ఆగష్టు 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు జిల్లెళ్ళమూడిలో ‘Sojourn’ గ్రంథ ఆవిష్కరణ వైభవంగా జరిగింది. శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షులు శ్రీ ఎం. దినకర్రు అనువదించిన ఈ గ్రంధానికి మాతృక డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మగారు సంస్కృతంలో వ్రాసిన ‘పావక ప్రభ”.
ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావుగారి అధ్యక్షతలో జరిగిన ఈ సభలో శ్రీ విశ్వజననీ పరిషత్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు గ్రంథాన్ని ఆవిష్కరించారు. శ్రీ రవీంద్రరావుగారు మాట్లాడుతూ “అమ్మలోని దివ్యప్రేమను చాటి చెప్పే ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టం” అన్నారు. డాక్టర్ పొత్తూరి వారు “ఇది యధాతధానువాదం కాదు, అనుసృజన కవి హృదయాన్ని గ్రహించి, శ్రీ దినకర్ గారు ఆంగ్లభాషలో ఉదాత్తంగా రచన చేశారు” అని అభినందించారు. విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ కె.బి.జి.కృష్ణమూర్తి గారు “ఈ గ్రంథంలో దినకర్ గారి తాత్త్వికత చక్కగా వ్యక్తమవుతోందన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ యస్. మోహనకృష్ణగారు తమ ప్రసంగంలో అమ్మ విశ్వప్రేమను సంస్కృతంలో నుంచి ఆంగ్లంలోకి అనువదించడంలో శ్రీ దినకర్ గారు చూపిన మెలకువలను ఆంగ్లకవితలోని విశేషాలను సోదాహరణంగా వివరించారు. జనరల్ సెక్రటరీ శ్రీ వైవి.శ్రీరామమూర్తి గారు – “రాధాకృష్ణశర్మగారి అనుభూతిని తనదిగా చేసుకొని శ్రీ దినకర్ ఆంగ్లంలోకి అనువదించడం ప్రశంసనీయం” అన్నారు. కళాశాల అధ్యాపకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు “ఈ గ్రంధం గంగానదివలె ‘త్రిపధగా’ అయిందని, మొదటి పన్నాలవారి కలంలో సంస్కృతభాషలో అవతరించి, తర్వాత డాక్టర్ ఝాన్సీగారి తెలుగు వివరణతో వెలువడి, ఇప్పుడు ప్రపంచ ప్రజలందరికీ చేరువకావడానికి శ్రీ దినకర్గారి చేతులమీదుగా అంతర్జాతీయ భాషలోకి అనువాదం కావడం అమ్మ బిడ్డలందరికీ ఆనందదాయకం” అన్నారు.
శ్రీ విశ్వజననీపరిషత్ పక్షాన శ్రీ దినకర్ గారికి ఘనసత్కారం జరిగింది. శ్రీ దినకర్ గారు “అంతా అమ్మ అనుగ్రహ”మని అన్నారు. గ్రంథ రచనలో తమకు కలిగిన అనుభూతులను వివరించారు.
డాక్టర్ ఝాన్సీ గారు చేసిన ప్రార్థనతో ప్రారంభమైన సభను శ్రీ విశ్వజనని సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు రసవత్తరంగా నిర్వహించారు.