Anantha Ramulamma

Interviewed by
Mannava Seshu
03/04/2012
Jillellamudi

 

శ్రీమతి అనంత రాములమ్మ (రాముడక్కయ్య)

 

ఈమె స్వస్థలం పరుచూరు మండలం చెరుకూరు గ్రామం. తల్లిదండ్రులు శ్రీదాసరి యల్లమంద, శ్రీమతి పేరమ్మ. ఈమె మెట్టిన ఊరు కొమ్మూరు గ్రామం. భర్త శ్రీ అనంత వెంకటేశ్వర్లు. ఈమెకు ఒక కుమారుడు. ఈమె వయస్సు 95 సంవత్సరాలు పైబడి. తొలి రోజుల్లో అమ్మకు అమూల్యమైన సేవలనందించిన డా॥ అనంత సీతాచలంగారికి ఈమె మరదలు.

సేవాతత్పరత : వందో పడిలో ప్రవేశించినా ఒంటరిగా అవతారమూర్తి ‘అమ్మ’ నడయాడిన పవిత్రక్షేత్రం – అర్కపురి (జిల్లెళ్ళమూడి) లో స్థిరనివాసం చేస్తోంది. ఇప్పటికీ అనుదినం తెల్లవారుఝామున 5 గంటలకి స్నానంచేసి, పూలవనంలో పూలుకోసుకుని ‘అమ్మ’ నివసించిన కుటీరంలోని అఖండ నామసంకీర్తనా స్థలం వద్ద కల అమ్మ పాదుకలను అర్చించుకొని, రోజూ రెండు గంటలు అమ్మ నామం చేసుకొనే ఈ అక్కయ్య, అమ్మదయకు సాకారరూపం. అందరింటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అవిశ్రాంతంగా సకుటుంబంగా పాల్గొని అమ్మనర్చించుకుంటున్న పుణ్యశీలి.

వినికిడి సమస్యతో బాధపడుతున్న ఈ అక్కయ్యని శ్రీమతి మన్నవ శేషు మరియు శ్రీ రావూరి ప్రసాద్ 03-04-2012వ తేదీన జిల్లెళ్ళమూడిలో చేసిన ఇంటర్వ్యూ సారాంశం 

****************


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

అమ్మని ఎప్పుడు దర్శించారు? ఆనాటి అమ్మ సన్నిధి, అక్కడి వాతావరణం ఎలా వుండేవి?

మేము మొదటిసారి 1955లో వచ్చాం. ఆ రోజుల్లో మాకంటే ముందు మా బావగారు శ్రీ అనంత సీతాచలం (కొమ్మూరు డాక్టర్ గారు) అమ్మ వద్దకు తరచు వస్తూ పోతూ ఉండేవారు. అమ్మ సన్నిధిలో ఆనందంగా గడిపి తిరిగి ఇంటికి వచ్చాక అమ్మ మాటలు చెప్పుకునేవారు, అమ్మపాటలు పాడుకునేవారు. నేను కూడా వెళ్ళి వాళ్ళ ప్రక్కన కూర్చునే దాన్ని. వాళ్ళ మాటలు విని, వాళ్ళతో పాటు పాటలు పాడుకుని ఆనందంగా గడిపి మా ఇంటికి వచ్చేదాన్ని. వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి అమ్మ దగ్గరికి పోతున్నారు, వస్తున్నారు. అమ్మను చూసి ఆనందపడుతున్నారు. నాకాయోగ్యత ఉన్నదా? అమ్మను చూస్తానా, చూడనా, ‘ఈ జన్మలో’ – అని ఏడ్చేదాన్ని.

అలా అమ్మను చూడాలనే తపనతో కొన్నాళ్ళకి మొదటిసారి హరిదాసుగారు – కృష్ణవేణమ్మక్కయ్య దంపతులతో నేను, మా వారు అమ్మ వద్దకు నడచి వచ్చాం. అమ్మ చాప పరిచింది. మేమంతా కూర్చున్నాం. బొగ్గుల కుంపటి వెలిగించి కాఫీ పెట్టి ఇచ్చింది; త్రాగాం. అమ్మ మాటలు వింటూ కూర్చున్నాం. కాసేపట్లో “వంట అయింది భోజనాలకి లేవండి” అన్నది అమ్మ. ‘ఇదేమిటమ్మా! నువ్వు ఇక్కడే ఉన్నావు కదా! లోపల వంట ఎవరు చేశారు? – అని అడిగాం. “భోజనం తయారైంది – లేవండి” అన్నది. మూడు విస్తళ్ళ అన్నం కలిపి ముద్దలు చేసి మాచే తినిపించింది. తిరిగి వెళ్ళే సమయాన ఎప్పుడైనా శనివారం, శుక్రవారం నియమం ఉన్నదమ్మా అని మేమంటే ఉప్మా, లేక అట్లు పోసి పొట్లాలు కట్టి “రేటూరు దాటిన తర్వాత ఫలానా చోట మంచినీటి కుంట ఉంది. అక్కడ యివి తిని వెళ్ళండి” – అంటూ మాకిచ్చేది.

