Rajupalepu Ramachandra Rao

Interviewed by
Ravuri Prasad
12/04/2012
Jillellamudi

 

కీ॥శే॥రాజుపాలెపు రామచంద్రరావు

  వీరు ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో 25-02-1903న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీరాజుపాలెపు శేషగిరిరావు, శ్రీమతి రంగమ్మ. భార్య శ్రీమతి సీతారత్నం. విద్య – B.A, B.Ed. ఉద్యోగం – పేరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు. సంతానం ఇద్దరు మగపిల్లలు. వీరు 30-01-1980 తేదీన అమ్మలో ఐక్యమైనారు.

సేవాతత్పరత : మహిమాన్వితమైన అలౌకికమైన అమ్మ జీవిత సంఘటనలను స్వయంగా అమ్మ చెప్పగా వాటిని తమ డైరీలలో నిక్షిప్తం చేసి భావితరాల వారికి అమ్మ విరాట్స్వరూపాన్ని ఆవిష్కరించిన అమూల్య జ్ఞాన సంపద శ్రీరామచంద్రరావుగారు. భృకుటి భేదనం వంటి యోగ స్థితులను, సిద్ధులను అమ్మలో దర్శించిన ప్రత్యక్షసాక్షి. అమ్మకంటే వయసులో 20 సంవత్సరాలు పెద్దవారు. అమ్మ కృపావృష్టిలో తడిసి పునీతులైన అదృష్టవంతులు. 1956 సంవత్సరంలో అమ్మని దర్శించిన మొదలు అంతిమ క్షణాల వరకు నిరంతరం అమ్మ అనుగ్రహవృష్టిలో జీవనయానం చేసిన ధన్యాత్ములు.

అనుభవాల సేకరణ నేపధ్యం: వీరిలాగ అనేక అనుభూతులు ‘అమ్మ’ అనుగ్రహంతో పొందిన మొదటి తరం సోదరీ సోదరులు అనేకులున్నారు. కానీ వారు ఈనాడు మన మధ్య లేరు. మనమెంతో కోల్పోయాం. శ్రీ రామచంద్రరావు గారి పెద్దకుమార్డు శ్రీ శేషగిరిరావుగారు అమ్మ ప్రేరణతో తండ్రిగారి డైరీల ఆధారంగా వారి అనుభూతులు 12-4-2012వ తేదీన జిల్లెళ్ళమూడిలో మనతో పంచుకొన్నారు. ఈనాడు శ్రీ శేషగిరిరావుగారు కూడా మన మధ్యలేరు. ప్రేరణే తానయిన అమ్మకి ప్రణమిల్లుతూ – తండ్రిగారి అనుభూతులు శ్రీ శేషగిరిరావుగారు చెప్పినవి శ్రీ రావూరి ప్రసాద్ రికార్డు చేయగా వాటిని మీముందుంచుతున్నాం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మా తండ్రిగారు 1956 నుంచి అమ్మ సన్నిధికి వస్తున్నారు. చీరాల హైస్కూల్లో టీచర్గా, పేరాల హైస్కూల్ తొలి ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. వారి తండ్రి శేషగిరిరావుగార్కి స్వంత స్కూల్ ఉండేది. శేషగిరిరావుగారి ప్రధమ భార్యకి ఒకే కుమారుడు (రామచంద్రరావుగారు); ప్రథమ కళత్రం గతించిన తర్వాత పునర్వివాహం చేసుకున్నారు; కానీ ఆమెకు పిల్లలు లేరు.

రామచంద్రరావు గారు బాల్యం నుంచీ సాము గరడీలు కుస్తీ పట్లు పట్టేవారు; ధృఢకాయులు, క్రమశిక్షణ గల వ్యక్తిత్వం. మౌనస్వామి వారు చీరాల వాడ్రేవు వద్ద ఆశ్రమం పెట్టారు. మౌనస్వామి వారి వద్ద అనేక మంత్రాలు ఉపదేశం పొందారు. అమ్మ Trance లో ఉన్నపుడు మౌనస్వామి వారు వారికి ఉపదేశించిన మంత్రాలన్నీ అమ్మ నోట విన్నారు. వారు అనేకమంది యోగుల వద్దకు వెళ్ళారు – కళ్యాణానందభారతి, మౌనస్వామి, కొత్తలంకయోగి, అవధూత మాల పిచ్చమ్మ. చేబ్రోలు దగ్గర ఆనందాశ్రమంలో తీవ్రంగా కొన్నేళ్ళు. యోగాభ్యాసం చేశారు; అక్కడ లక్ష్మీకాంతానందయోగిగారు తపస్సు చేస్తూండేవారు. సన్యాసం తీసుకోవాలనుకునేవారు; అపుడు మానాన్నగారితో మాల పిచ్చమ్మగారు ‘ఎక్కడికి పోతావురా నువ్వు, నీకు ఇంకా రెండు బొమ్మలు ఉన్నాయి! (రెండు వివాహాలు) అన్నది.

