“శ్రీమాత దయామూర్తి. ఆమె కృపాప్రభావం మహిమాన్వితం. ఆమె దయకు మాలిన్యం గాని” క్షీణతగాని లేదు. ఎప్పుడూ మహెూజ్జ్వలంగా ప్రకాశించే దయాగుణం గల శ్రీమాత ‘రాజత్కృప’ – భారతీవ్యాఖ్య

కృప అంటే జాలి, దయ, కనికరం, కరుణ లాంటి అర్థాలెన్నో ఉన్నాయి. రాజత్ అంటే ప్రకాశిస్తున్న అని అర్థం. శ్రీ లలితాదేవి ‘రాజతృప’. అంటే ప్రకాశిస్తున్న కరుణయే (స్వరూపమే) శ్రీమాత. సాటివారి పట్ల కరుణ చూపించడం అంటే అది అమ్మవారి లక్షణ మన్నమాట. సాధ్యం కావు అనుకున్నవి ఎన్నో అమ్మవారి కృపా విశేషం చేత సుసాధ్యమవుతాయి – అని మన పురాణాలు పేర్కొనటమే కాదు; చరిత్ర కూడా స్పష్టం చేస్తోంది. కాళిదాస మహాకవిని గురించి తెలియని వారుండరు. ఆ మహాకవి నుంచి అద్భుతమైన కవిత్వం ఆవిర్భవించిందంటే అది అమ్మవారి అనుగ్రహమే. మూకకవి “పంచశతి” అమ్మవారి కృపాకటాక్ష వీక్షణ ఫలితమే. ఇలా ఎందరినో తన కృపాదృష్టితో అనుగ్రహించిన తల్లి కనుకనే శ్రీలలిత – “రాజత్మృప”.

“అమ్మ” – “రాజతృప’. “అమ్మ”కు బాల్యం నుంచీ సాటివారిపట్ల జాలి, కరుణ ఉన్నాయనే విషయం “అమ్మ” జీవిత మహోదధిలోని ప్రతి తరంగం ప్రస్ఫుటం చేస్తోంది. చిన్నతనంలోనే “అమ్మ” సాటి వారి ఆకలిని గమనించి, తన ఆహారాన్ని వారికి పెట్టి, వారి ఆకలి తీర్చిన తల్లి. బాల్యంలోనే జీడిపప్పు అమ్ముకునే అమ్మాయికి, తాను జీడిపప్పు కొని పెట్టిందంటే – ఆ మాతృహృదయంలోని కరుణా తరంగం పైకి ఎగసిపడడమే కదా! కరుణాంతరంగ అయిన “అమ్మ” తన బుల్లి చేతికున్న బంగారు గాజును పిల్లలున్న అంధురాలికి తీసి ఇచ్చిన బంగారుతల్లి. ఇలా చెప్పుకుంటూ ఉంటే బాల్యనుంచీ ఆర్తులపట్ల “అమ్మ” చూపించిన కరుణ అపారమైనది. ఆ వయస్సుకు మనం ఊహించలేనిది.

