Sadguru Sri Sivananda Murthy

Interviewed by
Ravuri Prasad
14/12/2014
Bheemunipatnam

 

సద్గురు శ్రీ శివానన్దమూర్తి

  వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య – శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. విద్య B.SC. . వృత్తి – హన్మకొండ పోలీసుశాఖలో ఉద్యోగం. వారు 10-06-2015న శివైక్యం చెందారు.

ప్రవృత్తి : వీరు మహాశైవ పీఠాధిపతులు, యతీశ్వరులు, మహాజ్ఞాని, త్రికాలవేది, తంత్రవేత్త, తత్త్వవేత్త, శాస్త్రవేత్త, సాహితీవేత్త, మానవతావాది.
‘కఠయోగం’, ‘భారతీయత’, ‘మార్గదర్శకులు – మహర్షులు’, ‘భీష్మబోధ’ వంటి అనేక గ్రంథరచనలు చేశారు. జిల్లెళ్ళమూడి అమ్మ వారిని “లోకబంధువు” అని సమ్మానించింది.
సనాతన ధర్మ ప్రచారం కోసం, భారతీయ సంస్కృతి వారసత్వం గురించి బోధించటం కోసం, సనాతన ధర్మఛారిటబుల్ ట్రస్టును స్థాపించారు. పేదలకు ఉచిత వైద్యసేవలనందించారు.

మా మాట

శ్రీ సద్గురు శివానందమూర్తిగారిని శ్రీ రావూరి ప్రసాద్ 14-12-2014న భీమునిపట్నం, ‘ఆనందవనం’ ఆశ్రమంలో ఇంటర్వ్యూ చేయ ప్రయత్నించగా తీవ్ర అస్వస్థతతో వున్నారనీ వీలుపడదని తెలిసింది. అనేక ప్రయత్నాల పిమ్మట కేవలం 5 నిమిషాల దర్శనమేవుంటుందనీ, ఏ రకమైన ఇంటర్వ్యూ వారిచ్చే స్థితి లేదనీ, అందుకు సమ్మతమైతే రావచ్చని తెలియవచ్చింది.
కనీసం వారి రూపాన్నయినా చిత్రీకరించాలనే ఆశతో విశాఖపట్టణం సమీపాన భీమిలిలో ‘ఆనందవనం’ వారి ఆశ్రమానికి చేరుకొన్నాం. రెండుగంటల అనంతరం మాకు వారి దర్శనం లభించింది. పండుటాకులా దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ మూర్తికి ప్రణమిల్లాం. వారిని చిత్రించే క్రమంలో ‘అమ్మ’ యందు వారికి గల ఆత్మానుబంధంతో ఎంతో నీరసంగా వున్నా ఉద్వేగభరితులై పదినిమిషాలు అనర్గళంగా ప్రసంగించారు. అమ్మని గురించి వారు చేసిన ప్రసంగ సారాన్ని మీ ముందుంచుతున్నాము.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

అమ్మ అనంతశక్తిమత్వాన్ని గురించి

గత శతాబ్దంలో భారతదేశంలో పుట్టిన మహాయోగులు, మహాత్ములలో అమ్మ ఒకరు. ఆమెది సిద్ధవాక్కు. జ్ఞానసిద్ధి పొందినటువంటి వ్యక్తి ఆమె. ఏదో మంత్రసిద్ధి అంటే చాలామందికి వస్తుంది. జ్ఞానసిద్ధి అలారాదు. కొన్ని జన్మల తపస్సు వలన ఎప్పుడో ఒకనాడు వస్తుంది. జ్ఞానసిద్ధులు మనల్ని కళ్ళతో దయగా చూశారంటే చాలు; ఆ చూపులోనే అన్నీ ఉంటాయి. కాబట్టి జన్మమృత్యువులు అల్లాంటివేమీ వారికి ఉండవు.