‘ఇందరు మహాత్ముల్ని చూశారు కదా! మీకేమి ఒరిగింది?’ అని అడిగితే ‘ఇంతమందిని సేవించడం వలననే నేను అమ్మపాదాల వద్దకు చేరాను చివరకు’ అన్నారాయన. వారి మామగారి స్వస్థలం వేటపాలెం. అక్కడ ‘సారస్వత నికేతనం’ అనే ఒక ప్రసిద్ధ గ్రంధాలయం ఉంది. అక్కడ గల ఆధ్యాత్మిక గ్రంధాలన్నింటినీ చదివారు. తనకున్న శాస్త్ర జ్ఞానాన్ని గీటురాయిగా ఆయాగ్రంధాల సారాన్ని అమ్మ వాక్యాలతో పోల్చి అధ్యయనం చేసేవారు. ఈ శాస్త్ర జ్ఞానానికి అతీతమైనది అమ్మ పరతత్త్వస్వరూపం అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. తొలిరోజుల్లో అమ్మలో సిద్ధపురుషలక్షణాల్ని తెలుసుకుని వచ్చారు. అమ్మలో సర్వజ్ఞత్వ, సర్వవ్యాపకత్వ, సర్వశక్తిమత్వ దైవలక్షణాల్ని దర్శించి దేవతగా అంగీకరించారు. చీరాలలో వీరికి డా॥ పోట్లూరి సుబ్బారావుగారు పరిచయమైనారు. 1956 నుంచి సుబ్బారావుగారు, అచ్యుతుని రామకృష్ణశర్మగారు, శ్రీహర్ష రావుగారు, నోరి వెంకటేశ్వర్లు గారు, చీరాల వెంకట్రావు గారు, బెండపూడి అక్కిరాజుగారు, బందా ఆదినారాయణ గారు, లింగేశ్వరరావుగారు, రామచంద్రరావుగారు…. వీరంతా చీరాల నుంచి ఒక బృందంగా జిల్లెళ్ళమూడి వచ్చేవారు. గృహిణిగా అమ్మ అంతక్రితం డా॥ రంగారావు గారి దగ్గర వైద్యం నిమిత్తం చీరాల వచ్చింది. ఆయన చేసిన ఇంజక్షన్ అమ్మకు వికటించింది; అయినా అమ్మ స్వస్థత తోనే ఉంది. అసలే అమ్మకు గర్భస్రావమై రక్తంపోతే, ఇంకా ఎక్కువ పరిమాణంలో రక్తం తీశారని తెలుసుకుని, ‘అయినా వైద్యం ఇట్లా చెయ్యరే’ అనుకుని, దానిని కూడా అమ్మ తట్టుకుంది అని తెలుసుకుని, ‘ఇది చాలా అపూర్వంగా ఉందే’ అని అనుకున్నారు మా నాన్నగారు. ఆయన జిల్లెళ్ళమూడి రాగానే జన్మజన్మలుగా వారికీ అమ్మకీ ఉన్న అనుబంధాన్ని అమ్మ తెలియజేసింది. అది ఇంకా ఆశ్చర్యం కలిగించింది ఆయనకు.

“నేను బెంగుళూరులో రాజ్యలక్ష్మిగా ఉన్నప్పడు నువ్వు రోజూ పువ్వులు తెచ్చేవాడివి, నాన్నా!” అన్నది ఆయనతో అమ్మ. ఆశ్చర్యం. దీనిని బట్టి వారికి అమ్మతో గల జన్మజన్మల అనుబంధం తెలుస్తుంది. కానీ పరదేవత అయిన అమ్మకి కూడా జన్మలు ఉన్నాయా?- అనిపిస్తుంది. అమ్మలో దైవత్వ లక్షణాల్ని దర్శించారు; దానికి ప్రత్యక్షసాక్షులు వారు. తమ దర్శనాల్ని సంఘటనల్ని డైరీలలో రికార్డు చేశారు.