ఒక్కోసారి మేము రాగానే “బీరువాలో పెసరపప్పు ఉంది, నానబోయమ్మా. బెల్లం ఉంది. వడపప్పు పానకం చెయ్యి. అమ్మకి పూజ జరుగుతోందని ఆవరణలో వాళ్ళందరినీ బొట్టుపెట్టి పిలువు. వాళ్ళు వస్తారు. పూజ చేసుకొని వాళ్ళకి పెట్టుకుందువుగాని” అని చెప్పేది ‘అమ్మ’. నేను అట్లాగే చేసే దాన్ని. మద్దిబోయిన సాంబయ్య అన్నయ్య పూజకి నామాలు చదివేవాడు, హరిదాసు అన్నయ్య నాచే ‘అమ్మ’కి పూజ చేయించేవాడు. అట్లా అమ్మకి పూజ చేసుకుని బట్టలు పెట్టుకుని భోజనం చేసి వెళ్ళిపోయే వాళ్ళం.

మీరు కుటుంబంతో అమ్మ దగ్గర స్థిరనివాసం ఏర్పరచుకొన్న నేపథ్యం ఏమిటి ?

తర్వాత కొన్నాళ్ళకి 14 ఏళ్ళ మాపిల్లవాడు చనిపోయాడు. ఆ దెబ్బకి మేము తట్టుకోలేకపోయాము. “వాళ్ళు అక్కడుంటే మంచాన పడతారు. నాదగ్గరకి తీసుకువచ్చి వదిలిపెట్టు” అని మా బావగారు సీతాచలంతో అమ్మ చెప్పిందిట. తర్వాత మాబావగారూ తోడికోడలూ ఇద్దరూ కలిసి కారులో మమ్మల్ని తీసుకు వచ్చి అమ్మ వద్ద వదిలి వారం రోజులుండి వెళ్ళారు. నాటి నుంచి నేను ఇక్కడే ఉండిపోయాను. నాకు మొత్తం మీద నలుగురు బిడ్డలు పుట్టి పోయారు. ఒక్క బాబు (ముక్కంటి) మిగిలాడు. వాడు ఇక్కడికి వచ్చాక పుట్టిన పిల్లవాడే.

అమ్మ సన్నిధిలో మీదంపతులు చేసిన సేవలు- మీ జీవితాల్లో వచ్చిన మార్పులు ఏమిటి?

1955 ప్రాంతంలో అమ్మ పూరింట్లో ఉండేది. మట్టినేల. అలుకు గుడ్డవేసి అలకటం, చిమ్మటం, ముగ్గువేసి అమ్మ మంచం వేసి పక్కేసి చుట్టూ చాపలు పరిచేదాన్ని అమ్మదర్శనానికి వచ్చే వాళ్ళు కూర్చోవటానికి. ఆ రోజులలో ప్రతీ శని, ఆదివారాల్లో 60/70 మంది దాకా అమ్మ దర్శనానికి వచ్చేవారు. అమ్మ పూజ, దర్శనాలు పూర్తిఅయ్యేలోపల అవతల గది అలికి ముగ్గుపెట్టి, అమ్మ స్నానానికి నీళ్ళు కాచి సిద్ధం చేసేదానిని. ఆ తర్వాత అమ్మకి స్నానం చేయించే దానిని – ఇదే నా పని అప్పట్లో. మా వారు నాన్నగారి గొడ్ల దగ్గర పనిచేసేవారు – గొడ్లకి మేత తెచ్చుకోవటం, పొలంలో అరక దున్నుకోవటం, కావిడి వేసుకుని చెరువు నుంచి నీళ్ళు తేవటం చేసేవారు.

అప్పట్లో అమ్మ వద్దకు వచ్చేవారందరికీ వంట రాజుబావ భార్య ప్రభావతి అక్కయ్య చేసేది. అమ్మ- వచ్చిన వారికి దర్శనం ఇవ్వటం, సంభాషించటం, ప్రసాదం ఇవ్వటం- చేసేది. వంటపని అప్పుడప్పుడు బొమ్మకూడా చేసేది, ప్రభావతి అక్కయ్యకి పెళ్ళి అయిన తర్వాత చిదానందం అక్కయ్య, తర్వాత పెద్ద రాజ్యం, తర్వాత వల్లూరు బాలక్కయ్య చేసేవారు.

