1. సమ శోభాంచిత పాదపద్మములు నాసాలంబి ముక్తామణిన్
కమలేందీవర నేత్ర వైభవము ముక్తాహార కంఠంబునున్
విమలంబైన ముఖేందు చంద్రికలు సేవింపంగ దివ్యంబులై
సమతా భావమె అమ్మరూపమగుచున్ సాక్షాత్కరించెన్ భువిన్.
2. అవ్యాజంబగు ప్రేమపాశముననే ఆబోలగోపాలమున్
దివ్యత్వమ్మున సన్నిధిన్నిలిపి తా దేదీప్యమానంబుగా
సవ్యంబయ్యెడి మార్గమందు జనులన్ సాగింపగా అమ్మయే
భవ్యంబౌ స్థితి జేరగా కరుణతో భాగ్యంబు కల్పించెగా.
3. రక్షణ తత్పరంబులు విరాజిత భాసుర దివ్య దీధితుల్
శిక్షణ దాయకంబులును సేవక వందిత మంగళత్వముల్
లక్షణమైన బంధుర విలాస సమంచిత ప్రేమతత్వముల్
అక్షరరూప సుందరము లమ్మ పదాంబుజ పద్మరాగముల్.
4. దీనత్వంబును బాపి ధన్యులనుగా దీవించి రక్షింపగా
ఆనందంబును పొంది భక్తియుతులై ఆ తల్లి నర్చింపగా
పూనె న్నెల్లెడ మాతృయాగపరులై పుణ్యాత్ములై మైత్రి స
మ్మానింపందగు రీతి నార్తులకు తా మాహార మందించెడున్.
5. మాటలు కాదు అమ్మవవి మంజుల మోహన రాగ గీతికల్
సూటిగ వెల్గు బాటలను శోభన రీతుల చూపునట్టివౌ
తేటలు తేనెయూటలును తీయని పాటలు మేటి సూక్తులౌ
మూటలు వజ్రపుం గనులు మోదము నింపెడి లేత వెన్నెలల్.
6. మమతయు మానవత్వమును మంచిని బిడ్డల కెల్ల నేర్పుచున్
తమమును బాపి తత్పరత తాము తరించెడి త్రోవ చూపుచున్
సమతను ప్రోది చేయుచును సఖ్యత కూర్చుచు నాదరంబునన్
విమల యశస్సు నొందగను విజ్ఞుల జేయదె అమ్మ ఎల్లరన్.
7. ప్రేమామృతంబును బిడ్డల కందించు
భాగీరధీమాత భవ్యచరిత
ఏ మాయ లేకుండ ఎల్లవేళలయందు
అందరింట వెలుంగు అమల చరిత
కారణమే లేక కరుణను వర్షించు
కమనీయ విగ్రహ కల్పవల్లి
అతిలోకమౌ రీతి ఆదర్శ పథమును
పాటించి బోధించు భానుతేజ
ఎంత తపమును జేసిన ఎరుగరాని
సుగతిమార్గము చూపిన సులభ గురువు
మధుర చరితను సృష్టించె మహితశక్తి
అట్టి అనసూయ మాతకు అంజలింతు.
8. ఏ రూపమును గాంచి ఎల్లవారునుగూడ
అసలైన సంతృప్తి నందగలరొ
ఏ నామమును విన్న ఎట్టి పాపమ్మైన
కణమైన మిగలక కాలిపోవు
ఏ మాట మనుజుల కెల్ల కాలంబును
ఈప్సితంబులు పొంద నేడుగడయొ
ఏ భావనను జేసి ఎటువంటి స్థితినైన
ఎదిరించి నిలిచెడు ఎఱుక కలుగు
అట్టి అమ్మయె మదిలోన అమరియుండ
వాని జీవన మార్గమ్ము వాసికెక్కు
ఎదురులేనట్టి శక్తియే ఇనుమడించు
మాట చేతయు మనసును మహిమనొందు.