ఒక ఆసక్తికరమైన సంగతి. అమ్మ ఆహారం తీసుకోదు. కానీ ఇంట్లో మూతపెట్టిన నివేదనలు మాయమయ్యేవి. వాటిని ఎవరు స్వీకరిస్తున్నట్లు? ఒకసారి పోట్లూరి సుబ్బారావుగారు నివేదనలు బీరువాలో పెట్టి తాళం వేసి, తాళం చెవి జేబులో పెట్టుకుని జిల్లెళ్ళమూడి వచ్చారు. “తాళం వేసుకుంటే మాత్రం ఏమిటిరా?” అంది అమ్మ ఆయనతో. అమ్మ జన్మ ప్రభృతి 10-12 ఏళ్ళ వయస్సులో గల కొందరు వ్యక్తుల్ని ఎన్నుకున్నది తన పరికరాలుగా, వాళ్ళు ఎక్కడెక్కడో పర్వతాల పైనో, అరణ్యాల్లోనో తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆహారం ఎట్లా? అమ్మకైతే ఆహారం అవసరం లేదు. బాల్య నుంచీ ఆ మహనీయులతో సంఘటనల్ని అమ్మ మా నాన్నగారికి వివరించింది. వాళ్ళు ఎక్కడున్నారు? అని అడిగితే, ఫలానా చోట ఉన్నారని వివరం చెప్పింది. తనకవసరమైనపుడు వారు ప్రకటితమౌతారని చెప్పింది. వారికి ఆహారం కావాలంటే అమ్మ తన సంకల్పమాత్రం చేత పంపిణీ చేసేది. ఆ సంగతులన్నీ మానాన్నగారి డైరీలు చదివితే అర్థమౌతాయి.

బెండపూడి అక్కిరాజు గారు, K V నాగేశ్వరరావు గారు, వారి సహో పాధ్యాయులు – Staff Room లో అమ్మను గురించి తమతమ అనుభవాల్ని చెప్పుకునేవారు. నోరి వెంకటేశ్వర్లు గార్కి నాన్నగారికి (శ్రీబ్రహ్మాండం నాగేశ్వరరావు గారికి) బాగా స్నేహం. ఆనాడు అమ్మ సన్నిధిలో కుక్కలు, పిల్లులు వైరం లేక తిరుగుతుండేవి. ఆహారం లేకపోయినా అమ్మ చక్కని తేజస్సుతో ఉంటుంది. చేబ్రోలులో ఆనందాశ్రమంలో యోగసాధన చేస్తున్న రోజుల్లో అక్కడ కురుమద్దాలి అవధూత మాలపిచ్చమ్మ గారి ఫోటో చూశారు మానాన్నగారు. తర్వాత వారు పిచ్చమ్మగారిని చూడటానికి కురుమద్దాలి వెళ్ళినపుడు ఆమె “నువ్వు నా ఫోటో చూసిన తేదీ నుంచి నాకు తెలుసురా’ అన్నది. ఆమెకి శారీరక స్పృహ లేదు; దిగంబరి.

అలాగే కాశ్మీర దేశంలో లల్లాదేవి అనే అవధూత ఉండేది. ఆమె ఆధ్యాత్మిక తత్త్వాన్ని పాటలు (పదాలు) గా పాడుకునేది; వాటిని అందరూ పాడుకుండేవారు. ఆ తత్త్వాన్ని గుర్తించి జ్ఞానులు తెల్సుకుని ఆనందించే వారు. కాలక్రమేణా ఆమె పాటలే లల్లాయి పదాలు అయి, అదే మాట వాడుకలోకి వచ్చింది.

జిల్లెళ్ళమూడి వచ్చిన తొలిరోజుల్లో కొంచెం దూరంగానే ఉండి, అమ్మ మాటలు వింటూ అక్కడి సన్నివేశాలు గమనిస్తూ ఉండేవారు మానాన్న. ఎప్పుడూ అమ్మని ప్రశ్నించేవారు కాదు. చిత్రం ఏమిటంటే- మిగిలిన విషయాలు మరచిపోయినా అమ్మ, ఇతరుల మాటలు- విషయాలు మాత్రం స్పష్టంగా మనస్సులో గుర్తుండేవి. ఆయనకి అనేక రకాలుగా జిల్లెళ్ళమూడిని గురించిన సమాచారము అందుతూండేది – కంభంపాటి తాతగారు, నరసింహాచార్యులు గారు, గట్టుపల్లి సత్యంగారు, చెరువు సత్యనారాయణగారు, రాఘవరావుగారు, చంద్రమౌళి సత్యనారాయణరావుగారు, దేశిరాజు రంగారావుగారు, దేశిరాజు అప్పారావుగారు, ఖగ్గా పున్నయ్యగారు (వీరింట్లో 4 సంవత్సరాలు ఉన్నారు), ఖగ్గారామయ్యగారు, బ్రాహ్మణ కోడూరు కంపెనీ యజమాని సుబ్బారావుగారు మా నాన్నగారికి పరిచయమైనారు. అమ్మ కుమారులు సుబ్బారావు, రవి చదువుకోసం చీరాలలో ఉన్నారు; అలా మూడుతరాల తోటి మానాన్నగార్కి పరిచయం ఏర్పడింది. మంత్రి కృష్ణమూర్తిగారు, కోన వెంకట సుబ్బారావు గారు, కనకమ్మ బామ్మగారు, చిదంబరరావు తాతగారు, లక్ష్మయ్యగారి పరిచయాలు కలిగాయి. ‘జిల్లెళ్ళమూడి విషయ సేకరణ కోసం అమ్మ నన్ను నియమించింది’– అనుకున్నారాయన. అమ్మమాటలన్నింటినీ సేకరించారు.