ఆ తర్వాతి రోజుల్లో నేను అనుదినం – 2 గం.లు నామం చేయడం, కుంకుమపొట్లాలు కట్టుకోవడం, అన్నపూర్ణాలయానికి వెళ్ళి కూరలు తరగటం, ఉసిరికాయలు- చింతకాయలు వస్తే బాగుచేసుకోవడం, పాచిపని- అంట్లు తోమటం, మరుగుదొడ్లు – స్నానాల దొడ్లు శుభ్రం చేసుకోవడం – అలా అమ్మ సేవ చేసుకొంటూ అప్పటినుంచి ఇక్కడే ఉన్నాను. మా అబ్బాయి ముక్కంటి పది సంవత్సరాలు వచ్చే దాక ఇక్కడే ఉన్నాడు. వాడు 5వ తరగతి వరకు చదువుకున్నాడు. మా వారు చనిపోయిన తర్వాత మా బావగారు వాడిని తీసుకెళ్ళి తమ వద్ద అట్టిపెట్టుకున్నారు.

అమ్మ చెంత ఏమైనా ఆధ్యాత్మికానుభూతులు పొందారా?

ఆ రోజుకీ ఈ రోజుకీ నా దృష్టిలో అమ్మని మించిన దేవుడు లేడు అనేది నా విశ్వాసం. అమ్మకి పూజ జరుగుతున్నప్పుడు చూడటానికి వెళ్ళేవాళ్ళం. పూజ జరుగుతుండగా అమ్మ సమాధి స్థితిలోకి వెళ్ళేది. కృష్ణవేణమ్మక్కయ్య. నేను అక్కడే కూర్చునే వాళ్ళం; మాకు తెలియకుండానే ఏదో తెలియని స్థితిలోకి వెళ్ళే వాళ్ళం. అలా గంట, రెండు గంటల తర్వాత మాకు తెలివి వచ్చాక లేచి మా పనులు చేసుకొనేవాళ్ళం.

అమ్మ ఆలయ ప్రవేశం చేసినపుడు మీవయసెంత? ఇప్పుడు మీకెంత వయసు?

అమ్మ ఆలయప్రవేశం చేసినపుడు నా వయస్సు 65 ఏళ్ళు; ఇపుడు నా వయస్సు 95 ఏళ్ళు.

హైమక్కతో మీకున్న అనుబంధం ఎలాంటిది? హైమాలయంలో మీ అనుభవాలేంటి?

హైమమ్మకి జడవేసి స్నానం చేయించే దాన్ని, నన్ను ‘లంగా బాగుందా, ఓణీ బాగుందా’ అని అడిగేది. ‘బాగుందమ్మా నీకు’ అనే దాన్ని. నాకు కొంచెం హిందీ వచ్చు. నాతో హిందీలో మాట్లాడేది. నేను కొన్నాళ్ళు (మాతృశ్రీ క్యాంటిన్) హోటల్లో పనిచేసేదాన్ని. నా దగ్గరకు వచ్చి కూర్చునేది. ఇడ్లీ పెడితే తిని వెళ్ళిపోయేది. హైమమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత ఒకనాడు నేను హోటల్లో పనిచేసి వచ్చి పడుకొని ఉన్నాను. హైమ గుడిలోంచి లేచి వచ్చింది; రోడ్డు మీద నిలుచుని ‘రాముడక్కయ్యా’ అని రెండుమూడుసార్లు పిలిచింది. హైమ గొంతే అది. నేను లేచి వచ్చి చూస్తే ఎవరూ లేరక్కడ. అట్లా నాలుగైదు సార్లు జరిగింది. ఒకసారి నిద్రపోతూంటే కలలో ‘రాముడక్కయ్యా’ అని దగ్గరికివచ్చి లేపింది. లేచాను. ‘హైమను చూశావా?’ అని అడిగింది. ‘చూశానమ్మా’ అన్నాను. ‘పోదాం రా చూద్దువుగాని’ అని నన్ను హైమాలయంలోకి తీసికెళ్ళింది. అక్కడ హైమమ్మ విగ్రహం, హైమమ్మ ఇద్దరూ మాట్లాడుకున్నారు. మాటలు నాకు వినిపించలేదు. ఇంతలో తెల్లవారి పోయింది.

‘అక్కయ్యా! తెల్లవారవచ్చింది. నేను మళ్ళీ వస్తాను. వెడుతున్నాను’ అని వెళ్ళిపోయింది. నిద్ర కళ్ళు తెరచి చూస్తే ఏమీ లేదు. అది కల.

అమ్మ భర్తగారి గురించి మీ జ్ఞాపకాలను మాతో పంచుకోండి.