అమ్మ భౌతికశరీరాన్ని ఎక్కడో ఒక చోట పెట్టి ఉంచాం. ఆలయం కట్టుకున్నాం: స్మరిస్తాం. ఎప్పుడూ కూడా భగవంతుడిని నామస్మరణ ద్వారానే.. మనం ఆరాధించాం. భౌతికరూపాన్ని ఆరాధన యోగ్యంగా ఈశ్వరుని మలచుకోవటానికి వస్తుంది ఒక విగ్రహం. విగ్రహం అబద్ధం అని కాదు. కానీ అది మాత్రం ఒక్కటే నిజం కాదు: అనేక రూపాలలో ఒక రూపం కాబట్టి. మన జీవితకాలంలో అమ్మవారి యొక్క రూపం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మన మంతా. అది మన భాగ్యం. అపుడు చూసిన వారు ఆమె నిజస్వరూపాన్ని ధ్యానం చేసుకోగలం కదా! ‘శ్రీ మాత్రే నమః’ అంటే చాలు. అందులో లలిత, కాళి, అన్నపూర్ణ అందరూ ఉన్నారు.

ముఖ్యంగా జగన్మాతృస్వరూపిణిగా తను జీవించింది. “మీరందరూ నా పిల్లలు, నన్ను ఏ రూపంలో పూజించినా”. అన్నిటికంటె ఉత్తమమైనదేమిటి? ‘అమ్మా!’ అని పిలవండి నన్ను’ – ‘అం ఆ’ అని వ్రాస్తూంటారు అమ్మ. అంటే తల్లిగానే తనను చూడమని ఆమె ఉద్దేశం. నువ్వు జగదేకస్వరూపిణివి, పరాశక్తివి ఇవన్నీ మనం కల్పించుకున్నవి. ఎన్ని, ఎంతవర్ణన చేసినా అది పూర్తి అవదు. అమ్మని అమ్మగానే భావించడమే మంచిది. లోకంలో తల్లికంటే గొప్ప పవిత్రమైనటు వంటి వ్యక్తి మనకి లేదు. కని, పెంచి, ఆదరించటం అనేది మన కర్మవశాత్తూ వాళ్ళ కర్మవశాత్తూ జరిగేవే ఇవన్నీ.

మాతృస్వరూపం అనేది ఒక తత్త్వం; ఆ తత్త్వాన్ని ఆరాధిస్తాం మనం. ‘అమ్మ’ ని దేవతలూ ఆరాధిస్తారు. రాక్షసులూ పూజలు చేసి వరాలు పొందుతారు. మనం మాత్రం తల్లిగా ఆరాధిస్తాం. తల్లిగా ఆరాధించటం మనకి తెలుసు; రాక్షసులకి తెలియదు – శక్తిగా ఆరాధిస్తారు వాళ్ళు.

జిల్లెళ్ళమూడి క్షేత్రం పవిత్రమైనది. ఈ అవతరించిన మహాత్ములలో మన ఆంధ్రదేశంలో ఆమె పుట్టడం మన భాగ్యం అనుకోవాలి. అందులో ముఖ్యంగా ఆమె “అన్నం తిని వెళ్ళండిరా!” అనేది. “అన్నం తినందిరా” అంటే ‘నా ప్రసాదం, నా దయ అందులో ఉంది. నీ కర్మక్షయం అవుతుంది. నీ కర్మ నశిస్తుంది. ఆ అన్నం తిను’ అని. అందులో అన్నంలో అమ్మ దయామయిగా ఉంటుంది.

మనం వండుకుని దేవుడికి నైవేద్యం పెడతాం. అది భగవంతుడు స్వీకరించాడని మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. జిల్లెళ్ళమూడిలో అది ప్రత్యక్షం. ఇతర దేవతల ఆరాధనలో పరోక్షమైతే ఇక్కడ ప్రత్యక్షం. అందువల్ల ఆమె ఏమి చెప్పినా, ఏమాట చెప్పినా – ‘బ్రహ్మవస్తువంటే ఏమిటమ్మా?” అంటే “ఏదీ కానిది”అన్నది. ఏదీ కాదు. ఏ వస్తువు కాదది. ఏ గుణమూ కాదు. ఎంతో simple గా లేదూ! ఆ “ఏదీకాదు” అనేది. అల్లా define చేయగల్గటం అంటే – ఆమె సమగ్రమైన బ్రహ్మవేత్రి కాబట్టి.