1966 నుంచి చిన్న చిన్న డైరీలలో, Pocket books లో ఆ విషయాన్ని భద్రపరిచారు. సన్నటి handwriting తెలుగులోనూ, ఎక్కువగా ఇంగ్లీష్ లో వ్రాశారు. ఒక్కొక్కసారి గుర్తుకోసం చిత్రాల రూపంగా కూడా సమాచారాన్ని పొందుపరిచారు. అమ్మ సూక్తులను సేకరించి డా॥ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారికి అందించారు. అందులో అమ్మ జీవితంలో జరిగిన సంఘటనలు, అమ్మ సన్నిధిలో జరిగే ప్రముఖ సంఘటనలు కూడా వివరంగా ఉన్నాయి. వాటిని అమ్మ నోటినుండే వారు విన్నారు. “అమ్మ ఇలా చెప్పింది- అని ఎవరైనా నీతో అంటే అది ఏ విషయమైనా సరే, నువ్వు నా దగ్గరకి వచ్చి వివరంగా తెలుసుకో. వాళ్ళమాటలు వీళ్ళమాటలు నమ్మ వద్దు” – అని అమ్మ చెప్పింది మా నాన్నగారితో. ఆ విధంగా ప్రత్యక్షంగా అమ్మతో మాట్లాడి ప్రతి విషయాన్ని నిర్ధారించుకుని అక్షరబద్ధం చేశారు. ‘నాడు-నేడు’; ‘అమ్మ మాట’, ‘అమ్మ నా జీవితంలో ఎట్లా ప్రవేశించింది?’- అనే మూడు గ్రంధాలు వ్రాయాలని సంకల్పించారు. కానీ అవి పూర్తిచేయకుండా వారు పరమపదించారు. వారు రాసిన డైరీలు మాత్రం మిగిలాయి.

అమ్మ అనేక సంభాషణలు వారికి చెప్పింది. వాటిని యధాతధంగా వారు రికార్డ్ చేశారు. గుంటూరులో కళ్యాణానంద భారతీ స్వామివారికి అమ్మకి జరిగిన సంభాషణ యధాతథంగా అమ్మ చెపుతూండగా వారికి గుర్తుండి రికార్డ్ చేశారు. అది 10/15 పేజీల సంభాషణ. అది ముద్రితమైనదో లేదో తెలియదు. అలాగే అమ్మకి వాసుదాసస్వామి వారికి జరిగిన సంభాషణ. అది వసుంధరక్కయ్య వ్రాసిన ‘మహోపదేశం’లోనూ వచ్చింది. దేనిలోనూ రవ్వంత తేడా లేకపోవడం గమనార్హం, ఆశ్చర్యకరం.

‘నాడు – నేడు’ అంటే అలనాటి వ్యక్తులు, సంఘటనలు, సంభాషణలు, అంకదాసు, గుండేలరావు…. దర్శనాలు…. అట్లాంటి అనుభవాలే ఈనాడూ. ఆనాటి సోదరీ సోదరుల గురించి వ్రాసుకున్నారు. వారు చేసిన కృషి- అమ్మ దగ్గరికి వచ్చిన వారు ఏ ఏ పాత్రలను నిర్వహించారు? – అధరాపురపు శేషగిరిరావుగారు, భీమవరపు సుబ్బు ప్రసాద్, పోట్లూరి సుబ్బారావుగారు, పూండ్ల మాణిక్యమ్మగారు, అమ్మను పరీక్షించిన మంత్రాయి; సత్రం, దేవాలయం అభివృద్ధి- గురించి ఇంకా ఎన్నెన్నో.

