అమ్మ దగ్గరకి నేను వచ్చేటప్పటికి నాకు సుమారు 11 – 12 ఏళ్ళ మధ్య వయస్సు. 1962లో ఇంకొల్లులో నేను IV form చదువుకుంటున్నాను. మా బావగారు బాపట్ల వస్తూ జిల్లెళ్ళమూడి వెళ్ళాలనిపించి ‘మనం జిల్లెళ్ళమూడి అనే ఊరు వెడుతున్నాం. అక్కడ ఒక అమ్మవారు ఉంది. ఆమెను చూద్దాం’ అన్నారు. సరేననుకున్నాం. కానీ అట్లా జరగలే. ఎప్పుడైతే నాకు మనస్సులో ‘అక్కడొక అమ్మవారు ఉన్నది’ అనే భావన కలిగిందో – ఒక రోజు ఇంట్లో చెప్పి నా అంతట నేను బాపట్ల వచ్చి జిల్లెళ్ళమూడి చేరుకున్నాను.
ఒక తీవ్రమైన శుభేచ్ఛ కూడా నాయందున్నది. ఆ సమయంలో ‘అమ్మ ఎలా ఉంటుంది? చూద్దాం’- అదే ఉద్దేశ్యంతో మొదటిసారి రావటం. ఇవాళ ఉన్న జిల్లెళ్ళమూడికి 1962లో ఉన్న జిల్లెళ్ళమూడికి చాలా మార్పు ఉంది. ‘ఎక్కడ ఉంటుంది ఆమె?’ అని కనిపించిన వారిని అడిగాను. ‘అదిగో అక్కడ’ అని చూపించారు. వెళ్ళబోతున్నాను- ఒక పెద్దాయన ఆపేశారు నన్ను కానీ లోపలినుంచి ఉచ్ఛైస్వరంతో ఓ కంఠం వినిపించింది- “వాడ్ని నేను పిలుచుకున్నాను. లోపలికి తీసుకురా” అని. నన్ను ఆపిన ఆయనలో సంభ్రమం గమనించాను. నా మనస్సుపై అది ముద్రవేసుకుంది. నన్ను లోపలికి తీసుకెళ్ళారు. అమ్మమంచం దగ్గర నేను మామూలుగా కూర్చున్నాను. ఎందరెందరో వస్తున్నారు; వెడుతున్నారు, మాట్లాడుతున్నారు.
సుమారుగా ఒక గంట, గంటన్నర సమయం అయిపోయిన తర్వాత నెమ్మదిగా అమ్మ నావైపు తిరిగి మాట్లాడింది. ఒక అరటిపండు తీసి తోలు ఒలవటం ప్రారంభించింది. దానిని త్రుంచి నోట్లో పెడుతున్నది. ఆ క్షణంలో అమ్మ ఒక శుభ్రజ్యోత్స్నలా ఉంది. అమ్మ చేయి ఎంగిలౌతుందేమో! అది ఆత్మాను భూతి. మామూలు మాటలు, కవిత్వానికి అందే సౌందర్యం కాదది. జగదేక సౌందర్యమే కాక జగదతీత తేజోరూపాన్ని పరమాద్భుతంగా చూశా.
అరటి పండుపై తొక్క తీస్తూ “పై తోలు తీస్తే కదు- నాన్నా! లోపలి పదార్థం కనపడేది. ఆ పదార్థాన్ని చూస్తే ఏం ప్రయోజనం? తింటే కదా అనుభవం కలిగేది; ఆత్మారాముడికి శాంతి కలిగేది” అంటూ ప్రారంభించింది. అవి అమ్మ తొలివాక్యాలు. అంటే ఉన్నదంతా లోపలేఉందని, పైపైన ఏమీలేదని, లోపలికి వెడితే తప్ప అసలు విషయం అర్థం కాదని, కేవలం చూడటంతో మాత్రమే కాదు; అనుభవించాల్సిన యోగ్యత ఉన్నదనీ – ఈ అర్థాలన్నీ ఇప్పుడు స్ఫురిస్తున్నాయి. అలా అమ్మ తత్త్వంతోనే ప్రారంభించింది నా విషయంలో అనుభవాల్ని దాటిన అనుభూతినిచ్చింది. అమ్మ దర్శనం చేయటమే తొలి అనుభవం. ఆమె చేతివేళ్ళు నా నోటిలో పడటమే ఆమె నాకు అనుగ్రహించిన దశ.