అందరింటి సభ్యులకు సందేశం

అన్నవితరణ చేస్తూండండి. అంతే. ఇంకేమీ అక్కరలేదు. అమ్మకు అన్నంతో అభిషేకం చేయండి; పూర్వం చెప్పాను అది. ఏదో ఒక రోజు పెట్టుకోండి. చాలు. అన్నాభిషేకం చేత ఈ దేశంలో అందరికీ అన్న సమృద్ధి ఉంటుంది. ఆకలితో బాధపడేవాళ్ళు ఉండరు. సంకల్పం కూడా అలా ఉంటే ఇంకా మంచిది – ‘అన్నాభిషేకం చేస్తున్నాము. మా దేశంలో ఆకలితో ఎవ్వడూ బాధపడకూడదమ్మా. నువ్వు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఆ మాటే చెప్పావు. ఇప్పుడు అదే అడుగుతున్నాము’ – అని. అంతే. మీరు కష్టపడి సేవ చేస్తున్నారు. నాకు మహానందంగా ఉంది. సంతోషం.

అమ్మ వారింటికొచ్చిన జ్ఞాపకాలు

1973 ప్రాంతంలో వరంగల్లులో అమ్మ మా ఇంటికి వచ్చారు. ఏదో పూర్వం నుంచి బాగా చాలకాలం నుంచి తెలిసిన బంధువులా ఉంది ఆమె ప్రవర్తన. “అదేమిటి? ఆ గదిలో ఏముంది? ఈ గదిలో ఏముంది?” అంటూ ఆత్మబంధువు ఇంటికి వస్తే ఎలా ఉంటారో అలా; అలాంటి వాత్సల్యం అమ్మ. నా భార్యని చూసి “అమ్మాయీ! ఆయన ఎవరో తెలుసా నీకు ? నీ భర్త అనుకోకు. నీ భర్త ఒక పాత్ర ఆయనకి. ‘లోకబంధువు’ ఆయన. ఈ పేరుతోనే పిలవండి ఆయనను” అన్నారు. మా ఇంట్లో చాలా సేపు కూర్చున్నారు. ‘ఏమన్నా తీసుకోండి’ అని అంటే, “ఏమన్నా ఏమిటి? ఉన్నదంతా తీసుకుంటాను” అన్నారామె. నా భార్య అమ్మకి పాలు ఇచ్చింది. ఆమె కొంచెం తాగింది. నాకోసం వచ్చిన వారిని దూరం నుంచి చూసింది; రెండు మూడు వందల మంది ఉన్నారు; ఎప్పుడూ ఉంటారు అలా. అమ్మని చూస్తే ఇల్లంతా ఆక్రమించుకు కూర్చున్నటువంటి మహాతేజస్సు లాగ నాకు అనిపించింది.

వాళ్ళు తేజోమూర్తులు. జ్ఞానం ఒకటే సర్వాంతర్యామి; శక్తి కాదు, లేకపోతే ఆయుధం బలం కాదు. విష్ణువు కూడా అంతటా వ్యాపించే ఉన్నాడు. తత్త్వతః ఉన్నాడు కానీ చతుర్భుజుడుగా వ్యాపించి ఉన్నాడా ? అది కాదు కదా! విష్ణుతత్త్వం ఏదైతే ఉందో అది అంతటా వ్యాపించి ఉంది. శివుడు తత్త్వతః వ్యాపించి ఉన్నాడు. అంటే – భూలోకమే కాదు, మొత్తం 14 భువనాలు అంతటా వ్యాపించి ఉన్నది అంటే తత్త్వతః. అలాగే అర్థం చేసుకోవాలి. దానివల్ల మనకి ప్రపంచమంతా ఉండే వస్తువును ధ్యానిస్తే అందులో మనం కలిసిపోతే – అంటే అర్థం ఏమిటి? మళ్ళీ జన్మలేదు అని అర్థం. అదే మనందరం కోరుకోదగింది; చివరికి పొందగలిగింది. పొందవలసినది. దానికి మించింది లేదు; స్వర్గాధిపత్యం కూడా చాల చిన్నది.