Betrand Russel, John wood roff వేదాంత గ్రంథాల లోని మాటలు; వాళ్ళని పలకరిస్తూ Trance లో అమ్మ మాట్లాడుతూ ఉండగా వినేవారు. వేటపాలెం లైబ్రరీరికి వెళ్ళి పుస్తకాలను refer చేసి Record చేసుకున్నారు. వారు అమ్మను ప్రశ్నించేవారు గ్రంధులు, జన్మలు… వీటన్నిటి గురించి చేసిన సంభాషణలు “My visits and knowledge gained” అనే పుస్తకంలో రికార్డ్ చేశారు మానాన్న.

అమ్మకు మొదటి పూజ తెనాలిలో 10 సంవత్సరాల పాప చేసింది. రెండవసారి అమ్మ చీరాల వచ్చినపుడు, Tea inspector గారింట్లో అమ్మ తలమీద కుంకుమతో పూజ చేశారు. కొమ్మూరు (అనంత సీతాచలం) డాక్టర్ గారు ప్రతి ఏటా తిరుపతి వెళ్ళేవారట. ఒక సంవత్సరము వేంకటేశ్వరస్వామి అమ్మగా కనిపించిన మీదట ప్రతి ఏటా ఉగాదికి జిల్లెళ్ళమూడి వచ్చి పూజ చేసుకోవటం ప్రారంభించారు. అమ్మ – నాన్నగార్లు ఏటా ‘సీతారామ కళ్యాణం’ చేసేవారట. 1958 వరకు దసరాలకు అమ్మచేత కలశం పెట్టించి పూజలు చేసేవారు. 1958 నుంచి అమ్మ జన్మ దినోత్సవం నాడు పోట్లూరి సుబ్బారావుగారు అమ్మకు పూజ చేయటం ప్రారంభించారు.

1958 నుంచీ అందరూ అమ్మనే దుర్గగా భావించి, కూర్చుండబెట్టి దసరా పూజలు అమ్మకే చేయటం ప్రారంభించారు. ‘నాడు-నేడు’ అనే గ్రంధంలో who is who? తెలిపారు. 1954కి పూర్వం – మన్నవ శ్రీకృష్ణయ్యగారు, భట్టిప్రోలు చలపతిరావు గారు, పులిపాక చలపతిరావుగారు, చింతలపాటి నరసింహంగారు, సీతాబ్రహ్మం గారు, కాంతారావుగారు, రంగారావుగారు, అంబారావుగారు, రామారావు గారు; 1954 తర్వాత జిల్లెళ్ళమూడిలో – మంత్రాయి, రెడ్డి చిన్నసుబ్బయ్య, డా॥ మద్దిబోయిన సాంబయ్య, ఖగ్గా సుబ్బయ్య, కృష్ణమూర్తి, Tea inspector, చెన్నాప్రగడ సూరి; 1950లో లోకనాధం బాబాయి, గంగరాజుగారు; 1955 గుంటూరు బసవరాజుగారు, రామరాజు కృష్ణమూర్తి గారు; 1954లో గంగరాజు లోకనాథం గారు, డా॥ సీతాచలంగారు, మన్నవ బుచ్చిరాజుశర్మ, గంగరాజు శ్రీహరి గారు, హరిదాసు-వెంకటేశ్వర్లు; 1957లో పొట్లూరి సుబ్బారావు, భీమరాజు సుబ్బు ప్రసాద్, నైజాం నుంచి భవానీకుమారి, కుమారి తండ్రి Photographer; 1959లో యార్లగడ్డ రాఘవయ్యగారు, భాస్కరరావుగారు, కొల్లి చిన వెంకటరత్నం (సింగుపాలెం తాతయ్య). 1960 లో కొమరవోలు ముక్తేశ్వరరావుగారు, తర్వాత- అధరాపురపు శేషగిరిరావుగారు, గోపాలన్నయ్య, రామకృష్ణన్నయ్య – వీరంతా ఏ ఏ పాత్రలు పోషించారో ఆయన డైరీ లో రికార్డ్ చేశారు.