కేవలం నా ఆకలిని నివారించడం కోసం అమ్మ అరటిపండును తీయలేదు. తత్త్వబోధచేస్తూ ప్రారంభించింది. భోజనం వేళ అయింది. అమ్మ ఒక పళ్ళెంలో ప్రత్యేకంగా అన్నం తెప్పించింది. ముద్దలు కలిపింది. నాకు బాగాగుర్తు. “కాస్త ఒట్టిపప్పు, ఎక్కువనేయి తీసుకురా” అని ఎవరికో చెప్పింది. తెచ్చారు. ముద్దలు కలిపి చాలా సేపు పెట్టింది. పెడుతూ అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూనే ఉన్నది. నేను తింటూ ఊ కొడుతున్నాను. ప్రతి మెతుకులోనూ జ్ఞానాన్నాన్ని వరదానం చేసింది. ఇవాళ జరుగుతున్నటువంటి జీవనశైలిని కానీ జీవన దృక్పధాన్ని గాని గమనించినపుడు అర్థమౌతుంది. భోజనానంతరము అడిగింది, “ఇంట్లో చెప్పి వచ్చావు కదా నాన్నా!” అని. అవునమ్మా, చెప్పి వచ్చానన్నాను. “నాకోసమే వచ్చావు కదా?” అన్నది. ‘ఔనమ్మా! నిన్ను చూద్దామని వచ్చాను’. తల్లిగా భావించి ఉంటుంది – మనస్సు. ‘నువ్వు’ అంటూనే ఏకవచనం తోనే మాట్లాడాను. మిగతావాళ్ళు అమ్మని ‘మీరు, ‘మీరు’ అంటున్నారు. ఒక ద్రాక్ష పండ్ల గుత్తి తీసి దానిలోనుంచి ఒక పండు తీసి నోట్లో పెట్టి “ఇదంతా నీకోసం” అన్నది. అమ్మ చేతులు బంగారు వర్ణంలో ఉన్నాయి. అమ్మచేతులు ఎంగిలి అవుతాయేమో అని నాకు అనిపించిన మరుక్షణం అమ్మ “ఎంగిలికాని దేమీ ఉండదు, నాన్నా! బ్రహ్మము ముట్టనిది ఏమైనా ఉన్నదా? ఈ చేస్తున్నదంతా నాకోసం” అన్నది. అంటే నేను తింటున్నప్పుడు నేను పొందిన ఆనందం తన ఆనందానికి కారణం. మూడున్నర గంటల ప్రాంతంలో నల్లని పెద్ద ద్రాక్ష పళ్ళగుత్తి నా చేతిలో పెట్టింది, పది రూపాయల నోటు నా జేబులో పెట్టింది. “చక్కగా వెళ్ళు, నాన్నా! బాగా చదువుకో. వస్తూండు. అమ్మను చూసుకుంటూండు-”అన్నది.
అమ్మ నా భవిష్యత్ రూపకల్పన ఆనాడే చేసింది. మనం అనుకుంటాం. ఈ చదువుకున్న దేమిటి? చేస్తున్నదేమిటి’- అని. ఈ లోకసంబంధమైన విద్యకి అసలు విద్యకి ఖచ్చితమైన తేడా అమ్మకి తెలుసు. 1962, 63,64 మూడేళ్ళు వరుసగా తరచుగా వస్తూనే ఉన్నాను. సెలవలు వచ్చినయ్ అంటే అమ్మ దగ్గరకి రావటం. నన్ను అమ్మ జనసందోహంతో కలవనిచ్చేది కాదు. తన మంచం దగ్గర కూర్చోబెట్టుకునేది. ఎక్కడికీ వెళ్ళద్దనేది. “నువ్వు నా దగ్గరుండు, నాన్నా! నువ్వు నాకోసం వచ్చావు” అనేది. ఒక అవతారమూర్తి, జగజ్జనని సామాన్యుడితో, మాన్యుడితో, అసామాన్యుడితో ఎట్లా react అవుతుందో? నేను గమనించాను. వాళ్ళు ఒక అవతారమూర్తి నుంచి ఏం కోరుకుంటారు? – ఇవన్నీ నేను Observe చేయటానికి బహుశః నన్ను అమ్మ ఆ దృశ్యంలో నిలబెట్టింది; కూర్చోబెట్టింది – అనేది నా గట్టి నమ్మకం.
ఈమె ఏం చదువుకోలేదు కదా, ఈమె దగ్గర ఏమీ డిగ్రీలు లేవు కదా! గొప్ప గొప్పవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఆమెకి ఎందుకు దణ్ణం పెడుతున్నారు? ఆమెను చూడగానే ఎందుకని ఏడుస్తున్నారు?- ఈ భావస్పందనలు అన్నీ వాళ్ళకి ఎలా కలిగిస్తున్నదీమె? వాళ్ళతో ఏమీ మాట్లాడంలేదు, వాళ్ళనేమీ తాకడంలేదు, మీ కష్టాలేమిటో చెప్పండి అనటం లేదు. వస్తున్నారు – చూస్తూనే ఒక భావావేశానికి లోనవుతున్నారు. ఇవన్నీ గమనించినప్పుడు ఈ అమ్మ ఇన్ని వేలమందితో ఏకకాలంలో అక్కడి నుంచి కదలకుండా ఎలా చెయ్యగలగుతున్నది? ఇది మానవశరీరం కాదు- అనిపించింది.
0 Comments