“అమ్మ” తన తొమ్మిదేండ్ల వయస్సులో వాసుదాస స్వామివారిని దర్శించింది. తల్లిలేని పిల్ల అనే జాలితో స్వామివారు ‘అందరూ నిన్ను ప్రేమించేటట్లు దీవించేదా?” అని అడిగితే “అట్లా కాదు. ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను అందరినీ ప్రేమించేటట్లు దీవించండి” అని అడిగిన ‘రాజత్కృప’ మన “అమ్మ”. ఈ సన్నివేశం “అమ్మ” చిన్నతనంలో జరిగింది. ‘అందరి అమ్మ’గా గుర్తింపు పొందిన తర్వాత ఇలాంటిదే మరొక సంఘటన జరిగింది. చిలకలూరిపేట నుంచి వచ్చిన జ్యోతిష్కులు ఒకరు “అమ్మ”కు తమ ప్రతిభాపాటవాలను చెప్పి, అక్కడితో ఆగక “అమ్మ”నే ఒక ప్రశ్న అడగమని కోరారు. అడిగేందుకు తనకు ఏ ప్రశ్నలూ లేవు అని “అమ్మ” చెప్పినా, వారు పదే పదే ఏదైనా ఒక్క ప్రశ్న అడగమని మరీ మరీ “అమ్మ”ను ప్రార్థించారు. అంతేకదా! మనకు తెలిసిన విద్యను మహనీయులు మెచ్చుకుంటే మనం పొందే ఆనందం వేరు. అందుకే ఆయన “తనకు ఏ ప్రశ్నా స్ఫురించట్లేదు” అని “అమ్మ” అన్నా ఊరుకోలేదు. ఎంతగానో ప్రాధేయపడ్డారు. ఆయన కోరిక తీర్చడానికి “అమ్మ” “ప్రపంచంలో అందరూ కడుపునిండా తినాలి. ఎవరూ, ఎప్పుడూ ఆకలి బాధకు గురికారాదు. ఆ తరుణం ఎప్పుడు ? అది సాధ్యమేనా?” అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానం ఏ జ్యోతిష్కుడు చెప్పగలడండీ ? ఆ మాట అలా ఉంచితే ఈ ప్రశ్నలో ప్రజల పట్ల “అమ్మ”కు గల కరుణ ఎంతటిదో తెలుస్తుంది. తన కుటుంబం కాదు; తన గ్రామం కాదు; తన రాష్ట్రం కాదు; తన దేశం కాదు. యావత్ప్రపంచంలో ఎవ్వరూ ఆకలితో బాధపడకుండా ఉండాలనే ఆలోచన హద్దులు లేని “అమ్మ” కరుణకు నిలువెత్తు నిదర్శనం కాదా? అదే విశ్వజననీత్వం. అదే విశ్వజనని తత్వం. విశ్వజనని అయిన “అమ్మ”కు ఈ సృష్టిలోని సకల చరాచరములు బిడ్డలే కదా! అందుకే “నా గర్భ తీపి సర్వత్రా ఉంటుంది” అని ప్రకటించింది “అమ్మ”.

1973 వ సంవత్సరంలో బాపట్లలో దారుణమైన అగ్నిప్రమాదం సంభవించింది. 600 కుటుంబాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ సంఘటనకు “అమ్మ” హృదయం ద్రవించింది. వెంటనే వారికి ఆహార సదుపాయం కలుగచేయాలని సంకల్పించింది ఆ అర్ద్రహృదయం. ఆ సమయంలో “అమ్మ” దర్శనం కోసమని వచ్చిన ఒక సోదరుడు – ‘నాకేదైనా సందేశం ప్రసాదించమ్మా’ అని వినయంగా ప్రార్థించాడు. వెంటనే “అమ్మ” అక్కడ అన్నం పొట్లాలు తయారు చేస్తున్న సోదర బృందాలను చూపించి, అతనితో “నీవూ వారితో కలిసి పనిచెయ్యి” అని చెప్పింది. ఆ సోదరున కేమీ పాలుపోలేదు. “అమ్మ”నే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు “అమ్మ” – “వాళ్ళు అక్కడ ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. నలుగురూ కలిసి త్వరగా వారికి అన్నం అందించండి” అని గద్గద స్వరంతో పలికింది. “అన్నం పెట్టడానికి ఆకలే అర్హత” అని ప్రకటించిన తల్లి కదా! ఆకలితో అలమటించే అన్నార్తులకు ఆ సమయంలో ఎంత త్వరగా అన్నం అందించగలమా అనే “అమ్మ” ఆలోచనే ఒక సందేశంగా రూపుదిద్దుకుని ఆ సోదరునికి మహెూపదేశాన్ని అందించింది.

మానవుల విషయంలోనే “అమ్మ” ఇలా తన కృపాదృష్టిని ప్రసరింప చేస్తుందా ? అంటే కాదు అనేదే సమాధానం. పసితనంలోనే పది పిల్లలున్న తల్లి పందికి తన వంతు అన్నాన్ని అందించి, ఆ ప్రాణి ఆకలి తీర్చిన తల్లి. పిల్లులకు, కుక్కలకు, పక్షులకు, జలచరాలకు – సర్వజీవకోటికీ ఆహారం అందించి ఆనందించే తల్లి. ఒకనాడు ఆవరణలో నీటి బండిని లాగే ముసలి ఎద్దుకు సక్రమంగా ఆహారం అందటం లేదని “అమ్మ” కంట నీరు పెట్టుకున్నదంటే ఆ తల్లి “రాజత్కృప” కాక మరెవరు?