జిల్లెళ్ళమూడి ‘నాన్నగారు’ నన్ను ‘అమ్మా! రామమ్మా’ అని నోరారా అభిమానంతో పిలిచేవారు. ‘స్నానానికి నీళ్ళు తోడుతావా, అమ్మా?’ అనీ, ‘నా బట్టలు తీసికొచ్చి ఇయ్యమ్మా’ అనీ, నా మంచం రావిచెట్టు దగ్గర వెయ్యమ్మా’ అని అనేవారు. నేను హోటల్ లో పని చేసే రోజుల్లో తమ పెద్ద కోడలు శేషు పసిపిల్ల తల్లి. బాలింతను లేపటం ఎందుకని ఆయన హోటల్కు వచ్చేవారు. ఆయనకి ఇడ్లీ పెట్టి, కాఫీ ఇచ్చేదాన్ని. అమ్మ అన్నగారు ‘రాఘవరావు మామయ్య’ వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి వస్తూండేవాళ్ళు.

ఇన్నేళ్ళ మీ సుదీర్ఘ జిల్లెళ్ళమూడి వాసంలో ఇక్కడి నించి ఎపుడైనా వెళ్ళిపోదాం అనిపించిందా ?

ఒకసారి జిల్లెళ్ళమూడి వదిలి బయటికి పోదామని నా మనసుకి అనిపించింది. మా వారి మీద వంకపెట్టి అమ్మ దగ్గరకి పోయి ‘వెడతానమ్మా’ అన్నాను. “ఎందుకమ్మా వెళ్ళటం?” అని అడిగింది అమ్మ. ‘ఆయన వెళ్ళిపోదా మంటున్నాడు’ అని అబద్ధం ఆడాను. “మీ ఇష్టం అమ్మా. నేను చెప్పేదేముంది?” అంది అమ్మ. ఇద్దరం గుంటూరు వెళ్ళిపోయాం. అక్కడ ఐదారు నెలలు ఉన్నాం. మూడు సెంట్లు స్థలం కొనుక్కుని ఇల్లు కూడా కట్టుకున్నాం. ఒక భాగం అద్దెకి ఇచ్చుకొని ఒక భాగంలో ఉన్నాం. ‘హరిమ్మ’ నాకు ఆడపడచు. మావారు, హరిమ్మ పొగాకు కంపెనీలో మేస్త్రి పనిచేసేవారు. నేనూ పనికి వెళ్ళే దానిని. కొన్నాళ్ళు అలా గడిచాక అమ్మని వదిలి బయటికి ఎందుకొచ్చామా? అన్న బాధ మాలో మొదలైంది. ఇపుడు తిరిగి అమ్మ దగ్గరకి ఎలా వెళ్ళగలం అని మధన పడ్డాం. ఆ తర్వాత మా మనోవేదన తెలిసిన అమ్మే మమ్మల్ని పిలిపించుకున్నది ఇక్కడ ఉండడానికి. బయట ఉన్నా కూడా అమ్మా! ‘అమ్మా! అంటూ అమ్మ నామమే చేసుకునే దాన్ని.

తర్వాత కొన్నాళ్ళకి ‘నంబులు’ అన్నయ్యతో మమ్మల్ని జిల్లెళ్ళమూడి రమ్మనమని అమ్మ కబురు చేసింది. నంబులు వచ్చి చెప్పాడు- ‘మిమ్మల్ని అమ్మ రమ్మనమంటోంది అక్కయ్యా! కానీ ఇదివరకటిలా వెళ్ళిపోతామంటే వద్దు. మనసారా ఉంటామంటేనే రమ్మనమంది’ అన్నాడు. అమ్మ ఎప్పుడైతే కబురుపంపిందో, ‘ఎప్పుడెప్పుడు వెడదామా’ అనుకుంటూ ‘ఇక జిల్లెళ్ళమూడిలోనే ఉందాం’ అని ఇద్దరం అక్కడ నించి వచ్చేశాము. గుంటూరులో ఇంటిని 15 వందల రూపాయిలకి అమ్మేశాం.

ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ‘జిల్లెళ్ళమూడి’ వదిలి పోవాలని అనిపించలేదు. వెళ్ళలేదు. ఇక్కడే వుండిపోయాం.

మీ జీవితాశయం ఏమిటి?

ఎప్పుడూ అమ్మసేవ చేసుకోవాలి. అమ్మను చూడాలి, అమ్మ మాటలు వినాలి – అనే ధ్యాసేనాకు. అమ్మ పాదాల వద్ద ఉండి, ‘ఆ పాదాల పైనే రాలిపోవటం’ నా జీవితాశయం.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!