోగ్యపరమైన సేవలు అవసరమైన అమ్మభక్తులు ఏయే విధంగా మాతృశ్రీ ఆరోగ్య కేంద్రం సేవలను వినియోగించుకున్నారనే వివరాలు ఈ క్రింద పట్టిక రూపంలో అందివ్వడం జరిగింది.
ఎక్కువమంది దాదాపు 83% అల్లోపతిని వినియోగించుకోగా, హెూమియో వైద్యాన్ని 12.7 శాతం, ఆయుర్వేదాన్ని 3.7% మంది వినియోగించుకోవడం మనం గమనించవచ్చు.
విశేషించి ఈ వేడుక సమయంలో చిన్న చిన్న గాయాలు, జీర్ణకోశ సంబంధిత విషయాలు చూడటం జరిగింది. వడదెబ్బ వంటి వాటి నుంచి ఇబ్బంది కలుగుకుండా నివారణోపాయాలను కూడా చూసుకోవటమైనది.
ఈ ఆరోగ్య, వైద్య సేవల కార్యక్రమాలలో 5 రోజులు పాటు తమ విశేష సహాయ సహకారాలు అందించిన సేవాభారతి, ఆంధ్రప్రదేశ్ (బాపట్ల, గుంటూరు విభాగాలు)
శ్రీ రాజరాజేశ్వరి, శృంగేరి ఛారిటబుల్ ట్రస్ట్, హాస్పిటల్ గుంటూరు,
శ్రీ సత్యసాయి సేవాసమితి, బాపట్ల,
సెయింట్ జోసెఫ్స్ జనరల్ హాస్పిటల్ మరియు సెయింట్ జోసెఫ్స్ శాంతగిరి ఆయుర్వేద విభాగము, గుంటూరు,
ఇండియన్ రెడ్ క్రాస్, ఆంధ్రప్రదేశ్, బాపట్ల యూనిట్,
మాస్టర్ ఇ.కె. స్పిరిచ్యువల్, ఆంధ్రప్రదేశ్, బాపట్ల విభాగము.
మరియు వాలంటీర్లుగా సేవలు అందించిన అమ్మ భక్తులు మరియు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థుల బృందము వారికి వీరందరితో పాటుగా డాక్టర్లు మరియు పేరామేడిక్స్ (వీరి సంఖ్య చాల ఉన్నకారణంగా) పేరు పేరునా ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
‘మాతృశ్రీ జలప్రసాద కేంద్రం ఉచిత మజ్జిగ పంపిణీ
కొవ్వూరులో సోదరులు శ్రీ గుడివాక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం వలెనే ఏప్రిల్ – మే – జూన్ మూడు నెలలూ ప్రతిరోజూ అమ్మ సేవలో భాగంగా ఉచిత మజ్జిగ పంపిణి జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమైంది.