‘అజాయమానో బహుధా విజాయతే’ అనే శ్రుతి వాక్యాన్ని అధ్యయనం చేస్తే శ్రీమహావిష్ణువు ఎత్తిన దశావతారములే కాదు, సకల సృష్టి ఆ మూలకారణశక్తి అవతారమే అని తెలుస్తోంది. జంగమ స్థావరాత్మక జగత్తు యావత్తూ ప్రప్రథమ అవతారం. కాగా ఈ సత్యం బోధపడడం దాదాపు అసంభవం.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవతార ధ్యేయాలు. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ధర్మపరిరక్షణ. బాలకృష్ణుడు చిటికెనవేలుపై గోవర్ధనగిరిని ధరించడం, కోదండరాముడు జనస్థానంలో ఒంటిచేత్తో 14,000 మంది ఖరదుషణాది రాక్షసుల్ని సంహరించడం వంటి ఘట్టాల్ని స్మరించినపుడు పరిమిత మానవరూపంలో ఉన్న మాధవుని అనంతశక్తి స్పష్టమవుతుంది.

సామాన్యచక్షువులకు గోచరించే గోచరించని సమస్త సృష్టికూడా మూలకారణశక్తి యొక్క పరిమితరూపమే. ఈ వాస్తవాన్ని స్పష్టంచేస్తూ అమ్మ “నాన్నా! ఈ గోడ భగవంతుడే. కానీ భగవంతుడు ఈ గోడ మాత్రమేకాదు”అన్నది. ముమ్మాటికీ నిజం ఆ మాట. ‘త్రిపదా ర్ధారయ దేవః యద్విష్ణో రేక ముత్తమమ్’ – వ్యక్తావ్యక్తమయిన సృష్టిని నాలుగు భాగాలు చేస్తే అందలి మూడు భాగాల్ని విష్ణు భగవానుడు ధరించియున్నాడు – అనేది వేదవాక్కు. మరి నాల్గవ భాగం?

ఆధునిక భౌతికశాస్త్రం (Modern Physics) చిన్న అణువులోని ఊహాతీతమైన శక్తిని చూపించి ఋజువుచేసింది. అమ్మ అంటుంది, “పిపీలికాది బ్రహ్మపర్యంతం అంటారేమి? పిపీలిక (చీమ) బ్రహ్మకాకపోతేకదా!” అని. నిజానికి చీమని అర్థంచేసుకుంటే బ్రహ్మపదార్థం అవగతమవుతుంది. ఈ తాత్పర్యాన్ని ప్రకటిస్తూ Emerson అనే తత్త్వవేత్త “to achieve the high, explore the low” అన్నారు. అంటే అనల్పత్వాన్ని అర్థంచేసుకోవాలంటే, అల్పత్వాన్ని అధ్యయనం చేయాలి – అని.

‘సృష్టికంటె మహిమ ఏముంది?’ అనే అమ్మ వాక్యం అక్షరసత్యం. విజ్ఞాన నేత్రాలతో వీక్షిస్తే సృష్టిలో ఎచ్చోట దర్శించినా అద్భుతమే, ఆశ్చర్యకరమే. అనూహ్యమైన మహిమాన్వితమైన గురుత్వాకర్షణ (Gravitational Force) శక్తి వలన ఖగోళాలు తమ తమ నిర్ణీత కక్ష్యలలో పరిభ్రమిస్తున్నాయి. భూమి తన అక్షం మీద వంగి ఉండటం వలన ఋతువులు ఏర్పడుతున్నాయి.

అమ్మ నిజతత్త్వాన్ని వివరిస్తూ “అమ్మ అంటే జిల్లెళ్ళమూడిలో నాలుగు గోడలమధ్య మంచం మీద కూర్చున్నది కాదు; ఆద్యంతాలు లేనిది, అన్నిటికి ఆధారమైనది” అన్నది. ఒక సామాన్యగృహిణిగా, ముగ్గురు బిడ్డల తల్లిగా పాతివ్రత్య ధర్మాన్ని ఆచరించింది. నిజం ఏమంటే – అమ్మ కేవలం ఆ ముగ్గురు బిడ్డలకే తల్లికాదు; సృష్టిలోని అందరినీ అన్నిటినీ కన్నబిడ్డలుగా ప్రేమించి తన కంటిపాపలుగా సంరక్షిస్తుంది – అసలైన అమ్మ.

అమ్మ మనలాంటిదే అనిపిస్తుంది, కానీ అమ్మకీ మనకీ ఏ ఒక్క పోలికాలేదు. అమ్మ శరీరం పాంచభౌతికమైనది కాదు; పంచభూతాలను జయించినది. అమ్మ ‘నానాచ్ఛిద్రఘటోదర స్థిత మహా దీపప్రభ’ అనటానికి అమ్మ చరిత్రలో ఉదాహరణలు అసంఖ్యాకం. అమ్మ విశాలాక్షి. సకల సృష్టినీ ఏక కాలంలో దర్శిస్తుంది, స్మరిస్తుంది. తనలో నిఖిల సృష్టిని, సకల సృష్టిలో తనను దర్శిస్తూ తాదాత్మ్యంచెందే ఆత్మావలోకి.

అమ్మ ధర్మ పక్షపాతి; సనాతన ధర్మ స్వరూపిణి. “నాకు (భూతభవిష్యద్వర్తమానములు) మూడు కాలాలు లేవు, అంతా వర్తమానమే” అని ప్రకటించిన త్రికాలాబాధ్య.

‘రాధ అంటే ఆరాధన’, ‘విరామంలేనిది రామం’ అంటూ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గోపికలు మున్నగు లోకోత్తర ఉత్తమ పాత్రలను మహోన్నతంగా నిర్వచించిన ఆదిమూలము.

‘అందరికీ సుగతే’, ‘మనుషులందరూ మంచి వాళ్ళే’ అని హామీని ప్రకటించిన విలక్షణ విశిష్టమాననీయ మానవీయ సంపూర్ణమూర్తి.

అమ్మలో సర్వజ్ఞత్వ, సర్వవ్యాపకత్వ, సర్వశక్తి మత్వ లక్షణాలను దర్శించినవారు అనేకులు, సందర్భాలు అనేకం.

అమ్మ సంకల్పం అమోఘం, సిద్ధసంకల్ప. మన శరీరంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ – అనే ఐదు కోశా లున్నాయి. వాటికి తృప్తిని ప్రసాదించే లక్ష్యంతో ‘అమ్మ’ పంచాయతనం అనదగు ‘అన్నపూర్ణాలయం’ (అన్నం పెట్టి ఆకలి తీర్చే గుడి); ‘వైద్యాలయం (ఆరోగ్యాన్నిచ్చే గుడి); ‘హైమాలయం (మనస్సు లయం చేసి శాంతిని ప్రసాదించే గుడి); ‘విద్యాలయం’ (ఆంధ్రగీర్వాణ భాషలను బోధించే గుడి); ‘అనసూయేశ్వరాలయం’ (ఆదిదంపతులు, అమ్మ-నాన్నల నిలయం, అఖండానంద ప్రదాయకం) – అనెడు ఐదు ప్రజాహిత సంస్థలను ప్రతిష్ఠించింది.

అతిలోక మాతృవాత్సల్యానికి చిహ్నంగా లక్షమందికి ఒకే పంక్తిలో అన్నప్రసాదం పెట్టింది. తరువాత కాలంలో శోక సంతప్తులయిన బిడ్డలను వెతుక్కుంటూ మురికి వాడలూ, ఆస్పత్రులూ, కారాగారాలూ, అనాధ ఆశ్రమాలకి వెళ్ళి వాళ్ళ కన్నీటిని తన పమిటచెంగుతో తుడిచి తన గుండెలకు హత్తుకొని ప్రసాదాన్ని తినిపించింది; దీనజనావనలోల అమ్మ.

ఇట్టి అమ్మచర్యలు కంటికి కనిపించేవి; కనిపించనివి ఎన్నో! అవి అర్థంకావు. శరీరంతో జిల్లెళ్ళమూడిలో ఉంటూనే ఒకచోట వైద్యునిగా శస్త్రచికిత్స చేసింది, మరొకచోట నర్సురూపంలో వెళ్ళి తన అమృత కరస్పర్శతో ప్రాణదానం చేసింది, వేరొక చోట ఒక పల్లెపడుచుగా పసరువైద్యం చేసింది, ఇంకొకచోట ముత్తైదువుగా వెళ్ళి ఎన్నో చమత్కారాలు చేసింది.

ఇదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘మార్కండేయోపాఖ్యానం’, ‘మహిషాసురమర్ధనం’, ‘గజేంద్రమోక్షణం’, ‘విశ్వరూప సందర్శన భాగ్య ప్రదానం’, ‘గీతాప్రబోధం’ ఇత్యాది దైవీ సంపత్తికి దర్పణం పట్టే సంఘటనలు అమ్మ చరిత్రలో కోకొల్లలు.

దివినుండి దిగివచ్చి మనతో మనవలె మన మధ్య నడయాడిన అమ్మను ‘తరింప జేసే తల్లి’గా ఆరాధిద్దాం. 12-6-22 నుండి 14-6-22 వరకు జిల్లెళ్ళమూడిలో మనం నిర్వహించుకునే ‘అమ్మ అనంతోత్సవ’ సంరంభంలో యథాశక్తి పాల్గొందాం. లోగడ పరిమిత రూపంలో దర్శించుకున్న అనసూయమ్మను నేడు ‘విశ్వజనని’గా, ‘అనంతమ్మ’గా వీక్షిద్దాం, తరిద్దాం.

జయహో మాతా