పూర్వం నుంచీ జిల్లెళ్ళమూడి వచ్చే సోదరు లందరికీ చిరపరిచితుడు రాధన్నయ్య. ఆయన అంధుడు. “అమ్మ” భక్తి ధురంధరుడు. తన మధుర కంఠస్వరంతో “అమ్మ” నామాన్ని నాలుగుదిక్కులూ మారుమ్రోగేటట్లు చేసి, పరవశించే వారు. ఆయన ఒకసారి తన్మయంగా “అమ్మ”నామ సంకీర్తన చేస్తున్నారు. ప్రక్కగదిలో పవ్వళించి ఉన్న “అమ్మ” అ నామ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, ఆనందిస్తున్నది. అంతలో హఠాత్తుగా నామం ఆగిపోయింది. “అమ్మ” లేచి రాధ అన్నయ్య ఉన్న చోటికి వచ్చింది. అన్నయ్య కళ్ళు వర్షిస్తున్నాయి. “అమ్మ”- అన్నయ్యను సమీపించి “నాన్నా! ఏడుస్తున్నావా?” అంటూ తన సుకుమారమైన చేతితో అన్నయ్య పిక్కలు వత్తసాగింది. ఇంతకూ విషయమేమిటంటే – రాధన్నయ్యకు ఆ భాగమంతా భరించలేని నొప్పిగా ఉందిట. ‘దయామూర్తి’ అయిన “అమ్మ” తన అవయవాలమైన మనలో ఏ ఒక్కరికి బాధకలిగినా, ప్రేమతో సేవ చేసి, సేద తీర్చేది.

ఇలా “అమ్మ” చేసిన సేవను పొందిన భాగ్యశాలురు ఎందరో ! కూలి అయిన మునిస్వామి రోగగ్రస్తుడైనప్పుడు, సేవకుడైన మంత్రాయి క్షయవ్యాధి పీడితుడైనప్పుడు, బాపట్లలో కుష్టు ఆసుపత్రిలోని రోగులను దర్శించినప్పుడు పొంగిపొరలే ప్రేమతో, దయతో మనం అసహ్యించుకునే సేవలు ఎన్నో చేసింది “అమ్మ”. బాల్యంలోనే గుంటూరులో గుండేలురావు. గారికి చేసిన సేవ ఆ వయస్సులో ఎవ్వరూ చేయలేనిది. ఒకసారి ఆవరణలో అందరూ ఫ్లూ వ్యాధిగ్రస్తు అయినప్పుడు మందులు, జావ ప్రతి ఒక్క ప్రక్క వద్దకు వెళ్ళి స్వయంగా అందించిన “సాంద్రకరుణ” – “అమ్మ”.

“అమ్మ” దయాస్వభావం గురించి ఇలా ఎన్నని. చెప్పగలం ? ఎంతని వివరించగలం ? ఇలాంటి సన్నివేశాలను దృష్టిలో ఉంచుకుని, చిక్కని ఈ భావాలను గుదిగుచ్చి చక్కని కవిత్వంతో బంధించి మా నాన్నగారు కీ.శే. డాక్టర్ నారపరాజు శ్రీధరరావు గారు “అతిలోక కారుణ్యరాజ్యవర్తి” అని అన్నారు “అమ్మ”ను. అవును. కరుణా సామ్రాజ్యానికి ప్రకాశవంతమైన దీపమే “అమ్మ”.

“కరుణారససాగర” అయిన “అమ్మ” మనల్ని అనుగ్రహించి, అందరింటిలో అనసూయేశ్వరా లయంలో “రాజతృప”గా కొలువుతీరి, తన కృపాకటాక్ష వీక్షణాలను మనపై ప్రసరిస్తూ ఉన్నది. అలాంటి తల్లిని దర్శించి, స్మరించి, భజించి, తరించుదాం.

జయహోూమాతా ! శ్రీ అనసూయా!
మాతృసంహిత గ్రంథకర్తకు నా కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ….