జూన్ 12వ తేదీ సాయంత్రం 6గంటలకు జిల్లెళ్ళమూడిలో శ్రీ అనసూయేశ్వరాలయంలో Jillellamudi AMMA ఆంగ్ల గ్రంథం ఆవిష్కరణ జరిగింది.
శ్రీ విశ్వజననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్టు ఆధ్వర్యవంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు వంశపారంపర్య ధర్మకర్త శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు ఈ గ్రంథాన్ని అమ్మ సన్నిధిలో ఆవిష్కరించారు.
అమ్మను గురించి ఇతర భాషా ప్రాంతాలవారికి పరిచయం కావటానికి ఇలాంటి రచనలు ఆవశ్యకమని | పేర్కొంటూ రచయితను శ్రీ రవీంద్రరావుగారు అభినందించారు.
గ్రంథ రచయిత, శ్రీ విశ్వ జననీ పరిషత్ టెంపుల్స్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఎం. దినకర్ గారు మాట్లాడుతూ అమ్మ అనంత వైభవాన్ని కొనియాడారు. తెలుగు నుడికారపు సొగసులను సంతరించుకొన్న అమ్మ వాక్యాలను అనువదించటం తనకు పరీక్ష వంటిదన్నారు.
అమ్మ ఇచ్చిన ప్రేరణ, అనుగ్రహము కారణంగా ఈ రచనను తాను నిర్వహించ గలిగానని అమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. సోదరులు శ్రీ టి.టి. అప్పారావుగారు మాటాడుతూ ‘అంఆ’ అనే నామం ‘సో_హం’ మంత్రమే అన్నారు.
‘విశ్వజనని’ సంపాదకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు మాట్లాడుతూ- ఉభయ తెలుగు రాష్ట్రాలనూ దాటి దేశ, విదేశాల్లో అమ్మను సంక్షిప్తంగా పరిచయం చేయటానికి ఈ ఆంగ్ల గ్రంథం | సహకరిస్తుంది- అన్నారు. గ్రంథ పఠనం, పారాయణాలు చేసే విధానం, అందువల్ల కలిగే సత్ఫలితాలనూ వివరించారు.
టెంపుల్స్ ట్రస్టు కోశాధికారి శ్రీ ఎం. వి. ఆర్. సాయిబాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ట్రస్టు సభ్యులు, విశ్వజనని సంపాదక సభ్యులు, ఎందరో సోదరీ సోదరులు ఈ సభలో పాల్గొన్నారు. ప్రార్థనతో ప్రారంభమైన ఈ సభ శాంతి మంత్రంతో ముగిసింది.
సంపాదక మండలి