అమ్మకి పొట్లూరి సుబ్బారావుగారు ఒకే సమయాన తీసిన ఫోటోలు అన్నీ అనేక రూపాల్లో వివిధ వయస్సుల్లో వచ్చాయి. ఒకసారి మానాన్నగారు పొట్లూరి సుబ్బారావుగారు ఎక్కడో మాట్లాడుకున్న సంభాషణ జిల్లెళ్ళమూడిలో అమ్మ యధాతథంగా వినిపించింది. అమ్మ సర్వవ్యాపి అని అర్థమైంది. అమ్మ చేసిన సంభాషణలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఇంకా వెలుగులోకి రావాల్సినవి ఉన్నాయి. అమ్మ చెప్పినదంతా శాస్త్రబద్ధంగానే ఉంటుంది; మన పరిధి ఎంతవరకు ఉందో అంతవరకే అర్థమౌతుంది. వారు అమ్మ వాక్యాల్ని విశ్లేషించి వ్రాశారు. 100 గ్రంధాలు చదివినా మనం పొందలేని జ్ఞానం ఒక ‘అమ్మ’ వాక్యవిశ్లేషణ ద్వారా లభిస్తుంది- అనేది మా నాన్నగారి భావన.

వారికి చివరి రోజులలో మోకాలు fracture అయింది. ఆ సందర్భంగా వారిని చూడటానికి అమ్మ రెండుసార్లు వేటపాలెం వచ్చింది. వారు నిత్యం పూజ చేసుకునే పూజామందిరంలో నేరుగా వచ్చి కూర్చున్నది. అమ్మకి కిరీటం పెట్టారు. ఆ పూజ గదిలో చాల చీకటి. లోపల అంతా జనం. పాదాలు వారి ఒళ్ళో పెట్టి పూజలందుకున్నది అమ్మ. కిటికీలోంచి ఒక డబ్బా కెమారా తో నేను ఫోటో తీశా. ఖరీదైన Flash cameraతో తీసిన దానివలె చక్కగా వచ్చింది. ఆ ఫోటో.

మా నాన్న అమ్మ వద్దకు వచ్చేముందు శ్రీరామ జపం చేసేవారు. ‘అమ్మ’ ఆయన వచ్చినపుడు ‘శ్రీరామ’ అని వ్రాయబడిన ఒక ఉంగరాన్ని వారికి ఇచ్చింది. వారి వ్రేలికి ఆ ఉంగరం పరమపదించే వరకు ఉన్నది. “నువ్వు చేసిన కోట్ల రామనామ జపానికి ఫలితం రా ఇది” అన్నది ఆయనతో. వారు జిల్లెళ్ళమూడి వచ్చి ప్రతి శ్రావణ పౌర్ణమినాడు అమ్మచేత యజ్ఞోపవీతం వేయించుకునేవారు.

మానాన్నగారు 1980లో పోయారు. వారి చితిమీద పెట్టడానికి జిల్లెళ్ళమూడి నుంచి రామకృష్ణ అన్నయ్య చేత మంచి గంధం చెక్కలు అమ్మ పంపింది. “వాడు పోయినాడు – నా దగ్గరకే వచ్చాడు” అన్నది ‘అమ్మ’.

అమ్మ primordial energy, సర్వశక్తి సంపన్నమైన చైతన్య స్వరూపం. ఆ స్వరూపం తన సంకల్ప సిద్ధికోసం ఒక ఆకారాన్ని ధరించి కొన్ని చోట్ల కొన్ని పనులు చేసింది. కొన్ని తమాషా అయిన అనుభవాల్ని ఇచ్చింది. చీరాల బేర్ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్లు విదేశీయులు. అమ్మ జిల్లెళ్ళమూడిలోనే ఉంది; ఎక్కడికీ వెళ్ళలేదు. కానీ అదే సమయంలో ఆ డాక్టర్లు అమ్మను తీసికొని శ్రీరంగం వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, తర్వాత ఓడ ఎక్కి తమ దేశానికి వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మతో సంభాషించే వాళ్ళు. ఇవన్నీ మానాన్నగారు ‘అమ్మ’ ద్వారా విని సాక్షిగా ఉన్నారు. అలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అది వారి సుకృతఫలం.

అమ్మ సన్నిధిలో పిల్లులు రెండు మూడురోజులు నిరాహారంగా ఉండి స్పష్టంగా ఓంకారం చేస్తూ, అమ్మని చూస్తూ ప్రాణం వదలటం వారు చూశారు. అమ్మ చెప్పిన సో హం అనే జపాన్ని చేస్తూ 7 రోజల పాటు నిరాహారంగా అమ్మకెదురుగా కూర్చొని ప్రాణం వదలిన కుక్క, పిల్లులను చూశారు.

ఆరోజుల్లో అమ్మ పుట్టమట్టిని ప్రసాదంగా ఇచ్చేది. అది ఎంతో తియ్యగా మధురంగా ఉంది; వారు తిన్నారు; అది ఎన్నో సువాసనల్ని వెదజల్లేది.

ఒకసారి అమ్మ భృకుటి నుంచి వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఎవరికీ కనిపించకుండా అమ్మ తన తలను క్రిందికి వంచింది. బ్రొటనవ్రేలుతో అక్కడ ఒత్తిపెడితే బయటికి స్రవించిన రక్తం భస్మంగా మారింది. దాన్ని అమ్మ ప్రసాదంగా అందరికీ ఇచ్చింది. ఆదృశ్యాన్ని వారు చూశారు; ఆ ప్రసాదాన్ని తెచ్చుకున్నారు. అమ్మ సన్నిధిలో ఏం జరిగిందనే దానిని యదాతథంగా అక్షర బద్ధం చేశారు. అమ్మ అనేక భాషలు మాట్లాడేది. విదేశీయులు వచ్చినపుడు ప్రశ్నించకుండా, భాషతో నిమిత్తం లేకుండా, మౌనంగా సమాధానాలు చెప్పేది. భాషకు మూలం భావం కదా! ఒకసారి Tranceలో అమ్మ బావినీటిలో మూడురోజులు పాటు ఉండిపోయింది. ఎవరూ గమనించలేదు. తర్వాత అమ్మే బయటికి వచ్చింది. ఈ సంఘటనలన్నీ వారి డైరీలో ఉన్నాయి.

శ్రీ రాజుబావ వ్రాసిన పాటల్లో ప్రతిపాటకు వ్యాఖ్యానాన్ని అమ్మ నుంచి మా నాన్న విన్నారు; ఏ పదం వ్రాయటానికి ఏ సంఘటన ప్రేరణో వివరించింది. ఆ పాటలు అమ్మ జీవితాన్ని, వేదాంత సారాన్ని నింపుకుని ఉంటాయి. వాటిలో ప్రతి వాక్యమూ అమ్మ జీవితంలోని ఒక సంఘటనతో ముడివడి ఉంది. అవి లొల్లాయి పదాలు కావు.

ఒక పిల్లి అమ్మ దగ్గర కూర్చుని పొలాల్లోకి వెళ్ళి 15 రోజులకి ఒకసారి అమ్మ దగ్గర కొస్తూండేది. మళ్ళా పొలాల్లోకి వెళ్ళి 15 రోజులకి వచ్చి అమ్మ దగ్గరే కూర్చుంటుండేది. “అది పొలాల్లో తపస్సు చేసుకుంటోంది, నాన్నా!” అన్నది అమ్మ మానాన్నగారితో. అమ్మ దగ్గర కూర్చునే కంటె ఎంతో దూరాన ఉండి, అమ్మను చూడటం ముఖ్యం. అమ్మ అంటుంది, “మీరు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ దగ్గర కూర్చోవటం కాదు. అమ్మను మీ దగ్గరకి తెప్పించుకోవాలి” అని.

అమ్మకి పంచభూతాల మీద అధికారం ఉంది. వారు అమ్మ పై ప్రత్యేకమైన ప్రార్థన వ్రాసుకున్నారు.

‘ముగురమ్మల మూలపుటమ్మను అమ్మ, రాజరాజేశ్వరి అని అంటారు. ఈశ్వరుని మీద సింహాసనా రూఢయై 5 పుష్పబాణాలు, చెరకువిల్లు, పాశము, అంకుశము, కిరీటంపై చంద్రకళను ధరించిన- ‘పంచప్రేతమంచాధిశాయినీ’ అని సర్వజగదుత్పత్తికి కారణం, జగదాధారం కాకుండా ఉపాదానకారణం కూడా తానే కనుక ‘ఆ’ అంటే ఆనాడు, ‘ఈ’ అంటే ఈనాడు అనే కాలభేదం లేని సర్వమూ వర్తమానమే అయినందువలన సర్వజ్ఞత్వం, అక్కడ ఇక్కడ అనే ద్వంద్వ భేదం లేకపోవడం వలన సర్వవ్యాపకత్వం, అభేద ప్రతిపత్తి కావటం వలన షడ్గుణైశ్వర్య సంపన్నత…. ఇవన్నీ అమ్మకు చేకూరినవి. అమ్మ విధానంలో మతం లోని కాఠిన్యత (orthodoxy) లేదు. ప్రేరణ మాత్రమే అనసూయత్వంలో కనిపిస్తుంది. నేను 17 సంవత్సరాల నుండి అమ్మ దర్శనార్ధమై వెళుతూ నేను విన్నవి, కన్నవి, ఎరిగినవి, ఎరింగింపబడినవి అవగతమైనంత వరకు ఇతరులకు బాధాకరం కానంతవరకు ఎరిగింప ఇచ్ఛగలిగి వ్రాయసంకల్పించాను’ అని మానాన్నగారు గ్రంధరచన ప్రారంభించారు.