అమ్మను - మిమ్ము దర్శించటం అనేది మా భాగ్యం అన్నప్పుడు

మన భావం ఎలా ఉంటే అలా అవుతుంది. యద్భావం తద్భవతి. ఒట్టి మనిషిగా చూస్తే మనిషిగా; స్త్రీగా చూస్తే స్త్రీ; పురుషుడుగా చూస్తే పురుషుడు. ఏదో మీరు ఈశ్వర స్వరూపంగా చూస్తే ఈశ్వరుడు. ఒట్టి శుద్ధ జ్ఞానస్వరూపంగా చూస్తే అది. మనం గుర్తించడం అన్నమాట. ఇపుడు అంతేకదా! భగవంతుడి విగ్రహం చేసి ‘మహావిష్ణవే నమః’ అంటాం. అపుడా మట్టిని మహావిష్ణువు అంటాం; మహావిష్ణువు అవుతుంది అది. ఈ మాటలు అబద్ధం కావు.

మీలాంటి ఎందరో ప్రవక్తలు ఒకే శక్తి ఇన్నిగా రూపాంతరం చెందిందని చెబుతున్నారు. అంతా అయి వున్న ఆశక్తికి అంతా ఒకటేనన్న స్ఫురణ అంతటా ఎందుకు కలగటం లేదు?

మనందరం నిత్యం చూసేది ఇది పెద్ద కుర్చీ, ఇది చిన్న కుర్చీ భేదదృష్టే. అది గోడ, ఇది తలుపు – భేదదృష్టి మనకుంది కదా! దానితో నిండి పోయింది మన మనస్సు. మనస్సు, బుద్ధి, చిత్తము మూడూ కూడా భేదదృష్టితోనే నిండిపోయి ఉన్నాయి. అదంతా ప్రక్కకి పెట్టిన తర్వాత యోగారూఢుడైతే, అంతా అంతటా ఉండేటటువంటి పరమసత్యం ఏదైతే ఉందో అది తెలియబడుతుంది.

ఈ చుట్టూ ఉన్నవి. ఇదంతా నిజమేనా? 50 ఏళ్ళ తర్వాత ఏవీ ఉండవు. అనిత్యంగా ఉండే వస్తువుతో మనస్సు నిండిపోతే, నిత్యమై శాశ్వతమై ఉండే వస్తువుకు మనస్సు ఎలా వెడుతుంది? దానినే సాధన అంటారు. ఇవన్నీ తొలగించేసుకోవాలి.

నిద్దట్లో ఏముంది మీకు? ఏ భావన లేదే? రోజూ మీరు అనుభవిస్తున్న ఆనందమే అది. ఉపనిషత్తులు చక్కగా వివరంగా చెప్పాయి. మహర్షుల వాక్యాలు అవి. వాళ్ళు అనుభవించి చెప్పినవే ఎన్నో వాక్యాలున్నాయి. ఈ జ్ఞాన సంపద ఏ దేశంలో ఉంది? ఎక్కడ దొరుకుతుంది మీకు? ఎంత వెదికినా పుస్తకాల్లో దొరుకుతుందా? అందుకనే మనం ఈ దేశంలో పుట్టడమే పూర్వపుణ్యం. అంటే సరైన దారిలో ఉన్నాం. ఉత్తీర్ణత పొందడానికి సరియైన దారిలోనే ఉన్నాం. రెండుస్టేషన్లు దాటితే (సికిందరాబాద్) గమ్యం చేరతాం. అంతే.

॥ శుభం భూయాత్ ||

అప్పటికే వారు అలిసి పోయారు. వారు చేసిన ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపి, వారి ఆశీస్సులు పొంది ఆనందంగా సెలవు తీసుకున్నాం. తర్వాత కొద్దికాలానికే వారు శివైక్యం చెందారు.

Related Interviews …

V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
Bellamkonda Dinakar

Bellamkonda Dinakar

  శ్రీ బెల్లంకొండ దినకర్   వీరు ప్రకాశం జిల్లా కంభం మండలం తురుమెళ్ళ గ్రామంలో 07-06-1950లో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీవెంకటరంగయ్య, శ్రీమతి యశోదమ్మ. భార్య శ్రీమతి సరోజినీ దేవి. సంతానం - ఒక కుమారుడు, ఒక కుమార్తె, విద్య -...

read more
0 Comments
error: Content is protected !!