అవతారికలో- అవతారమన నెట్టిదో పరిశీలించి, శాస్త్ర ప్రమాణాన్ని ఆధారంగా ‘అమ్మ – అవతారం’ ఎందుకయ్యింది అనేది చెపుతూ ‘జీవులు ద్వంద్వాల చేత బద్ధులౌతారు కాబట్టి వాళ్ళు జీవులైనారు. ద్వంద్వాలు తానే కనుక ద్వంద్వాతీత స్థితిలో ఉండేది అవతారం. త్రిగుణాలూ సర్వసిద్ధులైన మార్గాల చేత సాధన చేత పొందింది గాక, జన్మతః వారి యందే అసలు సిద్ధులు ఉండటం చేత అమ్మ అవతారం. తెలిసినంతవరకు నాడీ గ్రంథాలలోంచి అమ్మను గురించి చెప్పేటప్పుడు “అమ్మ” చంపితే చనిపోయేటటు వంటిది కాదు’ – అని చెప్పాయి. నిరంతరం అన్నదానం చేత అన్నపూర్ణాతత్వం, ఆపః అంటే నీరు. ఆకుగాని నీరుగాని స్వీకరించలేదు కాబట్టి అపర్ణ. ఉదాసీనతతో, తాను ఎంతో ఎత్తున ఉండి, కులమతవర్ణ వర్గలింగ భేదము లేకుండుట చేత ఖండ జ్ఞానము తోటి ఉండుట చేత అకులా, త్రిమూర్తులకు అవతలనున్న రూపం కనుక పరమేశ్వరి – అని తెలుస్తోంది’ – అనివ్రాసుకున్నారు.

‘ఆ రోజుల్లో మేము జిల్లెళ్ళమూడిలో భోజనం చేసేటప్పుడు విస్తళ్ళలో పిల్లులు కలియబడేవి. ముందుగా వాటికి భోజనం పెట్టి మేము తినేవాళ్ళం’ అని వ్రాశారు. అయితే సనాతనధర్మపరాయణులు వస్తే ఆ పిల్లులు భోజన సమయాన మాయమయ్యేవి; కళ్ళకి కూడా కనిపించేవి కాదు. కుక్కలు ఎక్కడో అవసాన దశలో ఉంటే అమ్మ ‘వాటికి తీర్థం ఇవ్వండి’ అని పంపేది. అంటే అవీ సాధకులే అని అర్థం అవుతోంది. జననమరణాలు అమ్మ అధీనాలు. అమ్మకు తెలుసు. వాటి అవసానదశ గ్రహించి తీర్థం పంపేది తరింపచేయటం కోసం. భూతభవిష్యద్వర్తమానాలను వర్తమానంగా చూస్తున్నది కనుక అమ్మ రాజరాజేశ్వరి అన్నారు. ‘అగ్నియందలి ఉష్ణత్వం, సూర్యుని యందలి వెలుగు ఎంతటి స్వాభావికమో మనకి అసాధ్యములనుకునేవి అమ్మకి సుసాధ్యాలు కావటం చూశాను’ అన్నారు.

‘అమ్మ యందు విశ్వాసం ఉంచి దేహత్యాగం చేసిన మౌలాలీకి మహమ్మదీయ ఆచారప్రకారం 41వ రోజున అందరినీ స్వయంగా ‘ఓంకారనదికి’ తీసుకెళ్ళి తర్పణాలు ఇప్పించింది. ఋషితుల్యుడైన ‘రవి’ శరీర త్యాగం చేసినపుడు కూడా అందరినీ ‘ఓంకారనదికి’ తీసికెళ్ళి బిస్కెట్లు, పెసరగుగ్గిళ్ళు, టీ ఇవ్వటం మాకు తెలుసు- అని వ్రాసుకున్నారు. (ఇదీ మహ్మదీయ సంప్రదాయమే) పిపీలికాది బ్రహ్మపర్యంతం అంతటితో అమ్మ సంభాషించేది; భాషకి మూలం భావం కాబట్టి భావం తెలిస్తే భాషతో పనిలేదు.

‘ముద్రలతో తానే సకలదేవదేవీస్వరూపం అని మనకు తెలియపర్చింది పరమేశ్వరి పరాత్పరి అమ్మ’ అని తెలియజేశారు మా నాన్నగారు.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!